Friday, February 25, 2011

మీ ఆత్మసాక్షిగా ఓటేయండి - ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిమానులకు జగన్ పిలుపు


ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామనే ప్రచారం జోరుగా సాగుతోంది...
మేం ఎవరినీ ఈసారికి పోటీకి దింపడం లేదు
పార్టీని ఏర్పాటు చేయటం, సంస్థాగతంగా పటిష్టం చేయటం, స్థానికస్థాయిలో కార్యవర్గాలను
ఏర్పాటు చేసి బలోపేతం చేయడమే ప్రస్తుత మా లక్ష్యం

త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ పోటీకి దింపడం లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గం పోటీ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. పార్టీ స్థాపన, కార్యవర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత మాత్రమే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయాలన్నదే తమ అభిప్రాయంగా ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దివంగత నేత ైవె ఎస్ అభిమానులందరూ ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన పూర్తి పాఠం..

‘‘మహానేత వైఎస్ ఆశయాల్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని, ఆయన కుటుంబాన్ని అభిమానించే నేతలకు, అశేష జనావళికి నాదొక విన్నపం.’’

‘‘మిత్రులారా! త్వరలో రాష్ట్ర శాసనమండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థల కోటా నుంచి జరగబోతున్న ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తున్నాయి. గెలవటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో దివంగత నేత వైఎస్సార్‌కు జరుగుతున్న అవమానాలు, నన్ను పార్టీ నుంచి గెంటివేయడానికి చేసిన ప్రయత్నాలు భరించలేక ఆ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి నేను బయటకు వచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొచ్చిన నాకు... కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు, జన సంక్షేమాన్ని కాంక్షించే నాయకులు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న సంగతీ రోజూ మీరు చూస్తున్నదే.


జలయజ్ఞం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం పింఛన్లు, పావలా వడ్డీ రుణాలు ఇలా ఏవైనా కావచ్చు. పేదలకు లబ్ధి చేకూర్చే ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం ఎలా తూట్లు పొడుస్తున్నదో.. సర్కారు పడిపోతే తమ చిరునామాలెక్కడ గల్లంతవుతాయో అనే భయంతో.. దానికి ప్రతిపక్ష తెలుగుదేశం ఎలా కొమ్ము కాస్తున్నదో ఇదంతా మీరు ప్రత్యక్షంగా చూస్తున్నదే. దీన్నంతటినీ ఏవగించుకుంటూ జనహిత రాజకీయాల కోసం నాకు బాసటగా నిలిచినవారినిపుడు ‘జగన్ వర్గం’గా పిలుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయంగా పోరాడాలన్నా, ఏదైనా సాధించాలన్నా రాజకీయ పార్టీ అవసరం కాబట్టి వైఎస్సార్ పేరిట పార్టీ స్థాపన, దానికి సంబంధించిన నిబంధనావళి, విధివిధానాల రూపకల్పన ప్రక్రియను ఆరంభించాం. అది పూర్తవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది.’’


‘‘రాబోయే ఎన్నికల్లో మా వర్గం నుంచి అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నామనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. దీనికి సమాధానంగా రాస్తున్న ఈ లేఖలో నేను చెప్పేదొక్కటే. రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చాలని, సామాన్య జన సంక్షేమానికి కట్టుబడిన దివంగత నేత వైఎస్సార్ ఆశయాల్ని నెరవేర్చాలనే దృఢ నిశ్చయంతో మేం ముందుకు కదులుతున్నాం. దీనికోసం పార్టీని ఏర్పాటు చేయటంతో పాటు సంస్థాగతంగా దాన్ని పటిష్టం చేయడం, స్థానిక స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కార్యవర్గాల్ని ఏర్పాటు చేసి బలోపేతం చేయటం వంటివన్నీ మొదట పూర్తి చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నాం. అలా చేసిన తరువాతే ఏ ఎన్నికల్లోనైనా పోటీ పడాలన్నది మా మనోభిప్రాయం. కాబట్టే వచ్చే నెల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ మేం పోటీకి దింపే యోచన చేయటం లేదు. అందుకని విజ్ఞులు, వైఎస్సార్ పట్ల అంతులేని అభిమానం కలిగి ఉన్న వారు ఈ ఎన్నికల్లో వారి ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’

ఇట్లు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి

No comments:

Post a Comment