Wednesday, February 16, 2011

వారంపాటు నిరశన * ఫీజులపై హైదరాబాద్‌లో 18 నుంచి నిరాహార దీక్ష : జగన్

* ఫీజులకు రూ. 3400 కోట్లు అవసరమంటే సర్కారు చేతకాదంటోంది...* దీనికి నిరసనగా మొన్న ఒక్క రోజు దీక్ష చేద్దామని అనుకున్నాను* కానీ ఒక్క రోజు దీక్షతో ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేటట్లు లేదు* పేదరికం పోవాలంటే ప్రతి పేద విద్యార్థీ పెద్ద చదువులు చదవాలి* అందుకే మహానేత ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు* ఈ ప్రభుత్వం వైఎస్ కలలను నాశనం చేస్తోంది* సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సర్కారుకు బుద్ధి రావడంలేదు* పెద్ద చదువులు చదివే ప్రతి పేద విద్యార్థీ హైదరాబాద్‌కు చలో అనండి* ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేలోపు రాష్ట్రంతోపాటు కేంద్రానికి కనువిప్పుకావాలి

  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సర్కారుకు సిగ్గు, బుద్ధి రావడం లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. పేదవాడిని చదివించే స్థితిలో ప్రభుత్వం లేకపోతే, పేదరికం ఎప్పుడు పోతుందని నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి తాను హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి ఏడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. పెద్ద చదువులు చదివే పేద విద్యార్థులందరూ ఈ సర్కారును నిలదీసేందుకు హైదరాబాద్‌కు చలో అంటూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

బుధవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి యువనేతకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు దాదాపు 10 వేల మంది మహిళలు సహా జనం భారీగా తరలివచ్చారు. వారినుద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘రాచమల్లు ప్రసాద్‌రెడ్డి గుండెచప్పుడు వింటే లబ్‌డబ్.. లబ్‌డబ్.. లబ్‌డబ్ అని కాకుండా వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్ అని అంటోంది. ఇక్కడ ప్రసాద్ గుండె చప్పుడే కాకుండా ప్రతి అక్కా, ప్రతి చెల్లీ, ప్రతి అవ్వా, తాతా, ప్రతి స్నేహితుడి గుండె చప్పుడూ వైఎస్‌ఆర్ పేరునే వినిపిస్తోంది’ అని జగన్ అన్నారు.

వైఎస్ కలలను నాశనం చేస్తోందీ ప్రభుత్వం
‘పావలా వడ్డీ ఆలోచన వచ్చినప్పుడల్లా... ఇంత తక్కువ వడ్డీకి రుణం వస్తుందనిపించినప్పుడల్లా.. ప్రతి అక్కకు, చెల్లికి గుర్తుకొచ్చేది...’ అని యువనేత ప్రసంగం నిలపగానే సభికుల్లో నుంచి ‘వైఎస్‌ఆర్... వైఎస్‌ఆర్..’ అంటూ ప్రతిధ్వనులు వినిపించాయి. ‘ప్రతి పేదవాడి ఇంటిలో ఒక్కరన్నా చదువుకోవాలని, ఆ చదువుతో ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఆ పథకం కింద ప్రతి పేద విద్యార్థీ పెద్ద చదువు చదువుకునేటప్పుడు... పేద తల్లితండ్రులు తమకున్న చిన్న ఇల్లో, పొలమో అమ్ముకోకుండా బిడ్డలను చదివించగలగుతున్నప్పుడు... వారికి దివంగత వైఎస్‌ఆర్ గుర్తుకొస్తూనే ఉంటారు’ అని జగన్ అన్నారు.

‘వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద ఏర్పాటైన ఈ ప్రభుత్వం, ఈ వేళ ఆయన కలలను నాశనం చేస్తోంది. ఫీజు చెల్లించడానికి సమయం కావాలని అడిగితే సుప్రీంకోర్టు మొన్న సమయం ఇచ్చింది. ఈరోజు మళ్లీ సిగ్గులేకుండా వెళ్లి మళ్లీ సమయం కావాలని అడుగుతోంది ప్రభుత్వం. అది చూసి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అయినాసరే సిగ్గులేకుండా.. ఫీజుల కోసం 3400 కోట్లు అవసరం అంటే.. 800కోట్లిస్తాం.. 1200 కోట్లిస్తాం సరిపెట్టుకోండీ అంటోంది’ అంటూ సర్కారు వైఖరిని దుయ్యబట్టారు.

ఆ చెల్లి తగులబెట్టుకుంది..
‘ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థికి సకాలంలో ఫీజు చెల్లించకపోవడంతో ఆ చెల్లి కిరోసిన్ పోసుకుని తనను తాను తగులబెట్టుకుంది. బీటెక్ చదువుతున్న వరలక్ష్మీ అనే చెల్లి ఆత్మహత్య చేసుకుంటే మొన్న హయత్‌నగర్‌కు వెళ్లి పరామర్శించాను. ఆ చెల్లి తండ్రి ఓ ప్రయివేటు స్కూల్‌లో వాచ్‌మెన్. ఆయనకు నెలకు వచ్చే జీతం 1800. తల్లి పంచాయతీలో స్వీపర్. నెలంతా కష్టపడితే ఆమెకొచ్చేది వెయ్యి రూపాయలు. ఈ పేద తల్లితండ్రుల బిడ్డ వరలక్ష్మి చదువులో ఫస్ట్. వారింటికి పరామర్శకు వెళ్లినప్పుడు ‘డ్రాయింగ్’ పేపరు చూపించారు. 20 మార్కులకు 19 మార్కులు వచ్చాయి. ఫిబ్రవరి దాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆమె ఫీజు కట్టలేదు. చదువు కోసం 30 వేలు కావాలి నాన్నా అని అడిగితే ఏం చేయాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులది.

ఒక పక్క చదువును మధ్యలో వదిలేయలేక, చదవలేకపోతే తన తల్లిదండ్రులకు తాను అన్నం పెట్టే పరిస్థితి ఉండదని, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో సైతం తన కుటుంబానికి ఏ మేలూ చేయలేనన్న ఆవేదనతో ఆ చెల్లి కిరోసిన్ పోసుకుని తనను తాను తగులబెట్టుకుంది’ అంటూ జగన్ గద్గద స్వరంతో వరలక్ష్మి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. ఆమెలాంటి ఎందరో చెల్లెళ్లు, తమ్ముళ్లు.. ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన వాళ్లు.. ఫీజు కట్టలేక చదువులు మానుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని, పేద విద్యార్థులకు చదువు చెప్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే పేదరికం ఎప్పుడు పోతుందని జగన్ నిలదీశారు. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్లు చేద్దాం

‘సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. పేద విద్యార్థుల ఫీజులకు 3400 కోట్లు అవసరం అంటే.. 800 కోట్లిస్తాం.. 1200 కోట్లిస్తామంటోంది. ఇలాగైతే పేదోడు పేదరికం నుంచి బయటపడేదెప్పుడు? పేద విద్యార్థుల ఫీజుల కోసం నేను ఒక రోజు ధర్నా చేయాలని మొన్న అనుకున్నాను. కానీ ఈ రోజు అనిపిస్తోంది.. ఒక్క రోజుతో ఈ ప్రభుత్వం కళ్లు తెరవదూ అని! అందుకే ఇప్పుడు చెబుతున్నాను. ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేలోపు ఈ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పు కావాలి. ప్రతి పేద విద్యార్థీ పెద్ద చదవులు చదివితేనే పేదరికం పోతుందని సర్కారుకు కనువిప్పు కలగజేయడానికి ఈ నెల 18 నుంచి 7 రోజులపాటు నేను హైదరాబాద్ నగరంలో నిరాహార దీక్ష చేస్తాను. ఇప్పటికైనా పేదోడి చదువుకు ముందుకొచ్చి సాయం చేసేలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుర్ర ఇవ్వాలని, బుద్ధి ఇవ్వాలని, జ్ఞానోదయం చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇంజనీరింగ్, డాక్టర్‌లాంటి పెద్ద చదవులు చదివే పేద విద్యార్థులందరూ ఈ సర్కారును నిలదీసేందుకు హైదరాబాద్‌కు చలో అంటూ తరలి రండి. వారం రోజులపాటు నిరసన తెలిపైనా సరే సర్కారుకు బుద్ధి వచ్చేటట్లు చేద్దాం.’

  
విద్యార్థుల కోసం జగన్ దీక్ష


* ఇందిరాపార్కు వద్ద వారం పాటు నిరశన
* జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
* నేటి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయల్దేరనున్న యువనేత
* మార్గమధ్యంలో పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్ విగ్రహానికి నివాళి
* అక్కడ్నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి అంజలి
* తర్వాత నేరుగా దీక్షా స్థలికి


ఫీజులకు ఉరేసి.. బడుగు విద్యార్థి చదువులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య వైఖరిపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సింహగర్జన చేయనున్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలుచేయాలని నినదిస్తూ ‘ఫీజు పోరు’కు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఏడురోజులపాటు యువనేత చేయనున్న ఈ నిరాహారదీక్షకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్దగల ధర్నాచౌక్ వేదిక కానుంది. ఉదయం 10 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరనున్న జగన్.. మార్గమధ్యంలో పంజాగుట్ట సర్కిల్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు.

అక్కడ్నుంచి నేరుగా ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి అంజలి ఘటిస్తారు. తర్వాత ఇందిరాపార్కుకు వెళ్లి దీక్షలో కూర్చుంటారు. 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దీక్షను కొనసాగిస్తారు. రోజూ విద్యార్థులు,అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలినుంచీ ఏడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా విద్యార్థులు, అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం యువనేత తొలుత విజయవాడలో ‘లక్ష్యదీక్ష’, ఆ తరువాత కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో ‘జలదీక్ష’, అనంతరం పెట్రో ధరల పెంపునకు నిరసనగా విశాఖలో ‘జనదీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు
జగన్ దీక్ష కోసం ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పలువురు నాయకులు పర్యవేక్షించారు. దీక్షలకు తరలివచ్చే విద్యార్థులు, అభిమానులు, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఎమ్మెల్సీ రెహమాన్, శాప్ మాజీ ఛైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, గట్టు రాంచందర్‌రావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు దీక్షా స్థలాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఎల్‌ఐసీకాలనీ దగ్గర భారీ వేదికను ఏర్పాటు చేసి ఇందిరా పార్కు చౌరస్తా వరకు కార్పెట్లను పరిచారు. ఎండకు తట్టుకునే విధంగా షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం, ఏవీకాలేజ్‌లలో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్‌వర్గం నేతలు తెలిపారు.

No comments:

Post a Comment