Thursday, February 24, 2011

ఈ సర్కారును కొనసాగిస్తే... దేవుడి దృష్టిలో తప్పే! * జనమే జగన్.. జగనే జనం

25 లక్షల మంది విద్యార్థుల బాధలు పట్టించుకోలేదీ సర్కారు
‘ఫీజు రీయింబర్స్‌మెంటు’కు బడ్జెట్‌లో అన్యాయం చేశారు
రూ. 6,800 కోట్లు అవసరమైతే 3 వేల కోట్లు కేటాయించారు
ఈ సిగ్గులేని సర్కారు పేద విద్యార్థుల కోపాగ్నిలో కొట్టుకుపోతుంది
బడ్జెట్‌ను సవరించి విద్యార్థులను ఆదుకోవాలి... లేదంటే ఉద్యమం ఉధృతం
నిమ్మరసమిచ్చి జగన్ దీక్ష విరమింపజేసిన వరలక్ష్మి తల్లిదండ్రులు


  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సర్కారు వైఖరిని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు. ఇప్పటికే ఉన్న బకాయిలను చెల్లించని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో సైతం తగిన కేటాయింపులు చేయకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘25 లక్షల మంది పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధలను పట్టించుకోలేదీ ప్రభుత్వం.. ఇంత సిగ్గులేని ప్రభుత్వం ఎక్కడా ఉండదు. దీన్ని ఇంకా కొనసాగిస్తే దేవుడి దృష్టిలో మేమంతా తప్పు చేసినవాళ్లమవుతాం’ అని అన్నారు. లక్షలాది మంది పేద విద్యార్థుల కోపాగ్నిలో ఈ సర్కారు కొట్టుకుపోతుందని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వారం రోజులపాటు కఠిన నిరాహార దీక్ష చేసిన యువనేత జగన్ గురువారం సాయంత్రం దీక్ష విరమించిన సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తనను ప్రభుత్వం తరఫున ఎవరూ వచ్చి పరామర్శించనందుకు తనకు బాధలేదని, అయితే బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి చేసిన కేటాయింపులు తనను ఆవేదనకు గురిచేశాయని జగన్ చెప్పారు. మరోసారి మానవతా ధృక్పథంతో ఆలోచించి.. బడ్జెట్‌ను సవరించి పేద విద్యార్థులను ఆదుకోవాలని, లేదంటే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

హోరెత్తిన దీక్షా ప్రాంగణం


ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వరలక్ష్మి తల్లిదండ్రులు...జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వారం రోజులపాటు ప్రవాహంలా తరలివస్తున్న జనం గురువారం కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచీ ‘జై జగన్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతూనే ఉంది. ఏడు రోజులపాటు మెతుకు ముట్టకపోవడంతో నిస్సత్తువగా ఉన్న జగన్.. అంతమంది ప్రజల ఆదరాభిమానాలను చూశాక శక్తినంతా కూడదీసుకుని వారినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడ్డానికి లేవగానే.. జనంలో భావోద్వేగం ఉప్పొంగింది. దీక్షా ప్రాంగణమంతా కేరింతలు, హర్షధ్వానాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..


రాజశేఖరుడి సువర్ణ యుగం చూశాను


‘శ్రీరాముడి రాజ్యమైతే నేను చూడలేదు.. కానీ రాజశేఖరుడి సువర్ణయుగం చూశాను. ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే.. గండె బరువెక్కుతోంది. పేదలంతా పెద్ద చదువులు చదవాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత నేత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివి.. ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో అయితే... సంపాదించే డబ్బులో కొంత ముసలి తల్లిదండ్రులకు పంపిస్తే... పేదరికం నుంచి ఆ కుటుంబం బయటపడుతుందని, అందుకే ప్రతి పేదవాడు చదవాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారు.’

అందుకే వారం రోజుల దీక్ష
‘సర్కారు ఫీజులు కట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి ఇంటికి మొన్న నేను వెళ్లాను. ప్రభుత్వం ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో... తనను చదివించలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ప్రమాదమంటూ కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. వరలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు నాకు అనిపించింది.. ఈ ప్రభుత్వానికి బుద్ధిరావాలంటే... గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే.. ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తే సరిపోదని.. అందుకే ఏడు రోజులు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నా.’

ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..

‘ఈ సర్కారును మరోసారి హెచ్చరిస్తున్నా.. నెలరోజులు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల పథకం కేటాయింపుల్లో మార్పులు చేసి పేదవాడిని ఆదుకోండి. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నా.’

బడ్జెట్‌లోనైనా నిధులిస్తారని ఆశించాను..

‘అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్న సమయంలో నిరాహార దీక్ష చేసి ఒత్తిడి తెస్తే... ఫీజుల పథకానికి సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశించాను. 25 లక్షల మంది పేద విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని ఏడు రోజుల పాటు దీక్ష చేశాను. కానీ బడ్జెట్ చూస్తే.. 1.28 లక్షల కోట్ల బడ్జెట్. గత ఏడాది కంటే 15 వేల కోట్లు ఎక్కువగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో.. 25 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.’

రూ. 3,000 కోట్లే కేటాయిస్తారా?

‘ఈ ఏడాదికి ఫీజుల పథకానికి రూ. 3,400 కోట్లు అవసరం ఉంటే.. ఇప్పటికీ పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదీ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం కూడా 25 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాలంటే.. మరో రూ. 3,400 కోట్లు అవసరం. మొ త్తం రూ. 6,800 కోట్లు అవసరముంటే.. కేవలం రూ. 3,000 కోట్లు కేటాయించి చేతులు దులుపేసుకుంది. మరి ఈ 25 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటో ఈ సర్కారు ఏం సమాధానం చెబుతుంది?’
 
జనమే జగన్.. జగనే జనం
 
ప్రజల కోసం వారంపాటు కఠిన నిరాహార దీక్ష చేసిన జగన్
 
లక్షలాదిగా తరలివచ్చిన జనం

 
ఆయనిప్పుడు ఎంపీ కాదు.. ఎమ్మెల్యే కాదు.. అయినా ప్రజల ప్రతినిధిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.. అందుకే ఆయన వెంటే జనం నడుస్తున్నారు.. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వేలాదిగా గుమికూడుతున్నారు. జనమే జగన్.. జగనే జనమని వారు గట్టిగా నమ్ముతున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగిన ‘ఫీజు పోరు’కు వారం రోజులపాటు లక్షలాదిగా తరలివచ్చిన జనప్రవాహం.. ఆయనపై ప్రజల్లో ఉన్న ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు నిదర్శనం. అయితే జగన్ ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా.. లక్షలాది మంది విద్యార్థులిలా దీక్షకు తరలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా.. సర్కారు మాత్రం స్పందించలేదు. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో వచ్చే ఏడాది ఫీజుల పథకం కొనసాగింపును ప్రశ్నార్థకం చేసింది.

ఏడో రోజూ.. హోరెత్తిన ధర్నా చౌక్:
25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండుతో ‘ఫీజు పోరు’ పేరిట యువనేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాది మంది విద్యార్థులు దీక్షాస్థలికి వచ్చి యువనేతకు సంఘీభావం ప్రకటించారు. వారితోపాటు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళలు, పిల్లలు హాజరయ్యారు. దీక్ష కొనసాగిన ఏడు రోజుల్లో రెండు రోజులు తెలంగాణలో పూర్తి బంద్ జరిగినా.. దీక్షకు జన ప్రవాహం తగ్గలేదు. కాలి నడకన లక్షలాది మంది ఇందిరాపార్కుకు దండు కట్టారు.
ఆరోగ్యం క్షీణించినా..: నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత తొలి రెండు రోజులు ఆరోగ్యంగా ఉన్న యువనేత ఆ తర్వాత రోజు రోజుకూ నీరసించి పోయారు.

తొలి నాలుగు రోజులు పగలంతా వేదిక మీద కూర్చునే ప్రజలను పలకరించిన జగన్.. చివరి మూడు రోజులు దాదాపు పడుకొనే ఉన్నారు. మధ్యలో అప్పుడప్పుడు లేచి ప్రజలకు అభివాదం చేశారు. ఆఖరు రెండు రోజులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నాయని, సోడియం లెవల్స్ కూడా గణనీయంగా తగ్గాయని, మూత్రంలో కీటోన్ బాడీస్ భారీగా పోతున్నాయని వైద్యులు నిర్ధారించారు. తక్షణం వైద్య సహాయం అందించాలని వైద్యులు సూచించారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ఆరోగ్యం ప్రమాదకరస్థాయికి క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినా జగన్ దీక్ష వీడలేదు.

పోలీసుల ప్రయత్నం:
ఐదో రోజు, ఆరో రోజూ అర్ధరాత్రి వచ్చిన పోలీసులు యువనేతను ఆసుపత్రికి తరలించాలని ప్రయతం చేశారు. ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు హెచ్చరించారని, వైద్య చికిత్సకు అంగీకరించాలని వారు జగన్‌ను కోరారు. తన ఆరోగ్యం కంటే, 25 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ తనకు ముఖ్యమని చెబుతూ పోలీసుల విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు.

జగన్ దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధులు:
దీక్షలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కమలమ్మ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జయసుధ, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కుంజా సత్యవతి, గొల్ల బాబురావు, గుర్నాథరెడ్డి, పీఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, కొండా మురళి, సినీనటి రోజా, మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఎడ్మ క్రిష్ణారెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగ్గారెడ్డి, వడ్డి వీరభద్రరావు, జి.సుబ్బారావు, ప్రతాప అప్పారావు, నారాయణస్వామి, మాజీ మంత్రి మారెప్ప, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, పీసీసీ కిసాన్ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి గట్టు రామచంద్రరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున, సినీనటులు విజయ్‌చందర్, పోసాని కృష్ణ మురళి, శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, ముక్కా రూపానందరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి రాచమల్ల సిద్ధేశ్వర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి హాజరయ్యారు.


అపోలోలో జగన్‌కు వైద్యపరీక్షలు

యువనేత వైఎస్ జగన్ గురువారం దీక్ష ముగించాక జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అరగంట పాటు ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మ, భార్య భారతి తదితరులు జగన్‌కు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అంతకుముందు వందలాదిమంది అభిమానులు ఇంటి వద్ద యువనేతకు ఘనంగా స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

3 - 5 రోజులు విశ్రాంతికావాలి: డా. రవీందర్ బాబు

‘‘వైఎస్ జగన్‌ను సాయంత్రం ఆరింటికి పరీక్షించాం. ఆయన బ్రీతింగ్, పల్స్, బీపీ వంటివన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అయితే యూరిన్‌లో కీటోన్స్ మాత్రం ఐదుకు మించి ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఆయనకు మూడు నుంచి ఐదు రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరం. శక్తినిచ్చే ద్రవాహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.’’

దీక్షా వేదికపై నేతల స్పందనలివి

ఎన్నికలెప్పుడొచ్చినా జగనే సీఎం
పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యా భద్రత కల్పిస్తేనే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని భావించి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫీజుల పథకాన్ని ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం ఆయన ఆశయానికి తూట్లు పొడిచింది. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, విప్రో ప్రేమ్‌జీ ... వీరంతా పేద కుటుంబాల నుంచే వచ్చారు. చదువుకోవడం వల్లే ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. ముఖ్యమంత్రి, మంత్రులంతా.. వైఎస్ అందించిన అధికారాన్ని అనుభవిస్తున్నారు. అధికారాన్ని అనుభవిస్తే అనుభవించండి. కానీ దివంగత నేత ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. వైఎస్ మీద ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసంతోనే వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. విశ్వసనీయ నాయకుడు ఉంటేనే ప్రజాదరణ లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ పటిమ, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్ ఒక్కరే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సీఎం కావడం ఖాయం.
- ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ఈ ప్రభుత్వం పోవాలి.. జగన్ రావాలి

ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. నా బిడ్డను పొట్టనబెట్టుకుంది. ఫీజు కట్టలేక నా బిడ్డ వరలక్ష్మి ప్రాణాలు తీసుకుంటే.. గ్యాస్ లీకై మరణించిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. పాపిష్టి ప్రభుత్వం నా బిడ్డ మీద అభాండాలు వేసింది. ఇలాంటి ప్రభుత్వం పోవాలి.. జగన్ రావాలి. మాకొచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు. ఎవరికీ ఈ కడుపు కోత వద్దు.
- వరలక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, జంగయ్య

జగన్ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యముందా?

కళ్లుండి చూడలేని ప్రభుత్వం ఇది. చెవులుండి వినలేని సర్కారు ఇది. ప్రజా నాయకుడు జగన్ దీక్ష చేస్తుంటే.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు. అయినా ప్రభుత్వానికి తెలియలేదట. ఇక సామాన్యుల సంగతి ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది? జగన్ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం మంత్రులకు లేకపోవడం వల్లే... ప్రభుత్వం మంత్రులను పంపించి ఉండదు. కనీసం అధికారులను పంపించి డిమాండ్లు తెలుసుకోలేక పోయింది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం గద్దె దిగాల్సిందే. వైఎస్ హయాంలో లబ్ధి పొందని కుటుంబాలు రాష్ట్రంలో లేవు. చంద్రబాబు ఇంటికి కూడా రూ. 50 సబ్సిడీతో గ్యాస్
సిలిండర్లు వెళ్లాయి.
- మాజీ మంత్రి కొండా సురేఖ

అండగా ఉన్నానని చెప్పేందుకే దీక్ష..

ఏడు రోజులుగా ముద్ద ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్‌ను చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎంతో మంది తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ దయతో అధికారంలో కూర్చున్న వాళ్లు తన దీక్షకు స్పందిస్తారని జగన్ అనుకోలేదు. వరలక్ష్మి లాంటి చెల్లెళ్లు, తమ్ముళ్లకు అండగా ఉన్నానని చెప్పడానికే జగన్ నిరాహార దీక్షకు దిగారు.
- ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
 
 
పాలకుల దుర్బుద్ధికి నిదర్శనం
వారం రోజులుగా నిరాహారదీక్ష చేసిన జగన్‌తో ప్రభుత్వం చర్చలు జరపకపోవడం ఈ పాలకుల దుర్బుద్ధికి నిదర్శనం. మాట్లాడితే యువనేతకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనన్న భయమే వారిని వెంటాడింది. జగన్ ప్రభంజనంతో 125 ఏళ్ల కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్నాయి. చిరంజీవిని కలిపేసుకున్నారు.. చంద్రబాబును కౌగిలించుకున్నారు. వీరితో ప్రమాదంలేదు. కేవలం ఒక్కరితోనే వీరికి భయం. 
ఆ మొనగాడే జగన్.
- అంబటి రాంబాబు


ఫీజులకు తగిన నిధులు ఇవ్వండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులంతా వైఎస్‌కు రుణపడి ఉంటారు. బడ్జెట్ చూస్తే.. ఫీజుల పథకం వచ్చే ఏడాది ఉండదనే అనుమానం కలుగుతోంది. ఫీజుల కోసం వచ్చే ఏడాది కూడా విద్యార్థులు రోడ్డెక్కాల్సిందేనా..? బడ్జెట్‌ను సవరించి, ఈ పథకానికి తగు నిధులు ఇవ్వండి.
- మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్


సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి

పేద విద్యార్థుల కోసం ఏడు రోజులు దీక్ష చేయడం జగన్ ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఫీజుల నిధులివ్వకుండా మొండికేస్తున్న ఈ గుడ్డి సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి. జగన్ దీక్ష గురించి తమకు తెలియదని హేళన చేసిన కొందరు మంత్రులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
- కాటసాని రాంరెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే


ఇలాంటి దరిద్ర పాలన చేయొద్దు

బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ భవిష్యత్తులో ఉండకపోవచ్చు. దమ్ముంటే పాలన చేయాలి... కానీ ఇలాంటి దరిద్ర పాలన మాత్రం చేయొద్దు. పాలకులపై ఒత్తిడి పెంచేందుకే జగన్ దీక్ష చేపట్టారు. పరామర్శించే కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదా?
-గట్టు రామచంద్రరావు


రీయింబర్స్‌మెంట్ ఎత్తేస్తారేమో

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పాత బకాయిలకూ సరిపోవు. వచ్చే ఏడాది ఈ పథకం ఎత్తివేస్తారనే అనుమానం కలుగుతోంది. జలయజ్ఞం, సంక్షేమ పథకాల కేటాయింపులను చూస్తే వైఎస్ పథకాలనూ ప్రభుత్వం శాశ్వతంగా ఆపేందుకు రంగం సిద్ధం చేసిందనిపిస్తోంది.
- అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే


జగన్‌పై అక్కసుతోనే పలకరింపునకూ రాలేదు

వారంరోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్ పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. లక్షల మంది పేద విద్యార్థులకు ఆశాదీపంగా మారుతున్నాడనే అక్కసుతోనే కనీసం పలుకరించేందుకు కూడా ప్రభుత్వం రాలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నాయి.
- కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే


అగ్నిజ్వాలల్లో మసికావడం ఖాయం

నిమ్నజాతి పిల్లల అభ్యున్నతికి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తిలోదకాలిస్తోందీ ప్రభుత్వం. వారంరోజులుగా జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా పోయింది. ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. త్వరలోనే అగ్నిజ్వాలలు ప్రభుత్వాన్ని మసి చేయడం ఖాయం.
- గొల్ల బాబూరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే


నమ్మకమైన నేత

ప్రజాకర్షణే కాదు.. నమ్మకానికి పెట్టింది పేరు జగన్. ప్రజా సమస్యలే ఉద్యమంగా ముందుకు సాగుతున్నందునే జగన్ పట్ల ప్రజలకు నమ్మకం కలిగింది. ఏడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇది దున్నపోతు ప్రభుత్వం.
-జూపూడి, ఎమ్మెల్సీ


విద్యార్థులకు న్యాయం చేయాలి

యువనేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నా.. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం
చేయాలి.
-కొండా మురళి, ఎమ్మెల్సీ

ఫీజులు చెల్లించడం సామాజిక బాధ్యత

ఫీజులు చెల్లించడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. పేదరికం చదువులకు అడ్డుకాకూడదని వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తిలోదకాలిచ్చేలా వ్యవహరించడం సిగ్గుచేటు. యువనేత జగన్ ప్రాణాలొడ్డి వారం రోజులు దీక్ష చేసినా చలించని సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ
ప్రజలు స్పందించారు చాలు..

ప్రభుత్వం స్పందించక పోయినా పర్వాలేదు. విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున
స్పందించారు.
- ఎమ్మెల్యే జయసుధ


కుర్చీలు పట్టుకుని వేలాడుతున్నారు

దీక్షకు వచ్చిన నేతలు అధికార దాహంతో వచ్చిన వారు కాదు. రాని నాయకులే అధికార దాహంతో కుర్చీలు పట్టుకొని వేలాడుతున్నారు.
- బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే


పేదోళ్లకు చదువు వద్దనుకుంటున్నారా..

పేదవాడికి విద్య అవసరం అని దివంగత నేత వైఎస్ భావిస్తే... పేదవాడికి విద్య అవసరమా.. అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- నటి రోజా


కనీస భద్రత కల్పించరా..

జెడ్ కేటగిరీ నుంచి వచ్చిన జగన్, దివంగత ముఖ్యమంత్రి తనయుడు నడిరోడ్డు మీద రేయింబవళ్లు దీక్ష చేస్తుంటే.. ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించరా..?
- ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి


మంత్రులు పలుకరించక పోవడం శోచనీయం

రెండుసార్లు కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సాఆర్ తనయుడు నిరాహార దీక్ష చేస్తుంటే మంత్రులు పలుకరించక పోవడం శోచనీయం.
- రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ


వైఎస్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి స్వర్ణయుగం.
నేటి ప్రభుత్వం వైఎస్ పథకాలకు ఒక్కొక్కటిగా తూట్లు పొడుస్తోంది. -నెలవల సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే
దీక్షకు సంఘీభావం తెలపకుండా గోడమీద పిల్లుల్లా ఉన్న మంత్రులకు త్వరలో కాలం చెల్లుతుంది.
- ప్రతాప అప్పారావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే


వైఎస్ భిక్షతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేడు ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తున్న జగన్‌ను పరామర్శించని ఈ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.

- నారాయణస్వామి, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే


రాష్ర్టంలో ఇక మిగిలేది రెండు పార్టీలే. ఒకటి వైఎస్ జగన్ పార్టీ.. మరొకటి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ తదితరాల పార్టీ ఈ రెండింటి మధ్య త్వరలో మహాసంగ్రామం జరగబోతుంది.

- జి.సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే
 
సర్కారుకు ‘జగన్ భయం’...!
 
దీక్షపై స్పందించేందుకు కూడా సాహసించని వైనం
 
యువనేతకు మరింత పేరొస్తుందన్న భయమే కారణం

ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్టేనంటూ సర్వత్రా విమర్శలు
చౌకబారు ప్రవర్తనతో సర్కారే అప్రతిష్టపాలైందంటున్న స్వపక్ష నేతలు
ఎమ్మెల్యేలే స్పందిస్తుంటే ప్రభుత్వానికి ఏమైందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆవేదన

 ఫీజు రీయింబర్స్‌మెంట్. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టడంతో పాటు సాక్షాత్తూ సుప్రీంకోర్టుతోనే పాలకులకు పదేపదే అక్షింతలు వేయించిన సమస్య. 25 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన అపరిష్కృత సమస్యపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడు రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేస్తే, దానిపై కనీసం స్పందించేందుకు కూడా కిరణ్ సర్కారు సాహసించలేకపోయింది! దీని వెనక మతలబేమిటన్నది ఇప్పుడు రాష్టవ్య్రాప్తంగా చర్చనీయంగా మారింది. కారణాలేమైనా, దీక్షపై కనీస స్థాయిలో కూడా స్పందించకపోవడం ద్వారా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమయ్యామన్న వ్యాఖ్యలు సాక్షాత్తూ అధికార పక్షం నుంచే విన్పిస్తున్నాయి! జగన్ తిరుగులేని జన నేతగా ఎదుగుతున్న వైనం చూసి కాంగ్రెస్ ఇప్పటికే కలవరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీక్షపై ఎలా స్పందించినా ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుందన్న జంకుతోనే సర్కారు మూగనోము పట్టిందని అన్ని వర్గాలూ దుమ్మెత్తిపోస్తున్నాయి.

జగన్‌కు జనాదరణ పెరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోవడమే ప్రభుత్వ అనైతిక ప్రవర్తనకు కారణమని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ దీనిద్వారా తాము బావుకున్నదేమీ లేకపోగా... ప్రజా సమస్యలను, వాటిపై జరిగే ప్రజాస్వామిక ఆందోళనలను కూడా పట్టించుకోని పనికిమాలిన ప్రభుత్వమన్న అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు యువనేత పోరాటానికి సంఘీభావం ప్రకటించడం, ఆ విషయమై అసెంబ్లీకి పాదయాత్ర చేయడం, ఏకంగా సభలోనే ప్లకార్డులు ప్రదర్శించడం తమను మరింతగా ఇబ్బంది పెట్టే పరిణామమేనని వారంటున్నారు.


ఇంత ముఖ్యమైన ప్రజా సమస్యపై అధికార పక్ష ఎమ్మెల్యేలకున్న పాటి బాధ్యత గానీ, మానవత్వం గానీ ప్రభుత్వ పెద్దలకు లేకపోయాయా అంటూ నిలదీస్తున్న జనానికి బదులివ్వలేని దుస్థితిలో పడిపోయామంటున్నారు! ఇంతటి బాధ్యతారాహిత్యాన్ని మొదటిసారి చూస్తున్నామని కాంగ్రెస్ కురువృద్ధ నేతలు కూడా చెబుతున్నారు. జగన్‌ను జనంలో ఎదగనీయకుండా అణగదొక్కడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆయన దీక్షపై స్పందించకపోవడం వెనుక ఏకైక మతలబు కూడా అదేనని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు సీఎల్పీ వద్ద బాహాటంగానే చెప్పారు.


వారి విషయంలో అలా...

ఫీజులు కట్టకుంటే హాల్‌టికెట్లు ఇవ్వబోమని, పరీక్షలకు కూర్చోనివ్వబోమని, అసలు కాలేజీలనే మూసేస్తామని యాజమాన్యాలు హెచ్చరించడం, మరో దారి లేక ఓ అభాగ్య దళిత విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడం చూసి జగన్ స్పందించారు. రాష్ట్రం అట్టుడుకుతున్నా సమస్య తీవ్రతను గుర్తించడంలో, స్పందించడంలో ప్రభుత్వం విఫలమవడంతో ఏడు రోజుల నిరంతర నిరాహార దీక్ష చేపట్టారు. అందుకు రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో స్పందించింది. దీక్ష కొనసాగిన ఏడు రోజులూ రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి యువనేతను పరామర్శించారు. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా శిబిరానికి వచ్చి, ఫోన్ల ద్వారా సంఘీభావం ప్రకటించారు.

అసెంబ్లీకి పాదయాత్ర చేశారు. సభలో రెండ్రోజుల పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా సీఎం గానీ, మంత్రులు గానీ మాటమాత్రంగా కూడా స్పందించలేదు. సుప్రీంకోర్టు తలంటిన నేపథ్యంలో, రీయింబర్స్‌మెంట్ నిధులు, బకాయిలను విడతల వారీగా విడుదల చేసేందుకు కట్టుబడ్డామంటూ వినీ విన్పించకుండా నసిగి అంతటితో సరిపెట్టారు. రాజకీయంగా జగన్ విషయంలో కాంగ్రెస్, ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా ప్రజా సమస్య పరిష్కారానికి గళమెత్తినప్పుడు స్పందించడం పాలక పక్షం విధి. వారం రోజులు నిరాహార దీక్షకు దిగితే మానవీయతతో స్పందించడం కనీస బాధ్యత, మర్యాద. ఇదే సమస్యపై 2010 జూన్‌లో బీసీ నేత ఆర్.కృష్ణయ్య నిరాహార దీక్ష చేస్తే తొలి రోజు సాయంత్రమే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాటి సీఎం రోశయ్య ఆదేశానుసారం మంత్రులు సుభాష్‌చంద్రబోస్, దానం తదితరులు వెళ్లి పరామర్శించారు.


ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చి మరీ దీక్ష విరమింపజేశారు. ఇదే సమస్యపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగినా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలంటూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ గత డిసెంబర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగితే సీఎం స్వయంగా స్పందించి హామీ ఇచ్చారు. మంత్రులను, ఎంపీలను పంపి మరీ మంద కృష్ణ దీక్షను విరమింపజేశారు. డిసెంబర్‌లోనే రైతు సమస్యపై చంద్రబాబు ఆమరణ దీక్షకు దిగితే మూడో రోజే ఆస్పత్రికి తరలించారు. మర్నాడే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆయన్ను పరామర్శించారు. రైతు సమస్యలపై సీఎం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన్ను నిమ్స్‌కు తరలించే దాకా ప్రభుత్వం చేసిన హడావుడిని ఎవరూ మర్చిపోలేదు. కానీ కళ్లు మూసినా, తెరిచినా జగన్ జనాదరణనే తలచుకుని వణికిపోతున్న కిరణ్ సర్కారుకు మాత్రం ఆయన దీక్ష విషయంలో అలాంటి కనీస మర్యాదలేవీ అసలే పట్టలేదు. నిజానికి జగన్ ఫీజు పోరు దీక్షకు ఒక్కరోజు ముందు ఎన్టీవీ-నీల్సన్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.


వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్వాన్నంగా మారిందని, పీఆర్పీని విలీనం చేసుకున్నా ప్రజలు జగన్‌కే బ్రహ్మరథం పడుతున్నారని అందులో తేలింది. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి సహజం గానే రుచించలేదు. దీక్ష విషయంలో వారి ప్రవర్తనలో కూడా ఆ వైఖరే ప్రతిఫలించింది. జగన్ దీక్ష విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా కాక ఇంకెలా వ్యవహరిస్తుందని అసెంబ్లీ లాబీ లోనే ఒక సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు రుజువు. ఒకవైపు జగన్ ఎదుగుదలను అడ్డుకునేందుకు, ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తుంటే, ప్రత్యేకంగా ఈ దీక్ష విషయంలో మానవీయ కోణం ఎందుకుంటుందంటూ ఆయన ఉన్నమాట బయట పెట్టడంతో నోరెళ్లబెట్టడం విలేకరుల వంతయింది! జగన్ విషయంలో పాలక పక్ష అనైతిక రాజకీయాలు గతంలోనూ తెరపైకి వచ్చాయని వైఎస్, జగన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment