Monday, February 14, 2011

మార్చిలో మన పార్టీ * బద్వేలు బహిరంగ సభలో వైఎస్ జగన్ వెల్లడి

* ఈ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో వేసినా సిగ్గు రాదు
* ఫీజులు కట్టలేక పేద విద్యార్థుల భవిష్యత్తు అయోమయం
* 2010-11 సంవత్సరానికి పావలా వడ్డీ బడ్జెట్ లేదు
* వైఎస్ పథకాలను సర్వనాశనం చేశారు


వచ్చేనెల మార్చిలో ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదాల చెంత తన కొత్త పార్టీ ఆవిష్కృతమవుతుందని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మన జెండా మనం మోసి, వైఎస్ కలలుగన్న సువర్ణ రాష్ట్రాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మరో రెండు, మూడేళ్లలో వైఎస్ స్వర్ణపాలన వస్తుందని, ఆ పాలన ముప్పై ఏళ్లపాటు కొనసాగుతుందని ఉద్ఘాటించారు. సోమవారం కడప జిల్లా బద్వేలులో దివంగత మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి ముఖ్య అనుచరుడు లింగందిన్నె విజయభాస్కర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి జగన్ వర్గంలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో యువనేత ఉద్వేగంగా మాట్లాడారు. వైఎస్ పథకాలను నీరుగారుస్తున్న రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు.

బంగాళాఖాతంలో కలిపేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురాదని మండిపడ్డారు. ‘‘వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. పావలా వడ్డీకి ఒక్క రూపాయి లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక పేద విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారింది. ప్రతి విద్యార్థిని ఉచితంగా చదివించే ఈ పథకానికి డబ్బు ఇవ్వాలని అడుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. బంగాళాఖాతంలో వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురాదు. మార్చిలో మన పార్టీ మనకొస్తుంది. ఇడుపులపాయలో వైఎస్ పాదాల చెంత పేదోడి పార్టీ పుడుతుంది. మన జెండా మనం మోస్తాం. రామరాజ్యం ఎలా ఉంటుందో చూడలేదు కానీ వైఎస్ స్వర్ణపాలన మరో రెండు, మూడేళ్లలో వస్తుంది. ఆ స్వర్ణపాలన 30 ఏళ్లు కొనసాగుతుంది. మరో నూరు సంవత్సరాలు ఆ పాలనను మరచిపోకుండా చేస్తాను’’ అని జగన్ చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం సోమవారం బద్వేలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో యువనేత 15 వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆవిష్కరణలను వాయిదా వేసుకున్నారు.


వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు...


బద్వేలులో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ.. వైఎస్ పథకాలను గుర్తుచేసినప్పుడల్లా జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. ‘ప్రతి మహిళా లక్షాధికారి కావాలని మహానేత కలలుకన్నారు. వారికోసం పావలా వడ్డితో రుణాలిచ్చే పథకం ప్రవేశపెట్టారు. పావలా వడ్డీతో రుణాలు తీసుకుని తమ జీవితాలను బాగు చేసుకున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి చిరునవ్వులో వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తూనే ఉంటారు. అవ్వ, తాతలకు ప్రతి నెలా 1వతేదీ పింఛన్ తీసుకునేటప్పుడు వారి చిరునవ్వులో వైఎస్ ఉంటారు. వైఎస్ మా పెద్ద కొడుకని వారు గర్వంగా చెబుతారు’’ అని జగన్ పేర్కొన్నారు.


పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైత న్నలకు ఉచిత కరెంటు, బడుగు జీవులకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్.. ఇక రాడని అనుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈరోజు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్‌పై బురదజల్లుతున్నాయన్నారు. ‘‘నాన్న ఒక మాట అంటుండే వారు. అది నేనెప్పటికీ మరిచిపోను.. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం గొప్పకాదు. చనిపోయిన తర్వాత ఎందరి గుండెల్లో బతికున్నామన్నదే గొప్ప అని అంటుండేవారు. అలా జనం గుండెల్లో నిలిచిపోయిన నాన్న.. నాకు ఇంత పెద్ద కుటుం బాన్ని ఇచ్చారు. మీ ప్రేమ, ఆప్యాయతలకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను’’ అంటూ చేతులు జోడించారు.

విజయభాస్కర్‌రెడ్డి చేరిక సంతోషం


బద్వేలులో టీడీపీలో మంచి నాయకుడిగా ఎదిగిన లింగందిన్నె విజయభాస్కర్‌రెడ్డి తనకు తోడుగా రావడం సంతోషంగా ఉందని యువనేత హర్షం వ్యక్తం చేశారు. దాదాపు పదివేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగసభలో భాస్కర్‌రెడ్డి తన బంధుమిత్రులతో జగన్‌కు మద్దతు పలికారు. ఈ సభలో విజయభాస్కర్‌రెడ్డి బాబాయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బీరం మల్లారెడ్డి జగన్ స్థాపించబోయే పార్టీకి రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. అంతకు ముందు జగన్ కడప నుంచి బద్వేలుకు వచ్చే మార్గంలో, అట్లూరు క్రాస్ నుంచి విజయభాస్కర్‌రెడ్డి భారీ మోటారు సైకిల్ ర్యాలీతో స్వాగతం పలికారు. మోటారు సైకిళ్లు, వాహనాల ర్యాలీతో యువనేతను అనుసరించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


వైఎస్ గుడిని సందర్శించిన జగన్


బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని చల్లగిరిగెల గ్రామంలో స్థానికులు నిర్మించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుడిని యువనేత సందర్శించారు. చల్లగిరిగెల రామాలయం ఎదురుగా వైఎస్ గుడిని చుట్టుపక్కల గ్రామస్తులు విరాళాలతో నిర్మించారు. యువనేత గుడిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, టెంకాయ కొట్టి పూజలు చేశారు. ప్రతి గుండెలో దీపమైన వైఎస్‌ను శ్రీరాముని పాదాల చెంత ప్రతిష్టించినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నానని యువనేత అక్కడి ప్రజలనుద్దేశించి అన్నారు. బద్వేలు నుంచి చల్లగిరిగెలకు వెళ్లే దారిలో జగన్‌కు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేస్తూ యువనేత ముందుకు సాగారు. బద్వేలు ఎన్‌జీవో కాలనీ నుంచి బయలుదేరిన జగన్... గానుగపెంట, ఎస్.వెంకట్రామాపురం, అగ్రహారంల మీదుగా చల్లగిరిగెల చేరుకున్నారు.

No comments:

Post a Comment