Friday, February 25, 2011

మీ ఆత్మసాక్షిగా ఓటేయండి - ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిమానులకు జగన్ పిలుపు


ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామనే ప్రచారం జోరుగా సాగుతోంది...
మేం ఎవరినీ ఈసారికి పోటీకి దింపడం లేదు
పార్టీని ఏర్పాటు చేయటం, సంస్థాగతంగా పటిష్టం చేయటం, స్థానికస్థాయిలో కార్యవర్గాలను
ఏర్పాటు చేసి బలోపేతం చేయడమే ప్రస్తుత మా లక్ష్యం

త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ పోటీకి దింపడం లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గం పోటీ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. పార్టీ స్థాపన, కార్యవర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత మాత్రమే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయాలన్నదే తమ అభిప్రాయంగా ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దివంగత నేత ైవె ఎస్ అభిమానులందరూ ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన పూర్తి పాఠం..

‘‘మహానేత వైఎస్ ఆశయాల్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని, ఆయన కుటుంబాన్ని అభిమానించే నేతలకు, అశేష జనావళికి నాదొక విన్నపం.’’

‘‘మిత్రులారా! త్వరలో రాష్ట్ర శాసనమండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థల కోటా నుంచి జరగబోతున్న ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తున్నాయి. గెలవటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో దివంగత నేత వైఎస్సార్‌కు జరుగుతున్న అవమానాలు, నన్ను పార్టీ నుంచి గెంటివేయడానికి చేసిన ప్రయత్నాలు భరించలేక ఆ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి నేను బయటకు వచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొచ్చిన నాకు... కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు, జన సంక్షేమాన్ని కాంక్షించే నాయకులు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న సంగతీ రోజూ మీరు చూస్తున్నదే.


జలయజ్ఞం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం పింఛన్లు, పావలా వడ్డీ రుణాలు ఇలా ఏవైనా కావచ్చు. పేదలకు లబ్ధి చేకూర్చే ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం ఎలా తూట్లు పొడుస్తున్నదో.. సర్కారు పడిపోతే తమ చిరునామాలెక్కడ గల్లంతవుతాయో అనే భయంతో.. దానికి ప్రతిపక్ష తెలుగుదేశం ఎలా కొమ్ము కాస్తున్నదో ఇదంతా మీరు ప్రత్యక్షంగా చూస్తున్నదే. దీన్నంతటినీ ఏవగించుకుంటూ జనహిత రాజకీయాల కోసం నాకు బాసటగా నిలిచినవారినిపుడు ‘జగన్ వర్గం’గా పిలుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయంగా పోరాడాలన్నా, ఏదైనా సాధించాలన్నా రాజకీయ పార్టీ అవసరం కాబట్టి వైఎస్సార్ పేరిట పార్టీ స్థాపన, దానికి సంబంధించిన నిబంధనావళి, విధివిధానాల రూపకల్పన ప్రక్రియను ఆరంభించాం. అది పూర్తవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది.’’


‘‘రాబోయే ఎన్నికల్లో మా వర్గం నుంచి అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నామనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. దీనికి సమాధానంగా రాస్తున్న ఈ లేఖలో నేను చెప్పేదొక్కటే. రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చాలని, సామాన్య జన సంక్షేమానికి కట్టుబడిన దివంగత నేత వైఎస్సార్ ఆశయాల్ని నెరవేర్చాలనే దృఢ నిశ్చయంతో మేం ముందుకు కదులుతున్నాం. దీనికోసం పార్టీని ఏర్పాటు చేయటంతో పాటు సంస్థాగతంగా దాన్ని పటిష్టం చేయడం, స్థానిక స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కార్యవర్గాల్ని ఏర్పాటు చేసి బలోపేతం చేయటం వంటివన్నీ మొదట పూర్తి చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నాం. అలా చేసిన తరువాతే ఏ ఎన్నికల్లోనైనా పోటీ పడాలన్నది మా మనోభిప్రాయం. కాబట్టే వచ్చే నెల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ మేం పోటీకి దింపే యోచన చేయటం లేదు. అందుకని విజ్ఞులు, వైఎస్సార్ పట్ల అంతులేని అభిమానం కలిగి ఉన్న వారు ఈ ఎన్నికల్లో వారి ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’

ఇట్లు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి

Thursday, February 24, 2011

ఈ సర్కారును కొనసాగిస్తే... దేవుడి దృష్టిలో తప్పే! * జనమే జగన్.. జగనే జనం

25 లక్షల మంది విద్యార్థుల బాధలు పట్టించుకోలేదీ సర్కారు
‘ఫీజు రీయింబర్స్‌మెంటు’కు బడ్జెట్‌లో అన్యాయం చేశారు
రూ. 6,800 కోట్లు అవసరమైతే 3 వేల కోట్లు కేటాయించారు
ఈ సిగ్గులేని సర్కారు పేద విద్యార్థుల కోపాగ్నిలో కొట్టుకుపోతుంది
బడ్జెట్‌ను సవరించి విద్యార్థులను ఆదుకోవాలి... లేదంటే ఉద్యమం ఉధృతం
నిమ్మరసమిచ్చి జగన్ దీక్ష విరమింపజేసిన వరలక్ష్మి తల్లిదండ్రులు


  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సర్కారు వైఖరిని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు. ఇప్పటికే ఉన్న బకాయిలను చెల్లించని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో సైతం తగిన కేటాయింపులు చేయకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘25 లక్షల మంది పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధలను పట్టించుకోలేదీ ప్రభుత్వం.. ఇంత సిగ్గులేని ప్రభుత్వం ఎక్కడా ఉండదు. దీన్ని ఇంకా కొనసాగిస్తే దేవుడి దృష్టిలో మేమంతా తప్పు చేసినవాళ్లమవుతాం’ అని అన్నారు. లక్షలాది మంది పేద విద్యార్థుల కోపాగ్నిలో ఈ సర్కారు కొట్టుకుపోతుందని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వారం రోజులపాటు కఠిన నిరాహార దీక్ష చేసిన యువనేత జగన్ గురువారం సాయంత్రం దీక్ష విరమించిన సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తనను ప్రభుత్వం తరఫున ఎవరూ వచ్చి పరామర్శించనందుకు తనకు బాధలేదని, అయితే బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి చేసిన కేటాయింపులు తనను ఆవేదనకు గురిచేశాయని జగన్ చెప్పారు. మరోసారి మానవతా ధృక్పథంతో ఆలోచించి.. బడ్జెట్‌ను సవరించి పేద విద్యార్థులను ఆదుకోవాలని, లేదంటే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

హోరెత్తిన దీక్షా ప్రాంగణం


ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వరలక్ష్మి తల్లిదండ్రులు...జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వారం రోజులపాటు ప్రవాహంలా తరలివస్తున్న జనం గురువారం కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచీ ‘జై జగన్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతూనే ఉంది. ఏడు రోజులపాటు మెతుకు ముట్టకపోవడంతో నిస్సత్తువగా ఉన్న జగన్.. అంతమంది ప్రజల ఆదరాభిమానాలను చూశాక శక్తినంతా కూడదీసుకుని వారినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడ్డానికి లేవగానే.. జనంలో భావోద్వేగం ఉప్పొంగింది. దీక్షా ప్రాంగణమంతా కేరింతలు, హర్షధ్వానాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..


రాజశేఖరుడి సువర్ణ యుగం చూశాను


‘శ్రీరాముడి రాజ్యమైతే నేను చూడలేదు.. కానీ రాజశేఖరుడి సువర్ణయుగం చూశాను. ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే.. గండె బరువెక్కుతోంది. పేదలంతా పెద్ద చదువులు చదవాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత నేత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివి.. ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో అయితే... సంపాదించే డబ్బులో కొంత ముసలి తల్లిదండ్రులకు పంపిస్తే... పేదరికం నుంచి ఆ కుటుంబం బయటపడుతుందని, అందుకే ప్రతి పేదవాడు చదవాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారు.’

అందుకే వారం రోజుల దీక్ష
‘సర్కారు ఫీజులు కట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి ఇంటికి మొన్న నేను వెళ్లాను. ప్రభుత్వం ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో... తనను చదివించలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ప్రమాదమంటూ కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. వరలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు నాకు అనిపించింది.. ఈ ప్రభుత్వానికి బుద్ధిరావాలంటే... గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే.. ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తే సరిపోదని.. అందుకే ఏడు రోజులు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నా.’

ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..

‘ఈ సర్కారును మరోసారి హెచ్చరిస్తున్నా.. నెలరోజులు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల పథకం కేటాయింపుల్లో మార్పులు చేసి పేదవాడిని ఆదుకోండి. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నా.’

బడ్జెట్‌లోనైనా నిధులిస్తారని ఆశించాను..

‘అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్న సమయంలో నిరాహార దీక్ష చేసి ఒత్తిడి తెస్తే... ఫీజుల పథకానికి సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశించాను. 25 లక్షల మంది పేద విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని ఏడు రోజుల పాటు దీక్ష చేశాను. కానీ బడ్జెట్ చూస్తే.. 1.28 లక్షల కోట్ల బడ్జెట్. గత ఏడాది కంటే 15 వేల కోట్లు ఎక్కువగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో.. 25 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.’

రూ. 3,000 కోట్లే కేటాయిస్తారా?

‘ఈ ఏడాదికి ఫీజుల పథకానికి రూ. 3,400 కోట్లు అవసరం ఉంటే.. ఇప్పటికీ పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదీ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం కూడా 25 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాలంటే.. మరో రూ. 3,400 కోట్లు అవసరం. మొ త్తం రూ. 6,800 కోట్లు అవసరముంటే.. కేవలం రూ. 3,000 కోట్లు కేటాయించి చేతులు దులుపేసుకుంది. మరి ఈ 25 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటో ఈ సర్కారు ఏం సమాధానం చెబుతుంది?’
 
జనమే జగన్.. జగనే జనం
 
ప్రజల కోసం వారంపాటు కఠిన నిరాహార దీక్ష చేసిన జగన్
 
లక్షలాదిగా తరలివచ్చిన జనం

 
ఆయనిప్పుడు ఎంపీ కాదు.. ఎమ్మెల్యే కాదు.. అయినా ప్రజల ప్రతినిధిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.. అందుకే ఆయన వెంటే జనం నడుస్తున్నారు.. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వేలాదిగా గుమికూడుతున్నారు. జనమే జగన్.. జగనే జనమని వారు గట్టిగా నమ్ముతున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగిన ‘ఫీజు పోరు’కు వారం రోజులపాటు లక్షలాదిగా తరలివచ్చిన జనప్రవాహం.. ఆయనపై ప్రజల్లో ఉన్న ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు నిదర్శనం. అయితే జగన్ ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా.. లక్షలాది మంది విద్యార్థులిలా దీక్షకు తరలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా.. సర్కారు మాత్రం స్పందించలేదు. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో వచ్చే ఏడాది ఫీజుల పథకం కొనసాగింపును ప్రశ్నార్థకం చేసింది.

ఏడో రోజూ.. హోరెత్తిన ధర్నా చౌక్:
25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండుతో ‘ఫీజు పోరు’ పేరిట యువనేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాది మంది విద్యార్థులు దీక్షాస్థలికి వచ్చి యువనేతకు సంఘీభావం ప్రకటించారు. వారితోపాటు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళలు, పిల్లలు హాజరయ్యారు. దీక్ష కొనసాగిన ఏడు రోజుల్లో రెండు రోజులు తెలంగాణలో పూర్తి బంద్ జరిగినా.. దీక్షకు జన ప్రవాహం తగ్గలేదు. కాలి నడకన లక్షలాది మంది ఇందిరాపార్కుకు దండు కట్టారు.
ఆరోగ్యం క్షీణించినా..: నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత తొలి రెండు రోజులు ఆరోగ్యంగా ఉన్న యువనేత ఆ తర్వాత రోజు రోజుకూ నీరసించి పోయారు.

తొలి నాలుగు రోజులు పగలంతా వేదిక మీద కూర్చునే ప్రజలను పలకరించిన జగన్.. చివరి మూడు రోజులు దాదాపు పడుకొనే ఉన్నారు. మధ్యలో అప్పుడప్పుడు లేచి ప్రజలకు అభివాదం చేశారు. ఆఖరు రెండు రోజులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నాయని, సోడియం లెవల్స్ కూడా గణనీయంగా తగ్గాయని, మూత్రంలో కీటోన్ బాడీస్ భారీగా పోతున్నాయని వైద్యులు నిర్ధారించారు. తక్షణం వైద్య సహాయం అందించాలని వైద్యులు సూచించారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ఆరోగ్యం ప్రమాదకరస్థాయికి క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినా జగన్ దీక్ష వీడలేదు.

పోలీసుల ప్రయత్నం:
ఐదో రోజు, ఆరో రోజూ అర్ధరాత్రి వచ్చిన పోలీసులు యువనేతను ఆసుపత్రికి తరలించాలని ప్రయతం చేశారు. ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు హెచ్చరించారని, వైద్య చికిత్సకు అంగీకరించాలని వారు జగన్‌ను కోరారు. తన ఆరోగ్యం కంటే, 25 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ తనకు ముఖ్యమని చెబుతూ పోలీసుల విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు.

జగన్ దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధులు:
దీక్షలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కమలమ్మ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జయసుధ, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కుంజా సత్యవతి, గొల్ల బాబురావు, గుర్నాథరెడ్డి, పీఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, కొండా మురళి, సినీనటి రోజా, మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఎడ్మ క్రిష్ణారెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగ్గారెడ్డి, వడ్డి వీరభద్రరావు, జి.సుబ్బారావు, ప్రతాప అప్పారావు, నారాయణస్వామి, మాజీ మంత్రి మారెప్ప, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, పీసీసీ కిసాన్ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి గట్టు రామచంద్రరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున, సినీనటులు విజయ్‌చందర్, పోసాని కృష్ణ మురళి, శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, ముక్కా రూపానందరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి రాచమల్ల సిద్ధేశ్వర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి హాజరయ్యారు.


అపోలోలో జగన్‌కు వైద్యపరీక్షలు

యువనేత వైఎస్ జగన్ గురువారం దీక్ష ముగించాక జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అరగంట పాటు ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మ, భార్య భారతి తదితరులు జగన్‌కు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అంతకుముందు వందలాదిమంది అభిమానులు ఇంటి వద్ద యువనేతకు ఘనంగా స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

3 - 5 రోజులు విశ్రాంతికావాలి: డా. రవీందర్ బాబు

‘‘వైఎస్ జగన్‌ను సాయంత్రం ఆరింటికి పరీక్షించాం. ఆయన బ్రీతింగ్, పల్స్, బీపీ వంటివన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అయితే యూరిన్‌లో కీటోన్స్ మాత్రం ఐదుకు మించి ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఆయనకు మూడు నుంచి ఐదు రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరం. శక్తినిచ్చే ద్రవాహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.’’

దీక్షా వేదికపై నేతల స్పందనలివి

ఎన్నికలెప్పుడొచ్చినా జగనే సీఎం
పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యా భద్రత కల్పిస్తేనే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని భావించి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫీజుల పథకాన్ని ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం ఆయన ఆశయానికి తూట్లు పొడిచింది. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, విప్రో ప్రేమ్‌జీ ... వీరంతా పేద కుటుంబాల నుంచే వచ్చారు. చదువుకోవడం వల్లే ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. ముఖ్యమంత్రి, మంత్రులంతా.. వైఎస్ అందించిన అధికారాన్ని అనుభవిస్తున్నారు. అధికారాన్ని అనుభవిస్తే అనుభవించండి. కానీ దివంగత నేత ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. వైఎస్ మీద ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసంతోనే వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. విశ్వసనీయ నాయకుడు ఉంటేనే ప్రజాదరణ లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ పటిమ, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్ ఒక్కరే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సీఎం కావడం ఖాయం.
- ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ఈ ప్రభుత్వం పోవాలి.. జగన్ రావాలి

ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. నా బిడ్డను పొట్టనబెట్టుకుంది. ఫీజు కట్టలేక నా బిడ్డ వరలక్ష్మి ప్రాణాలు తీసుకుంటే.. గ్యాస్ లీకై మరణించిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. పాపిష్టి ప్రభుత్వం నా బిడ్డ మీద అభాండాలు వేసింది. ఇలాంటి ప్రభుత్వం పోవాలి.. జగన్ రావాలి. మాకొచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు. ఎవరికీ ఈ కడుపు కోత వద్దు.
- వరలక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, జంగయ్య

జగన్ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యముందా?

కళ్లుండి చూడలేని ప్రభుత్వం ఇది. చెవులుండి వినలేని సర్కారు ఇది. ప్రజా నాయకుడు జగన్ దీక్ష చేస్తుంటే.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు. అయినా ప్రభుత్వానికి తెలియలేదట. ఇక సామాన్యుల సంగతి ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది? జగన్ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం మంత్రులకు లేకపోవడం వల్లే... ప్రభుత్వం మంత్రులను పంపించి ఉండదు. కనీసం అధికారులను పంపించి డిమాండ్లు తెలుసుకోలేక పోయింది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం గద్దె దిగాల్సిందే. వైఎస్ హయాంలో లబ్ధి పొందని కుటుంబాలు రాష్ట్రంలో లేవు. చంద్రబాబు ఇంటికి కూడా రూ. 50 సబ్సిడీతో గ్యాస్
సిలిండర్లు వెళ్లాయి.
- మాజీ మంత్రి కొండా సురేఖ

అండగా ఉన్నానని చెప్పేందుకే దీక్ష..

ఏడు రోజులుగా ముద్ద ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్‌ను చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎంతో మంది తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ దయతో అధికారంలో కూర్చున్న వాళ్లు తన దీక్షకు స్పందిస్తారని జగన్ అనుకోలేదు. వరలక్ష్మి లాంటి చెల్లెళ్లు, తమ్ముళ్లకు అండగా ఉన్నానని చెప్పడానికే జగన్ నిరాహార దీక్షకు దిగారు.
- ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
 
 
పాలకుల దుర్బుద్ధికి నిదర్శనం
వారం రోజులుగా నిరాహారదీక్ష చేసిన జగన్‌తో ప్రభుత్వం చర్చలు జరపకపోవడం ఈ పాలకుల దుర్బుద్ధికి నిదర్శనం. మాట్లాడితే యువనేతకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనన్న భయమే వారిని వెంటాడింది. జగన్ ప్రభంజనంతో 125 ఏళ్ల కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్నాయి. చిరంజీవిని కలిపేసుకున్నారు.. చంద్రబాబును కౌగిలించుకున్నారు. వీరితో ప్రమాదంలేదు. కేవలం ఒక్కరితోనే వీరికి భయం. 
ఆ మొనగాడే జగన్.
- అంబటి రాంబాబు


ఫీజులకు తగిన నిధులు ఇవ్వండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులంతా వైఎస్‌కు రుణపడి ఉంటారు. బడ్జెట్ చూస్తే.. ఫీజుల పథకం వచ్చే ఏడాది ఉండదనే అనుమానం కలుగుతోంది. ఫీజుల కోసం వచ్చే ఏడాది కూడా విద్యార్థులు రోడ్డెక్కాల్సిందేనా..? బడ్జెట్‌ను సవరించి, ఈ పథకానికి తగు నిధులు ఇవ్వండి.
- మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్


సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి

పేద విద్యార్థుల కోసం ఏడు రోజులు దీక్ష చేయడం జగన్ ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఫీజుల నిధులివ్వకుండా మొండికేస్తున్న ఈ గుడ్డి సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి. జగన్ దీక్ష గురించి తమకు తెలియదని హేళన చేసిన కొందరు మంత్రులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
- కాటసాని రాంరెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే


ఇలాంటి దరిద్ర పాలన చేయొద్దు

బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ భవిష్యత్తులో ఉండకపోవచ్చు. దమ్ముంటే పాలన చేయాలి... కానీ ఇలాంటి దరిద్ర పాలన మాత్రం చేయొద్దు. పాలకులపై ఒత్తిడి పెంచేందుకే జగన్ దీక్ష చేపట్టారు. పరామర్శించే కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదా?
-గట్టు రామచంద్రరావు


రీయింబర్స్‌మెంట్ ఎత్తేస్తారేమో

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పాత బకాయిలకూ సరిపోవు. వచ్చే ఏడాది ఈ పథకం ఎత్తివేస్తారనే అనుమానం కలుగుతోంది. జలయజ్ఞం, సంక్షేమ పథకాల కేటాయింపులను చూస్తే వైఎస్ పథకాలనూ ప్రభుత్వం శాశ్వతంగా ఆపేందుకు రంగం సిద్ధం చేసిందనిపిస్తోంది.
- అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే


జగన్‌పై అక్కసుతోనే పలకరింపునకూ రాలేదు

వారంరోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్ పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. లక్షల మంది పేద విద్యార్థులకు ఆశాదీపంగా మారుతున్నాడనే అక్కసుతోనే కనీసం పలుకరించేందుకు కూడా ప్రభుత్వం రాలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నాయి.
- కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే


అగ్నిజ్వాలల్లో మసికావడం ఖాయం

నిమ్నజాతి పిల్లల అభ్యున్నతికి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తిలోదకాలిస్తోందీ ప్రభుత్వం. వారంరోజులుగా జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా పోయింది. ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. త్వరలోనే అగ్నిజ్వాలలు ప్రభుత్వాన్ని మసి చేయడం ఖాయం.
- గొల్ల బాబూరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే


నమ్మకమైన నేత

ప్రజాకర్షణే కాదు.. నమ్మకానికి పెట్టింది పేరు జగన్. ప్రజా సమస్యలే ఉద్యమంగా ముందుకు సాగుతున్నందునే జగన్ పట్ల ప్రజలకు నమ్మకం కలిగింది. ఏడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇది దున్నపోతు ప్రభుత్వం.
-జూపూడి, ఎమ్మెల్సీ


విద్యార్థులకు న్యాయం చేయాలి

యువనేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నా.. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం
చేయాలి.
-కొండా మురళి, ఎమ్మెల్సీ

ఫీజులు చెల్లించడం సామాజిక బాధ్యత

ఫీజులు చెల్లించడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. పేదరికం చదువులకు అడ్డుకాకూడదని వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తిలోదకాలిచ్చేలా వ్యవహరించడం సిగ్గుచేటు. యువనేత జగన్ ప్రాణాలొడ్డి వారం రోజులు దీక్ష చేసినా చలించని సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ
ప్రజలు స్పందించారు చాలు..

ప్రభుత్వం స్పందించక పోయినా పర్వాలేదు. విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున
స్పందించారు.
- ఎమ్మెల్యే జయసుధ


కుర్చీలు పట్టుకుని వేలాడుతున్నారు

దీక్షకు వచ్చిన నేతలు అధికార దాహంతో వచ్చిన వారు కాదు. రాని నాయకులే అధికార దాహంతో కుర్చీలు పట్టుకొని వేలాడుతున్నారు.
- బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే


పేదోళ్లకు చదువు వద్దనుకుంటున్నారా..

పేదవాడికి విద్య అవసరం అని దివంగత నేత వైఎస్ భావిస్తే... పేదవాడికి విద్య అవసరమా.. అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- నటి రోజా


కనీస భద్రత కల్పించరా..

జెడ్ కేటగిరీ నుంచి వచ్చిన జగన్, దివంగత ముఖ్యమంత్రి తనయుడు నడిరోడ్డు మీద రేయింబవళ్లు దీక్ష చేస్తుంటే.. ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించరా..?
- ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి


మంత్రులు పలుకరించక పోవడం శోచనీయం

రెండుసార్లు కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సాఆర్ తనయుడు నిరాహార దీక్ష చేస్తుంటే మంత్రులు పలుకరించక పోవడం శోచనీయం.
- రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ


వైఎస్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి స్వర్ణయుగం.
నేటి ప్రభుత్వం వైఎస్ పథకాలకు ఒక్కొక్కటిగా తూట్లు పొడుస్తోంది. -నెలవల సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే
దీక్షకు సంఘీభావం తెలపకుండా గోడమీద పిల్లుల్లా ఉన్న మంత్రులకు త్వరలో కాలం చెల్లుతుంది.
- ప్రతాప అప్పారావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే


వైఎస్ భిక్షతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేడు ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తున్న జగన్‌ను పరామర్శించని ఈ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.

- నారాయణస్వామి, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే


రాష్ర్టంలో ఇక మిగిలేది రెండు పార్టీలే. ఒకటి వైఎస్ జగన్ పార్టీ.. మరొకటి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ తదితరాల పార్టీ ఈ రెండింటి మధ్య త్వరలో మహాసంగ్రామం జరగబోతుంది.

- జి.సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే
 
సర్కారుకు ‘జగన్ భయం’...!
 
దీక్షపై స్పందించేందుకు కూడా సాహసించని వైనం
 
యువనేతకు మరింత పేరొస్తుందన్న భయమే కారణం

ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్టేనంటూ సర్వత్రా విమర్శలు
చౌకబారు ప్రవర్తనతో సర్కారే అప్రతిష్టపాలైందంటున్న స్వపక్ష నేతలు
ఎమ్మెల్యేలే స్పందిస్తుంటే ప్రభుత్వానికి ఏమైందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆవేదన

 ఫీజు రీయింబర్స్‌మెంట్. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టడంతో పాటు సాక్షాత్తూ సుప్రీంకోర్టుతోనే పాలకులకు పదేపదే అక్షింతలు వేయించిన సమస్య. 25 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన అపరిష్కృత సమస్యపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడు రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేస్తే, దానిపై కనీసం స్పందించేందుకు కూడా కిరణ్ సర్కారు సాహసించలేకపోయింది! దీని వెనక మతలబేమిటన్నది ఇప్పుడు రాష్టవ్య్రాప్తంగా చర్చనీయంగా మారింది. కారణాలేమైనా, దీక్షపై కనీస స్థాయిలో కూడా స్పందించకపోవడం ద్వారా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమయ్యామన్న వ్యాఖ్యలు సాక్షాత్తూ అధికార పక్షం నుంచే విన్పిస్తున్నాయి! జగన్ తిరుగులేని జన నేతగా ఎదుగుతున్న వైనం చూసి కాంగ్రెస్ ఇప్పటికే కలవరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీక్షపై ఎలా స్పందించినా ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుందన్న జంకుతోనే సర్కారు మూగనోము పట్టిందని అన్ని వర్గాలూ దుమ్మెత్తిపోస్తున్నాయి.

జగన్‌కు జనాదరణ పెరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోవడమే ప్రభుత్వ అనైతిక ప్రవర్తనకు కారణమని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ దీనిద్వారా తాము బావుకున్నదేమీ లేకపోగా... ప్రజా సమస్యలను, వాటిపై జరిగే ప్రజాస్వామిక ఆందోళనలను కూడా పట్టించుకోని పనికిమాలిన ప్రభుత్వమన్న అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు యువనేత పోరాటానికి సంఘీభావం ప్రకటించడం, ఆ విషయమై అసెంబ్లీకి పాదయాత్ర చేయడం, ఏకంగా సభలోనే ప్లకార్డులు ప్రదర్శించడం తమను మరింతగా ఇబ్బంది పెట్టే పరిణామమేనని వారంటున్నారు.


ఇంత ముఖ్యమైన ప్రజా సమస్యపై అధికార పక్ష ఎమ్మెల్యేలకున్న పాటి బాధ్యత గానీ, మానవత్వం గానీ ప్రభుత్వ పెద్దలకు లేకపోయాయా అంటూ నిలదీస్తున్న జనానికి బదులివ్వలేని దుస్థితిలో పడిపోయామంటున్నారు! ఇంతటి బాధ్యతారాహిత్యాన్ని మొదటిసారి చూస్తున్నామని కాంగ్రెస్ కురువృద్ధ నేతలు కూడా చెబుతున్నారు. జగన్‌ను జనంలో ఎదగనీయకుండా అణగదొక్కడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆయన దీక్షపై స్పందించకపోవడం వెనుక ఏకైక మతలబు కూడా అదేనని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు సీఎల్పీ వద్ద బాహాటంగానే చెప్పారు.


వారి విషయంలో అలా...

ఫీజులు కట్టకుంటే హాల్‌టికెట్లు ఇవ్వబోమని, పరీక్షలకు కూర్చోనివ్వబోమని, అసలు కాలేజీలనే మూసేస్తామని యాజమాన్యాలు హెచ్చరించడం, మరో దారి లేక ఓ అభాగ్య దళిత విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడం చూసి జగన్ స్పందించారు. రాష్ట్రం అట్టుడుకుతున్నా సమస్య తీవ్రతను గుర్తించడంలో, స్పందించడంలో ప్రభుత్వం విఫలమవడంతో ఏడు రోజుల నిరంతర నిరాహార దీక్ష చేపట్టారు. అందుకు రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో స్పందించింది. దీక్ష కొనసాగిన ఏడు రోజులూ రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి యువనేతను పరామర్శించారు. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా శిబిరానికి వచ్చి, ఫోన్ల ద్వారా సంఘీభావం ప్రకటించారు.

అసెంబ్లీకి పాదయాత్ర చేశారు. సభలో రెండ్రోజుల పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా సీఎం గానీ, మంత్రులు గానీ మాటమాత్రంగా కూడా స్పందించలేదు. సుప్రీంకోర్టు తలంటిన నేపథ్యంలో, రీయింబర్స్‌మెంట్ నిధులు, బకాయిలను విడతల వారీగా విడుదల చేసేందుకు కట్టుబడ్డామంటూ వినీ విన్పించకుండా నసిగి అంతటితో సరిపెట్టారు. రాజకీయంగా జగన్ విషయంలో కాంగ్రెస్, ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా ప్రజా సమస్య పరిష్కారానికి గళమెత్తినప్పుడు స్పందించడం పాలక పక్షం విధి. వారం రోజులు నిరాహార దీక్షకు దిగితే మానవీయతతో స్పందించడం కనీస బాధ్యత, మర్యాద. ఇదే సమస్యపై 2010 జూన్‌లో బీసీ నేత ఆర్.కృష్ణయ్య నిరాహార దీక్ష చేస్తే తొలి రోజు సాయంత్రమే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాటి సీఎం రోశయ్య ఆదేశానుసారం మంత్రులు సుభాష్‌చంద్రబోస్, దానం తదితరులు వెళ్లి పరామర్శించారు.


ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చి మరీ దీక్ష విరమింపజేశారు. ఇదే సమస్యపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగినా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలంటూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ గత డిసెంబర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగితే సీఎం స్వయంగా స్పందించి హామీ ఇచ్చారు. మంత్రులను, ఎంపీలను పంపి మరీ మంద కృష్ణ దీక్షను విరమింపజేశారు. డిసెంబర్‌లోనే రైతు సమస్యపై చంద్రబాబు ఆమరణ దీక్షకు దిగితే మూడో రోజే ఆస్పత్రికి తరలించారు. మర్నాడే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆయన్ను పరామర్శించారు. రైతు సమస్యలపై సీఎం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన్ను నిమ్స్‌కు తరలించే దాకా ప్రభుత్వం చేసిన హడావుడిని ఎవరూ మర్చిపోలేదు. కానీ కళ్లు మూసినా, తెరిచినా జగన్ జనాదరణనే తలచుకుని వణికిపోతున్న కిరణ్ సర్కారుకు మాత్రం ఆయన దీక్ష విషయంలో అలాంటి కనీస మర్యాదలేవీ అసలే పట్టలేదు. నిజానికి జగన్ ఫీజు పోరు దీక్షకు ఒక్కరోజు ముందు ఎన్టీవీ-నీల్సన్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.


వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్వాన్నంగా మారిందని, పీఆర్పీని విలీనం చేసుకున్నా ప్రజలు జగన్‌కే బ్రహ్మరథం పడుతున్నారని అందులో తేలింది. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి సహజం గానే రుచించలేదు. దీక్ష విషయంలో వారి ప్రవర్తనలో కూడా ఆ వైఖరే ప్రతిఫలించింది. జగన్ దీక్ష విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా కాక ఇంకెలా వ్యవహరిస్తుందని అసెంబ్లీ లాబీ లోనే ఒక సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు రుజువు. ఒకవైపు జగన్ ఎదుగుదలను అడ్డుకునేందుకు, ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తుంటే, ప్రత్యేకంగా ఈ దీక్ష విషయంలో మానవీయ కోణం ఎందుకుంటుందంటూ ఆయన ఉన్నమాట బయట పెట్టడంతో నోరెళ్లబెట్టడం విలేకరుల వంతయింది! జగన్ విషయంలో పాలక పక్ష అనైతిక రాజకీయాలు గతంలోనూ తెరపైకి వచ్చాయని వైఎస్, జగన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.

Wednesday, February 23, 2011

దీక్షా ప్రాంగణం జనమయం * బడుగుల చదువు కోసం...

రెండు రోజులుగా తెలంగాణ మొత్తం స్తంభించినా.. జగన్ దీక్షకు పోటెత్తిన జనం...
యువనేతకు మద్దతుగా వేలాదిగా వచ్చిన విద్యార్థులు
బస్సులు తిరగకపోవడంతో కాలినడకన ర్యాలీలు
కదిలి వచ్చిన కుటుంబాలు
పిల్లలను చంకనెత్తుకుని వచ్చిన తల్లులు
నేటితో ముగియనున్న జగన్ నిరాహార దీక్ష
జనాభిమానానికి అడ్డురాని తెలంగాణ బంద్



  బస్సులు తిరగలేదు.. జనం రోడ్ల మీదికి రాలేదు.. దుకాణాలు తెరవలేదు.. ఫలితం రోడ్లన్నీ ఖాళీఖాళీ.. రెండు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఇదే సీన్! కానీ రాజధానిలోని ఇందిరాపార్క్‌కు దారితీసే రోడ్లలో మాత్రం నిరంతరాయంగా జనప్రవాహం కొనసాగుతూనే ఉంది. వేలాదిగా తరలివస్తున్న అభిమాన ప్రవాహంతో యువనేత జగన్ దీక్ష చేస్తున్న ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ జనసంద్రమవుతోంది. విద్యార్థుల అభిమానంతో, తల్లుల ఆశీర్వాదాలతో, అక్కచెల్లెళ్ల ప్రేమాభిమానాలతో ‘జై జగన్’ నినాదం హోరెత్తుతోంది. బుధవారం యువనేత నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పేదల కోసం దీక్ష చేపట్టిన ప్రియమైన నేత ఇలా కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచీ జనప్రవాహం దీక్షా ప్రాంగణానికి చేరుకుంది. విద్యార్థులు ర్యాలీగా వచ్చి యువనేతకు మద్దతు తెలిపారు. తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా వచ్చి జగన్‌ను చూసి పలుకరించేందుకు ప్రయత్నించారు. తమకు కొండంత అండగా నిలిచిన వైఎస్‌ఆర్ కుమారుడికి ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకున్న వృద్ధులు, వికలాంగులు వేలాదిగా తరలివచ్చారు.


నిస్సత్తువతో పడుకునే ఉన్న జగన్


ఆరోగ్యం క్షీణించినందున జగన్ మొదటి రోజుల్లోలాగా మాట్లాడలేకపోయారు. కరచాలనం చేయలేకపోయారు. నిస్సత్తువతో రోజంతా పడుకునే ఉన్న ఆయన విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్నం 2:30 సమయంలో లేచి నిల్చుని అభివాదం చేశారు. దీంతో విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. విభిన్న వర్గాలు దశలవారీగా వచ్చి దీక్షకు మద్దతు ప్రకటించారు.


కాలినడకన దీక్షా శిబిరానికి..


తెలంగాణ బంద్ కారణంగా విద్యా సంస్థలకు సెలవు కావడంతో నగర పరిసర ప్రాంతాల్లోని వివిధ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి కాలినడకన దీక్షా శిబిరానికి వచ్చారు. ఇలాగే వేల మంది తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. దీక్షా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మహిళలు.. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు కనిపించారు. చంటి పిల్లలను చంకనెత్తుకొని కొందరు, పిల్లలను వెంటబెట్టుకుని మరికొందరు తల్లులు.. ఆరు రోజులుగా ముద్ద ముట్టకుండా కఠిన దీక్ష చేస్తున్న యువనేతను చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. మధ్యాహ్నం సమయంలో వేల మంది ముస్లిం విద్యార్థులు ఒకేసారి ర్యాలీగా రావడం అందరినీ ఆకట్టుకుంది. బుధవారం వచ్చిన వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఎక్కువగా కనిపించారు.


జగన్‌ను చూపించేందుకు ప్రయత్నాలు


తల్లిదండ్రులు తమ పిల్లలకు జగన్‌ను చూపించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే నిస్సత్తువతో ఉన్న జగన్ పడుకునే ఉండడంతో.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను భుజాల మీదికి ఎక్కించుకొని అదిగో జగన్ అంటూ చూపించడానికి ప్రయత్నించారు. కొంత మంది చిన్నారులు సమీపంలోని టేబుళ్ల మీదికి, రాళ్లమీదికి, గోడల మీదికి ఎక్కి చూశారు. చిన్నారులు అనుపమ, దీపలను ‘న్యూస్‌లైన్’ పలకరించగా విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన జగన్ ఆరోగ్యం నిలకడగా ఉండాలని, జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు.


రెండో రోజూ వచ్చిన పోలీసులు


జగన్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు బుధవారం ప్రయత్నించారు. రాత్రి 11.30 గంటల సమయంలో యువనేత వైద్య పరీక్షల రిపోర్టుతో వచ్చిన చిక్కడపల్లి ఏసీసీ చక్రపాణి జగన్‌తో మాట్లాడారు. వైద్య సేవలకు అంగీకరిస్తే ఆసుపత్రికి తరలిస్తామన్నారు. దానికి యువనేత తిరస్కరిస్తూ.. 6 రోజులుగా దీక్ష చేస్తున్న తనకు మరోరోజు దీక్షను కొనసాగించే మనోబలముందని, తనకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని తేల్చి చెప్పారు. దీంతో ఏసీపీతోపాటు ఆయనవెంట పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నాఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం.. ఈ రోజు దీక్షను భగ్నంచేయడానికి యత్నిస్తోంది. జగన్ ఆరోగ్యం పట్ల శ్రద్ధలేకపోవడమే కాకుండా.. అర్ధరాత్రి వేళ పోలీసులను పంపి నిద్రా భంగం కలుగజేస్తోంది. దీక్షను భగ్నం చేయాలనుకుంటనే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
 జగన్ ఆరోగ్య పరిస్థితి విషమం!
తగ్గిన సోడియం లెవెల్ యూరిన్‌లో ప్రమాదకరస్థాయిలో కీటోన్ బాడీస్


యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం విషమిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం ఆరురోజులుగా చేస్తున్న నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతోంది. శరీరంలోని సోడియం లెవెల్ దారుణంగా పడిపోయింది. బుధవారం రాత్రి 6:30 గంటలకు గాంధీ ఆస్పత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సోడియం లెవెల్ 121కి పడిపోయింది. అలాగే బీపీ 100/70, నాడీ స్పందన 64గా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. కాగా, యూరిన్‌లో కీటోన్ బాడీస్ 4+ ఉన్నట్లు నిర్ధారించారు. కీటోన్ బాడీస్ ప్రమాదకర స్థాయికి చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. సత్వరమే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్యులు హెచ్చరించారు.
జగన్‌ను తల్లి విజయమ్మ, సతీమణి భారతి  పరామర్శ
యువనేత జగన్‌ను తల్లి విజయమ్మ, సతీమణి భారతి పరామర్శించారు. ఆరురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను చూసి వారి కళ్లు చెమర్చాయి. బుధవారం రాత్రి వరలక్ష్మి దీక్షా ప్రాంగణానికి చేరుకున్న ఇరువురూ దాదాపు అర గంటపాటు యువనేతతో గడిపారు. నిరాహార దీక్షతో రోజురోజుకూ క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పటికే వైద్యులు కూడా పరీక్షలు నిర్వహించడంతో వారిని వాకబు చేశారు. అదే సమయంలో జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా యువనేతను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంతకుముందు విజయమ్మ దీక్షా ప్రాంగణానికి చేరుకోగానే అభిమానులు వైఎస్సార్ అమర్‌హై.. జై జగన్..జైజై జగన్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
 ఎమ్మెల్యేల పాదయాత్ర *  దీక్షా శిబిరం నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులతో నడిచిన ఎమ్మెల్యేలు
పెద్ద చదువులు - పేదవారి హక్కంటూ నినాదాలు  *  దీక్షపై స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్



ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం యువనేత వైఎస్ జగన్ ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. ఉదయం 7 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణా’నికి చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఆ తరువాత అక్కడినుంచి వారంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ‘పెద్ద చదువులు - పేదవారి హక్కు’, ‘మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశయానికి తూట్లు పొడవొద్దు’, ‘జగన్ దీక్షకు ప్రభుత్వం స్పందించాలి’ అని రాసిన ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ అసెంబ్లీ వరకూ నడిచారు. రామకృష్ణమఠం, సచివాలయం ఫ్లైఓవర్, రవీంద్రభారతి మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కమలమ్మ, కె.సత్యవతి, జయసుధ, టి.బాలరాజు, మేకతోటి సుచరిత, ప్రసాదరాజు, భూమా శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కె.రామచంద్రారెడ్డి, వై.బాలనాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పెంచల్‌రెడ్డి, కుర్రి పున్నారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి ఇందులో పాల్గొన్నారు.


ప్రభుత్వ వైఖరి విచారకరం: బోస్


పాదయాత్ర ప్రారంభానికి ముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ తన ఒక్కడి కోసం దీక్ష చేయడం లేదనీ, పాతిక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నారని అన్నారు. ఆరు రోజులుగా ఆయన కఠోర దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఆశయాలకు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ తూట్లు పొడుస్తోందని, అందుకే తాము ఆందోళనకు సిద్ధపడ్డామని ఆయన అన్నారు. ఇప్పటికైనా సర్కార్ దిగివచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


జగన్‌పై ప్రభుత్వానికి కక్ష: కొండా సురేఖ


కాలినడకన అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన కొండా సురేఖ సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ దీక్ష చేస్తున్నాడా? ఎక్కడ? అని ఓ మంత్రి ప్రశ్నిస్తూ ఉంటే ఆయన పక్కన ఉన్న మంత్రులు ఎగతాళిగా నవ్వారని తప్పు పట్టారు. జగన్‌లాంటి నేత దీక్ష చేస్తుంటే నిజంగా ప్రభుత్వానికి సమాచారం ఉండదా? ఇంటెలిజెన్స్ వారు చెప్పి ఉండరా? అని ఆమె ప్రశ్నించారు. ఒక పెద్ద నాయకుడు చేస్తున్న దీక్ష గురించే తెలుసుకోలేని ప్రభుత్వం ఇక సామాన్యుల గురించి ఏం తెలుసుకుంటుందని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జూపూడి మాట్లాడుతూ.. ఎవరైనా దీక్ష చేస్తే ప్రభుత్వం మూడోరోజే స్పందిస్తుందని, అలాంటిది జగన్ గురించి పట్టించుకోకుండా ఆయనపట్ల, ఆయన అనుయాయుల పట్ల కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.


ఆళ్ల నాని మద్దతు: ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) మధ్యాహ్నం దీక్షా శిబిరం వద్దకు వచ్చి జగన్‌ను కలిసి తన మద్దతును ప్రకటించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు.

 వారసులమంటూనే వైఎస్ పథకాలకు కత్తెర

రాష్ట్ర బడ్జెట్ వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచే విధంగా ఉందని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు.. వైఎస్‌కు వారసులమంటూనే ఆయన పథకాలకు కేటాయింపులు తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు. యువనేత జగన్ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన శాప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, టీటీడీ మాజీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ.3,400 కోట్ల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంటే బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లే కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ పథకానికి ఏటా సుమారు రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయనే విషయాన్ని గుర్తుచేస్తూ కనీసం ఆరేడు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఉంటే ఈ పథకం కొనసాగిస్తారనే నమ్మకం ఏర్పడేదన్నారు.


కానీ ప్రస్తుత కేటాయింపులు చూస్తే ఈ పథకాన్ని క్రమంగా రద్దు చేయడమో లేదా లబ్ధిదారులైన విద్యార్థులను త గ్గించేందుకు వడపోతను ఆరంభించడమో చేస్తారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కోరుతున్నది కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు ఒక్కటే కాదనీ, ఈ పథకంపై ఒక స్పష్టమైన వైఖరితో నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. వైఎస్ అధిక ప్రాధాన్యత ఇచ్చిన పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు ఇన్ని నిధులను కేటాయిస్తామని కూడా బడ్జెట్‌లో పేర్కొనలేదని కొణతాల అన్నారు. సీఎం కిరణ్ చిత్తూరు జిల్లా వాడైనందుకు తాను సిగ్గుపడుతున్నానని చెవిరెడ్డి అన్నారు.
 ‘ఫీజు’ కోసం పోరుబాట
జగన్ నిరాహార దీక్షకు మద్దతుగా రాష్టవ్య్రాప్తంగా విద్యార్థి లోకం కదిలివస్తోంది. యువనేతకు మద్దతుగా బుధవారం రాష్టవ్య్రాప్తంగా వైఎస్, జగన్ అభిమానులు, విద్యార్థులు బంద్‌లు, ఆందోళనలు, నిరశనలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యం కోసం రాష్టవ్య్రాప్తంగా పలు దేవాలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా గురువారం విశాఖ ఏజెన్సీలో బంద్ పాటించనున్నారు. విశాఖ జీవీఎంసీ ముందు ఆమరణ దీక్ష చేస్తున్న 12 మందిలో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి, ఏజెన్సీ ప్రాంతాల్లో బుధవారం బంద్ విజయవంతమైంది. దీక్షకు మద్దతుగా గురువారం వరంగల్ కాకతీయ వర్సిటీ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు జరిగాయి. నాగార్జున వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో చేశారు.
మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పొన్నూరు, నరసరావుపేటల్లో గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతపురంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. కడప వైఎస్ సర్కిల్‌లో నేతలు, విద్యార్థులు మానవహారంగా నిలిచారు. అమీన్‌పీర్ (పెద్ద) దర్గాలో మైనార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పులివెందులలో తరగతులు బహిష్కరించి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రమిచ్చారు.


స్కాలర్‌షిప్ అందక విద్యార్థి ఆత్మహత్యాయత్నం: రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం మరో విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొనేలా ఉంది. స్కాలర్‌షిప్ రాకపోవడం, వసతి గృహంలో ఉండొద్దని యాజమాన్యం చెప్పడంతో విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్ చదువుతున్న దుంప జనార్దన్ (18), బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
దీక్షా వేదికపై ఎవరేమన్నారంటే..

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్  ‘మూడు రోజుల్లోనే ఎందుకు విరమించారు?’
వయసులో ఉన్న వారు 10 రోజులు తినకున్నా ఏమీ కాదని జగన్ నిరాహార దీక్షపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించడం సమంజసం కాదు. జగన్ దీక్ష విషయంలో ఇలా మాట్లాడే రాజగోపాల్ మూడు రోజుల్లోనే ఎందుకు దీక్ష విరమించారో చెప్పాలి. జగన్ దీక్షపై స్పందించాలని సర్కారుకు చెప్పాల్సిందిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. జగన్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
- లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు
‘దీక్షకు గౌరవప్రదమైన ముగింపునివ్వండి’

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం యువనేత జగన్ చేస్తున్న దీక్షకు ఇప్పటికైనా స్పందించి గౌరవప్రదమైన ముగింపునివ్వాలి. అలాకాని పక్షంలో అపవాదులను ఎదుర్కోక తప్పదు. జగన్‌ని దూరం చేసుకోవడంలో కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని తప్పులు చేసి నష్టపోయింది. మరిన్ని తప్పులు చేసి పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిని కాంగ్రెస్‌లోని నాయకులే తీసుకొస్తున్నారు. ఆరోగ్యం పాడుచేసుకోకుండా జగన్ దీక్షను విరమించాలి.
- హరిరామ జోగయ్య, మాజీ ఎంపీ
ప్రభుత్వం.. రెండు తలల విషసర్పం


ముఖ్యమంత్రి కిరణ్ తాము వైఎస్ వారసులమని, ఆయన పెట్టిన పథకాలు కొనసాగిస్తామని అంటారు. డీఎల్ రవీంద్రారెడ్డి అవే పథకాలు సర్కారుకు గుదిబండలని వ్యాఖ్యానిస్తారు. శంకర్‌రావు అక్రమాలని ఏదో అంటారు. ఇలా రెండు నాల్కల ధోరణితో రెండు తలల విషసర్పాలను వీరు గుర్తుకు తెస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు అనేవి 26 లక్షల మందికి సంబంధించిన అంశాలు. ఇది అన్నిపార్టీలకు, ప్రాంతాలకు సంబంధించిన సమస్య. జగన్ దీక్షను అడ్డుకోవాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు చెప్పడం దారుణం. 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించడంతో ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. వారి ఆశీస్సులే జగన్‌కు శ్రీరామ రక్ష.
- అంబటి రాంబాబు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్


బడ్జెట్‌ను సవరించాలి


ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 25 మంది ఎమ్మెల్యేలం పాదయాత్ర చేశాం. ప్రభుత్వం స్పందించాలని కోరాం. సర్కారులో స్పందనే లేదు. తాజా బడ్జెట్‌లోనూ రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను పక్కనబెట్టారు. ఇదేనా సర్కారు చిత్తశుద్ధి. రీయింబర్స్‌మెంట్ సంక్షేమ పథకం కాదు. భావితరాల అభ్యున్నతి కోసం సమాజంపై చేసే పెట్టుబడి. బడ్జెట్ సవరణకు మరో 30 రోజుల సమయం ఉంది. ఇప్పటికైనా సవరించుకోవాలి. లేకుంటే జగన్ మళ్లీ ఒత్తిడి తెస్తారు. - శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే
వెంటనే నిధులివ్వాలి
పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. - ఎం.సుచరిత, ఎమ్మెల్యే
వైఎస్ పేరు తలిచే అర్హత లేదు
ప్రభుత్వ పెద్దలు వైఎస్ పేరు తలిచే అర్హత కోల్పోయారు. వైఎస్ పేరును కొట్టేయడానికి ఆయన పథకాలను కాంగ్రెస్ పథకాలుగా నేతలు చెప్పుకుంటున్నారు. పావలా వడ్డీ పథకం తన సూచనే అని సీఎం అబద్ధాలు చెబుతున్నారు.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ


పదవిలో ఉండే అర్హత లేదు..


వైఎస్ వారసులమని చెప్పుకొంటూ ఆయన పదవిలో కూర్చున్న వారు పేదల సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారు. ఉపకారం పేరుతో అపకారం చేస్తున్నారు. సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్న వారికి పదవిలో ఉండే అర్హత లేదు.
- రోజా, మహిళా నాయకురాలు


జగన్ దీక్ష చేస్తుంటే స్పందించని ప్రభుత్వానికి సిగ్గులేదా అని చాలా మంది అంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఇది కేవలం విద్యార్థుల సమస్యే కాదు. 1.50 కోట్ల జనాభా సమస్య. కురుక్షేత్రంలో అభిమన్యుడిలాగే ఇప్పడు జగన్ పోరాడుతున్నారు.
- తోట గోపాలకృష్ణ, మాజీ ఎంపీ


జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. యువనేత ఒక్క పిలుపునిస్తే ఎంతటి పోరాటానికైనా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.
- బుచ్చి మహేశ్వరరావు, మాజీ ఎంపీ


రాష్ట్రంలో మానవత్వం లేని ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగన్ అభిమన్యుడిలా పోరాటం చేస్తుంటే ప్రభుత్వంలోని వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.
- బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే


జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత వైఎస్‌దే. అందరికీ ఉన్నత విద్య అందించాలని ఆయన పెట్టిన పథకానికి ఇప్పుడు తూట్లు పొడుతున్నారు.
- కె.రవి కుమార్, మాజీ ఎమ్మెల్యే


రాష్ట్రానికి దశ, దిశ కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి.
- జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే


వైఎస్ పథకాలను పక్కనబెట్టిన ప్రస్తుత ప్రభుత్వం జగన్ ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం. - చల్లా వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే


కాంగ్రెస్ పార్టీనుంచి ఎంతో మంది సీఎంలయ్యారు. అయితే వైఎస్ సీఎం అయ్యాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం పట్టని సర్కారిది. శంకర్‌రావు మాటలు చూస్తుంటే ఎస్సీలు సిగ్గుపడుతున్నారు.
-ఎం.నాగార్జున, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్


ఫీజు రీయింబర్స్‌మెంట్ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్య. ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేస్తున్న జగన్‌తో చర్చలు జరపాల్సిన నైతిక బాధ్యత సర్కారుపై ఉంది. జగన్ దీక్ష చేస్తుంటే కొందరు మంత్రులు హేళనగా మాట్లాడడం సరికాదు.
- కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ ప్రధాన కార్యదర్శి


ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఒక ప్రాంతానికో, రాజకీయ పార్టీకో సంబంధించిన సమస్య కాదు. లక్షలాది పేద కుటుంబాల సమస్య. సుప్రీంకోర్టు జోక్యం, జగన్ ఉద్యమంతో ఈ పథకాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
- దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
జగన్ దీక్ష చేస్తుంటే సర్కారుకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దానికి పోయేకాలం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారు.
- ఎం.వి.హర్షవర్ధన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి కుమారుడు



ఎవరి గొడవ వాళ్లు చూసుకునే ఈ రోజుల్లో జనం కోసం దీక్ష చేస్తున్న నేత జగన్. జగన్ ఈజ్ జగన్, జగన్ ఈజ్ వైఎస్‌ఆర్. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని వంశం నుంచి వచ్చిన జగన్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
- ఎస్.వి.కృష్ణారెడ్డి, సినీ దర్శకుడు


ఈ తరం, రేపటి తరం నేత జగన్. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలి.
- అచ్చిరెడ్డి, సినీ నిర్మాత


పేదలకు పెద్ద చదువుల కోసం వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెడితే ప్రస్తుత సర్కారు కాలేజీలు మూసివేసే పరిస్థితిని తెచ్చింది. జగన్ ఆరురోజులుగా దీక్ష చేస్తున్నా సర్కారు స్పందించకపోవడమే ఈ పథకంపై వారి నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.
- తాడి శకుంతల, విజయవాడ మాజీ మేయర్


కులం, మతం అని తేడా లేకుండా పేదలందరికీ ఉన్నత చదువులు అందుబాటు ఉండేందుకు వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. ఇప్పటి ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి వారికి కష్టాలు సృష్టిస్తోంది.
- నేదురుమల్లి పద్మనాభరెడ్డి, జగన్ వర్గం నేత


జగన్ దీక్ష సంగతే తెలియదంటున్నాడు మంత్రి బొత్స. తోలు మందమైంది బిడ్డా నీకు. నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర అంతా తెలుసు. నీది దొంగ డిగ్రీ. వేరే వ్యక్తితో పరీక్షలు రాయించావు. సారా సీసాలు కడిగి పైకి వచ్చావు. విజయనగరం మునిసిపాలిటీ ఎన్నికల్లో తేలుస్తాం నీ సత్తా ఎంటో.
- గోనె ప్రకాష్‌రావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

జగన్‌ను ఆస్పత్రికితరలించే యత్నం * యువనేత ససేమిరా.. దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ

మూత్రంలో కీటోన్స్, తగ్గిన షుగర్ లెవల్స్
నిర్ధారించిన వైద్యులు

--------------------------------
జగన్ ఆరోగ్య పరిస్థితి
బీపీ: 100/70
రక్తంలో చక్కెర స్థాయి: 66 ఎంజీ
నాడీ స్పందన: నిమిషానికి 60 సార్లు
మూత్రంలో కీటోన్స్ ఎక్కువగా పోతున్నాయి

---------------------------------------------


యువనేత ససేమిరా.. దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ
అర్ధరాత్రి దాటాక దీక్షా శిబిరానికి పోలీసులు.. ఆస్పత్రికి తరలిస్తామని వినతి
తన ఆరోగ్యం కంటే పేద విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్న యువనేత
సర్కార్ ఫీజుల సమస్య పరిష్కరిస్తేనే దీక్ష విరమిస్తానని వెల్లడి
క్షీణిస్తున్న ఆరోగ్యం.. మూత్రంలో కీటోన్ బాడీస్ 4% దాటాయి..
వెంటనే ఆహారం తీసుకోవాలి.. లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి
తీసుకోకుంటే మొదట కిడ్నీలకు, తర్వాత గుండెకు ప్రమాదమన్న డాక్టర్లు
అయినా వైద్య చికిత్సలను తిరస్కరించిన జగన్.. కొనసాగుతున్న నిరాహార దీక్ష
ఐదో రోజూ పోటెత్తిన జనం.. బంద్ ఉన్నా ఆగని అభిమానులు



ఐదు రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్ ఆరోగ్య పరిస్థితి మంగళవారం క్షీణించింది. దీంతో అర్ధరాత్రి 12 గంటలు దాటాక యువనేతను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. భారీ పోలీసు బలగాలతో దీక్షా శిబిరానికి వచ్చిన ఏసీపీ చక్రపాణి జగన్‌తో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చేందుకు అంగీకరిస్తే గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తామని కోరారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల దీక్ష కొనసాగిస్తానని జగన్ స్పష్టంచేశారు. దీక్ష వల్ల తన ఆరోగ్యం క్షీణించవచ్చుగాని, యువకుడినైనందువల్ల ప్రమాదమేమీ జరగదని అన్నారు. తన ఆరోగ్యానికంటే 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టంచేశారు. ‘నాకోసం నేను దీక్ష చేయడంలేదు. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాను. నేను 37 సంవత్సరాల యువకుడిని. ఏడు రోజులపాటు దీక్ష చేస్తానని ముందే చెప్పాను.

ఆ క్రమంలో ఆరోగ్యం దెబ్బతింటుందని నాకు తెలుసు. అయితే లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ముందు నా ఆరోగ్యాన్ని లెక్క చేయను. ఇప్పటికి ఐదు రోజులు దీక్ష చేశాను. మరో రెండు రోజులు చేయడం నాకేం కష్టంకాదు. నా ఆరోగ్యం దెబ్బ తింటుందని మీకు ఆందోళన ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థుల కోసం ఏమైనా చేస్తే దీక్ష విరమించడంపై నిర్ణయం తీసుకుంటాను’ అని ఏసీపీ చక్రపాణికి జగన్ స్పష్టంచేశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.


కీటోన్ బాడీస్‌పై వైద్యుల ఆందోళన

అంతకుముందు రాత్రి 8 గంటలకు జగన్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని చెప్పారు. ఆయన షుగర్ స్థాయి తగ్గిందని, కీటోన్ బాడీస్ నాలుగు శాతం దాటాయని పేర్కొన్నారు. అసలు మూత్రంలో కీటోన్ బాడీస్ ఉండడమే ఆరోగ్యం క్షీణిస్తోందనడానికి సూచికని, అలాంటిది నాలుగు శాతం దాటడమంటే పరిస్థితి విషమిస్తున్నట్లేనని యువనేతకు వైద్య పరీక్షలు చేసిన గాంధీ ఆస్పత్రి వర్గాలు స్పష్టంచేశాయి. అత్యవసరంగా ఆయన ఆహారం తీసుకోవాలని, లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలని పేర్కొన్నాయి. అలా చేయలేదంటే ఆరోగ్యం మరింత వేగంగా క్షీణించే ప్రమాదముందని తెలిపాయి. దీక్ష ఇలాగే కొనసాగితే మొదట కిడ్నీకి, తర్వాత గుండెకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ జగన్ పట్టువీడట్లేదు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించాలన్న బలమైన సంకల్పంతో నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. జగన్‌ను చూడ్డానికి తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు.
 
కాసేపే కూర్చోగలిగిన యువనేత

విద్యార్థులకు ఫీజులు, మెస్ చార్జీలు తక్షణం చెల్లించాలని డిమాండు చేస్తూ జగన్ చేపట్టిన ఏడు రోజుల నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరింది. యథావిధిగా ఉదయం నుంచే దీక్షా స్థలికి చేరుకున్న ప్రజలను కలవడానికి ఉదయం 7 గంటలకే ఆయన వేదిక మీదకు వచ్చారు. అప్పటికే ఆయన నీరసంగా కనిపించారు. ప్రజలను పలకరించడానికి, కరచాలనం చేయడానికి వీలుగా నాలుగు రోజులుగా పగలంతా కూ ర్చొనే ఉన్న జగన్... మంగళవారం కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. సర్వ శక్తులు కూడగట్టుకొని అభిమానులు, విద్యార్థులను పలకరించడం కోసం అప్పుడప్పుడూ కూర్చున్నారు. షుగర్ లెవల్ బాగా పడిపోవడంతో.. ఆయన ఎక్కువ సమయం వేదిక మీద పడుకొనే ఉన్నారు. యువనేత మాట్లాడాలని విద్యార్థులు సాయంత్రం గట్టిగా డిమాండు చేశారు. జగనన్న మాట్లాడాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాట్లాడడానికి జగన్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని, అర్థం చేసుకోవాలని నాయకులు సర్దిచెప్పడంతో విద్యార్థులు సరేనన్నారు.



చికిత్స అందించకుంటే ప్రమాదమే

ఐదు రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించిందని జగన్‌ను పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య చికిత్స అత్యవసరమని డాక్టర్లు సూచించారు. ఆయనకు పరీక్షలు చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో చికిత్స అత్యవసరం.. కానీ ఆయన దీక్ష కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు’ అని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి(గాంధీ) వైద్యుడు దీపక్ మాట్లాడుతూ ఆయన శరీరంలో షుగర్‌లెవల్స్ తగ్గాయని చెప్పారు. మిగిలిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

దీక్ష పూర్తి చేయాలంటున్నారు: భూమన

ఇలాగే దీక్ష కొనసాగితే మరింత ప్రమాదముందని వైద్యులు చెప్పారని జగన్ వర్గం నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ‘వెద్యులు చికిత్స అత్యవసరమంటున్నారు. కానీ జగన్ మాత్రం ఏడు రోజుల దీక్ష పూర్తయ్యేంతవరకు డాక్టర్ల నుంచి ఎలాంటి సహాయం తీసుకోనని చెపుతున్నారు. మానసికంగా ధృఢంగా ఉన్నారు. నిరాహార దీక్షను పూర్తి చేస్తానంటున్నారు’ అని చెప్పారు.


జగన్ దీక్షలో జన దండు  *   బంద్‌తో తెలంగాణ స్తంభించినా వెల్లువలా వచ్చిన ప్రజలు


 బంద్ పిలుపుతో మంగళవారం తెలంగాణ మొత్తం స్తంభించింది.. కిక్కిరిసి ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.. కానీ ఇందిరాపార్క్ వద్ద యువనేత జగన్ నిరాహార దీక్ష చేస్తున్న ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ మాత్రం జన జోరుతో హోరెత్తింది. తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుండగా.. ఇక్కడకు వచ్చిన వారిలో తెలంగాణ జిల్లాల ప్రజలే అధికంగా ఉండడం గమనార్హం. విద్యార్థులకు ఫీజులు, మెస్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగన్ చేపట్టిన ఏడు రోజుల కఠిన నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు.. ఇలా విభిన్న వర్గాల ప్రజలు వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు.

కిలోమీటర్ల మేర కాలి నడకన..:
మంగళవారం తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలో సిటీబస్సులు నిలిచిపోయాయి. వివిధ జిల్లాల నుంచి రైళ్లల్లో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌లకు చేరకున్న జనం పాదయాత్ర చేపట్టారు. కోస్తా జిల్లాల నుంచి వచ్చిన జనం సికింద్రాబాద్ నుంచి, రాయలసీమ జిల్లా నుంచి వచ్చిన జనం కాచిగూడ స్టేషన్ నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన జనం నాంపల్లి నుంచి ఇందిరా పార్కు బాట పట్టారు. బంద్‌రోజు ప్రశాంతంగా ఉండాల్సిన ఆర్టీసీ క్రాస్‌రోడ్-ఇందిరాపార్కు రహదారి జై జగన్..జైజై జగన్..అంటూ నినాదాలతో హోరెత్తింది. గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థుల పాదయాత్రలో మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య కూడా పాల్గొనడం విశేషం. ఇక దీక్షా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మహిళలు.. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా కనిపించారు.

కన్నీరు మున్నీరైన అభిమానులు:
వివిధ జిల్లాల నుంచి పలువురు జానపద కళాకారులు దీక్ష స్థలికి వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు. మనగానం కళాబృందం సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. 50 మంది సీనీ జూనియర్ మహిళా ఆర్టిస్టులు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు, మహిళలు... జగన్‌ను దగ్గర నుంచి చూడాలని పరితపించారు. ఆయన్ను పలకరించాలని, చేయి కలపాలని ఆరాటపడ్డారు. అభిమానులను పలకరించడానికి యువనేత సర్వశక్తులు కూడగట్టుకొని కాసేపు కూర్చుని అభివాదం చేశారు. కొంత మందితో కరచాలనం చేశారం. బాగా నీరసించి ఉన్న ఆయన ఎక్కువ సమయం కూర్చోలేక.. ఎక్కువసేపు పడుకొనే ఉన్నారు. నీరసించి పడుకొని ఉన్న జగన్‌ను చూసి.. పలువురు మహిళలు కంటతడి పెట్టారు. ఫీజు పోరుకు మద్దతుగా జూనియర్ డాక్టర్లు, విద్యార్థినిలు సోమవారం నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు వారు దీక్ష చేశారు.

ఎంఐఎం మద్దతు:
దీక్షకు ఎంఐఎం మద్దతు ప్రకటించిందని మైనార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వెల్లడించారు. ఎంఐఎం నేత ఒవైసీ తనకు ఫోన్ చేసి జగన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారని తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసిన వైఎస్ కుమారుడైన జగన్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, త్వరలో వచ్చి కలుస్తానని చెప్పమన్నారని వెల్లడించారు.

దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు:
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుభాష్ చంద్రబోస్, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రసాదరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలరాజు, కమలమ్మ, ఆళ్ల నాని, ద్వారంపూడి, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథ రెడ్డి, శోభానాగిరెడ్డి, జయసుధ, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జూపూడి, కొండా మురళి, పుల్లా పద్మావతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి, సినీ నటులు రోజా, రాజా, జగన్ వర్గ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, బాజిరెడ్డి, రెహ్మాన్, బీరవోలు సోమిరెడ్డి, సిరాజుద్దీన్ దీక్షలో పాల్గొన్నారు.
 
లేదు.. దీక్ష కొనసాగిస్తారు
 స్పష్టం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
పథకం అమలులో ప్రభుత్వ వైఖరి తేల్చేందుకే దీక్ష
ప్రభుత్వంపై ఎంత నమ్మకముందో సుప్రీం వ్యాఖ్యలే చెబుతున్నాయి
దీక్షపై టీడీపీ రాజకీయాలు సిగ్గుచేటు


భవిష్యత్‌లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బయటపెట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముందే చెప్పినట్టు ఏడు రోజులు పూర్తిగా నిరాహార దీక్ష కొనసాగిస్తారని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. దివంగత నేత వైఎస్ కలలుకన్న విధంగా నిరుపేద పిల్లలకూ పెద్ద చదువులు అందించాలన్న లక్ష్యంతోనే జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె. శ్రీనివాసులు, పి.రామకృష్ణారెడ్డి, బాబూరావు, రామ చంద్రారెడ్డి, గురునాథ్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు చెప్పింది.. ప్రభుత్వం ఇస్తామంటుంది.. జగన్ దీక్ష విరమించవచ్చు కదా అని అందరూ అంటున్నారు. కానీ జగన్ దీక్ష చేస్తోంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం ఇబ్బందుల గురించి కాదు. రాబోయే ఆర్థిక సంవత్సరాల గురించి ప్రభుత్వం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆయన దీక్ష చేస్తున్నారు. చిన్న వయస్సులో నిరాహార దీక్షలు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎంతోమంది చెబుతున్నా ఏడు రోజులు దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. తాము కాంగ్రెస్‌లోనే ఉన్నామని, పార్టీ ఎమ్మెల్యేలుగానే మాట్లాడుతున్నామని చెప్పారు. ైవె ఎస్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలను సరిగా అమలు చేయకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తుందా.. లేదా అన్న అనుమానంతో జూలై కల్లా బకాయిలు చెల్లించి తమకు రశీదులు చూపమని సుప్రీంకోర్టు కోరిందని గుర్తుచేశారు. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకు ఏమేరకు నమ్మకముందో అర్థమవుతోందన్నారు. నిరుపేద విద్యార్థులకుపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌తో జగన్ దీక్ష చేస్తుంటే... టీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుందంటూ చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, జగన్ దీక్షపై రాజకీయం చేయడం ఎంతవరకు సమంజస మో బాబు ఆలోచించుకోవాలన్నారు. తొమ్మిదేళ్ల సీఎంగా, ఆరున్నర ఏళ్లగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలో తెలియకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సర్కారు శవంతో సమానం
జగన్ దీక్షను పట్టించుకోకపోవడంపై అంబటి రాంబాబు ధ్వజం
హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై యువనేత జగన్ ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఒక మృత కళేబరంతో సమానమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. మంగళవారమిక్కడ ఆయన పీసీసీ కిసాన్ సెల్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జునతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘సమస్యలు పాలకుల దృష్టికి తీసుకురావడానికి నిరాహారదీక్ష అనేది ఒక మార్గం, గాంధీ మహాత్ముడు మనకు నే ర్పించింది ఇదే. అలాంటి మార్గాన్ని ఎంచుకుని ఐదు రోజులుగా కడుపు మాడ్చుకుని నడిరోడ్డుపై జగన్ దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వం తరపున కనీసం ఎవరూ పలకరించడానికి రాకపోవడం శోచనీయం. ఆర్.కృష్ణయ్య, జి.కిషన్‌రెడ్డి, మందకృష్ణ మాదిగలు వివిధ సమస్యలపై నిరాహారదీక్ష చేసినపుడు మంత్రులను పంపి సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం జగన్ దీక్ష విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది’ అని నిలదీశారు. చంద్రబాబు దీక్షకు కూర్చున్న మరుసటి రోజే ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారని అంబటి గుర్తు చేశారు. బాబును ఆసుపత్రికి తరలించిన తరువాత కూడా వైద్యశాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి ఆరోగ్యం జాగ్రత్తగా చూడాల్సిందిగా వైద్యులకు ఆదేశాలు ఇచ్చి వచ్చారని తెలిపారు.


జగన్ అంటే ఎందుకంత కోపం?


‘జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత కోపం? మహానేత వైఎస్సార్ తనయుడనేనా? ఆయన కాంగ్రెస్‌ను వీడి వె ళ్లాడనా? లక్షలాది మంది విద్యార్థుల అభ్యున్నతి కోసం తన తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తూ ఉంటే చూడలేక దీక్షకు పూనుకున్నారనా’ అని అంబటి ప్రశ్నించారు. ప్రభుత్వానికి మానవతా విలువలు కూడా లేవా అని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని, అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ‘ప్రతి విషయంపైనా ఎక్కువగా మాట్లాడే ఓ మంత్రి జగన్ దీక్ష చేస్తున్న విషయమే తెలియదంటారు, డీఎల్ వంటి మంత్రి వైఎస్ పథకాలు గుదిబండలయ్యాయని, వాటి వల్ల నరకయాతన పడుతున్నామని అంటారు. అసలు ఈ ప్రభుత్వమే ప్రజలకు పెద్ద గుదిబండ’ అని దుయ్యబట్టారు. జగన్ దీక్షను ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నా.. మరో విధంగా అనుకున్నా.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాత్రం ఆగదు.. అంతం కాదిది ఆరంభం మాత్రమే అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలు విశ్వసించలేమంటూ సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా సిగ్గు రాలేదన్నారు. ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా? అనేది అనుమానంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాబుకు కడుపు మంట


విద్యార్థుల కోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అడ్డుకోలేదేమని చంద్రబాబు మాట్లాడటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని రాంబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు వారి తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంది. అలాంటిది ఆయన తన బాధ్యతను మర్చిపోయి.. జగన్ ఆ ఉద్యమాన్ని చేస్తుంటే అడ్డుకోలేదేమని తెలంగాణవాదులను ఉసిగొల్పాలని చూస్తారా? ఇంతకంటే దిగజారుడుత నం ఏమైనా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాగా, మంత్రి శంకరరావుకు ఇంగిత జ్ఞానం ఉంటే.. సీఎం కిరణ్ రూ. 30 కోట్ల విలువైన అసైన్డ్ భూములను ఆక్రమించారనే ఆరోపణల మీద హైకోర్టుకు లేఖ రాయాలని గట్టు రామచంద్రరావు ఫీజు పోరు వేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ సవాలు విసిరారు.


ఆ పత్రికలు, మీడియాది దుష్ర్పచారం
జగన్‌కు 4.5 లక్షల మంది పరామర్శ


కొన్ని పత్రికలు, ఓ వర్గం మీడియా కావాలనే జగన్ దీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంబటి విమర్శించారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘జగన్ దీక్షకు స్పందన లేదని, నీరుగారిపోయిందని కొన్ని పత్రికలు రాశాయి. మీడియాలో వచ్చిందంతా.. పత్రికల్లో రాసిందంతా రాష్ట్ర ప్రజలు నమ్మి ఉంటే 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదే కాదు. పత్రికల్లో వచ్చిందంతా నమ్మొద్దని వైఎస్ చెప్పేవారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా తెలుసుకోమని చెప్పేవారు. ఎవరేమి రాసినా.. ఏం చూపించినా జగన్‌కు ఉన్న ప్రజాదరణ తగ్గదు. దీక్ష ప్రారంభించిన నాటి నుంచి మంగళవారం ఉదయం వరకూ 4.5 లక్షల మంది వచ్చి జగన్‌ను పరామర్శించారు.


పరామర్శకు వచ్చిన వారంతా దీక్షా శిబిరం వద్దనే కూర్చుండిపోరు కదా? బిడ్డ కడుపు మాడ్చుకుంటున్నాడని దగ్గరికి వచ్చి ఏడ్చినవారున్నారు.. అయ్యో అని ఆవేదన వ్యక్తం చేసేవారున్నారు. ఇవన్నీ మీడియాకు కనపడవు. వాళ్లకు కనిపించినా కనిపించకపోయినా జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నారు. తెలుగు రాష్ర్టంలో ఆయనే అత్యంత ప్రజాదరణగల నేత’ అని చెప్పారు. ప్రాణం పోయినా సరే మాట తప్పని వంశం నుంచి వచ్చిన వాడు.. ఆరోగ్యం క్షీణిస్తున్నా నీరసంగా కనిపిస్తున్నా దీక్ష మాత్రం ఏడు రోజుల పాటు కొనసాగించి తీరుతారు అని తెలిపారు. జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతోందన్న వార్తలను ప్రస్తావిస్తూ.. ‘దీక్ష చేస్తున్నది ఏమైనా అసెం బ్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికా? ఎమ్మెల్యేలు వచ్చేటపుడు వస్తారు. కొంతమంది వస్తారు. మరికొందరు ఇబ్బంది కలుగుతుందని రాకపోవచ్చు, అంత మాత్రాన జగన్ బలం తగ్గిపోయినట్లేనా’ అని అన్నారు.


‘ఫీజు పోరు’లో ఎవరేమన్నారంటే...

చీమ కుట్టినట్లు కూడా లేదు

జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఫీజులిచ్చినా విద్యార్థులు పరీక్షలు రాసే మానసిక స్థితిలో లేరు. విద్యా వ్యవస్థలో దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వకపోవడం వల్ల... ఫీజులు కట్టి చదువుతున్న 40 శాతం మంది విద్యార్థులకూ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. -కొండా సురేఖ, మాజీ మంత్రి

దీక్ష ప్రకటించాకే విద్యార్థులు గుర్తొచ్చారు

జగన్ ఫీజు పోరు ప్రకటించిన తర్వాతే చంద్రబాబుకు, ప్రభుత్వానికి విద్యార్థులు గుర్తొచ్చారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షనేత ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్‌కు రెండు సార్లు ఘన విజయాలను అందించిన మహానేత కుమారుడు దీక్ష చేస్తుంటే.. వైఎస్ వల్ల అధికారం వెలగబెడుతున్న సీఎం, మంత్రులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. తాము పలకరిస్తే జగన్ నాయకుడు అవుతారని సీఎం, మంత్రులు భయపడుతున్నారు.
- శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే

సర్కారుది అహంకార పూరిత వైఖరి

జగన్ దీక్ష చేస్తున్నా.. దున్నపోతు మీద వాన పడినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైఎస్‌ను నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే... ఆయన లేకపోయేసరికి ఈ ప్రభుత్వం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా జగన్ దీక్ష చేపడితే... ఆయన డిమాండ్లు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయని ప్రభుత్వానికి ఎంత అహంకారం ఉందనే విషయం తెలుస్తూనే ఉంది.
- రోజా, నటి

జగన్ దీక్షతో విద్యార్థుల్లో ఆశలు

రీయింబర్స్‌మెంట్ బకాయిలను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే.. వచ్చే సంవత్సరం విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ పథకాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకొంది. జగన్ దీక్ష విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించింది.
- మాకినేని పెద రత్తయ్య, మాజీ మంత్రి

వీళ్లకు సిగ్గూశరం లేదు

ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు.. కోర్టులు కూడా నమ్మడం లేదు. సిగ్గూశరం విడిచిపెట్టి.. సీఎం, మంత్రులు కుర్చీల్లో కూర్చున్నారు. వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి మంత్రులయిన వారి ప్రవర్తన చూస్తుంటే అసహ్యం వేస్తోంది. జగన్ దీక్ష చేస్తున్నారా? అంటూ ఒక మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్ దీక్ష చేస్తున్న విషయం, ఎందుకు చేస్తున్నారనే విషయం విద్యార్థిలోకానికే కాకుండా ప్రపంచానికి మొత్తం తెలుసు.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ

నువ్వే వైఎస్‌కు సలహా ఇస్తే ఇప్పుడేం చేస్తున్నావ్?

డీఎస్.. ఫీజు రీయింబర్స్ గురించి నేనే వైఎస్‌కు చెప్పానని చెప్పుకున్నావ్. సిగ్గులేదా? ఇప్పుడేం చేస్తున్నావ్? బలహీన వర్గాలకు చెందినవాడిగా విద్యార్థుల ఫీజులు చెల్లించమని సీఎంకు చెప్పొచ్చుకదా? రెండుసార్లు ఓడిపోయిన తర్వాత కూడా మూడోసారి పీసీసీ అధ్యక్ష పదవి వస్తే దానిని చంకలో పెట్టుకుని తిరుగుతున్నావ్. ప్రభుత్వం మూడేళ్లు ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మూడేళ్లు కాదు మూడు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. నాగం జనార్దనరెడ్డి ఓయూకి వెళ్లి విద్యార్థులతో మాలిష్ చేయించుకున్న తర్వాతే తెలంగాణవాదిగా మారారు.
- బాజిరెడ్డి గోవర్థన్, మాజీ ఎమ్మెల్యే

దీక్ష అంటే ఇది...

ఒక పెద్ద మనిషి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి.. ఒక్కరోజులోనే పారిపోయి వచ్చారు. మరో నాయకుడు గన్‌పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తే తొలి రోజే షుగర్ లెవల్ 80 శాతం పడిపోయింది. ఆసుపత్రిలో చేరంగానే 90 శాతం పెరిగింది. నేతల నిరాహార దీక్షలంటేనే అసహ్యం కలుగుతున్న నేపథ్యంలో... జగన్ దీక్ష స్వాతంత్ర సమరయోధుల చిత్తశుద్ధిని జ్ఞప్తికి తెస్తోంది.
- లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు

వైఎస్‌ను ప్రజల గుండెల నుంచి తొలగించే కుట్ర

మహానేత ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్‌ను ప్రజల హృదయాల నుంచి తొలగించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ ముద్రను ప్రజల గుండెల నుంచి తొలగించడం ఎవరి తరం కాదు. వైఎస్ కలలు కన్న సంక్షేమరాజ్య స్థాపన ఒక్క జగన్‌తోనే సాధ్యం.
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్

భవిష్యత్ పరిణామాలకు జగన్ బాధ్యులు కారు

ఈ ఏడాది ఫీజురీయింబర్స్‌తోపాటు వచ్చే ఏడాదికి అవసరమైన రూ. 3,500 కోట్లు బడ్జెట్‌లో పెట్టాలని జగన్ కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనందున దీక్ష విరమించాలన్న విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. జగన్ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యువనేత అభిమానులు క్రోధంతో ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు జగన్ బాధ్యులు కారు.
- భూమన కరుణాకరరెడ్డి

జనమే కుర్చీలు లాగేస్తారు...

వైఎస్ లేకుంటే కాంగ్రెస్‌కు దిక్కే లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారు. జనాల సమస్యలు పట్టించుకోకపోతే.. జనమే కుర్చీలు లాగేస్తారు. విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు.
- రాజా, ప్రముఖ సినీ నటుడు


‘నాగం.. ఒళ్లు దగ్గరపెట్టుకో’
 ‘తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన నాగం జనార్దనరెడ్డి లాంటి నేతలకు జగన్ దీక్షను అడ్డుకోమ్మని చెప్పడానికి సిగ్గూ, లజ్జా ఉండాలి. అలాంటి ప్రకటనలు చేసేముందు నాగంలాంటి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు నాగం ఒక్కసారైనా తెలంగాణ గురించి మాట్లాడారా? కాంగ్రెస్ నేతలు మంత్రివర్గంపై, సీఎంపై ఒత్తిడి తెచ్చి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలి. దానిని ప్రజలకు చెప్పి జగన్‌తో ఒప్పించి దీక్ష విరమింపజేయాలి’.
- గోనె ప్రకాశరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

జగన్‌తో సర్కారు చర్చించాలి


వైఎస్ ఉన్నంతకాలం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వైపు వేలు కూడా చూపలేకపోయారు. ఆయన చనిపోయాక పథకానికి తూట్లు పొడుస్తున్నా రు. పట్టువిడుపులకు పోకుండా జగన్‌తో ప్రభుత్వం చర్చించాలి. ఇప్పుడు జగన్ ఒక్కడే దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే 26 లక్షల మంది జగన్‌లా మారుతారు. అప్పుడు ప్రభుత్వానికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది.
- పోసాని




ఊరంతా నిరాహార దీక్ష
యువనేత వైఎస్ జగన్ ఫీజు పోరుకు ఏలూరు రూరల్ మండలం '' మానూరు '' గ్రామమంతా ఒక్కమాటగా నిలిచి మద్దతు పలికింది.


 యువనేత వైఎస్ జగన్ ఫీజు పోరుకు ఏలూరు రూరల్ మండలం మానూరు గ్రామమంతా ఒక్కమాటగా నిలిచి మద్దతు పలికింది. వంటా వార్పు మానేసింది.. ఇళ్లకు తాళాలు వేసింది.. ఊరంతా గ్రామం నడిబొడ్డులోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు తరలి వచ్చింది. పిల్లాపాప, పెద్ద చిన్న భేదం లేకుండా రోజంతా నిరాహార దీక్షను చేపట్టి మద్దతు పలికారు. 800 మంది జనాభా కలిగిన మానురులో 50 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కూడా కూలిపనులు మానుకుని దీక్షలో పాల్గొని ఫీజు పోరుకు సంఘీభావం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని దీక్ష శిబిరంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమానికి పీవీ రావు నాయకత్వం వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్షను కొనసాగించారు. 
 
                                                 జగన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలి
 
   ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న యువనేత వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంటే ముప్పూటలా తింటున్న మంత్రుల్లో ఏ ఒకరూ చర్చలకు వెళ్లకపోవడం దారుణం. ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం లేదు’’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సదుద్దేశంతో ఫీజు పోరు దీక్ష చేస్తున్న జగన్‌తో మంత్రులు చర్చలు జరిపేలా సీఎం చొరవ తీసుకోవాలని కోరారు. సీఎం, 9మంది మంత్రులు ఫీజు నిధులకు సంబంధించి కాకిలెక్కలు చెబుతూ.. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సాగునీటి కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు మాత్రం నానా ఇబ్బందులు సృష్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులననుసరించి దశలవారీగా నిధులు విడుదల చేసేందుకూ ముందుకు రాకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పైగా రూ.150 కోట్ల నిధులే విడుదల చేసిన ప్రభుత్వం రూ. వెయ్యికోట్లు విడుదల చేశామని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారమందిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
జగన్ దీక్ష విరమించాలి - మంత్రులు పితాని, బాలరాజు, అహ్మదుల్లా
దీక్ష వద్దకు ప్రతినిధిని పంపుతారా? అన్న ప్రశ్నకు జవాబు దాటవేత
  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో యువనేత వై.ఎస్.జగన్ ఐదు రోజులుగా ‘ఫీజు పోరు’ పేరిట చేస్తున్న దీక్షపై స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం నామమాత్రంగా స్పందించింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, బాలరాజు, అహ్మదుల్లాలు దీక్షకు సంబంధించి ఒక మాట మాట్లాడి వెళ్లిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు మేర కు చెల్లింపులు జరపటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ట్యూషన్ ఫీజుల విషయంలో జగన్ దీక్ష ప్రారంభించి నాలుగు రోజులవుతోంది. వారిని కోరేదొక్కటే. దీక్ష విరమించుకోండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కళాశాల యాజ మాన్యాలతో మాట్లాడి ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు విడుదల చేశాం. సుప్రీం తీర్పుకు లోబడి జూలై 15 లోపు మొత్తం చెల్లింపు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పితాని చెప్పారు. కళాశాల యాజమాన్యాలు 24 నుంచి తలపెట్టిన కళాశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. జగన్ దీక్ష శిబిరం వద్దకు ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా వెళ్లి విరమించమని కోరతారా అన్న విలేకరుల ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పలేదు. ‘‘నేను దీక్ష విరమించుకోమని చెప్పా ను. వారి ఉద్దేశం వేరే ఉండవచ్చు. ప్రభుత్వం మాత్రం పేద విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికి కట్టుబడి ఉంది’’ అని జవాబిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.