Wednesday, February 23, 2011

జగన్‌ను ఆస్పత్రికితరలించే యత్నం * యువనేత ససేమిరా.. దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ

మూత్రంలో కీటోన్స్, తగ్గిన షుగర్ లెవల్స్
నిర్ధారించిన వైద్యులు

--------------------------------
జగన్ ఆరోగ్య పరిస్థితి
బీపీ: 100/70
రక్తంలో చక్కెర స్థాయి: 66 ఎంజీ
నాడీ స్పందన: నిమిషానికి 60 సార్లు
మూత్రంలో కీటోన్స్ ఎక్కువగా పోతున్నాయి

---------------------------------------------


యువనేత ససేమిరా.. దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ
అర్ధరాత్రి దాటాక దీక్షా శిబిరానికి పోలీసులు.. ఆస్పత్రికి తరలిస్తామని వినతి
తన ఆరోగ్యం కంటే పేద విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్న యువనేత
సర్కార్ ఫీజుల సమస్య పరిష్కరిస్తేనే దీక్ష విరమిస్తానని వెల్లడి
క్షీణిస్తున్న ఆరోగ్యం.. మూత్రంలో కీటోన్ బాడీస్ 4% దాటాయి..
వెంటనే ఆహారం తీసుకోవాలి.. లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి
తీసుకోకుంటే మొదట కిడ్నీలకు, తర్వాత గుండెకు ప్రమాదమన్న డాక్టర్లు
అయినా వైద్య చికిత్సలను తిరస్కరించిన జగన్.. కొనసాగుతున్న నిరాహార దీక్ష
ఐదో రోజూ పోటెత్తిన జనం.. బంద్ ఉన్నా ఆగని అభిమానులు



ఐదు రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్ ఆరోగ్య పరిస్థితి మంగళవారం క్షీణించింది. దీంతో అర్ధరాత్రి 12 గంటలు దాటాక యువనేతను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. భారీ పోలీసు బలగాలతో దీక్షా శిబిరానికి వచ్చిన ఏసీపీ చక్రపాణి జగన్‌తో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చేందుకు అంగీకరిస్తే గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తామని కోరారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల దీక్ష కొనసాగిస్తానని జగన్ స్పష్టంచేశారు. దీక్ష వల్ల తన ఆరోగ్యం క్షీణించవచ్చుగాని, యువకుడినైనందువల్ల ప్రమాదమేమీ జరగదని అన్నారు. తన ఆరోగ్యానికంటే 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టంచేశారు. ‘నాకోసం నేను దీక్ష చేయడంలేదు. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాను. నేను 37 సంవత్సరాల యువకుడిని. ఏడు రోజులపాటు దీక్ష చేస్తానని ముందే చెప్పాను.

ఆ క్రమంలో ఆరోగ్యం దెబ్బతింటుందని నాకు తెలుసు. అయితే లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ముందు నా ఆరోగ్యాన్ని లెక్క చేయను. ఇప్పటికి ఐదు రోజులు దీక్ష చేశాను. మరో రెండు రోజులు చేయడం నాకేం కష్టంకాదు. నా ఆరోగ్యం దెబ్బ తింటుందని మీకు ఆందోళన ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థుల కోసం ఏమైనా చేస్తే దీక్ష విరమించడంపై నిర్ణయం తీసుకుంటాను’ అని ఏసీపీ చక్రపాణికి జగన్ స్పష్టంచేశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.


కీటోన్ బాడీస్‌పై వైద్యుల ఆందోళన

అంతకుముందు రాత్రి 8 గంటలకు జగన్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని చెప్పారు. ఆయన షుగర్ స్థాయి తగ్గిందని, కీటోన్ బాడీస్ నాలుగు శాతం దాటాయని పేర్కొన్నారు. అసలు మూత్రంలో కీటోన్ బాడీస్ ఉండడమే ఆరోగ్యం క్షీణిస్తోందనడానికి సూచికని, అలాంటిది నాలుగు శాతం దాటడమంటే పరిస్థితి విషమిస్తున్నట్లేనని యువనేతకు వైద్య పరీక్షలు చేసిన గాంధీ ఆస్పత్రి వర్గాలు స్పష్టంచేశాయి. అత్యవసరంగా ఆయన ఆహారం తీసుకోవాలని, లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలని పేర్కొన్నాయి. అలా చేయలేదంటే ఆరోగ్యం మరింత వేగంగా క్షీణించే ప్రమాదముందని తెలిపాయి. దీక్ష ఇలాగే కొనసాగితే మొదట కిడ్నీకి, తర్వాత గుండెకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ జగన్ పట్టువీడట్లేదు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించాలన్న బలమైన సంకల్పంతో నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. జగన్‌ను చూడ్డానికి తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు.
 
కాసేపే కూర్చోగలిగిన యువనేత

విద్యార్థులకు ఫీజులు, మెస్ చార్జీలు తక్షణం చెల్లించాలని డిమాండు చేస్తూ జగన్ చేపట్టిన ఏడు రోజుల నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరింది. యథావిధిగా ఉదయం నుంచే దీక్షా స్థలికి చేరుకున్న ప్రజలను కలవడానికి ఉదయం 7 గంటలకే ఆయన వేదిక మీదకు వచ్చారు. అప్పటికే ఆయన నీరసంగా కనిపించారు. ప్రజలను పలకరించడానికి, కరచాలనం చేయడానికి వీలుగా నాలుగు రోజులుగా పగలంతా కూ ర్చొనే ఉన్న జగన్... మంగళవారం కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. సర్వ శక్తులు కూడగట్టుకొని అభిమానులు, విద్యార్థులను పలకరించడం కోసం అప్పుడప్పుడూ కూర్చున్నారు. షుగర్ లెవల్ బాగా పడిపోవడంతో.. ఆయన ఎక్కువ సమయం వేదిక మీద పడుకొనే ఉన్నారు. యువనేత మాట్లాడాలని విద్యార్థులు సాయంత్రం గట్టిగా డిమాండు చేశారు. జగనన్న మాట్లాడాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాట్లాడడానికి జగన్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని, అర్థం చేసుకోవాలని నాయకులు సర్దిచెప్పడంతో విద్యార్థులు సరేనన్నారు.



చికిత్స అందించకుంటే ప్రమాదమే

ఐదు రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించిందని జగన్‌ను పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య చికిత్స అత్యవసరమని డాక్టర్లు సూచించారు. ఆయనకు పరీక్షలు చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో చికిత్స అత్యవసరం.. కానీ ఆయన దీక్ష కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు’ అని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి(గాంధీ) వైద్యుడు దీపక్ మాట్లాడుతూ ఆయన శరీరంలో షుగర్‌లెవల్స్ తగ్గాయని చెప్పారు. మిగిలిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

దీక్ష పూర్తి చేయాలంటున్నారు: భూమన

ఇలాగే దీక్ష కొనసాగితే మరింత ప్రమాదముందని వైద్యులు చెప్పారని జగన్ వర్గం నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ‘వెద్యులు చికిత్స అత్యవసరమంటున్నారు. కానీ జగన్ మాత్రం ఏడు రోజుల దీక్ష పూర్తయ్యేంతవరకు డాక్టర్ల నుంచి ఎలాంటి సహాయం తీసుకోనని చెపుతున్నారు. మానసికంగా ధృఢంగా ఉన్నారు. నిరాహార దీక్షను పూర్తి చేస్తానంటున్నారు’ అని చెప్పారు.


జగన్ దీక్షలో జన దండు  *   బంద్‌తో తెలంగాణ స్తంభించినా వెల్లువలా వచ్చిన ప్రజలు


 బంద్ పిలుపుతో మంగళవారం తెలంగాణ మొత్తం స్తంభించింది.. కిక్కిరిసి ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.. కానీ ఇందిరాపార్క్ వద్ద యువనేత జగన్ నిరాహార దీక్ష చేస్తున్న ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ మాత్రం జన జోరుతో హోరెత్తింది. తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుండగా.. ఇక్కడకు వచ్చిన వారిలో తెలంగాణ జిల్లాల ప్రజలే అధికంగా ఉండడం గమనార్హం. విద్యార్థులకు ఫీజులు, మెస్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగన్ చేపట్టిన ఏడు రోజుల కఠిన నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు.. ఇలా విభిన్న వర్గాల ప్రజలు వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు.

కిలోమీటర్ల మేర కాలి నడకన..:
మంగళవారం తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలో సిటీబస్సులు నిలిచిపోయాయి. వివిధ జిల్లాల నుంచి రైళ్లల్లో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌లకు చేరకున్న జనం పాదయాత్ర చేపట్టారు. కోస్తా జిల్లాల నుంచి వచ్చిన జనం సికింద్రాబాద్ నుంచి, రాయలసీమ జిల్లా నుంచి వచ్చిన జనం కాచిగూడ స్టేషన్ నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన జనం నాంపల్లి నుంచి ఇందిరా పార్కు బాట పట్టారు. బంద్‌రోజు ప్రశాంతంగా ఉండాల్సిన ఆర్టీసీ క్రాస్‌రోడ్-ఇందిరాపార్కు రహదారి జై జగన్..జైజై జగన్..అంటూ నినాదాలతో హోరెత్తింది. గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థుల పాదయాత్రలో మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య కూడా పాల్గొనడం విశేషం. ఇక దీక్షా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మహిళలు.. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా కనిపించారు.

కన్నీరు మున్నీరైన అభిమానులు:
వివిధ జిల్లాల నుంచి పలువురు జానపద కళాకారులు దీక్ష స్థలికి వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు. మనగానం కళాబృందం సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. 50 మంది సీనీ జూనియర్ మహిళా ఆర్టిస్టులు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు, మహిళలు... జగన్‌ను దగ్గర నుంచి చూడాలని పరితపించారు. ఆయన్ను పలకరించాలని, చేయి కలపాలని ఆరాటపడ్డారు. అభిమానులను పలకరించడానికి యువనేత సర్వశక్తులు కూడగట్టుకొని కాసేపు కూర్చుని అభివాదం చేశారు. కొంత మందితో కరచాలనం చేశారం. బాగా నీరసించి ఉన్న ఆయన ఎక్కువ సమయం కూర్చోలేక.. ఎక్కువసేపు పడుకొనే ఉన్నారు. నీరసించి పడుకొని ఉన్న జగన్‌ను చూసి.. పలువురు మహిళలు కంటతడి పెట్టారు. ఫీజు పోరుకు మద్దతుగా జూనియర్ డాక్టర్లు, విద్యార్థినిలు సోమవారం నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు వారు దీక్ష చేశారు.

ఎంఐఎం మద్దతు:
దీక్షకు ఎంఐఎం మద్దతు ప్రకటించిందని మైనార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వెల్లడించారు. ఎంఐఎం నేత ఒవైసీ తనకు ఫోన్ చేసి జగన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారని తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసిన వైఎస్ కుమారుడైన జగన్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, త్వరలో వచ్చి కలుస్తానని చెప్పమన్నారని వెల్లడించారు.

దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు:
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుభాష్ చంద్రబోస్, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రసాదరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలరాజు, కమలమ్మ, ఆళ్ల నాని, ద్వారంపూడి, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథ రెడ్డి, శోభానాగిరెడ్డి, జయసుధ, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జూపూడి, కొండా మురళి, పుల్లా పద్మావతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి, సినీ నటులు రోజా, రాజా, జగన్ వర్గ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, బాజిరెడ్డి, రెహ్మాన్, బీరవోలు సోమిరెడ్డి, సిరాజుద్దీన్ దీక్షలో పాల్గొన్నారు.
 
లేదు.. దీక్ష కొనసాగిస్తారు
 స్పష్టం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
పథకం అమలులో ప్రభుత్వ వైఖరి తేల్చేందుకే దీక్ష
ప్రభుత్వంపై ఎంత నమ్మకముందో సుప్రీం వ్యాఖ్యలే చెబుతున్నాయి
దీక్షపై టీడీపీ రాజకీయాలు సిగ్గుచేటు


భవిష్యత్‌లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బయటపెట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముందే చెప్పినట్టు ఏడు రోజులు పూర్తిగా నిరాహార దీక్ష కొనసాగిస్తారని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. దివంగత నేత వైఎస్ కలలుకన్న విధంగా నిరుపేద పిల్లలకూ పెద్ద చదువులు అందించాలన్న లక్ష్యంతోనే జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె. శ్రీనివాసులు, పి.రామకృష్ణారెడ్డి, బాబూరావు, రామ చంద్రారెడ్డి, గురునాథ్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు చెప్పింది.. ప్రభుత్వం ఇస్తామంటుంది.. జగన్ దీక్ష విరమించవచ్చు కదా అని అందరూ అంటున్నారు. కానీ జగన్ దీక్ష చేస్తోంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం ఇబ్బందుల గురించి కాదు. రాబోయే ఆర్థిక సంవత్సరాల గురించి ప్రభుత్వం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆయన దీక్ష చేస్తున్నారు. చిన్న వయస్సులో నిరాహార దీక్షలు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎంతోమంది చెబుతున్నా ఏడు రోజులు దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. తాము కాంగ్రెస్‌లోనే ఉన్నామని, పార్టీ ఎమ్మెల్యేలుగానే మాట్లాడుతున్నామని చెప్పారు. ైవె ఎస్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలను సరిగా అమలు చేయకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తుందా.. లేదా అన్న అనుమానంతో జూలై కల్లా బకాయిలు చెల్లించి తమకు రశీదులు చూపమని సుప్రీంకోర్టు కోరిందని గుర్తుచేశారు. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకు ఏమేరకు నమ్మకముందో అర్థమవుతోందన్నారు. నిరుపేద విద్యార్థులకుపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌తో జగన్ దీక్ష చేస్తుంటే... టీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుందంటూ చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, జగన్ దీక్షపై రాజకీయం చేయడం ఎంతవరకు సమంజస మో బాబు ఆలోచించుకోవాలన్నారు. తొమ్మిదేళ్ల సీఎంగా, ఆరున్నర ఏళ్లగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలో తెలియకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సర్కారు శవంతో సమానం
జగన్ దీక్షను పట్టించుకోకపోవడంపై అంబటి రాంబాబు ధ్వజం
హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై యువనేత జగన్ ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఒక మృత కళేబరంతో సమానమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. మంగళవారమిక్కడ ఆయన పీసీసీ కిసాన్ సెల్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జునతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘సమస్యలు పాలకుల దృష్టికి తీసుకురావడానికి నిరాహారదీక్ష అనేది ఒక మార్గం, గాంధీ మహాత్ముడు మనకు నే ర్పించింది ఇదే. అలాంటి మార్గాన్ని ఎంచుకుని ఐదు రోజులుగా కడుపు మాడ్చుకుని నడిరోడ్డుపై జగన్ దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వం తరపున కనీసం ఎవరూ పలకరించడానికి రాకపోవడం శోచనీయం. ఆర్.కృష్ణయ్య, జి.కిషన్‌రెడ్డి, మందకృష్ణ మాదిగలు వివిధ సమస్యలపై నిరాహారదీక్ష చేసినపుడు మంత్రులను పంపి సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం జగన్ దీక్ష విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది’ అని నిలదీశారు. చంద్రబాబు దీక్షకు కూర్చున్న మరుసటి రోజే ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారని అంబటి గుర్తు చేశారు. బాబును ఆసుపత్రికి తరలించిన తరువాత కూడా వైద్యశాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి ఆరోగ్యం జాగ్రత్తగా చూడాల్సిందిగా వైద్యులకు ఆదేశాలు ఇచ్చి వచ్చారని తెలిపారు.


జగన్ అంటే ఎందుకంత కోపం?


‘జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత కోపం? మహానేత వైఎస్సార్ తనయుడనేనా? ఆయన కాంగ్రెస్‌ను వీడి వె ళ్లాడనా? లక్షలాది మంది విద్యార్థుల అభ్యున్నతి కోసం తన తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తూ ఉంటే చూడలేక దీక్షకు పూనుకున్నారనా’ అని అంబటి ప్రశ్నించారు. ప్రభుత్వానికి మానవతా విలువలు కూడా లేవా అని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని, అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ‘ప్రతి విషయంపైనా ఎక్కువగా మాట్లాడే ఓ మంత్రి జగన్ దీక్ష చేస్తున్న విషయమే తెలియదంటారు, డీఎల్ వంటి మంత్రి వైఎస్ పథకాలు గుదిబండలయ్యాయని, వాటి వల్ల నరకయాతన పడుతున్నామని అంటారు. అసలు ఈ ప్రభుత్వమే ప్రజలకు పెద్ద గుదిబండ’ అని దుయ్యబట్టారు. జగన్ దీక్షను ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నా.. మరో విధంగా అనుకున్నా.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాత్రం ఆగదు.. అంతం కాదిది ఆరంభం మాత్రమే అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలు విశ్వసించలేమంటూ సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా సిగ్గు రాలేదన్నారు. ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా? అనేది అనుమానంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాబుకు కడుపు మంట


విద్యార్థుల కోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అడ్డుకోలేదేమని చంద్రబాబు మాట్లాడటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని రాంబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు వారి తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంది. అలాంటిది ఆయన తన బాధ్యతను మర్చిపోయి.. జగన్ ఆ ఉద్యమాన్ని చేస్తుంటే అడ్డుకోలేదేమని తెలంగాణవాదులను ఉసిగొల్పాలని చూస్తారా? ఇంతకంటే దిగజారుడుత నం ఏమైనా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాగా, మంత్రి శంకరరావుకు ఇంగిత జ్ఞానం ఉంటే.. సీఎం కిరణ్ రూ. 30 కోట్ల విలువైన అసైన్డ్ భూములను ఆక్రమించారనే ఆరోపణల మీద హైకోర్టుకు లేఖ రాయాలని గట్టు రామచంద్రరావు ఫీజు పోరు వేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ సవాలు విసిరారు.


ఆ పత్రికలు, మీడియాది దుష్ర్పచారం
జగన్‌కు 4.5 లక్షల మంది పరామర్శ


కొన్ని పత్రికలు, ఓ వర్గం మీడియా కావాలనే జగన్ దీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంబటి విమర్శించారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘జగన్ దీక్షకు స్పందన లేదని, నీరుగారిపోయిందని కొన్ని పత్రికలు రాశాయి. మీడియాలో వచ్చిందంతా.. పత్రికల్లో రాసిందంతా రాష్ట్ర ప్రజలు నమ్మి ఉంటే 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదే కాదు. పత్రికల్లో వచ్చిందంతా నమ్మొద్దని వైఎస్ చెప్పేవారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా తెలుసుకోమని చెప్పేవారు. ఎవరేమి రాసినా.. ఏం చూపించినా జగన్‌కు ఉన్న ప్రజాదరణ తగ్గదు. దీక్ష ప్రారంభించిన నాటి నుంచి మంగళవారం ఉదయం వరకూ 4.5 లక్షల మంది వచ్చి జగన్‌ను పరామర్శించారు.


పరామర్శకు వచ్చిన వారంతా దీక్షా శిబిరం వద్దనే కూర్చుండిపోరు కదా? బిడ్డ కడుపు మాడ్చుకుంటున్నాడని దగ్గరికి వచ్చి ఏడ్చినవారున్నారు.. అయ్యో అని ఆవేదన వ్యక్తం చేసేవారున్నారు. ఇవన్నీ మీడియాకు కనపడవు. వాళ్లకు కనిపించినా కనిపించకపోయినా జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నారు. తెలుగు రాష్ర్టంలో ఆయనే అత్యంత ప్రజాదరణగల నేత’ అని చెప్పారు. ప్రాణం పోయినా సరే మాట తప్పని వంశం నుంచి వచ్చిన వాడు.. ఆరోగ్యం క్షీణిస్తున్నా నీరసంగా కనిపిస్తున్నా దీక్ష మాత్రం ఏడు రోజుల పాటు కొనసాగించి తీరుతారు అని తెలిపారు. జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతోందన్న వార్తలను ప్రస్తావిస్తూ.. ‘దీక్ష చేస్తున్నది ఏమైనా అసెం బ్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికా? ఎమ్మెల్యేలు వచ్చేటపుడు వస్తారు. కొంతమంది వస్తారు. మరికొందరు ఇబ్బంది కలుగుతుందని రాకపోవచ్చు, అంత మాత్రాన జగన్ బలం తగ్గిపోయినట్లేనా’ అని అన్నారు.


‘ఫీజు పోరు’లో ఎవరేమన్నారంటే...

చీమ కుట్టినట్లు కూడా లేదు

జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఫీజులిచ్చినా విద్యార్థులు పరీక్షలు రాసే మానసిక స్థితిలో లేరు. విద్యా వ్యవస్థలో దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వకపోవడం వల్ల... ఫీజులు కట్టి చదువుతున్న 40 శాతం మంది విద్యార్థులకూ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. -కొండా సురేఖ, మాజీ మంత్రి

దీక్ష ప్రకటించాకే విద్యార్థులు గుర్తొచ్చారు

జగన్ ఫీజు పోరు ప్రకటించిన తర్వాతే చంద్రబాబుకు, ప్రభుత్వానికి విద్యార్థులు గుర్తొచ్చారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షనేత ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్‌కు రెండు సార్లు ఘన విజయాలను అందించిన మహానేత కుమారుడు దీక్ష చేస్తుంటే.. వైఎస్ వల్ల అధికారం వెలగబెడుతున్న సీఎం, మంత్రులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. తాము పలకరిస్తే జగన్ నాయకుడు అవుతారని సీఎం, మంత్రులు భయపడుతున్నారు.
- శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే

సర్కారుది అహంకార పూరిత వైఖరి

జగన్ దీక్ష చేస్తున్నా.. దున్నపోతు మీద వాన పడినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైఎస్‌ను నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే... ఆయన లేకపోయేసరికి ఈ ప్రభుత్వం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా జగన్ దీక్ష చేపడితే... ఆయన డిమాండ్లు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయని ప్రభుత్వానికి ఎంత అహంకారం ఉందనే విషయం తెలుస్తూనే ఉంది.
- రోజా, నటి

జగన్ దీక్షతో విద్యార్థుల్లో ఆశలు

రీయింబర్స్‌మెంట్ బకాయిలను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే.. వచ్చే సంవత్సరం విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ పథకాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకొంది. జగన్ దీక్ష విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించింది.
- మాకినేని పెద రత్తయ్య, మాజీ మంత్రి

వీళ్లకు సిగ్గూశరం లేదు

ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు.. కోర్టులు కూడా నమ్మడం లేదు. సిగ్గూశరం విడిచిపెట్టి.. సీఎం, మంత్రులు కుర్చీల్లో కూర్చున్నారు. వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి మంత్రులయిన వారి ప్రవర్తన చూస్తుంటే అసహ్యం వేస్తోంది. జగన్ దీక్ష చేస్తున్నారా? అంటూ ఒక మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్ దీక్ష చేస్తున్న విషయం, ఎందుకు చేస్తున్నారనే విషయం విద్యార్థిలోకానికే కాకుండా ప్రపంచానికి మొత్తం తెలుసు.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ

నువ్వే వైఎస్‌కు సలహా ఇస్తే ఇప్పుడేం చేస్తున్నావ్?

డీఎస్.. ఫీజు రీయింబర్స్ గురించి నేనే వైఎస్‌కు చెప్పానని చెప్పుకున్నావ్. సిగ్గులేదా? ఇప్పుడేం చేస్తున్నావ్? బలహీన వర్గాలకు చెందినవాడిగా విద్యార్థుల ఫీజులు చెల్లించమని సీఎంకు చెప్పొచ్చుకదా? రెండుసార్లు ఓడిపోయిన తర్వాత కూడా మూడోసారి పీసీసీ అధ్యక్ష పదవి వస్తే దానిని చంకలో పెట్టుకుని తిరుగుతున్నావ్. ప్రభుత్వం మూడేళ్లు ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మూడేళ్లు కాదు మూడు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. నాగం జనార్దనరెడ్డి ఓయూకి వెళ్లి విద్యార్థులతో మాలిష్ చేయించుకున్న తర్వాతే తెలంగాణవాదిగా మారారు.
- బాజిరెడ్డి గోవర్థన్, మాజీ ఎమ్మెల్యే

దీక్ష అంటే ఇది...

ఒక పెద్ద మనిషి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి.. ఒక్కరోజులోనే పారిపోయి వచ్చారు. మరో నాయకుడు గన్‌పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తే తొలి రోజే షుగర్ లెవల్ 80 శాతం పడిపోయింది. ఆసుపత్రిలో చేరంగానే 90 శాతం పెరిగింది. నేతల నిరాహార దీక్షలంటేనే అసహ్యం కలుగుతున్న నేపథ్యంలో... జగన్ దీక్ష స్వాతంత్ర సమరయోధుల చిత్తశుద్ధిని జ్ఞప్తికి తెస్తోంది.
- లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు

వైఎస్‌ను ప్రజల గుండెల నుంచి తొలగించే కుట్ర

మహానేత ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్‌ను ప్రజల హృదయాల నుంచి తొలగించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ ముద్రను ప్రజల గుండెల నుంచి తొలగించడం ఎవరి తరం కాదు. వైఎస్ కలలు కన్న సంక్షేమరాజ్య స్థాపన ఒక్క జగన్‌తోనే సాధ్యం.
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్

భవిష్యత్ పరిణామాలకు జగన్ బాధ్యులు కారు

ఈ ఏడాది ఫీజురీయింబర్స్‌తోపాటు వచ్చే ఏడాదికి అవసరమైన రూ. 3,500 కోట్లు బడ్జెట్‌లో పెట్టాలని జగన్ కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనందున దీక్ష విరమించాలన్న విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. జగన్ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యువనేత అభిమానులు క్రోధంతో ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు జగన్ బాధ్యులు కారు.
- భూమన కరుణాకరరెడ్డి

జనమే కుర్చీలు లాగేస్తారు...

వైఎస్ లేకుంటే కాంగ్రెస్‌కు దిక్కే లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారు. జనాల సమస్యలు పట్టించుకోకపోతే.. జనమే కుర్చీలు లాగేస్తారు. విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు.
- రాజా, ప్రముఖ సినీ నటుడు


‘నాగం.. ఒళ్లు దగ్గరపెట్టుకో’
 ‘తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన నాగం జనార్దనరెడ్డి లాంటి నేతలకు జగన్ దీక్షను అడ్డుకోమ్మని చెప్పడానికి సిగ్గూ, లజ్జా ఉండాలి. అలాంటి ప్రకటనలు చేసేముందు నాగంలాంటి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు నాగం ఒక్కసారైనా తెలంగాణ గురించి మాట్లాడారా? కాంగ్రెస్ నేతలు మంత్రివర్గంపై, సీఎంపై ఒత్తిడి తెచ్చి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలి. దానిని ప్రజలకు చెప్పి జగన్‌తో ఒప్పించి దీక్ష విరమింపజేయాలి’.
- గోనె ప్రకాశరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

జగన్‌తో సర్కారు చర్చించాలి


వైఎస్ ఉన్నంతకాలం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వైపు వేలు కూడా చూపలేకపోయారు. ఆయన చనిపోయాక పథకానికి తూట్లు పొడుస్తున్నా రు. పట్టువిడుపులకు పోకుండా జగన్‌తో ప్రభుత్వం చర్చించాలి. ఇప్పుడు జగన్ ఒక్కడే దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే 26 లక్షల మంది జగన్‌లా మారుతారు. అప్పుడు ప్రభుత్వానికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది.
- పోసాని




ఊరంతా నిరాహార దీక్ష
యువనేత వైఎస్ జగన్ ఫీజు పోరుకు ఏలూరు రూరల్ మండలం '' మానూరు '' గ్రామమంతా ఒక్కమాటగా నిలిచి మద్దతు పలికింది.


 యువనేత వైఎస్ జగన్ ఫీజు పోరుకు ఏలూరు రూరల్ మండలం మానూరు గ్రామమంతా ఒక్కమాటగా నిలిచి మద్దతు పలికింది. వంటా వార్పు మానేసింది.. ఇళ్లకు తాళాలు వేసింది.. ఊరంతా గ్రామం నడిబొడ్డులోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు తరలి వచ్చింది. పిల్లాపాప, పెద్ద చిన్న భేదం లేకుండా రోజంతా నిరాహార దీక్షను చేపట్టి మద్దతు పలికారు. 800 మంది జనాభా కలిగిన మానురులో 50 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కూడా కూలిపనులు మానుకుని దీక్షలో పాల్గొని ఫీజు పోరుకు సంఘీభావం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని దీక్ష శిబిరంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమానికి పీవీ రావు నాయకత్వం వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్షను కొనసాగించారు. 
 
                                                 జగన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలి
 
   ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న యువనేత వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంటే ముప్పూటలా తింటున్న మంత్రుల్లో ఏ ఒకరూ చర్చలకు వెళ్లకపోవడం దారుణం. ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం లేదు’’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సదుద్దేశంతో ఫీజు పోరు దీక్ష చేస్తున్న జగన్‌తో మంత్రులు చర్చలు జరిపేలా సీఎం చొరవ తీసుకోవాలని కోరారు. సీఎం, 9మంది మంత్రులు ఫీజు నిధులకు సంబంధించి కాకిలెక్కలు చెబుతూ.. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సాగునీటి కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు మాత్రం నానా ఇబ్బందులు సృష్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులననుసరించి దశలవారీగా నిధులు విడుదల చేసేందుకూ ముందుకు రాకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పైగా రూ.150 కోట్ల నిధులే విడుదల చేసిన ప్రభుత్వం రూ. వెయ్యికోట్లు విడుదల చేశామని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారమందిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
జగన్ దీక్ష విరమించాలి - మంత్రులు పితాని, బాలరాజు, అహ్మదుల్లా
దీక్ష వద్దకు ప్రతినిధిని పంపుతారా? అన్న ప్రశ్నకు జవాబు దాటవేత
  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో యువనేత వై.ఎస్.జగన్ ఐదు రోజులుగా ‘ఫీజు పోరు’ పేరిట చేస్తున్న దీక్షపై స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం నామమాత్రంగా స్పందించింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, బాలరాజు, అహ్మదుల్లాలు దీక్షకు సంబంధించి ఒక మాట మాట్లాడి వెళ్లిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు మేర కు చెల్లింపులు జరపటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ట్యూషన్ ఫీజుల విషయంలో జగన్ దీక్ష ప్రారంభించి నాలుగు రోజులవుతోంది. వారిని కోరేదొక్కటే. దీక్ష విరమించుకోండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కళాశాల యాజ మాన్యాలతో మాట్లాడి ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు విడుదల చేశాం. సుప్రీం తీర్పుకు లోబడి జూలై 15 లోపు మొత్తం చెల్లింపు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పితాని చెప్పారు. కళాశాల యాజమాన్యాలు 24 నుంచి తలపెట్టిన కళాశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. జగన్ దీక్ష శిబిరం వద్దకు ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా వెళ్లి విరమించమని కోరతారా అన్న విలేకరుల ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పలేదు. ‘‘నేను దీక్ష విరమించుకోమని చెప్పా ను. వారి ఉద్దేశం వేరే ఉండవచ్చు. ప్రభుత్వం మాత్రం పేద విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికి కట్టుబడి ఉంది’’ అని జవాబిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

No comments:

Post a Comment