Thursday, February 3, 2011

చాలా బాధనిపిస్తోంది * మహానేత మీద ఆరోపణలపై యువనేత జగన్ ఆవేదన

వైఎస్ ఊపిరి పోసిన కాంగ్రెస్‌వారే బురదజల్లుతున్నారు
పేదల సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో వైఎస్ బతికే ఉన్నారు
వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన జగన్
పలు గ్రామాల్లో 17 వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
పల్లెపల్లెనా వెల్లువెత్తినఅభిమానం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఊపిరి పోసి బతికించిన కాంగ్రెస్ పార్టీ వారే ఈ రోజు ఆయనపై బురదజల్లుతున్నారని, ఇది తనకు చాలా బాధగా ఉందని యువనేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రతి పేద కుటుంబానికీ ఏదో ఒక మేలు చేసి జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత ఇవాళ లేడంటే బాధనిపిస్తోంది. నాన్నా అని పిలిస్తే రాడనిపిస్తే బాధనిపిస్తోంది.. ఆయన ఊపిరి పోసి బతికించిన కాంగ్రెస్ పార్టీ వారే ఈరోజు ఆయనపై బురదజల్లుతుంటే చాలా బాధనిపిస్తోంది.. స్వపక్ష, విపక్ష పార్టీలు బురదజల్లుతుంటే చాలా చాలా బాధనిపిస్తోంది...’ అని ఆయన అన్నారు.

వైఎస్సార్ జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం, గోపవరం మండలంలో బుధవారం వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో స్థానికులు ఏర్పాటుచేసిన 17 వైఎస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడి వేదికలపై నుంచి ఆయన ప్రసంగిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుండెలోనూ బతికున్నారన్నారు. ‘పావలా వడ్డీతో రుణం తీసుకున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లికీ.. ప్రతి నెలా ఒకటో తేదీ పెన్షన్ తీసుకునే అవ్వలకు, తాతలకు.. లక్షలు ఖర్చయ్యే వైద్యం చేయించుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే ప్రతి పేద వారికీ.. చదువుకునే ప్రతి పేద విద్యార్థికీ, వారి తల్లిదండ్రులకూ వైఎస్ రాజశేఖరరెడ్డి నిత్యం గుర్తుకొస్తూనే ఉంటారు’ అంటూ వైఎస్ జ్ఞాపకాలను మరోసారి జనం గుండెల నుంచి తట్టి లేపారు.


కుయ్..కుయ్.. కుయ్ అంటూ..


108 గురించి మాట్లాడుతూ ‘ఏ ఆపదో వచ్చినప్పుడో లేక ఏ ప్రమాదమో జరిగినప్పుడో 108 కొట్టగానే కుయ్...కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ వచ్చినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు’ అని వైఎస్‌ను అనుకరిస్తూ జగన్ చేసిన ప్రసంగం జనానికి మహానేతను స్ఫురణకు తెచ్చింది. ముంపు గ్రామాలైన బ్రాహ్మణపల్లె, బుచ్చనపల్లె తదితర గ్రామాల్లో యువనేత మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాలించినా.. సోమశిల ముంపు గ్రామ వాసుల గోడును ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. వారికి పరిహారం ఇవ్వక కష్టాలపాలు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాగానే రూ.100 కోట్లు ముంపు పరిహారమిచ్చి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని తెలియజెప్పారన్నారు.


పల్లెపల్లెనా ఉప్పొంగిన అభిమానం

జగన్ పర్యటన సాగిన గోపవరం మండలంలో దారి పొడవునా పల్లెపల్లెనా అభిమానం ఉప్పొంగింది. కాన్వాయ్ రోడ్డుపై అల్లంత దూరంలో వస్తుండగా, పొలాల్లోని రైతులు, కూలీలు ఆయన్ను చూసేందుకు పొలాల వెంట పరుగులు తీస్తూ వచ్చిన చోట యువనేత వాహనాన్ని నిలిపి వారితో మాట్లాడారు. బద్వేల్ పట్టణంలో ప్రవేశించగానే పట్టణ శివారులోనే ఆయనను ఆపి జనం జేజేలు పలికారు. బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున జనం ఆయన్ను చుట్టుముట్టారు. అందరికీ అభివాదం చేస్తూ మధ్యాహ్నం 12.20 గంటలకు గోపవరం మండలంలోని పి.పి.కుంటకు జగన్ చేరుకున్నారు. అక్కడి నుండి ప్రారంభమైన యువనేత పర్యటన పలు గ్రామాల మీదుగా సాగింది.

ఆయా గ్రామాల్లో 17 వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ఆవిష్కరణలున్న ఈ గ్రామాల్లోనే కాకుండా మార్గ మధ్యం లోని అన్ని పల్లెల్లో జగన్‌ను చూసేందుకు జనం వేచి ఉన్నారు. కాన్వాయ్‌కు అడ్డుపడి మరీ యువనేతను చూడ్డానికి ఉత్సాహం చూపారు. దీంతో జగన్ కూడా బయటకు వచ్చి వారికి అభివాదం, కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. జగన్ పర్యటనలో ఎమ్మెల్యే జి.కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే డి.సి.గోవిందరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బద్వేల్ మునిసిపల్ చైర్మన్ డాక్టర్ పి.మునయ్య, జెడ్పీటీసీలు ఆర్.నాగభూషణం, డి.శశిధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, భూపాల్‌రెడ్డి, గోపవరం, బద్వే ల్ మండలాల ఎంపీపీలు సరస్వతమ్మ, వెంకటేశ్వరరెడ్డి, మహిళా ఆర్థిక సంస్థ మాజీ చైర్మన్ పి.కృష్ణమ్మ, స్థానిక సర్పం చులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
 
ప్రజలను మభ్యపెట్టడానికే రచ్చబండ: జగన్ 
 
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలవడ్డీ రుణాలు, రేషన్‌కార్డులు, ఇళ్ల మంజూరులో ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందన్నారు. మైదుకూరు రోడ్డులోని అన్వల్‌హాల్ సర్కిల్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

ప్రజలను మభ్య పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఎవరినీ మోసం చేయడానికి రచ్చబండ కార్యక్రమం పెట్టారని జగన్ సూటిగా ప్రశ్నించారు. పేదల అభ్యున్నతి కోసం తన తండ్రి కృషి చేశారన్నారు. వైఎస్సారే బతికుంటే పేదలకిచ్చే ఫించన్లు రూ. 200 నుంచి రూ. 600కు పెంచేవారని అన్నారు. అలాంటి మహానేతపై కొంతమంది బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సభకు జనం పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ప్రొద్దుటూరు పులకించింది.
 
వైఎస్‌ఆర్ పేరుతోనే పార్టీ: జగన్

వైఎస్‌ఆర్ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీ సదస్సులో మాట్లాడుతూ ముస్లింలకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయటం లేదని జగన్ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు.

రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదని, అయితే రాజన్న స్వర్ణయుగాన్ని చూశానని వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత స్వర్ణయుగమేనన్నారు. మహానేత వైఎస్‌పై బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వారసులమని చెప్పుకుంటూనే సిగ్గులేకుండా టీడీపీతో కుమ్మక్కు అయ్యారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి పాలించే హక్కులేదని జగన్ అన్నారు. పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేయటంలో సర్కార్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పేనన్నారు.
 

వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం....

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలబై ఐదు రోజుల్లో తమ పార్టీ వస్తుందని వైయస్ జగన్ అప్పట్లో చెప్పారు. కానీ ఆ గడువు ఎప్పుడో దాటి పోయింది. సంక్రాంతి తర్వాత అని, మార్చి రెండో వారంలో అని వైయస్ జగన్ వర్గం నాయకులు పార్టీ స్థాపనపై చెబుతూ వచ్చారు. కానీ మార్చిలో కూడా జగన్ పార్టీ వచ్చే అవకాశాలు లేవు. జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.

మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్‌లో గానీ పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, పులివెందుల, కడప ఉప ఎన్నికల నాటికి పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లనే పార్టీ స్థాపనలో జాప్యం జరుగుతోందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. అయితే, కారణం అది కాదని తెలుస్తోంది. తెలంగాణపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే పార్టీని స్థాపించాలనేది జగన్ అభిమతమని చెబుతున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని, తెలంగాణలో అడుగు పెట్టాలంటే కేంద్రం తెలంగాణపై తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు రావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. యథాతథ స్థితి చోటు చేసుకుంది.

పార్లమెంటు సమావేశాల లోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కానీ, అది జరిగే అవకాశాలు లేవు. కాగా, రేపు శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపైనా, ప్రజారాజ్యం పార్టీతో వ్యవహరించాల్సిన తీరుపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, మంత్రివర్గంలో చేరుతుందా అనేది స్పష్టంగా తేలిన తర్వాత తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అప్పుడే జగన్ తన పార్టీ స్థాపనకు తగిన రంగం సిద్ధం చేసుకుంటారని అంటున్నారు.
 

No comments:

Post a Comment