Thursday, February 17, 2011

జననేత జగనే!

*రాష్ట్రంలో ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు యువనేతకే
*ఎన్‌టీవీ-నీల్సన్, ఓఆర్‌జీ-మార్గ్ సర్వే
*ముఖ్యమంత్రిగా జగన్‌కు 35%, కేసీఆర్‌కు19%, చంద్రబాబుకు 19%, కిరణ్‌కు 15%, చిరంజీవికి 5% మంది ఓట్లు
*ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ పార్టీకి 35%, టీఆర్‌ఎస్‌కు 20%, టీడీపీకి 18%, కాంగ్రెస్‌కు 16%, పీఆర్పీకి 5% ఓట్లు
*కోస్తా, రాయలసీమల్లో జగన్‌కే జననీరాజనం
*తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనం.. అక్కడా కాంగ్రెస్, టీడీపీలకు దీటుగా జగన్‌కు ఓట్లు

యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డే రాష్ట్రంలో జన హృదయ నేతని.. వచ్చే ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అని 35 శాతం మంది ప్రజలు చెప్తున్నారని ఎన్‌టీవీ-నీల్సన్ ఓఆర్‌జీ మార్గ్ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని 19 శాతం మంది చెప్తే.. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అవుతారని మరో 19 శాతం మంది.. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భావించే వారు 15 శాతం మంది ఉన్నట్లు సర్వే పేర్కొంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న వారి సంఖ్య కేవలం ఐదు శాతమేనని చెప్పింది.


రాష్ట్రం మొత్తం ఓట్లర్లలో ప్రతి ముగ్గురులో ఒకరు తాము జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించబోయే పార్టీకి ఓటు వేస్తామని నిర్థారించారు. కోస్తా, రాయలసీమల్లో జగన్ పార్టీ ఎవరికీ అందనంత దూరంలో తిరుగులేని విజయం సాధిస్తుందని.. తెలంగాణ ప్రాంతంలో సైతం కాంగ్రెస్, టీడీపీలకు దాదాపు సమానంగా జగన్ పార్టీ ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అయితే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభంజనం ముందు మరే పార్టీ ప్రభావం పనిచేయదని సర్వే నిర్ధారించింది. జనవరి ఆరో తేదీ నుంచి 26వ తేదీ మధ్య కాలంలో.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వే నిర్వహించినట్లు నీల్సన్ వివరించింది. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాలన్న ప్రతిపాదనలు జరుగుతుండటంతో ఈ అంశాన్ని సర్వేలో పరగణనలోకి తీసుకున్నా.. పీఆర్పీ కూడా ఎన్నికల బరిలో ఉంటుందన్న కోణంలోనే సర్వే కొనసాగినట్లు సంస్థ పేర్కొంది.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 35 శాతం ఓట్లతో జగన్ పార్టీ 139 నుంచి 153 వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. జగన్ పార్టీకి కోస్తాలో 45 శాతం ఓట్లు, రాయలసీమలో 59 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. రాష్ట్రం మొత్తం ఓట్లలో 20 శాతం.. తెలంగాణ ప్రాంతంలో 50 శాతం ఓట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్ 70 నుంచి 74 స్థానాలు గెలిచి రెండోస్థానం దక్కించుకుంటుందని పేర్కొంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 28 -33 సీట్లు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 32 -37 సీట్లు, పీఆర్పీకి 2-4 సీట్లు, వామపక్షాలకు ఒక సీటు, ఇతరులకు 10- 14 సీట్లు వస్తాయని సర్వే నిర్ధారించింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే తెలంగాణలో.. కాంగ్రెస్, జగన్ పార్టీలు సమానంగా 12 -14 సీట్లు, టీడీపీ 15- 17 సీట్లు, వామపక్షాలు ఒక సీటు, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని సర్వే తేల్చింది. కోస్తా, రాయలసీమల్లో జగన్ పార్టీకి దగ్గరగా వచ్చే స్థాయిలో మరే పార్టీ లేదని సర్వేలో తేలింది.
ప్రభుత్వంపై నమ్మకం పోయింది...
గత ఏడాది నీల్సన్ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని 71 శాతం నమ్మితే తాజా సర్వేలో ఆ సంఖ్య 30 శాతానికి పడిపోయింది. తాజా సర్వేలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవ ని 52 శాతం మంది నమ్ముతున్నారు. మూడు ప్రాంతాలకు చెందినవారు సగం మంది మధ్యంతరం ఉంటుందని అనుకుంటున్నారని సర్వేలో తేలింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, పీఆర్పీల పనితీరు ఆధ్వాన్నంగా ఉందన్నది జనాభిప్రాయం.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ బలహీనపడిందని 80 శాతం మంది ప్రజలు నమ్మితే.. యువనేత జగన్ పార్టీ వీడటం కారణంగా కాంగ్రెస్ బలహీన పడిందని 34 శాతం మంది చెప్పారు. సరైన నాయకత్వం లేకపోవటం, పార్టీలో కేంద్ర నాయకత్వం పెత్తనం వల్ల బలహీనపడిందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుందని కేవలం 11 శాతం మంది మాత్రమే సర్వేలో పేర్కొనగా.. 68 శాతం మంది బాగోలేదని తేల్చిచెప్పారు.
సర్వే జరిగిన తీరు.. ఖచ్చితత్వం..
ఐదేళ్ల పాటు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలన్న నీల్సన్ ఓఆర్జీ మార్గ్ - ఎన్‌టీవీ ఒప్పుందంలో భాగంగా ఏడో ధపా ఈ సర్వే నిర్వహించారు. గతంలో ఆరు సార్లు వీరు నిర్వహించిన సర్వేలు 97 శాతం వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. 2009 ఎన్నికల సమయంలో వారి అంచనాలకు అతి దగ్గరగా ఫలితాలు ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడు ప్రాంతాల్లో మొత్తం 75 అసెంబ్లీ నియోజకవర్గాలను శాంపిల్ తీసుకొని, నియోజవర్గానికి 16 పోలింగ్‌బూత్‌ల చొప్పున ఒక్కొక్క చోట పదేసి మంది అభిప్రాయాలను సేకరించారు. తెలంగాణలో 33, కోస్తాలో 30, రాయలసీమలో 12 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 12,052 మంది అభిప్రాయాల ఆధారంగా సర్వే పూర్తి చేశారు.

కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమవుతుందని ప్రకటించక ముందు జనవరి ఆరో తేదీ నుంచి 26వ తేదీ మధ్య నిర్వహించిన సర్వే ఇది. పీఆర్పీ విలీనం తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై శుక్రవారం ఎన్‌టీవీలో విశ్లేషణ ప్రసారం కానుంది.

No comments:

Post a Comment