Friday, March 11, 2011

‘ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ’ * జగ్గంపేట సభ వేదికగా పార్టీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్


నేడు మధ్యాహ్నం 2:29 గంటలకు జెండా ఆవిష్కరణ
పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుంది
ఇడుపులపాయలో నాన్న పాదాల చెంత నేను, అమ్మ కలిసి ఆవిష్కరిస్తాం


ఈ పార్టీ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు
ప్రతి పేదోడి మొహాన చిరునవ్వు చూసే పార్టీ అవుతుంది
పార్టీ ప్రకటన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకున్నాం
జిల్లాలో ఎన్నికల కోడ్ వల్ల అది వీలుకాలేదు
కడప ఉప ఎన్నికలయ్యాక ఘనంగా సభ పెట్టుకుందాం
ఎన్నికలయ్యాక ఇడుపులపాయలో రెండు రోజుల ప్లీనరీ
మేధో మథనం చేసి పార్టీ విధివిధానాల రూపకల్పన
మూడో రోజు అందరి సమక్షంలో వాటిని ప్రకటిస్తాం



కోట్లాది మందిలో ఎన్నాళ్ల నుంచో నెలకొన్న ఉత్కంఠకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరదించారు. పేదల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా తాను ఏర్పాటు చేయబోయే పార్టీ పేరును ప్రకటించారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని సాక్షిగా, అభిమానుల హర్షధ్వానాల మధ్య యువనేత పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లూ ఇడుపులపాయలోనే పార్టీ పేరు ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఇలా అనూహ్యంగా జగ్గంపేటలో ప్రకటించే సరికి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుందని, దాన్ని శనివారం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ పాదాల చెంత ఆవిష్కరిస్తామని జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పీఆర్‌పీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా మహిళా రాజ్యం అధ్యక్షురాలు రొంగలి లక్ష్మి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితర ముఖ్యనాయకులు.. జగన్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సభలో ప్రకటించారు.

‘ప్రజా పుష్కరం’గా నామకరణం చేసిన ఈ సభకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 06:33 నిమిషాలకు జగన్ ప్రసంగించడానికి లేవగానే అభిమానులు చేతులు పెకైత్తి జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజా సంక్షేమ ప్రభుత్వ స్థాపన కోసం మరో సంవత్సరమో, రెండు సంవత్సరాలో జరుగబోయే పోరుబాటలో నాతోపాటు అడుగులో అడుగువేసి పోరాటం చేయడానికి ఇక్కడ ఒక్కటైన జ్యోతుల నెహ్రూ, దొరబాబు, పద్మమ్మలకు, ముఖ్యంగా జగ్గంటపే సోదరులందరికీ, అక్కా చెల్లెళ్లకు, అవ్వలకు, తాతలకు, మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నాను.

పార్టీ తొలి కండువా నెహ్రూకే..

ఇవాళ నెహ్రూ అన్న చేరికలో ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ స్థాపించిన తర్వాత.. మొట్టమొదటి కండువా వేస్తున్నది జ్యోతుల నెహ్రూకే. తర్వాత పెండెం దొరబాబు, వాసిరెడ్డి పద్మలకే. ఈ రోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలనిపిస్తోంది.. రేపు(శనివారం) మధ్యాహ్నం 2:29 నిమిషాలకు ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదాల చెంతన పార్టీకి సంబంధించి మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మిగారు కలిసి ఆవిష్కరిస్తాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనుకున్నా వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంది.. ఎన్నికల నియమావళిని గౌరవించాలి.. కడప ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని గొప్పగా వైఎస్సార్ పాదాల చెంతన జరుపుకొందాం.

నేడే జగన్ పార్టీ
విజయమ్మ సమక్షంలో ఇడుపులపాయలో ప్రకటన

జగ్గంపేట బహిరంగసభలో తెలిపిన జగన్
నీలం తెలుపు ఆకుపచ్చ రంగుల్లో జెండా ,,మధ్య వైఎస్ బొమ్మ

తన తండ్రికి అత్యంత ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ ఎస్టేట్‌లో... తల్లి విజయమ్మ సమక్షంలో.. శనివారం మధ్యాహ్నం సరిగ్గా 2.29 గంటలకు పార్టీ వ్యవస్థాపక ప్రకటన చేయనున్నట్లు మాజీ ఎంపీ వైఎస్ జగన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ విషయం చెప్పారు. "ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ పాదాల చెంతన మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మి ఆవిష్కరిస్తాం. కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత ఇడుపులపాయలోనే ప్లీనరీ నిర్వహిస్తాం.

విధి విధానాలు ప్రకటిస్తాం'' అని జగన్ పేర్కొన్నారు. జగ్గంపేట సభలో జ్యోతుల నెహ్రూ చేరికకు ఒక ప్రత్యేకత ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత మొదటి కండువా నెహ్రూ అన్నకు, తర్వాత దొరబాబన్నకు, పద్మమ్మకు వేశానని జగన్ ఆనందం వ్యక్తం చేశారు. యువజన, శ్రామిక, రైతులను ప్రతిబింబించేలా.. పార్టీ జెండాలో నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయని, మధ్యలో వైఎస్ బొమ్మ ఉంటుందని జగన్ వర్గ నేతలు చెబుతున్నారు.

దగా చేసిన చిరు: నెహ్రూ

మార్పు కోసం అంటూ ఆర్భాటం చేసిన చిరంజీవి తమను దారుణంగా దగా చేశారని పీఆర్పీ జిల్లా అధ్యక్ష పదవి నిర్వహించిన జ్యోతుల నెహ్రూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో జ్యోతులతో పాటు వాసిరెడ్డి పద్మ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పీఆర్పీ నాయకులు రొంగల లక్ష్మి, శెట్టిబత్తుల రాజబాబు తదితరులు జగన్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. సభలో ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గొల్ల బాబూరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్టుండి జగన్ ప్రకటించడంతో ఇడుపులపాయలో సంద డి నెలకొంది. శనివారం ఇడుపులపాయలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు 5 నుంచి 10 వేల మంది వరకు అభిమానులు, కార్యకర్తలు రావచ్చని జగన్ వర్గీయులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ఆయన అనుచర ఎమ్మెల్యేలు ఐదుగురే కాకుండా ఇతర జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారని కూడా తెలుస్తోంది.

తొలుత పది లక్షల మందితో భారీగా పార్టీని ప్రకటించాలనుకున్నా, కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని సాదాసీదాగానే నిర్వహించాలని నిర్ణయించారు. చిరంజీవి తిరుపతిలో భారీ సభ నిర్వహించి పార్టీని ఏర్పాటు చేసినా రాణించలేదని, ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 2వేలమందితో పార్టీని ప్రకటిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్ వర్గం చర్చించుకున్నట్లు తెలిసింది.

ప్రతి పేదోడి మొహాన చిరునవ్వు చూసే పార్టీ
దివంగత నేత పాదాల చెంత స్థాపించబోయే పార్టీ ఎలా ఉంటుందా అని మొత్తం ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఒక్కమాట మట్టుకు నేను చెబుతున్నా. ప్రతి పేదవాడి మొఖానచిరునవ్వును చూసే పార్టీ అవుతుందని చెబుతున్నా. పార్టీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం కాసింత సమయం తీసుకొని ఎన్నికలయ్యాక ఇడుపులపాయలో ప్లీనరీ సమావేశాలు జరుపుతాం. ప్రతి పేదవాడి మొఖాన ఏవిధంగా చిరునవ్వు చూడాలని రెండు రోజుల పాటు మేధోమథనం చేశాక.. మూడో రోజున ప్రతిసోదరుడు, స్నేహితుడు, అక్కాచె ల్లెళ్ల మధ్య, అవ్వా తాతల మధ్యన విధివిధానాలను గొప్పగా ప్రకటించుకుందాం.
 
జగ్గంపేటలో చరిత్రాత్మక ప్రకటన
అనూహ్యంగా పార్టీ పేరు ప్రకటించిన జగన్
అభిమానుల హర్షం

  రాజకీయ అనిశ్చితితో అనాథగా మారిన రాష్ట్రానికి ఆశాకిరణంగా రాబోతున్న పార్టీ అది.. పార్టీ పేరేంటి? ఎప్పుడు? ఎక్కడ దాన్ని ప్రకటిస్తారు?.. అని జనమంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ చరిత్రాత్మక ప్రకటనకు వేదికగా మారే అవకాశం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట సభకు దక్కింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం నచ్చని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తదితరులు జగన్ పెట్టబోయే పార్టీలో చేరడానికి జగ్గంపేటలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలానికి ‘విజయ ప్రాంగణం’గా నామకరణం చేసి ‘ప్రజా పుష్కరం’ సభగా దానికి పేరు పెట్టారు. దీనికి జగన్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వేదికపై జగన్ పెట్టబోయే పార్టీలో చేరుతున్నట్టు నెహ్రూ ప్రకటించారు. నెహ్రూతో పాటు పీఆర్పీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. అనూహ్యంగా పార్టీ పేరును ‘వైఎస్సార్ కాంగ్రెస్’ అని ప్రకటించడంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఆ ఇంట భోంచేస్తే..
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉదయం 11.45 గంట లకు మధురపూడి విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి జగ్గంపేట మండలం మల్లిసాల చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మె ల్యే నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొన్నారు. ఆ గ్రామంలో అత్తులూరి నాగబాబు ఇంట జగన్ మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ ఇంట భోజనం చేసిన వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారన్నది గ్రామస్తుల నమ్మకం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్యలు ఇక్కడ భోజనం చేసిన తరువాత ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ సెంటిమెంట్ కొనసాగుతుందని వారంటున్నారు.

తొలి కండువా..: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకటించాక తొలి కండువాను నెహ్రూకు, తర్వాత వాసిరెడ్డి పద్మకు కప్పడం ఈ రోజు ప్రత్యేకతని జగన్ చెప్పారు. ఆ మాట వినగానే జనం ఎగిరి గంతేశారు. సభ అనంతరం జగన్ ఇర్రిపాకలోని జ్యోతుల నెహ్రూ ఇంటికి వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని స్నేహితుడు అడపా వేణు చిన్నాన్న రాజేంద్ర కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులు శ్రీయ, శరత్‌లను ఆశీర్వదించారు.

నిరంతరం జగన్ వెంటే...
జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ తీసుకున్న నిర్ణయం శాస్ర్తీయమైనది. ప్రజల్లో నిరంతరం ఉండే జగన్ వెంట ఉంటామని వారు ప్రకటించారు. జగన్ పేరు చెబితేనే కొంత మంది ప్యాంట్‌లు తడిసిపోతున్నాయి. ఎవరొచ్చినా రాకపోయినా వైఎస్ సంక్షేమ పథకాలు అనుభవించిన వారి అండ జగన్‌కు ఉంటుంది.
- ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్

అందుకే వైఎస్ అంటే అభిమానం
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకే జనం వైఎస్‌ను అంతగా అభిమానిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దేశంలో మరెక్కడా లేని విధంగా ఆయన అమలు చేశారు. ఆ పథకాలు కొనసాగాలంటే ఆయన తనయుడే చేయగలడనే నమ్మకంతోనే ప్రజలు జగన్ వెంట నడుస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనను దీవిస్తున్నారు.
- మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్
ముహూర్త బలం కోసమే... 
అకస్మాత్తుగా పార్టీ పేరు ప్రకటించిన జగన్
నియమావళి నేపథ్యంలో నేడు జెండా ఆవిష్కరణ

ఒకవైపు ఎన్నికల నియమావళి అమలులో ఉండటం, మరోవైపు ముహూర్తబలం బాగుం డటం వంటి కారణాలతో యువనేత జగన్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పేరును ప్రకటించారు. పార్టీ, జెండా ఆవిష్కరణ వంటి అత్యంత కీలకమైన కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టాలని జగన్ అభిమానులు, మద్దతుదారులు, రాష్టవ్య్రాప్తంగా అనేక మంది నాయకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. దీనికోసం కొందరు అనువైన తేదీలు, ప్రాంతాన్ని కూడా సూచిస్తూ పలు నివేదికలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ (ఎన్నికల నియమావళి) అమలులో ఉన్న కారణంగానే జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆకస్మాత్తుగా పార్టీ పేరును ప్రకటించారని ఆయన సన్నిహితులు చెప్పారు. ముహూర్తబలం బాగుందన్న ఉద్దేశంతోనే శనివారం మధ్యాహ్నం 2.29 గంటలకు ఇడుపులపాయలో దివంగత నేత పాదాలచెంత జెండాను ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

జెండా ఆవిష్కరణ ముహూర్తం గురించి ముందే ప్రకటన చేస్తే ఇడుపులపాయకు లక్షలాదిగా జనం, అభిమానులు, నేతలు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే కోడ్‌ను విధిగా పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే అతి తక్కువ సమయంలో పార్టీ పేరును, జెండా ఆవిష్కరణ ముహూర్తాన్ని జగన్ ప్రకటించారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉపఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఆ ఉపఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఇడుపులపాయలో భారీస్థాయిలో పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేసుకోవాలన్నది జగన్ అభిమతమని ఆయన సన్నిహితులు చెప్పారు. ‘‘మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మి గారు.. ఇద్దరం రేపు (శనివారం) ఆవిష్కరిస్తాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనుకున్నా జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంది.. ఎన్నికల నియమావళిని గౌరవించాలి... కడప పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గొప్పగా వైఎస్సార్ పాదాల చెంతన పార్టీ కార్యక్రమం జరుపుకొందాం’’ అని జగ్గంపేట సభలో జగన్ తెలిపారు.
ఆశల రూపం... ఆవిష్కరణ సంబరం
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపుష్కరం సభలో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను స్థాపించబోయే ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పేరును ప్రకటించి, శనివారంనాడు కొత్త పార్టీ పతాకాన్ని ఇడుపులపాయలో ఆవిష్కరిస్తానని వెల్లడించడం ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.టీవీల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్, జగన్ అభిమానులు పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, సత్తెనపల్లిల్లో జగన్ కటౌట్‌లను ఊరేగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాణసంచా కాల్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నేత గౌతంరెడ్డి ఇంటి వద్ద అభిమానులు స్వీట్లు పంచారు. గన్నవరం మండలంలో బాణసంచా కాల్చారు.

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పీసీసీ మాజీ కార్యదర్శి వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సందడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది. కొన్నిచోట్ల యువకులు రోడ్లపైకి వచ్చి నృత్యం చేశారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా బాణసంచా కాల్చి నూతన పార్టీకి స్వాగతం పలికారు. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల తో పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఇంటి వద్ద వైఎస్ అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు.

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులు బాణసంచా కాల్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో అభిమానులు బాణసంచా కాల్చారు. నల్లగొండ జిల్లాలో ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంచారు. హుజూర్‌నగర్‌లో బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జగన్ అభిమానులు బాణాసంచా కాల్చారు. పాలమూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అభిమానులకు స్వీట్లు పంచారు. ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు.


No comments:

Post a Comment