Sunday, March 13, 2011

జెండానే ఎజెండా * ఇడుపులపాయలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పతాకావిష్కరణ

మహానేత పాదాల చెంత ఆవిష్కరించిన వైఎస్ జగన్, విజయమ్మ
ప్రజా ఎజెండాను ప్రతిఫలించిన పార్టీ జెండా
రాజశేఖరుడి స్వర్ణయుగ పునరాగమన సూచికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకం
యువజన.. దళిత, శాంతి, రైతు రాజ్యానికి ప్రతీకగా 3 రంగులు
వైఎస్ ప్రవేశపెట్టిన 9 పథకాలను ప్రతిబింబించేలా చిహ్నాలు
జెండా మధ్యలో నవ్వుతూ కనిపించే రాజశేఖరుడి చిత్రం
పతాకావిష్కరణకు పోటెత్తిన అభిమానులు..
భారీగా తరలివచ్చిన నేతలు
అడుగుతీసి అడుగు వేయలేనంతలా అభిమాన తాకిడి


ప్రజా సౌభాగ్యాన్ని కాంక్షించే త్రివర్ణాలు.. బడుగు బతుకుల్లో వెలుగులు నింపిన నవ రత్నాల్లాంటి తొమ్మిది సంక్షేమ పథకాలు... పేదల మోముల్లో చిరునవ్వులు నింపిన ‘స్వర్ణయుగకర్త’ చిరు దరహాసం.. మొత్తంగా పేదోడి సంక్షేమమే ఎజెండాగా ‘వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. రాజకీయ పార్టీలు ప్రజలకు తామేంచేసేదీ ఎన్నికలనాడు మ్యానిఫెస్టోల్లోనే చెబుతుండగా.. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం జెండాలోనే ‘ప్రజా అజెండా’ను స్పష్టంగా చెప్పారు. రామరాజ్యాన్ని తలపించిన రాజశేఖరుడి పాలనను మళ్లీ తెస్తానని విస్పష్టంచేశారు. శనివారం ఇడుపులపాయలో మహానేత పాదాల చెంత, ఉవ్వెత్తున తరలివచ్చిన అభిమాన సందోహం మధ్య యువనేత జగన్, తల్లి విజయమ్మ కలిసి భవిష్యత్ స్వర్ణయుగ పతాకాన్ని ఆవిష్కరించారు.



అభిమాన సునామీ..

జెండాలో యువజన, దళిత, శాంతి, రైతు రాజ్యానికి చిహ్నంగా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉండగా.. ఆ మధ్యలో.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ధి కలిగేలా వైఎస్సార్ ప్రవేశపెట్టిన తొమ్మిది పథకాలను (ఇందిరమ్మ ఇళ్లు, *2కే కిలో బియ్యం, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్, భూ పంపిణీ, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, పింఛన్లు) తొమ్మిది గుర్తులతో ప్రతిబింబించారు. ఆ పథకాల మధ్యలో చిరునవ్వులు చిందిస్తోన్న మహానేత వైఎస్సార్ చిత్రాన్ని ఉంచారు. ఈ జెండా ఆవిష్కరణ విషయాన్ని, పార్టీ పేరును శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో ప్రకటించడంతో రాష్టవ్య్రాప్తంగా అభిమానుల్లో వెల్లువెత్తిన భావోద్వేగం శనివారం ఇడుపులపాయలో ప్రతిబింబించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ పోటెత్తిన అభిమానుల తాకిడి జన సునామీని తలపించింది. జెండాను ఆవిష్కరించిన యువనేత వైఎస్ జగన్, ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర నేతలు ఒక్కక్షణం కూడా స్థిమితంగా నిలబడలేనంతగా అభిమానుల తాకిడి వారిని కుదిపివేసింది.

అడుగు తీసి అడుగు వేయడమే అతికష్టం..

యువనేత జగన్ శనివారం ఉదయం తొలుత పులివెందులకు చేరుకున్నారు. అక్కడ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం హెలికాప్టరులో ఇడుపులపాయ చేరుకున్నారు. యువనేత వెంట హెలికాప్టర్‌లో ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మమ్మ, సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్ వచ్చారు. హెలికాప్టర్ దిగిన వెంటనే జగన్ ఇడుపులపాయలోని తమ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అప్పటికే వివిధ జిల్లాల నుంచిగెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను యువనేత పలుకరించారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచివైఎస్ జగన్, వైఎస్ విజయలక్ష్మమ్మలతో పాటు నేతలంతా వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు యువనేతను దగ్గరి నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అడుగు ముందుకు వేయడం అతికష్టమైంది. వాహనం దిగిన యువనేత కొద్ది అడుగులు వేసి సమాధి వద్దకు చేరడానికి, అభిమానుల తాకిడి వల్ల విపరీతమైన ఆలస్యం జరిగింది. సమాధి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన తరువాత, తోపులాట, హర్షధ్వానాల మధ్య ‘వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీ జెండాను యువనేత ఆవిష్కరించారు.

అభిమానుల తాకిడితో పతాకాన్ని కొద్దిసెకన్లు మాత్రమే ప్రదర్శించడంతో ఈ దృశ్యం మీడియా కెమెరాలకు దొరకడమే కష్టమైపోయింది.

అనుకున్న ముహూర్తానికే ఆవిష్కరణ

ముందుగా నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 2.29గంటలకే పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జన సందోహం తాకిడితో, ముహూర్త సమయానికి పతాకావిష్కరణ జరుగుతుందో, లేదోననే సంశయం పటాపంచలైంది. యువనేత వైఎస్ జగన్ తదితరులంతా ముహూర్త సమయానికి అరగంట ముందే వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకోవడంతో, అభిమానుల తాకిడి, తోపులాటలు ఉన్నా, అనుకున్న సమయానికి పతాకాన్ని ఆవిష్కరించగలిగారు.

తరలివచ్చిన నేతలు

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కాట సాని రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కె.శ్రీనివాసులు, కమలమ్మ, కాపు రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, అనంతపురం జడ్పీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, చిత్తూరు జడ్పీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, మారెప్ప, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, గోనె ప్రకాశరావు, గట్టురామచంద్రరావు, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు మాజీ డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కడప మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పీసీసీ ఎస్టీ సెల్ మాజీ కన్వీనర్ రాజమల్ల సిద్ధేశ్వర్ తదితరులున్నారు.


స్వర్ణయుగ సంకేతం
పొడుస్తున్న పొద్దును, కొత్త నమ్మకాన్ని తలపించేలా వైఎస్‌ఆర్ చుట్టూ నారింజ రంగు వలయాకారంలో... దివంగత నేత ప్రవేశపెట్టిన 9 సంక్షేమ పథకాల అమలు బాధ్యతను గుర్తుచేసే చిహ్నాలు

నీలం..
మహానేతకు ఇష్టమైన నీటి రంగు
యువ చైతన్యం, దళితుల
ఆత్మగౌరవానికి చిహ్నం

తెలుపు
శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం

ఆకుపచ్చ
వైఎస్ కలగన్న హరితాంధ్రప్రదేశ్
మైనార్టీ మహాశక్తి, మానవీయ స్ఫూర్తి

పేదవాడి సంక్షేమమే ఎజెండాగా, బాధ్యతకు ప్రతిరూపంగా కనిపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. శనివారం మధ్యాహ్నం 2.29 గంటలకు ఆవిష్కృతమైన ఈ జెండా స్వర్ణయుగానికి సంకేతమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా జెండా విశిష్టతలను వివరించాయి. నీలం, ఆకుపచ్చ మధ్యలో తెలుపు రంగులతో జెండాను రూపొందించారు. మధ్యలో ఉన్న తెలుపు రంగులో కేంద్ర బిందువుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారు. పొడుస్తున్న పొద్దును, ఒక కొత్త నమ్మకాన్ని, స్వర్ణయుగాన్ని తలపించేలా వైఎస్సార్ చుట్టూ నారింజ రంగు కనిపిస్తుంది. నారింజ రంగు చుట్టూ వలయాకారంలో దివంగత నేత ప్రవేశపెట్టిన తొమ్మిది సంక్షేమ పథకాలకు సంకేతంగా చిహ్నాలున్నాయి.


జెండాలో సంక్షేమ రూపాలివీ..

నిరుపేదలందరికీ నిలువ నీడ కోసం ఇళ్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం, రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్టుల నిర్మాణం, రైతన్నకు వెన్నంటి ఉండాలన్న లక్ష్యంతో ఉచిత విద్యుత్తు, ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నతవిద్య కలను నిజం చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, భూమిలేని ప్రతిపేద రైతుకు భూపంపిణీ, ఆరోగ్యశ్రీ కింద మరింత మెరుగైన ఉచిత వైద్యం, మహిళలకు పావలా వడ్డీ, వృద్ధులకు పింఛన్లతో సహా అన్ని రకాల ఆసరా కల్పించడం... వంటి అత్యంత కీలకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి పార్టీ బాధ్యతను నిరంతరం గుర్తుచేసేలా జెండాలో వాటి చిహ్నాలను పొందుపరిచారు.

జెండా పొడవు-వెడల్పుల నిష్పత్తి-2:3

జెండాలో నీలం, ఆకుపచ్చలు ఇరువైపులా చెరొక భాగం ఉంటే.. మధ్యలో తెలుపురంగు రెండింతలు ఉంటుంది. ఈ తెలుపు రంగులోనే తొమ్మిది పథకాల చిహ్నాలు, వాటి మధ్య చిరునవ్వుతో నమ్మకానికి ప్రతిరూపంగా వైఎస్సార్ చిత్రం కనిపిస్తుంది.



 అంబరాన్ని తాకిన సంబరం * 
 జన పార్టీకి ఘన స్వాగతం

రాష్టవ్య్రాప్తంగా వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
ర్యాలీలు, సభలు, ప్రదర్శనలు
మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. రాష్టవ్య్రాప్తంగా బడుగు బలహీన వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నగరాలు, జిల్లా, మండల కేంద్రాల్లో కొత్త పార్టీకి స్వాగతం పలుకుతూ బాణసంచాలు కాల్చారు. ర్యాలీలు, సభలు నిర్వహించారు. కేకులు కట్ చేసి ఆనందం పంచుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధ న జగన్ వల్లే సాధ్యమని నినదించారు. పలుచోట్ల వైఎస్ అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకున్నారు. విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఆదివారం పెద్దఎత్తున ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జిల్లాల్లో పండగ వాతావరణం..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ బాణసంచా కాల్చారు. పిఠాపురంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి సెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో యువకులు ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని సంపత్ వినాయక దేవస్థానంలో జగన్ యువసేన, విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలం మొయిదలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామగ్రామాన వేడుకలు జరుపుకున్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సర్కిల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించి బాణసంచా కాల్చారు.

ఇచ్చాపురం, సోంపేట, పలాసల్లో ప్రదర్శనలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో బైక్ ర్యాలీ, చిలకలూరిపేట, రావులపాలెం, పురుషోత్తమ పట్టణాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు చేశారు. రేపల్లెలో అంబటి రాంబాబు నివాసం వద్ద నాయకులు సంబరాలు జరిపారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు సందడి చేశారు. బాణాసంచా పేలుళ్లు, స్కూటర్ ర్యాలీలతో కృష్ణా జిల్లా మార్మోగింది. విజయవాడలో అభిమానులు బస్సులో ప్రయాణికులకు స్వీట్లు పంచారు. పాతబస్టాండ్ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జోగి సురేష్ తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో నేతలంతా ఇడుపులపాయలో పతాకావిష్కరణకు వెళ్లడంతో అభిమానులు, కార్యకర్తలే సొంతంగా సంబరాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇలాకా అయిన కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. బాణసంచా పేల్చి.. పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వికలాంగులు బాణసంచా కాల్చారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజవర్గ కేంద్రం జగన్నినాదాలతో దద్దరిల్లింది. తిరుపతిలో అలిపిరి వద్ద మహిళలు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. తిరుమలలో అఖిలాండం వద్ద అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. కర్నూలు జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలంతా స్మృతివనం వద్దకు చేరుకుని మహానేతకు నివాళులు అర్పించారు. కర్నూలు, నంద్యాల, మంత్రాలయం నియోజకవర్గాల్లో మహిళలు, ముస్లిం సోదరులు బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్‌లో కార్యకర్తలు రోడ్లపైకి వ చ్చి సంబరాలు చేసుకున్నారు. వరంగల్‌లో కలెక్టరేట్ ఎదుట ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి జగన్ యువసేన ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కురవిలో కార్యకర్తలు మోకాళ్లపై నడిచి వీరభద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.

నల్లగొండ జిల్లా కోదాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పతాకాలు చేతపట్టి, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన చేశారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు అనంతరం తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హౌజింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, లక్సెట్టిపేట్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ పార్టీకి అంతా మంచే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ఆశీర్వదించారు. శనివారం యువనేత జెండాను ఆవిష్కరించే సమయంలో అభిమానులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు.

సాగర్ సొసైటీలో కోలాహలం..

హైదరాబాద్ సాగర్ సొసైటీలోని యువనేత క్యాంపు కార్యాలయం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచే అక్కడికి చేరిన వందలాది మంది పార్టీ పతాకం ఆవిష్కరణ సమయానికి కార్యాలయంలో కేక్ కోసి పంచారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో అభిమానులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ
YSR CONGRESS
989 20381
YSR CONGRESS
989 20380
YSR CONGRESS
989 20379
YSR CONGRESS
989 20378
YSR CONGRESS
989 20377
YSR CONGRESS
989 20376
YSR CONGRESS
989 20375
YSR CONGRESS
989 20374
YSR CONGRESS
989 20373
YSR CONGRESS
989 20372
YSR CONGRESS
989 20371
YSR CONGRESS
First                                                         Last               

No comments:

Post a Comment