వైఎస్ లేకే ఈ అవస్థలని జననేత వివరణ
రైతుల సమస్యల ప్రస్తావన వస్తే చాలు.. ఆ గొంతు నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. అన్నదాతకు అన్ని విధాలా జరుగుతున్న అన్యాయం స్ఫురణకు వస్తే చాలు, ఆ మదిలో ఆవేశం ఉప్పొంగుతోంది. జనం మధ్య జనం కోసం సాగుతున్న ఓదార్పు యాత్రలో కర్షకులకు ఎదురవుతున్న కష్టనష్టాలపై జననేత జగన్ మాట్లాడినప్పుడల్లా ఓవంక ఆగ్రహం, మరోవంక ఆవేదన వెల్లువవుతున్నాయి.

జగన్ తన ప్రసంగాల్లో రైతుల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా జనం నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. పోలవరం, చేవెళ్ల ప్రాణహిత, సుజలస్రవంతి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న వైనం, ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టికొట్టేలా కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులతో రాష్ట్ర రైతాంగం ఎంతగానో దెబ్బతింటోందని తన ప్రసంగాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈనెల 11న రాజధాని డి ల్లీలో నిరాహారదీక్షకు దిగుతానని సోమవారమే ప్రకటించారు. రైతు పక్షపాతి వైఎస్ బతికుంటే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు సగమైనా పూర్తయ్యేవని, దీంతో నేడు రైతన్నలకు ఈ దుస్థితి ఉండేది కాదని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తవుతుంటే వారి కళ్లల్లో దివంగత మహానేత వైఎస్సే గుర్తుకు వస్తారని పేర్కొంటున్నారు. పోలవరం వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు పూర్తిస్థాయిలో సాగు, తాగునీటి సమస్య తీరేదని ప్రస్తావిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌నిచ్చిన మహనీయునిగా డాక్టర్ వైఎస్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడుతున్నారు. ఓదార్పుయాత్ర సమయంలో బాధిత కుటుంబాల కష్టసుఖాలను, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ కష్టమొచ్చినా మీకు నేనున్నానని, అండగా ఉంటానని, దిగులు చెందవద్దని భరోసా ఇస్తున్నారు. విగ్రహావిష్కరణలు, సభల్లో మాత్రం అన్నదాతల అవస్థలు, వారికి జరుగుతున్న అన్యాయం, వైఎస్ చేపట్టినసంక్షేమ పథకాలు పడకేసిన తీరు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబడుతున్నారు. యువనేత జగన్ సమయస్ఫూర్తితో చేస్తున్న ప్రసంగాలకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు.
No comments:
Post a Comment