Sunday, January 23, 2011

ధరల పాలనకు చరమ గీతం * పేదోడి గోడు పట్టని ప్రభుత్వంపై ‘జన దీక్ష’లో జగన్ ధ్వజం

* పేదల గురించి ఆలోచించే తీరిక కూడా కేంద్రానికి, రాష్ట్రానికి లేదు
* ఆరు నెలల్లో ఏడుసార్లు పెట్రోలు రేట్లు పెంచారు... వాటి దెబ్బకు నిత్యావసరాల ధరలూ కొండెక్కాయి
* మార్కెట్‌కెళితే కూరగాయలు షాక్ కొడుతున్నాయి
* ఇలా రేట్లు పెరుగుతూ పోతే సామాన్యుడు ఎలా బతకాలి?
* పాలకులకు కుర్చీలను కాపాడుకోడానికే సమయం సరిపోతోంది
* బాబు, నేటి కాంగ్రెస్.. దొందూ దొందే
* బాబు ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు ఎడాపెడా పెంచారు
* పన్నుల మీద పన్నులు వేసి ఇప్పుడు ట్యాక్సుల గురించి మాట్లాడుతున్నారు
* అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనిషి ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడాలి

అప్పటి చంద్రబాబు పాలన అయినా.. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన అయినా దొందూ దొందేనని, వీరికి ఒక మాట అన్నా.. విశ్వసనీయత అన్నా.. అర్థం తెలియదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పేదల గురించి ఆలోచించే తీరిక అటు కేంద్రానికి గానీ, ఇటు రాష్ట్ర పాలకులకు గానీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాలకులకు కుర్చీని కాపాడుకునేందుకే సమయం సరిపోతోందని, ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి అధ్వాన పరిస్థితిలో రాష్ట్రం ప్రయాణం చేస్తున్నందున, ప్రజలు, ప్రతి పేదవాడు కూడా కాంగ్రెస్ పాలనను సాగనంపాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గ్యాస్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చంద్రబాబు భావి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. శనివారం విశాఖ సాగర తీరాన పెట్రో ధరలు, నిత్యావసర ధరల పెరుగుదలపై జగన్ ‘జన దీక్ష’ పేరుతో ధర్నా చేశారు. లక్ష మందికిపైగా పాల్గొన్న ఈ ధర్నాలో ఆయన కేంద్ర రాష్ట్ర పాలకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
కుర్చీ గురించే తప్ప వారికి వేరే ఆలోచన లేదు..
‘పెరుగుతున్న పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. వాటికి కళ్లెం వేయాలంటూ ఇక్కడ కూర్చున్న లక్షలాది మంది గొంతులు ఒక్కటై మాట్లాడాయి.. ఈ గోడును అక్కడ కేంద్రాన్ని, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న పెద్దలు ఒక్కసారి వినండని కోరుతున్నా.. ఈరోజు కూరగాయల మార్కెట్‌కు వెళితే కూరగాయలు షాక్ కొడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ మీద పెంచే ప్రతి రూపాయి కూడా కూరగాయలు, నిత్యావసర వస్తువుల మీద ప్రభావం చూపుతాయన్న సంగతి పక్కనబెట్టి 6 నెలల్లో ఏడుసార్లు పెట్రోలు, డీజిల్ పెంచుతూ పోతుంటే.. 20 నెలల్లో 20 సార్లు పెరుగుతూ పోతుంటే ఎలా బతకాలని సామాన్యుడు అడుగుతున్నాడు. ఇవాళ మార్కెట్లో మునగకాయ ఒక్కటి 8 రూపాయలు. చిక్కుడు కిలో రూ.40. చింతపండు కిలో 90. గత ఏడాది జనవరికి.. ఇప్పటికి తేడా చూడండి. ఉల్లి కిలో రూ.10 నుంచి 50కు పెరిగింది. వెల్లుల్లి రూ.80 నుంచి 280కి పెరిగింది. కందిపప్పు రూ.60 నుంచి 70కి, మినప్పప్పు రూ.60 నుంచి 80కి, ధనియాలు రూ.70 నుంచి 84కు, వేరుశనగ నూనె రూ.55 నుంచి 78కి పెరిగింది. సబ్బం హరి అంటున్నారు నిన్న.. గతంలో పిడికిట్లో డబ్బులు తీసుకెళ్లి సంచిలో కూరగాయలు తెచ్చుకుంటే.. ఇప్పుడు సంచిలో డబ్బులు తీసుకెళ్లి పిడికిట్లో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రంగానీ ఎక్కడా పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ ఆలోచన చేయట్లేదు. ఎంతసేపూ వాళ్ల వాళ్ల కుర్చీ గురించి తప్ప ఇంకోటి ఆలోచించడం లేదు.’
బాబు ఘనత ఇదీ..
‘చంద్రబాబునాయుడు గారు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి 1995 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గద్దెనెక్కిన 10 నెలల్లోనే.. ఆ సమయంలో తాను మద్దతునిచ్చిన అటు యునెటైడ్ ఫ్రంట్, ఇటు ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో డీజిల్ ధరను ఏడు రూపాయల నుంచి రూ.22కు పెంచారు. పెట్రోలు రూ.21 నుంచి 34కు పెంచారు. కానీ చంద్రబాబునాయుడుకు వాటి పెరుగుదలను ఆపాలని ఏమాత్రం ధ్యాసలేదు. కనీసం రాష్ట్రంలోనైనా చంద్రబాబు ఏమైనా చేశాడా? అంటే ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. కరెంటు చార్జీలు నాలుగుసార్లు పెంచారు. 1995-96లో కరెంటు చార్జీలు 18 శాతం పెరగగా, 1996-97లో 32 శాతం, 1998-99లో 10 శాతం, 2000 సంవత్సరంలో 15 శాతం.. మొత్తంగా ఐదేళ్లలో కరెంటు చార్జీలు 100 శాతం పెరిగాయి. గ్యాస్ ధర రూ.150 ఉంటే రూ.300కు తీసుకెళ్లాడు.’
మనిషి ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడాలి..
‘చంద్రబాబు ఈవేళ పన్నుల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా మనిషి అనే వాడు ఒక్క రకంగానే ఉండాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోలుపై 18 శాతం ఉన్న అమ్మకపు పన్ను 32.55 శాతానికి పెంచాడు. డీజిల్‌పై 12 శాతం ఉన్న పన్ను 21.33 శాతానికి తీసుకెళ్లాడు. గ్యాస్‌పై 10 శాతం పన్ను వేశాడు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు పన్నులు వేసి అధికారం పోయిన తరువాత వేరే రకంగా మాట్లాడడమంటే ప్రజలను మోసం చేయడమే.’

గ్యాస్ బిడ్డింగ్‌లో లేకుండా ద్రోహం చేశారు..
‘చంద్రబాబు అన్నింటికన్నా పెద్ద తప్పు చేసిందేంటంటే.. ఆయన చక్రం తిప్పుతున్న సమయంలోనే కృష్ణా, గోదావరి గ్యాస్‌ను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు.. గ్యాస్‌పై హక్కుల కోసమని చెప్పి కనీసం ఆంధ్రప్రదేశ్ తరఫున బిడ్డింగ్‌లో కూడా పాల్గొనలేదు. గుజరాత్ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తే అదే గ్యాస్ గుజరాత్ వరకు పోతోంది. కానీ మన రాష్ట్రంలో ఉన్న అక్కాచెల్లెళ్లకు ఆ గ్యాస్ దక్కడం లేదు. భావి రాష్ట్రానికి చంద్రబాబు చేసిన ద్రోహం ఇది. బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం తీవ్రమైన అన్యాయం. అది జరిగి ఉంటే ఇవాళ గ్యాస్ మనకు రూ.100కో రూ.200కో అందుబాటులో ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనకు వచ్చాక.. ఈ గ్యాస్ మనదీ అని, మనకు, మన అక్కాచెల్లెళ్లకు న్యాయం జరగాలని తలచి ఆ గ్యాస్ టెండర్లలో ఆంధ్రప్రదేశ్ కూడా కచ్చితంగా పాల్గొనేలా చేశారు.’
అధ్వాన స్థితిలో రాష్ట్ర ప్రయాణం..
‘మహానేత వైఎస్ మన మధ్య నుంచి దూరమయ్యాక ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో వెంటనే ఆర్టీసీ చార్జీలు 23 శాతం పెంచారు. కరెంటు చార్జీలు వాణిజ్య అవసరాలకు 28 పైసల నుంచి 40 పైసల వరకూ పెంచారు. గ్యాస్ ధర రూ.300లకంటే పెరగకుండా వైఎస్ తొక్కిపెడితే.. ఇప్పుడు తాను చనిపోయాక ఇవాళ గ్యాస్ రూ.343 చేశారు. ఒక్కసారి ఆలోచించండి. అప్పటి చంద్రబాబు పాలన అయినా.. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన దొందూ దొందే. ఒక్కరికీ ఒక మాట అన్నా.. విశ్వసనీయత అన్నా.. అర్థం తెలియదు. ఇలాంటి అధ్వాన పరిస్థితిలో రాష్ట్రం ప్రయాణం చేస్తోంది. ప్రజలు, ప్రతి పేదవాడు కూడా కాంగ్రెస్ పాలనను సాగనంపాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.’

ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
‘లక్షలాది గొంతులు ఒక్కటై ధరలకు కళ్లెం వేయాలని ఏడెనిమిది గంటలుగా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా దీక్ష చేస్తున్నారు. ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా.. ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని ఆకాశంవైపు చూస్తూ దేవుణ్ని ప్రార్థిస్తున్నా.’

ఆయిల్ కంపెనీలకు నష్టాలెక్కడ?

‘ఒకవైపు అంటారు.. పెట్రోలు ధరలు పెంచక తప్పడం లేదు అని. ఎందుకంటే ఆయిల్ సంస్థలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున పెంచక తప్పదని పాలకులు చెబుతున్నారు. కానీ దేశంలో ఉన్న 13 చమురు సంస్థల లాభాలు చూడండి. 2006-07లో రూ. 33,204 కోట్లు, 2007-08లో రూ. 29,041 కోట్లు, 2008-09లో రూ. 26,730 కోట్లు, 2009-10లో రూ. 37,319 కోట్లు లాభం గడించాయి. అంటే ఐదేళ్లలో మొత్తం రూ.1,26,292 కోట్ల మేర ఈ చమురు కంపెనీలు లాభాలు గడించాయి. మరి ఈ కారణం ఎందుకు చెబుతున్నట్టు?.’

పొరుగు దేశాల్లో రేటు సగమే..
‘పెట్రోలు ధర నేపాల్‌లో లీటరుకు రూ. 39.24, శ్రీలంకలో రూ. 21, పాకిస్థాన్‌లో రూ. 35.97, బంగ్లాదేశ్‌లో రూ. 29.43 మాత్రమే. ఇవి పక్క దేశాల రేట్లు. ఒక పక్క ఆయిల్ కంపెనీల పేరు చెప్పి ఆరు నెలల్లో ఏడు సార్లు పెంచితే ఎక్కడికి పోవాలి పేదవాడు?’

వైఎస్ పాలనలో ఎలా ఉంది?

‘దివంగత నేత వైఎస్ పాలన గురించి కూడా చెప్పుకుందాం. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌లపై రూ. 50 పెంచితే.. మన అక్కాచెల్లెళ్లపై భారం పడుతుందని, వారికి కష్టం కలగకూడదని.. ఆ పెరిగిన భారం రాష్టమ్రే భరిస్తుందని వైఎస్ ప్రకటించి అమలుచేశారు. చంద్రబాబునాయుడు గ్యాస్‌పై పన్ను నిర్ణయాలు తీసుకున్నప్పుడు చమురు ధర 23 డాలర్లు ఉంది. కానీ వైఎస్ ’50 సబ్సిడీ భారాన్ని భరించినప్పుడు చమురు ధర 145 డాలర్లు ఉంది. పైగా వైఎస్ గ్యాస్‌పై ఉన్న పన్నును 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. ఐదేళ్లలో ఆర్టీసీ చార్జీ ఒక్కరూపాయి కూడా పెంచలేదు. కరెంటు చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు.’

ఉద్యోగులను చర్చలకూ పిలవరా..?

‘ఉద్యోగులు మూడు రోజులుగా ధర్నాలు, సమ్మెలు చేస్తున్నారు. ఈ పెరుగుతున్న ధరలు ఆ ఉద్యోగులనూ వేధించేవే. ఆ ఉద్యోగులను పిలిచి.. మీ సమస్యలేంటి అని అడిగి.. న్యాయమైన కోర్కెలు ఉంటే పరిష్కరిద్దామని కనీసం చర్చలకు కూడా పిలవని పరిస్థితి ఉందంటే చాలా బాధగా ఉంది. దివంగత నేత వైఎస్ ఉన్నప్పుడు ఏ ఉద్యోగీ వీధిన పడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యోగి పరిస్థితి దయనీయంగా ఉంది.’
సాగరం.. జనసాగరం .... విశాఖలో జన దీక్షకు కెరటాల్లా పోటెత్తిన జనం
* ధరల మంటలపై నిరసన జ్వాల
* ఉదయం నుంచి సాయంత్రం వరకు చమటలు కక్కే ఎండనూ లెక్కచేయని జనం
* లక్షన్నరకుపైగా హాజరైనా తోపులాటలకు తావులేకుండా ధర్నా నిర్వహణ

ఓ పక్క సాగరం.. మరోపక్క జన సాగరం.. యువనేత కోసం పోటీ పడి పోటెత్తాయి. అభిమాన జనం హోరు ముందు సాగరుని హోరు చిన్నబోయింది. పెరిగిన పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలకు నిరసనగా జగన్ చేపట్టిన జన దీక్షకు మునుపెన్నడూ లేనంతగా వచ్చిన జనం, వారి జగన్నినాదాలతో విశాఖ ఆర్‌కే బీచ్ తీరం శనివారం దద్దరిల్లింది. ఇదేదో డబ్బులిచ్చి జనాన్ని తెచ్చి గంటో రెండు గంటలో నిర్వహించే బహిరంగ సభ కాదు. ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మొక్కవోని దీక్షతో ఆరేడు గంటలపాటు లక్షన్నరకుపైగా జనం చేసిన ధర్నా. ఒక్కో వాన నీటి చుక్కా వరదై, అది నదిగా మారి సంద్రమైన తీరులా.. విశాఖ సాగర తీరాన జన సముద్రం చేసిన సత్యాగ్రహం.

ఉదయం 9 నుంచే జనప్రవాహం
ఉదయం తొమ్మిది గంటల నుంచి విశాఖ ఆర్కేబీచ్ నిండడం మొదలైంది. అలా మధ్యాహ్నం పన్నెండయ్యే సరికి సాగరాన్ని జనసంద్రం కమ్మేసింది. సాయంత్రం అయిదు గంటల వరకూ ఆ ప్రవాహం అలాగే కొనసాగింది. విశాఖ నగర చరిత్రలో నభూతో నభవిష్యతి అన్న చందంగా దీక్షాప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిర్వాహకులు బీచ్‌రోడ్డుపై చాలా దూరం కార్పెట్లను ఏర్పాట్లు చేశారు. అయితే అవన్నీ ఏ మూలకూ చాలకపోవడంతో నడిరోడ్డుపైనే కూర్చుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. మామూలు రోజుల్లో అయితే సాగరతీరంలో సముద్రుడి అందాలకు ముగ్ధులవుతారు. శనివారం మాత్రం యువనేత ధ్యాసలో సంద్రాన్ని పట్టించుకోవడం మానేశారు.

యువనేత మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దీక్షా వేదికపైకి వచ్చారు. అప్పటిదాకా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలతో జేజేలు పలికారు. జగన్ జిందాబాద్, యువనేత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి జగన్ ఇంకా ముందే ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే ఉదయం 10 గంటలకు జగన్ ఎమ్మెల్యే బాబూరావు ఇంటి నుంచి ధర్నాకు బయలుదేరినా మధ్యలో నార్త్ ఎక్స్‌టెన్షన్‌లోని అభయాంజనేయ స్వామి గుడిలో దర్శనం, సంపత్ వినాయగర్ ఆలయంలో పూజలు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, పాత వాల్తేరులో దివంగత నేత విగ్రహావిష్కరణలు చేయడంతో అనుకున్న సమయానికంటే ధర్నా స్థలానికి ఆలస్యంగా వచ్చారు. 12.15 గంటలకు ధర్నా వేదికపై కూర్చున్నారు.

దీక్షమీదే ధ్యాస
జగన్ వచ్చే సమయానికి బీచ్‌రోడ్డు కిలోమీటరు పొడవునా కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఐదున్నర వరకు మొక్కవోని దీక్షలో జనం నిమగ్నమయ్యారు. ఎరట్రి ఎండలో, చెమటలు కక్కుతున్నా.. దాహం వేస్తున్నా.. బీచ్ వాతావరణంలో తీవ్రమైన ఆకలి వేస్తున్నా.. చూపంతా జగన్ మీదే. ధ్యాసంతా దీక్ష మీదే. దీక్ష ప్రాంగణంలో లక్షకుపైగా జనంలో సగం మంది కూర్చుంటే సగం మంది నిల్చునే ఉన్నారు. దీక్షకు వచ్చీపోయే జనప్రవాహంతో కలిపి ఈ ధర్నాకు లక్షన్నర మందిదాకా హాజరయ్యారని అంచనా. వేదికకు సమాంతరంగా సాగర తీరాన రామకృష్ణ బీచ్ వద్ద రోడ్డంతా కిలోమీటరు వరకు జనంతో కిక్కిరిసిపోయింది. జగన్ సాయంత్రం నాలుగ్గంటలకు ప్రసంగిస్తారని నిర్వాహకులు ప్రకటించారు. సభకు వచ్చిన ప్రముఖుల ప్రసంగాలు పూర్తయ్యే సరికి సాయంత్రం నాలుగున్నర గంటలయింది. జనం మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓపికతో, క్రమశిక్షణతో వేచి వున్నారు.

అందరి ప్రసంగాలు పూర్తయ్యాక జగన్ ప్రసంగానికి ఉపక్రమించేసరికి జనంలో ఒకటే ఉత్సాహం. జగన్ సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పన్నుల మీద పన్నులు వేసి, చార్జీలు మీద చార్జీలు పెంచి జనం నడ్డివిరిచిన తీరును జగన్ వివరిస్తుంటే జనం ఆసక్తిగా, శ్రద్ధగా వినడం కనిపించింది. ఇంకాసేపు మాట్లాడితే బాగుండునని జనం ఒకింత నిరాశ వ్యక్తంచేయడం కూడా వినిపించింది. మధ్యమధ్యలో కాబోయే సీఎం జగన్ అంటూ జనం రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. భానుడు పడమర దిక్కులో అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుంచి మొదలైన జనదీక్షను యువనేత ముగించారు.

ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు
జగన్ ప్రసంగానికి ముందు వేదికపై నేతలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, లక్ష్మీపార్వతి, కొండా సురేఖ, రోజా, పుల్లా పద్మావతి, రెహమాన్, పలువురు ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తన ప్రసంగంతో జనంలో ఆలోచన రేకెత్తించి ఆకట్టుకున్నారు. తన అల్లుడు చంద్రబాబు దొంగల్లుడు అంటూ చలోక్తులు విసిరారు. ధరలపై మాట్లాడే బాబు.. తన హెరిటేజ్‌లో ఎందుకు అడ్డగోలు ధరలతో అమ్ముతున్నారని ప్రశ్నించారు. ధరలు ఎంత పెరిగాయి? పొరుగు దేశాల్లో పెట్రోలు ధరలు ఎంత తక్కువగా ఉన్నాయి తదితర వివరాలతో లోతైన ప్రసంగంతో సినీనటి రోజా ఆకట్టుకున్నారు.

వైఎస్ చేపట్టిన పథకాలు కాంగ్రెస్ కార్యక్రమాలు అని చెప్పుకోవడానికి ప్రస్తుత పాలకులు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన ప్రసంగానికి జనం జేజేలు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అతిపెద్ద ధర్నా ఇదేనని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి చెబుతున్నప్పుడు జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. వక్తలు దివంగత నేత పేరు ప్రస్తావించినప్పుడు జనం కేరింతలు సముద్ర హోరును తలపించాయి. తర్వాత జగన్ ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అంటూ ఎదురుచూస్తూ క్రమశిక్షణ గల సైనికుల్లా దీక్ష కొనసాగించారు.

జన దీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచీ పదుల సంఖ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, నేతలు హాజరయ్యారు. తరలి వచ్చిన అభిమాన జనం జగనన్నా, నీకు మేమంతా అండగా ఉంటామన్నా అంటూ నినదించారు. ఒకపక్క దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మరోపక్క జననేత జగన్‌ల భారీ ఫ్లెక్సీలను, కటౌట్లను కిలోమీటర్ల మేర సముద్రం చెంతనే ఏర్పాటు చేశారు.
 
నాడు వైఎస్‌ను సోనియా పరామర్శించలేదు *      2003 పాదయాత్ర ఘటనను గుర్తు చేసుకున్న కొణతాల
 
 ఎన్నికల్లో మహానేత వైఎస్సార్ ముఖం చూసే జనం ఓట్లేశారని, సోనియాను చూసి కాదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. శనివారం ‘జనదీక్ష’ వేదికపై ఆయన మాట్లాడుతూ.. 2004, 2009 ఎన్నికల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అధిష్టానం వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేసింది తప్ప.. ఆయనపై అభిమానంతో కాదని చెప్పారు. ‘2003లో వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు రాజమండ్రిలో అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఒడిశా పర్యటనకు వెళ్తున్న సోనియాగాంధీ విశాఖ విమానాశ్రయంలో ట్రాన్సిట్ హాల్టు చేశారు. ఆ సందర్భంలో వైఎస్‌ను ఫోన్లో పరామర్శించాలని నేను కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. నేనేమైనా ఆయన్ను పాదయాత్ర చేయమన్నానా? ఆయనిష్టం. దాని పర్యవసానం ఆయనే అనుభవిస్తాడు. నేను మాట్లాడనన్నారు. ఆ మాటలకు తీవ్ర మనోవేదనకు గురైన నేను ఆ రోజు నుంచి సోనియాను కలవడం మానేశాను. దీనికి మాజీ సీఎం రోశయ్యే సాక్షి’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇలాంటి నేతలకా మనం అండగా ఉండాల్సిందని ప్రశ్నించారు. ‘నాడు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి విడిపోయి ఇందిరా కాంగ్రెస్ పెట్టడం తప్పయితే.. నేడు జగన్ పార్టీ పెట్టడం కూడా తప్పవుతుంది. త్వరలో జగన్ పెట్టబోయే పార్టీయే అసలైన కాంగ్రెస్. ప్రస్తుత కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ కాదు... ఇటాలియన్ కాంగ్రెస్. ఇటాలియన్ కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి. త్వరలో పెట్టబోయే వైఎస్సార్ పార్టీకి పట్టం కట్టండి. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోమని చాటి చెప్పండి’ అని కోరారు. అధిష్టానం ఆశీస్సుల మేరకు వైఎస్ రెండుసార్లు సీఎం అయ్యారంటూ చేసిన ప్రకటన సిగ్గుచేటన్నారు. ‘కిరణ్‌కుమార్ రెడ్డికి సీఎం పదవినిచ్చారంటే అది జగన్‌కు భయపడేనని గుర్తుంచుకోవాలి. సీఎం ఎప్పుడూ జగన్ ఫొటో పెట్టుకోవాలి. సోనియా భజన చేసి దొడ్డిదారిన సీఎం అయ్యారు. సోనియాకు దాసోహమంటే జగన్ ఎప్పుడో సీఎం అయ్యేవారు’ అని తెలిపారు.
 
మేం రెడీ... మీరు రెడీనా? రాజీనామాలపై ముఖ్యమంత్రికి జగన్ వర్గం నేతల ప్రతిసవాల్
 
* ఏ క్షణాన్నైనా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమని ప్రకటన* మీరు సోనియా, మేం వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్దాం... ఎవరేంటో అప్పుడు ప్రజలే తేలుస్తారు* కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబం రుణపడి ఉండాలన్న సీఎం వ్యాఖ్యలపైనా మండిపాటు* కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన మహానేతకు కాంగ్రెస్సే రుణపడి ఉండాలని వెల్లడి

యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, మళ్లీ గెలవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన సవాలుకు జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు దీటుగా స్పందించారు. తాము ఏ క్షణాన్నైనా రాజీనామాకు సిద్ధమని, మీరు కూడా సిద్ధమేనా అంటూ ప్రతిసవాల్ విసిరారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాదనే నేతలు రాజీనామా చేసి, సోనియా బొమ్మతో ఎన్నికల్లో నిలవాలని.. తాము వైఎస్ బొమ్మతో ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పారు. జగన్‌తో ఉండటమే నైతికత అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబం రుణపడి ఉండాలన్న సీఎం వ్యాఖ్యలపైనా వారు మండిపడ్డారు. నిజానికి, కాంగ్రెస్సే వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రుణపడి ఉండాలని పేర్కొన్నారు. శనివారం ‘జన దీక్ష’ వేదికపై ఆయా నేతలు ఏమన్నారంటే..

కాంగ్రెస్సే వైఎస్‌కు రుణపడి ఉండాలి
కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబం రుణపడి ఉండాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారట. నిజానికి రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందంటే అది వైఎస్ వల్లే. ఈ మాట కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీయే స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 33 ఎంపీ సీట్లను ఇవ్వడం వల్ల ఈ రోజు నేను కేంద్రమంతిగా ఉన్నానని ఆయన చెప్పారు. కేవలం వైఎస్ వల్లే ఇన్ని సీట్లు వచ్చాయి. అందువల్లే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అందుకు కాంగ్రెస్సే వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రుణపడి ఉండాలి. 2009 ఎన్నికలయ్యాకే జగన్ పార్లమెంటు సెంట్రల్ హాలులో పరిచయమయ్యారు. అంతకు ముందు పరిచయం లేదు. కొందరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్ ఎంపీగా ఉన్నందున నేను గొంతులో గరళం పెట్టుకుని ఉండాల్సి వస్తోంది. నిజం మాట్లాడితే వారిలో చాలామంది మిగలరు. 8 నెలలుగా ఒకే మాట చెబుతున్నాను. జగన్ ఒక శక్తి. కాంగ్రెస్ ఆయనను వదులుకుంటే ఏం జరుగుతుందో చెప్పాను. ఇప్పుడదే జరగబోతోంది. అన్ని వయసులు, తెగలు, మతాల వారూ జగన్‌కు బ్రహ్మరథం పడ్తున్నారు. ఓదార్పుయాత్రలో అన్ని చోట్లా.. బాబూ నువ్వు సీఎం కావాలి. సీఎం అయితేనే మా కష్టాలు తీరతాయి. నువ్వు కాకపోతే మరెవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు అని అంటున్నారు. అలసట ఎరుగకుండా.. ఒకట్రెండు పండ్లు మినహా ఏమీ తినకుండా రోజుల తరబడి రేయింబవళ్లు యువనేత ఓదార్పుయాత్ర నిర్వహిస్తున్నారంటే ఆశ్చరం కలుగుతోంది. జగన్ యువతకు ఓ చిహ్నం. జనదీక్షతోనైనా ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం దిగి రావాలి.
- సబ్బం హరి, అనకాపల్లి ఎంపీ

మీది మైనార్టీ ప్రభుత్వం కాదా...?
జగన్‌ను వేధించి, మనోవేదనకు గురిచేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. వైఎస్ మరణానంతరం ఆయన్ను సీఎం చేయాలని 150 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారు. తర్వాత దానినీ వక్రీకరించారు. జగన్‌ను కాదని రోశయ్యను సీఎం చేశారు. ఏడాది తర్వాత ఆయన్ను మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. వైఎస్ పుణ్యాన రాష్ట్రంలో అధికారం వస్తే ఆయన మరణించాక వేరే వారికి సీఎం పదవులను కట్టబెట్టారు. ఇప్పుడు వారంతా నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. నైతిక విలువలకు నిర్వచనం చెప్పగలరా? గుట్టుగా ఉండకుండా రచ్చ చేసుకుంటున్నారు. రేపోమాపో పడిపోయే స్థితిలో ఉన్నారు. మీది మైనార్టీ ప్రభుత్వం కాదా? నాయకత్వ లోపం వల్లే రాష్ట్రంలో దుర్భర పరిస్థితులేర్పడ్డాయి. వైఎస్ వుంటే రాష్ట్రంలో ఈ పరిస్థితులొచ్చేవి కావు. రేపటి తరానికి ఓ గొప్ప నాయకుడు (జగన్) దొరికాడు. ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పూనుకున్నాడు. రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలనే శాసించబోతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారి బతుకును దుర్భరం చేశారు.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ

దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలి
పూర్వం వారసుల్లేని రాజు మరణిస్తే ఏనుగుకు పూలదండను అందించి వీధుల్లోకి వదిలేవారు. అది ఎవరి మెడలో దండ వేస్తే వారికే రాజ్యాధికారం. అధిష్టానం అనే ఏనుగు వేసిన దండతో సీఎం అయిన కిరణ్ కుమార్‌రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు. దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలి. ధరల పెరుగుదలతో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలపై స్పందిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమించారు. మేం పార్టీ పెట్టాక కూడా ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగుతాయి.
- అంబటి రాంబాబు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి

35 మందీ రాజీనామాకు సిద్ధం..
జగన్ వెంట 35 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఏ క్షణాన్నైనా రాజీనామాకు సిద్ధమే. వైఎస్సార్ బొమ్మతో గెలిచిన ఆ నేతలకు మాట్లాడే అర్హత లేదు. మీరు కూడా రాజీనామా చేసి రండి. ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. వైఎస్సార్‌కు ప్రజల బాధలు తెలుసు. ప్రజలకు భారమయ్యే ఏ చర్యనూ ఆయన ఉపేక్షించేవారు కాదు. ఇప్పుడు నేతలు ఢిల్లీలో ఊకదంపుడు సమావేశాలు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.
- బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి

రాహుల్, సోనియాను చూసి ఓట్లేయలేదు..
ప్రజలే జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారు. జగన్‌కు వేరే అధిష్టానం లేదు. ప్రజలే ఆయనకు అధిష్టానం. వైఎస్ పథకాలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అంతో ఇంతో అనుభవించారు. సొంతంగా పట్టుమని పది ఓట్లులేని కొందరు పెద్దలు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. వైఎస్సార్ పట్ల ప్రజలకు అమితమైన ప్రేమ ఉంది. సోనియమ్మ, రాహుల్‌ను చూసి రాష్ట్ర ప్రజలు ఓట్లేయలేదు. వైఎస్సార్ బొమ్మతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాదనే నేతలు రాజీనామా చేసి సోనియా బొమ్మతో పోటీ చేయండి.. మేం వైఎస్సార్ బొమ్మపెట్టుకుని ప్రజల్లోకి వెళతాం. దేవాలయాల్లో దేవుడు.. ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచే ఉంటారు.
- మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు ఎమ్మెల్యే

ఈ ప్రభుత్వం వైఎస్సార్ పెట్టిన భిక్ష..
ఈ ప్రభుత్వం దివంగత వైఎస్ పెట్టిన భిక్ష. నాన్న తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చొద్దన్న జగన్ మాట మేరకు నేను రాజీనామా చేయలేదు. ఆయన సరేనంటే ఈ క్షణమే రాజీనామా చేసి, ఫ్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి పంపుతా. నైతిక విలువలు గురించే మాట్లాడే సీఎం తన అనుయాయులతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలిపోతుంది. పేదలు ధరాఘాతంతో తల్లడిల్లుతోంటే ఈ ప్రభుత్వం నీరోలా వ్యవహరిస్తోంది.
- గొల్ల బాబూరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే

జగన్ వెంట ఉండటమే నైతికత..
ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగేది అనుమానమే. నిత్యావసరాలు, పెట్రో మంటతో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. దివంగత నేత వైఎస్సార్‌లా ఎవరూ పేద, బడుగు, బలహీన వర్గాలపై దృష్టి పెట్టింది లేదు. 30 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలు కావడం వైఎస్సార్ చలవే. ఆయన వారసుడు జగన్ వెంట ఉండటమే నైతికత. ఆయన ఊ అంటే ఈ క్షణాన్నైనా రాజీనామా చేసేందుకు సిద్ధమే.
- కమలమ్మ, బద్వేలు ఎమ్మెల్యే
 

కోతికి మల్లెపువ్వు.. కిరణ్‌కు సీఎం పీఠం
 కోతి చేతికి మల్లెపువ్వు నిస్తే ఏం చేయాలో తెలియక నలిపి పారేసిందట. మంత్రిగా కూడా పనిచేయకుండానే ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ప్రజల ఇబ్బందులను పక్కనబెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు వైఎస్ జగన్ మీటింగ్‌కి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తున్నారన్నదానిపైనే దృష్టి పెట్టారు. జగన్ సభలకెళ్తున్నారని కొంత మంది పెద్దలు ఏవేవో వాగారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు. పాలకులు జనాన్ని జగన్ సభలకు వెళ్లకుండా అడ్డుకోవడం మాని నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలి. అలా కాకపోతే ప్రజాగ్రహం ప్రభుత్వాన్ని కాల్చి బూడిద చేస్తుంది.
- సినీ నటి రోజా
జగన్ వెంటే నడుస్తా..


యువనేత జగన్‌కు అండగా ఉంటా. ఈరోజు, రేపు, ఎల్లుండి, కాదు సంవత్సరం తర్వాత పార్టీ పెట్టినా జగన్ వెంట నడిచి వస్తాను. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు యువనేతకు బాసటగా నిలుస్తారు. జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే నా ఆకాంక్ష.
- టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి

జనం గుండెల్లో వైఎస్సార్ పథకాలు


2004 నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు మా గుండెల్లో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. మహిళలకు ఆయన పెద్దపీట వేశారు. జగనన్నా.. నీవు ముందుండి నడిపిస్తే చాలు.. నీ వెంట నడిచేందుకు మేము, మా నియోజకవర్గ ప్రజలంతా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
- మినతి గొమాంగో, మాజీ ఎమ్మెల్యే, కొత్తూరు

ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ


కడప ఉప ఎన్నికల్లో యువనేత జగన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యం. ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయన ఇప్పటి వరకు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చారు. నా నియోజకవర్గ ప్రజలంతా జగన్ వెంట నడవడానికి పూర్తి మద్దతు తెలిపారు. వైఎస్సార్ లేని లోటు జగన్ మాత్రమే తీర్చగలరు.
- శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే
 
అసలు సిసలైన నిరసన * వైఎస్ జగన్ దీక్షలతో ఆందోళనలకు కొత్తరూపు
నిరసన అంటే ప్రజలకు ఇబ్బందులు కలిగించడం.. నిరసన అంటే ప్రజాజీవనానికి అవరోధాలు కలిగించడం.. నిరసన అంటే అప్పటికే అవస్థలు పడుతున్న సామాన్యులను మరింత చికాకు పెట్టడం.. ఇవీ ఈనాటి రాజకీయాలు. ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాల కార్యకర్తలు అనుసరిస్తున్న పద్ధతులివే.. జన జీవనానికి ఆటంకం కలిగించి, మీడియా కెమేరాల ఎదుట పోజులిచ్చి కాసేపటికి ఎక్కడివారక్కడ చెదిరిపోవడం ఇప్పటి నిరసనల అంతస్సూత్రం. కానీ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న దీక్షలు కొత్త ధర్మాన్ని చాటిచెబుతున్నాయి. కొత్త విధానానికి పథ నిర్దేశం చేస్తున్నాయి. అసలు సిసలైన నిరసన అంటే ఇదీ అని తేల్చిచెబుతున్నాయి. మొన్న విజయవాడలో, నిన్న ఢిల్లీలో, ఇప్పుడు విశాఖలో చేపట్టిన దీక్షలు ఎలాంటి ఆందోళనకూ దారితీయకుండా, ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా ప్రజల ఆవేదనను సర్కారుకు ఎలుగెత్తి చెప్పాయి.

కడుపు మాడుతున్న ఎందరో సామాన్యుల ఆక్రోశాన్ని తెలియజెప్పాయి. వర్తమాన రాజకీయ ‘ప్రమాణాలకు’ ఏమాత్రం పొసగకుండా శనివారం విశాఖలో జరిగిన ‘జన దీక్ష’... ఉద్యమాలకు, నిరసనలకు కొత్త భాష్యం చెప్పింది. లక్షల్లో తరలివచ్చిన ప్రజానీకం.. బంగాళాఖాతం తీరాన జన సముద్రం.. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయాలు లేవు. రోడ్డెక్కి నిరసనలు లేవు.. ప్రజలకు ఇబ్బందులు, చిక్కులూ అసలే లేవు. కేవలం సత్యాగ్రహం.. కేవలం ధర్మాగ్రహం.. కేవలం ప్రజాగ్రహం.. గురి తప్పని శరాఘాతంలాజననిరసన మాత్రమే అక్కడ గోచరించింది. సాగరఘోషను మించిన నిరసన హోరు వినిపించింది. అందుకే జనదీక్ష సాగరతీరం సాక్షిగా ఘనవిజయాన్ని సాధించింది. పాలకులను, వారి అనుచరులను గజగజలాడించింది.

 
అంతులేని జలనిధి అసూయ పడింది. అంతెత్తున లేచిన జన కెరటాన్ని చూసి విస్తుబోయింది. జనసంద్రం అలజడితో చిన్నబోయింది. లక్ష గొంతులు ఒకే గళం విప్పాయి. ధరలపై నిరసన స్వరం వినిపించాయి. కన్నీళ్లను తుడిచేందుకొచ్చిన యువనేతను హత్తుకున్నాయి. కష్టాలను పంచుకోవాలి... ఆనందాలను పెంచుకోవాలి... హితులు చేయాల్సిందిదే... హితం కోరేవారు చేసేదిదే... అది మహానేత వైఎస్సార్‌కే చెల్లింది. ఆ మహానేత నిష్ర్కమణతోనే ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలమైంది. సంక్షేమం అటకెక్కింది. ధరలు పేట్రేగిపోతున్నాయి. జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి.

ఆంధ్ర రాష్ట్రం నాథుడు లేని రాజ్యమైంది. అప్పుడే యువ కిరణం కనిపించింది. నేనున్నానని భరోసా ఇచ్చింది. బతుకుపై నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడీ రాష్ట్రానికి ఏకైక ఉపశమనమైంది. ధరలపై జనదీక్షకు సిద్ధం చేసింది. ఆయనే యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డి. అశేష జనవాహిని సాక్షిగా సాగరతీరం శనివారం చిక్కిపోయింది. ధరల దరువుకు తల్లడిల్లిపోతున్న ప్రజల్ని యువనేత అనునయిస్తుంటే ఉత్సాహపడిపోయింది. చేతకాని పాలకుల నిర్వాకంపై పేలుతున్న జన శతఘు్నలకు సాక్షిగా నిలిచింది. జనదీక్ష వేదికపై జగన్నినాదం స్వార్ధ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. సాగర తీరమేనా... పాలక పీఠాలూ దద్దరిల్లాయి. క్షీరసాగర మథనంతో అమృత భాండం ఆవిర్భవించింది. ఇప్పుడు సముద్రతీరాన జగన్ చేసిన దీక్షాయజ్ఞం ఫలితమిస్తుంది. 
ఇది సామాన్యుడి నమ్మకం... కాదుకాదు అచంచల విశ్వాసం.

No comments:

Post a Comment