Tuesday, January 4, 2011

హామీల అమలెక్కడ? * విశాఖ ఓదార్పులో జగన్ ధ్వజం

* మహానేత మరణించగానే అన్నీ గాలికొదిలేశారు
* నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం
* 9 గంటల కరెంటు ఏమైంది?
* 30 కేజీల బియ్యం ఎటు పోయాయి?... ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు
* రెండో రోజు యాత్రలో విగ్రహావిష్కరణల జోరు
* యువనేతపై ఉప్పొంగిన ప్రేమాభిమానాలు.. ఘనస్వాగతం
* 11న ఢిల్లీలో దీక్ష కారణంగా ‘ఓదార్పు’ షెడ్యూలులో మార్పు
* 8 వరకు యాత్ర... సంక్రాంతి తర్వాత మిగతా కుటుంబాల పరామర్శ


  దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రస్తుత పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మంగళవారం రెండోరోజు ఓదార్పుయాత్ర సందర్భంగా రాత్రి 10 గంటల సమయంలో బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ రైతు తన సమస్యను చెప్పుకొంటూ కేకలు వేశాడు. దీనికి స్పందించిన జగన్ ‘ఏం చేద్దాం మరి? ధర్నా చేద్దామా? రండి మరి.. చలో ఢిల్లీ..’ అంటుండగా ఆ రైతు తన సమస్యను వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో జగన్ ‘రా.. ఇక్కడికి వచ్చి మైకులో చెప్పు’ అని ఆ రైతు పెంటకోట శ్రీనివాస్‌రావును కోరారు. దీంతో ఆ రైతు మైక్ తీసుకొని ‘తొమ్మిది గంటల కరెంటు ఏమైంది? కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు. చెరకు క్రషర్‌కు 10 రోజుల అనుమతి కోసం అడిగితే 3 నెలల కోసం డీడీ తీయాలని చెబుతున్నారు..’ అని బదులిచ్చాడు.
దీనికి జగన్ ప్రతిస్పందిస్తూ ‘ఆ వేళ నాకు బాగా గుర్తు. రైతులంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజుల్లో.. వారిని బతికించాలంటే ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, దాని వల్ల కొంతైనా మేలు జరుగుతుందని, రైతులు బతుకుతారని వైఎస్ భావించారు. అప్పట్లో విద్యుత్తు ఉద్యమం కూడా జరిగింది. అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతీ నాకు గుర్తుంది. అయితే ఉచిత విద్యుత్తు ఇస్తే ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని అప్పటి పాలకులు హేళన చేశారు. దాన్ని పక్కనబెట్టారు. కాదూ కుదరదన్నారు. కానీ దివంగత నేత వైఎస్ ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకమే ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దివంగత నేత రాష్ట్రానికే కాదు.. దేశానికీ చూపించారు’ అని అన్నారు.
ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు..
‘దివంగత నేత రేషన్ బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి విద్యుత్తును ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతామని చెప్పారు. అయితే రెండోసారి ప్రభుత్వాన్ని తె చ్చాక వందరోజుల్లోనే ఆయన చనిపోయారు. ఒక నాయకుడు చనిపోయాక వెంటనే ఈ పాలకులు ఆ హామీలు గాలికొదిలేశారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దగ్గర దగ్గర ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కాబోతోంది.. ఆ హామీల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు..’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మనిషంటే వైఎస్‌లా ఉండాలని చెప్పేందుకు వేరే నిదర్శనం అవసరం లేదు. మీరు చూపిస్తున్న ఆప్యాయతలే చాలు’ అని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.


పల్లెపల్లెనా పెద్దాయనే..
ఊరూరా విగ్రహం.. రాజన్నే మా దైవం
* మహానేత కుమారుడికి హారతి పట్టిన పల్లెలు

‘నాకు నాలుగు మెతుకులు నోట్లోకి పోతున్నాయంటే దానికి కారణం పెద్దాయనే. రెండ్రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు. మా ఊళ్లో ఆరుగురికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు. ముగ్గురికి గుండె ఆపరేషన్లు. ఇద్దరు పిల్లలకు చెవి ఆపరేషన్లు. పెద్దాయన లేకున్నా ఆయనను మరచిపోలేం. అందుకే ఊరంతా కలిసి విగ్రహం పెట్టుకున్నాం. ఆయనే మాకు దేవుడు. జగనే ఇప్పుడు మా నాయకుడు. పార్టీ పెడితే తిరిగి చూడక్కర్లేదు..’ ఇదీ విశాఖ జిల్లా లక్ష్మీపురంలో మజ్జి జగ్గారావు అనే వ్యవసాయ కూలీ హృదయ స్పందన. ‘ఏం పెద్దాయన.. విగ్రహం ఎవరు పెట్టారు’ అని ‘న్యూస్‌లైన్’ పలుకరిస్తే ఆయనిలా స్పందించారు.

పేదోళ్లందరికీ మంచి చేసినందుకేప్రతి ఊరికీ వైఎస్ దేవుడయ్యాడని చెప్పుకొచ్చాడు. మంగళవారం యువనేత ఓదార్పు యాత్రలో భాగంగా ముందుకు సాగుతున్నప్పుడు నాలుగైదు వందల జనాభా లేని చిన్న పల్లెల్లో సైతం మహానేత విగ్రహాన్ని ఏర్పాటుచేయడం కనిపించింది. చిన్నచిన్న పల్లెలకు ప్రభుత్వం నుంచి సాయం అందడం చాలా కష్టం. అయినా ఇలాంటి పల్లెల్లోనూ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం నుంచి సాయం లభించిందనడానికి ఊరూరా నెలకొల్పిన వైఎస్ విగ్రహాలే నిదర్శనం. కాగా యువనేత కోసం వేచి చూసిన జనంతో మంగళవారం యాత్ర సాగిన రోడ్లన్నీ కళకళలాడాయి. ‘జై జగన్’ నినాదాలు మిన్నంటాయి.

తొలిరోజు తెల్లవారుజాము వరకు యాత్ర
తొలిరోజు సోమవారం యాత్రకు జనం భారీగా పోటెత్తడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం కష్టమైంది. దీంతో షెడ్యూల్ పూర్తి చేయడం కోసం యువనేత మంగళవారం తెల్లవారుజామువరకు పర్యటించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక అడ్డూరు, నర్సాపురం, రాయువురాజుపేట, చౌడువాడ, గుల్లేపల్లి, గొండుపాలెం, కె.కోటపాడుల్లో విగ్రహావిష్కరణలు చేసిన జగన్ 3 గంటల వేళ కోటపాడులో పట్టాభిరామయ్య అనే రిటైర్డ్ ఉపాధ్యాయుని ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 9.30కే రెండోరోజు యాత్రకు బయలుదేరారు. 10 గంటలకు కోడూరు, 10.40కి కొత్తపెంట, 11.15కు వేచలం, 12.10కి లక్కవరం గ్రామాల్లో విగ్రహాలు ఆవిష్కరించారు. ఇవన్నీ చిన్న గ్రామాలే. అయినా అన్ని గ్రామాల్లో జనం విగ్రహాలు ఏర్పాటుచేశారు. జగన్ వచ్చేదాక వేచి ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తమ ఊళ్లో ఒకరాత్రి బస చేశారని.. దానికి గుర్తుగా ఇప్పుడు విగ్రహాన్ని పెట్టుకున్నామని లక్కవరం ప్రజలు చెప్పారు. వైఎస్‌ను జీవితాంతం మరిచిపోలేమని, వైఎస్ ఆనాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్లారని, మీరూ దర్శించుకోవాలని పట్టుబట్టారు. ఇక్కడే చోడవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సన్యాసిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వద్దూ.. పదవీ వద్దూ అంటూ రాజీనామా చేసేశానని, జగన్ వెంటే వస్తానని ప్రకటించారు.

వైఎస్ ఉంటే పింఛను రూ.600 అయ్యేదేమో..
లక్కవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ముందుకు సాగుతుండగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నేతృత్వంలో పలువురు నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌ను కలిశారు. అక్కడి నుంచి జుత్తాడ వెళ్లేసరికి 2 అయ్యింది. జుత్తాడలో విగ్రహావిష్కరణ చేశారు. 2.45కు గజపతినగరంలో, 3.10కి గోవాడ(అంబేరుపురం)లో విగ్రహావిష్కరణ చేశారు. అంబేరిపురంలో జగన్ మాట్లాడుతూ వైఎస్ బతికే ఉంటే తమ పింఛన్ రూ.200 నుంచి రూ.600 చేసేవారేమోనని అవ్వలూ తాతలూ అనుకుంటున్నారని చెప్పారు. 3.35కు వెంకన్నపాలెంలో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి 4.20కి చోడవరం చేరుకున్నారు.

వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు..
చోడవరంలో విగ్రహావిష్కరణ అనంతరం జగన్ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లు పావలా వడ్డీకే రుణాలు అందుకున్నప్పుడు వారి చిరునవ్వులో, పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి చదువులు చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే ఆనందంలో వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడని అన్నారు. ‘అవ్వాతాతలు నడవలేని స్థితిలోనూ ఇక్కడికి వచ్చారు.. నెల ఒకటో తేదీన వచ్చిన పింఛన్ చూసుకొని కన్నకొడుకులా మా బాగోగులు చూసుకున్నాడని ఆలోచించినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడని వారు చెబుతున్నారు. పేదవాడు అనారోగ్యానికి గురైనప్పుడు.. పెద్దాసుపత్రికి వెళ్లి అప్పుల పాలు కాకుండానే గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికివచ్చి భార్యాపిల్లలతో తన సంతోషాన్ని పంచుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. బిల్లులు కట్టే బాధలేకుండా రైతూ తన మోటారు ఆన్ చేసుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తాడు..’ అని చెప్పారు.

బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు..
చోడవరం నుంచి 5.20కి దామునాపురం చేరుకున్న యువనేత అక్కడ విగ్రహావిష్కరణ చేశాక ప్రసంగించారు. ‘నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు.. చనిపోయాక ఎందరి గుండెల్లో ఉన్నామన్నదే గొప్ప సంగతీ అని చెప్పేవారు. ఎక్కడున్నావ్ నాన్నా.. అని నేను పిలిచినా పలికే పరిస్థితిలో లేడు ఆ మహానేత. ఇంత బాధలో ఉన్నా నన్ను ఒంటరిని చేశారు. ఒంటరినై మీ ముందుకు వచ్చినా.. మేమున్నామంటూ ఆప్యాయత చూపిన మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను’ అని అన్నారు.

5.40కి లక్ష్మీపురంలో రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి తిరిగి చోడవరం మీదుగా గాంధీగ్రామ్ చేరుతుండగా మహిళలు పెద్దసంఖ్యలో హారతులు పట్టారు. రోడ్లకు ఇరువైపులా యువత ర్యాలీలుగా తరలివచ్చారు. 7.00 గంటలకు గాంధీగ్రామ్‌లో, 7.35కు చౌడుపల్లిలో విగ్రహాలు ఆవిష్కరించారు. అక్కడి నుంచి 7.50కి గౌరిపట్నం చేరుకున్నారు. ఇక్కడ కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. 9.40కు విజయరామరాజుపేటలో రెండు విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత మంగళపాలెం, కె.జగన్నాథపురం, అప్పల్రాజుపురం, ఎల్‌బీపట్నం, ఖండీవరంలలో విగ్రహావిష్కరణలు చేసి ప్రసంగించారు. ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. 12.20కు మాడుగులలో రెండు విగ్రహాల ఆవిష్కరణతో యువనేత యాత్ర పూర్తి చేసి అక్కడే బసచేశారు.

పోలవరం ఏమైంది?
‘రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ చెప్పేవారు. ఇవాళ వైఎస్ బతికి ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండేదని రైతు అనుకుంటున్నాడు. సగానికి సగం పూర్తయ్యేదని అనుకుంటూ ప్రాజెక్టు వైపు చూస్తున్నాడు. వైఎస్ బతికి ఉంటే సాగునీరు వచ్చేదని, విశాఖకు తాగునీరు వచ్చేదని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఏమైంది పోలవరం ప్రాజెక్టు అని నేను అడుగుతున్నా.. ఎందుకు మొదలవ్వలేదని నేను అడుగుతున్నా.. పోలవరం ఏమైందని రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు.. వైఎస్ బతికి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అంటున్నాడు..’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

No comments:

Post a Comment