* 2014లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాకుండా ఒంటరిదవుతుంది
* వైఎస్ హామీలు అమలు చేయని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు
* 30 కిలోల బియ్యం ఎటు పోయాయ్? 9 గంటల కరెంటు ఏమైంది?
* ఆదివాసీలకు ఒక్క ఎకరం భూమైనా పంచారా?
* ఒక్క రేషన్ కార్డయినా కొత్తగా ఇచ్చారా?
* ఒక్క కొత్త పింఛన్ అయినా మంజూరు చేశారా?
‘నన్ను ఒంటరిని చేసి పార్టీ నుంచి బయటకు పంపామని ఆనందపడుతున్నారు.. కానీ నేను ఒంటరిని కాదు.. 2014లో డిపాజిట్లు కూడా దక్కకుండా కాంగ్రెస్ పార్టీయే ఒంటరిదవుతుంది’ అని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2009 ఎన్నికల్లో రేషన్ బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని, ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచుతామని మహానేత వైఎస్ హామీ ఇచ్చారని, వాటిని ఇప్పటికీ అమలు చేయని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదని ఆయన విమర్శించారు. రాజశేఖరరెడ్డి చనిపోయాక ఒక్క కొత్త కార్డుగాని, కొత్త పింఛనుగాని ఇచ్చారా? ఒక్క ఎకరం భూమైనా పేదలకు పంచారా? అంటూ సర్కారు తీరును దుయ్యబట్టారు. బుధవారం విశాఖ జిల్లాలో మూడోరోజు ఓదార్పుయాత్ర సందర్భంగా పాడేరులో భారీ జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘నాకు బాగా గుర్తుంది. దివంగత నేత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక అంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంతోపాటు కొత్తగా అనేక పనులుచేశారు. మొన్నటి ఎన్నికల్లో రెండే మాటలు చెప్పారు. ప్రజాపంపిణీ బియ్యం 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని.. వ్యవసాయానికి మరో రెండు గంటలు పెంచి 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే మహానేతను పోగొట్టుకుంది ఈ రాష్ట్రం. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయి దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది. మరి ఈ రెండు హామీలు ఏమయ్యాయి? ఇక్కడా కాంగ్రెస్ పెద్దలే ఉన్నారు. ఢిల్లీలోనూ కాంగ్రెస్ పెద్దలే ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. మీకు ఓటేసిన ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చరా?’ అని నిలదీశారు.
ఈ ప్రభుత్వం నిద్రపోతోందా?
‘ఆ గొప్పనేత లేడన్న బాధ వినిపిస్తున్నప్పుడు.. కనిపిస్తున్నప్పుడు.. నాకూ చాలా బాధగా ఉంది. ఒంటరిని చేసి పార్టీ నుంచి పంపించేశామని వాళ్లు ఆనందపడుతున్నా.. ఇంతమంది గుండెల్లో వైఎస్ బతికే ఉన్నాడని చెబుతున్నా.. ఒంటరిని నేను కానని.. 2014లో డిపాజిట్లు కూడా కోల్పోయి కాంగ్రెస్ పార్టీనే ఒంటరిగా మిగులుతుందని చెబుతున్నా..’ అని జగన్ పేర్కొన్నారు. ‘ఆదివాసీలకు దివంగత నేత వైఎస్ లక్షా 20 వేల ఎకరాల భూమిని పంచాడని ఇప్పుడే మాజీ ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు చెబుతున్నాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలా ఒక్కచోటైనా ఎందుకు పంచలేదని అడుగుతున్నా.. ఇక్కడ ఇంకా 60 వేల ఎకరాలు పంచాల్సి ఉంది. అర్జీలు వచ్చినా దివంగత నేత చనిపోయాక ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు.. ప్రభుత్వం నిద్రపోతోందా?’ అని ఆయన ప్రశ్నించారు.
ఒక్కటైనా కొత్తగా ఇచ్చారా...?
అరకు నియోజకవర్గ పరిధిలోని హుకుంపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రసంగించారు. ‘నేను వస్తుంటే పైకప్పు లేకుండా నిర్మాణం ఆగిపోయిన ఇళ్లు కనిపించాయి. మీరే చెప్పండమ్మా... వైఎస్ చనిపోయాక బిల్లులు వస్తున్నాయా? కొత్త ఇళ్లు మంజూరవుతున్నాయా?’ అని అడిగినప్పుడు జనం లేదు లేదంటూ ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. ‘వైఎస్ చనిపోయాక కొత్త పెన్షన్లు వస్తున్నాయా? ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా? వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆదివాసీలకు లక్షా 20 వేల ఎకరాలు పంచారు. ప్రతి ఆదివాసీ కూడా చల్లగా ఉండాలని చూశారు. వైఎస్ చనిపోయాక ఈ ప్రాంతంలో కనీసం ఒక్క ఎకరా కూడా ఇచ్చారా?’ అంటూ ప్రశ్నించడంతో జనం లేదంటూ సమాధానమిచ్చారు.
No comments:
Post a Comment