Sunday, January 9, 2011

'దీక్ష'తో హస్తినకు * మన కృష్ణమ్మ మనకే...

ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయల్దేరిన జగన్
కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి అన్యాయంపై రేపు దీక్ష
రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు... నేడు మరికొంత మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి
మార్గమధ్యంలోని రైల్వే స్టేషన్లలో యువనేతకు ఘనస్వాగతం

* ప్రధాన డిమాండ్లు..
కృష్ణా నదీ జలాలను కేటాయించే విషయంలో ట్రిబ్యునల్ నీటి లభ్యతను 65 శాతంగా పరిగణనలోకి తీసుకుంది. అలా కాకుండా నదీ జలాల లభ్యతను 75 శాతంగా పరిగణనలోకి తీసుకోవాలి.
దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై పూర్తి హక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఉండాలి.
మహారాష్టల్రోని కొయినా జల విద్యుత్ కేంద్రానికి కేటాయించిన 67 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే... బదులుగా ఆ మేరకు ఉత్పత్తి అయ్యే కరెంటును ఆ రాష్ట్రానికి అందిస్తుంది.
దిగువ రాష్ట్రాల నీటి హక్కులను కాపాడేందుకు స్వతంత్ర ప్రతిపత్తిగల నదీ జలాల క్రమబద్ధీకరణ సాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. వంద టీఎంసీల సామర్థ్యం కన్నా మించిన ప్రాజెక్టులన్నింటినీ ఈ సంస్థ పరిధిలోకి తీసుకురావాలి.
పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి.

కృష్ణా జలాల పంపకం విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రానికి వినిపించేందుకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరివెళ్లారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు వెంటరాగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు యువనేత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 2,500 మంది ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఈ ప్రత్యేక రైలు 2.55 గంటలకు జనం జేజేల మధ్య హస్తినకు బయల్దేరింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జగన్ ఒకరోజు దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.

తరలివచ్చిన నేతలు..

వారం రోజుల పాటు విశాఖపట్టణం జిల్లాలో ఓదార్పు యాత్రలో పాల్గొన్న జగన్ ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్నారు. అనంతరం తన నివాసంలో పలువురు నేతలతో సమావేశమై రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. జగన్‌తో పాటు రైలులో ఎమ్మెల్యేలు టి.బాలరాజు, కె.శ్రీనివాసులు, కుంజా సత్యవతి, రేగ కాంతారావు, బి.గురునాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, పుల్లా పద్మావతి తదితరులు బయలుదేరి వెళ్ళారు. మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఇక్కడినుండి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు.

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మేకా ప్రతాప అప్పారావు, ఎడ్మ కృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, జంగా కృష్ణమూర్తి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, గండి బాబ్జీ, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, లోకనాథం రాయుడు, జొన్నా సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఎంఏ రెహ్మాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగు నాగార్జున, కడప మాజీ మేయర్ పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డిలతో సహా పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, డెయిరీ డెరైక్టర్లు రైలులో ఉన్నారు.

రైల్వేస్టేషన్‌కు భారీ ఎత్తున తరలిరావటంతో రైలు గంటన్నర ఆలస్యంగా కదిలింది. జగన్ దీక్షకు బయలుదేరుతున్నారనే విషయం తెలుసుకున్న సాధారణ ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచే పదో నెంబరు ప్లాట్‌ఫాంపై వేచి ఉన్నారు. ఆయనకు మద్దతు తెలిపి వీడ్కోలు పలుకుదామనే ఉద్దేశంతో చేరుకున్న వారు రైలు బయలుదేరే వరకూ అక్కడే ఉండి, జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు జగన్‌కు రైల్వేస్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. ‘కృష్ణా జలాలు -మన హక్కు... రాష్ట్రం ఎడారి కాకుండా కాపాడుకుందాం... జగనన్న జిందాబాద్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మార్గమధ్యంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ నాయకులు తమ జిల్లాల్లోని కాజీపేట, రామగుండం, కాగజ్‌నగర్ స్టేషన్లలో రెలైక్కారు. ప్రతి స్టేషన్‌లోనూ అభిమానులు, నాయకులు పెద్దసంఖ్యలో హాజరై జగన్‌కు స్వాగతం పలికారు. ప్రతిచోటా యువనేతపై అభిమానం చాటుతూ నినాదాలు చేశారు. రైలులో కేవలం 1,200 మంది ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించగా అనేక ప్రాంతాల నుండి తరలివచ్చిన నాయకులు తాము ఎలాగైనా దీక్షకు హాజరు కావల్సిందే నంటూ రెలైక్కారు. ఒక్కో బోగీలో సీట్లమేరకు పరిమిత సంఖ్యలో రావాలని కోరినప్పటికీ తాము సర్దుబాటు చేసుకుంటామంటూ రెలైక్కారు.

ఈ రకంగా మొత్తం మీద 2,500కు మించి ప్రతినిధులు రైలులో బయలుదేరారు. జగన్ రైలు వద్దకు వచ్చేసరికి ఆయనను చూడటానికీ, కరచాలనం చేయడానికీ ఎగబడ్డారు. దీంతో బోగీ వద్దకు చేరుకోవడానికి ఆయన కష్టపడాల్సి వచ్చింది. రైలు ఎక్కగానే జగన్ శాంతికి చిహ్నంగా పావురాన్ని గాల్లోకి ఎగరేశారు. వీడ్కోలు పలకడానికి వచ్చిన వారిలో గట్టు రామచంద్రరావు, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్ రెడ్డి, వైఎస్‌ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రాజగోపాల్, ఉపాధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ తదితరులున్నారు. రైలులో చోటు లేకపోవడంతో చాలామంది ప్రతినిధులు, అభిమానులు జగన్‌కు వీడ్కోలు పలికి వెనుదిరిగారు.

ప్రత్యేక టీషర్టులు..

11న జగన్ దీక్షను పురస్కరించుకుని వైఎస్‌ఆర్ సేవాదళ్ ప్రతినిధి బృందం ఢిల్లీ బయల్దేరింది. బృందంలోని వారంతా చూపరులను ఆకట్టుకునే రీతిలో ప్రత్యేక టీషర్టులను ధరించారు. వాటిపై ‘జనం కోసం.. జలం కోసం.. జగన్ దీక్ష’ అని ప్రింట్ చేయించారు. జగన్ లక్ష్యాన్ని చాటి చేప్పే విధంగా రూపొందించిన ఈ టీ షర్టులు రైల్వే ప్రయాణికులను విశేషంగా ఆకర్షించాయి.

అడుగడుగునా ఘన స్వాగతం..

ఆదివారం ఉదయం హైదరాబాద్ బయల్దేరేందుకు విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్‌కు ఎంపీ సబ్బం హరి, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, మిలట్రీ నాయుడు, గండి బాబ్జీ, ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి, పీసీసీ కార్యదర్శి పీలా ఉమారాణి, పలువురు కార్పొరేటర్లు వీడ్కోలు పలికారు.

స్టేషన్లలో పోటెత్తిన జనం..

ప్రత్యేక రైలులో ఢిల్లీ బయల్దేరిన జగన్‌ను చూసేందుకు మార్గమధ్యంలోని రైల్వే స్టేషన్లకు జనం పోటెత్తారు. సాయంత్రం 4.56 గంటలకు వరంగల్ జిల్లా కాజీపేటకు రైలు చేరుకోగానే పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు.. ‘‘జగనన్నా.. జిందాబాద్..’’ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సివిల్, ఆర్ఫీఎఫ్, జీఆర్‌పీ పోలీస్ బలగాలు, రోప్ స్క్వాడ్ టీం స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో కూడా జగన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 6.20 గంటలకు రైలు స్టేషన్‌కు రాగానే.. జగన్ రైలు కిటికీ వద్ద నిల్చుని.. అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్...జై తెలంగాణ నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా హోరెత్తింది.







 
జగన్ దీక్షకు మద్దతిస్తా

అవసరమైతే సోనియా ఇంటి ముందు మేం కూడా ధర్నా చేస్తాం: 
ఎంపీ సబ్బం హరి
ఈ నెల 11న యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టనున్న నిరసన దీక్షకు మద్దతిస్తున్నట్టు ఎంపీ సబ్బం హరి స్పష్టం చేశారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం రాష్ట్ర ప్రయోజనం కోసమే ఆయన దీక్ష చేస్తున్నారని తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే తాము కూడా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడానికే జగన్ దీక్షా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.

అక్రమంగా కట్టిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతానికి మిగులు జలాలు రావని, ఇది అన్యాయమని చెప్పేందుకే జగన్ దీక్షకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఈ దీక్షను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఓదార్పు యాత్రపై ప్రశ్నించగా... ఎంత విజయవంతంగా జరుగుతుందో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని, జగన్ చేసే యాత్రలు, దీక్షల్లో జనం స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. జగన్ చేపట్టే యాత్రకు ఎవరినీ ప్రత్యేకంగా రమ్మని పిలిచిన సందర్భాలు లేవని, అయితే యాత్రలో పాల్గొనవద్దంటూ మాత్రం ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. జగన్ వెంట రావాలని ఉన్నా ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో సతమతమవుతున్నామని చాలామంది ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు.

  

No comments:

Post a Comment