Saturday, January 8, 2011

దీక్ష కోసం నేడు ఢిల్లీకి జగన్ * నేటి మధ్యాహ్నం 1.30కి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు

రైలులో జగన్‌తో పాటు 1,500 మంది వెళ్లేందుకు అవకాశం
దీక్షకు వచ్చేవాళ్లు స్వెట్టర్లు,రగ్గులు తెచ్చుకోవాలి: అంబటి


కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ తీర్పు ఫలితంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్న విషయాన్ని, ప్రజల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటానికి ఈ నెల 11వ తేదీన యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టనున్న నిరశన దీక్షకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జగన్‌తో సహా ఆయన మద్దతుదారులు, అనుచరులు ఢిల్లీ వెళ్లటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు 9వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు సికిందరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. దీక్షలో పాల్గొనటానికి వచ్చే వారు స్టేషన్‌కు 12.30 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక రైలులో 1,500 మంది ఢిల్లీ వెళ్లటానికి అవకాశం ఉంటుంది. ఆయా జిల్లాల వారీగా ఎంపిక చేసిన వారి జాబితాలను ఇప్పటికే బాధ్యులకు పంపినట్లు ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు తెలిపారు.

చాలా మంది ప్రత్యేక రైలుతో నిమిత్తం లేకుండా సొంతంగా 11వ తేదీ ఉదయానికి ఢిల్లీకి చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఎక్కువ మంది రావాలని ఆసక్తి చూపుతున్నా అందరినీ తీసుకువెళ్లటం సాధ్యం కానందుకు అన్యధా భావించవద్దని, అపార్థం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో చలిగాలులు తీవ్ర స్థాయిలో ఉన్నందున రైలులో వచ్చే వారు మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, మఫ్లర్లు, రగ్గులు తప్పకుండా తమ వెంట తెచ్చుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు. రైలులో జగన్ కూడా పయనిస్తారనీ ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై అంబటి ధ్వజం
ఢిల్లీలో దీక్ష బలప్రదర్శన కాదు.. కృష్ణా డెల్టా రైతాంగం కోసం చేస్తున్న దీక్ష
పట్టు జారిపోతోందనే ఆందోళనతో డీఎల్ మానసిక స్థితి దెబ్బతిన్నట్లుంది
ఆయనే రాజీనామా చేసి.. వైఎస్ ఫొటో లేకుండా మళ్లీ గెలిచి చూపాలి


రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యలను పరిష్కరించకుండా.. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లేవారిని నిరోధించటమే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు విమర్శించారు. ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులనూ జగన్ వద్దకు పోకుండా నిరోధించటానికి ప్రయత్నించటం కాంగ్రెస్ అధిష్టానానికీ, ముఖ్యమంత్రికీ కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ఆయన శనివారం సాయంత్రం సాగర్ సొసైటీలోని జగన్ క్యాంపు కార్యాలయంలో శాప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లకుండా ఎమ్మెల్యేలను నిరోధించాలని చూశారు.

అధిష్టానం కూడా వారిని పిలిచి వెళ్లొద్దని చెప్పింది. ఇపుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఎమ్మెల్యేలను జగన్ వద్దకు వెళ్లొద్దని ఒత్తిడి చేయటం, బ్లాక్‌మెయిల్ చేయటం, ప్రలోభ పెట్టటం వారికి మామూలే. వారెన్ని చేస్తున్నా జగన్ వద్దకు వచ్చే వాళ్లు వస్తూనే ఉంటారు’’ అని అంబటి స్పష్టంచేశారు. తాను చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని జగనే ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారని వస్తున్న వ్యాఖ్యలను ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘అసలు జగన్ ఎందుకు ఒత్తిడి చేస్తారు? తన వద్ద ఏం అధికారం ఉందని వారిని ఒత్తిడి చేస్తారు? ఓ వైపు ముఖ్యమంత్రే ఒత్తిడి చేస్తున్నారని మీరే చెబుతూ మళ్లీ జగన్‌కు ఆపాదించటం ఏమిటి? అయినా ఎవరు ఒత్తిడి చేస్తున్నారనేది ప్రజలు కూడా చూస్తున్నారు.. వారికి బాగా తెలుసు’’ అని అంబటి సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో జగన్ చేయనున్న దీక్ష బలప్రదర్శన కానే కాదని, అది కృష్ణా డెల్టా రైతాంగం సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దీక్ష అని రాంబాబు స్పష్టం చేశారు.

డీఎల్‌ను చూస్తే జాలేస్తోంది...

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే జాలేస్తుందని అంబటి ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో (2009) మైదుకూరు నియోజకవర్గంలో ఆయనతో పోటీపడి 4,360 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి ఇపుడు జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారని, దీంతో తన పట్టు సడలి పోతోందే అన్న ఆందోళనతో డీఎల్ మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లుగా ఉందనీ అంబటి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో డీఎల్‌ను దగ్గరుండి గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ జగన్ వెంట వెళ్లిపోవటాన్ని ఆరోగ్య మంత్రి సహించలేక సంయమనం కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ లోక్‌సభకు పోటీ చేసి, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి గట్టిగా మద్దతు నిచ్చినపుడే డీఎల్ మైదుకూరు నియోజకవర్గంలో 4,360 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారని ఆయన గుర్తు చేశారు. రాజీనామాలు చేయాల్సిందిగా కడప ఎమ్మెల్యేలను సవాల్ చేసే బదులు.. డీఎల్ తానే పదవికి రాజీనామా చేసి మైదుకూరులో వైఎస్ బొమ్మ లేకుండా తనకు నచ్చిన బొమ్మ పెట్టుకుని గెలుపొందాలని అంబటి సవాల్ చేశారు. అయినా తాను డీఎల్‌ను రాజీనామా చేయాల్సిందిగా కోరననీ, కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో జగన్ విజయం తరువాత నైతిక బాధ్యత వహించి ఆయనే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఆ పాపం మేం మూటగట్టుకోం...


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టే ప్రసక్తే లేదనీ, ఆ పాపం జగన్ ఎంత మాత్రం మూటగట్టుకోబోరని రాంబాబు తేల్చి చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను పక్కకు లాగి ప్రభుత్వాన్ని పడగొట్టటం అనైతికమైన చర్యగా భావిస్తున్నామని, సీఎం కావటం కోసం ప్రభుత్వం పడగొట్టారనే అపఖ్యాతి జగన్ తెచ్చుకోరని ఆయన స్పష్టంచేశారు. మూడేళ్ల తరువాత జరిగే ప్రజా పోరులోనే పోరాడి తేల్చుకోవటానికి తమ నాయకుడు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌సీ కమిషన్ మాజీ సభ్యుడు మేరుగ నాగార్జున, పీసీసీ ఎస్‌సీ సెల్ మాజీ కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


శక్తిమంతమైన నాయకుడు జగన్: జూపూడి
యువనేత వైఎస్ జగన్‌ను శక్తిమంతమైన నాయకుడిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. శనివారం ఆయన జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ యువనేత పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకనే కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడన్నారు. ఇలా కామెంట్లు ఎక్కువైన కొద్దీ జగన్ పార్టీకి వలసలు పెరుగుతూనే ఉంటాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కొంత మంది కాంగ్రెస్ నేతలు జగన్‌పై వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. ఢిల్లీలో 11న తలపెట్టిన జల దీక్ష రైతు ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు.

ఢిల్లీ దీక్షకు హాజరవుతా: పీఆర్‌పీ ఎమ్మెల్యే శోభా
యువనేత జగన్ ఈ నెల 11న ఢిల్లీలో చేపడుతున్న దీక్షకు తాను కూడా హాజరవుతున్నట్లు పీఆర్‌పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తెలిపారు. శనగ పంట నష్టంతో దెబ్బతిన్న రైతులకు శనివారం ఆమె ఆర్థిక సహాయం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా మిగులు జలాలు వాడుకునే హక్కు సీమకే ఉందన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడంతోనే ప్రస్తుతం పంట పొలాలు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేయాలని భావించామన్నారు.

ఆయన మరణానంతరం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకునే స్థితిలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ పీఆర్పీ నాయకులు రామిరెడ్డి, ఎంపీపీ నాగమ్మ, సర్పంచ్ అన్సర్‌బాషా, జెడ్పీటీసీ సభ్యుడు రామసుబ్బయ్య, మాజీ ఎంపీపీ రఘునాథరెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, పీఆర్పీ నాయకులు పుల్లయ్య, ఖాదర్‌బాషా, జమాల్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment