Tuesday, January 11, 2011

జలం కోసం జగన దీక్ష



కృష్ణా జలాల్లో న్యాయం కోసం నేడు ఢిల్లీలో యువనేత నిరశన

డిమాండ్: కృష్ణా జలాల పంపకంలో న్యాయం జరగాలని...

వేదిక: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దనున్న పార్లమెంటు వీధి

సమయం: నేటి ఉదయం 10గంటలకు ప్రారంభం


ఎవరెవరు: జగన్‌తోపాటు రైతులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

జలదీక్షలో జగన్ ప్రధాన డిమాండ్లివీ...

+ ఆలమట్టి ప్రాజెక్టును ప్రస్తుత ఎత్తుకే పరిమితం చేయాలి. పెంపునకు అనుమతించవద్దు.
+ కృష్ణా మిగులు జలాలు వాడుకునే పూర్తి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు కల్పించాలి.
+ నదీ జలాలకు సంబంధించి డిపెండబులిటీ లెక్కలపై బచావత్ ట్రిబ్యునల్ తీసుకున్న 75 శాతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి.
+ మహారాష్టల్రోని కోయినా విద్యుత్ ప్లాంటు కోసం ఉపయోగించిన నీటిని అరేబియాలోకి వృథాగా పోనీకుండా, ఆ నీటిని దిగువ రాష్ట్రాల వైపు మళ్లించాలి.
+ ఎగువ రాష్ట్రాల్లోని 100 టీఎంసీల సామర్థ్యం దాటిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను క్వాసీ జుడీషియల్ అధికారాలున్న ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీలకు అప్పగించాలి.
+ ఈ అథారిటీ 15 రోజులకొకసారి రాష్ట్రాల కేటాయింపులకు అనుగుణంగా తగిన దామాషాలో నీటిని విడుదల చేయాలి.
+ కృష్ణా జలాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ట్రిబ్యునల్‌కు అప్పీల్‌కు వెళ్లాలి. విచారణల్లో కేంద్రమూ ఇంప్లీడ్ కావాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే కార్యాచరణ చేపట్టాలి.
+ పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టులకు వెంటనే జాతీయ హోదా కల్పించి, సరిపడా నిధులు కేటాయించి.. వాటి నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి.


కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టనున్న 24 గంటల ‘జలదీక్ష’కు రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా.. ‘జనం కోసం.. జలం కోసం..’ అని నినదిస్తూ జగన్ చేపట్టనున్న ఈ నిరశన దీక్షకు.. పార్లమెంటు సమీపంలోని జంతర్‌మంతర్ (పార్లమెంటు వీధి) వేదిక కానుంది. జగన్‌తో పాటు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మద్దతుదారులు దాదాపు 2,000 మందితో ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు మంగళవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు జంతర్‌మంతర్ సమీపంలో జగన్, రాష్ట్రం నుంచి వచ్చిన రైతులు దీక్ష ప్రారంభిస్తారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాకుండా సొంతంగా బయలుదేరిన ప్రజా ప్రతినిధులు, రైతులు, జగన్ మద్దతుదారులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, రైతుల ఆందోళనను చాటిచెప్పటానికి జగన్‌కు మద్దతుగా దీక్షలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్‌పీ చైర్మన్లు, జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు ఢిల్లీకి తరలివచ్చారు.

నేరుగా కేంద్రానికి తెలియజేయటం కోసమే..

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు, రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదనే భయాందోళనను, ఆవేదనను కేంద్రానికి తెలియచేయటానికి జగన్ ఈ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష ఏ రాష్ట్రానికో, ఏ ప్రాంత ప్రజలకో వ్యతిరేకం కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ చేపడుతున్న దీక్ష అని ఆయన మద్దతుదారులు స్పష్టంచేశారు. ఈ దీక్షను ఢిల్లీలో చేపట్టటానికి కారణం.. రాష్ట్ర ప్రజలు, రైతాంగం ఆందోళనను నేరుగా ఢిల్లీలోని కేంద్ర సర్కారుకు, దేశ ప్రజలందరికీ గట్టిగా తెలియజేయాలన్న ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు లక్షలాది మంది రైతాంగం తీవ్రంగా నష్టపోతే.. ఆదుకోవాలని కోరుతూ లక్షల మంది రైతాంగం కొద్ది రోజుల కిందట విజయవాడలో లక్ష్య దీక్ష పేరుతో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించను కూడా లేదని గుర్తుచేశారు. ‘అందుకే ఈసారి ఏకంగా ఢిల్లీలోనే మా ఆందోళనను తెలియజేయాలని ఈ దీక్ష చేస్తున్నాం’ అని దీక్షలో పాల్గొంటున్న పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు.

తక్షణం అప్పీలుకు వెళ్లాలి...

జలదీక్ష డిమాండ్ల గురించి వివరిస్తూ.. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాలను వారు వివరించారు...

- కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలి. ఏయే అంశాల్లో మనకు నష్టం వాటిల్లుతుందో వాటిపై మన వాదనలు పక్కాగా ఉండేలా జాగ్రత్తపడాలి. మనకు జరగబోయే నష్టాన్ని స్పష్టంగా, సమర్థంగా వివరించాలి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ వాదనల్లో ఇంప్లీడ్ కావాలి. అసలు నీటిలభ్యత లెక్కించటానికి ఎన్ని సంవత్సరాల రికార్డులు తీసుకోవాలి, ఎంత డిపెండబులిటీ శాతాన్ని లెక్కించాలి, మిగులు జలాల్ని ఏం చేయాలి.. వంటి విషయాల్లో ఇప్పటికే జాతీయ స్థాయిలో నిర్దుష్టంగా మార్గదర్శకాలు ఉన్నట్లయితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తనకు తోచిన ప్రాతిపదికలను తీసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా రావటానికి కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే. ఇకనైనా జాతీయ స్థాయిలో వీటికి ఒక నిర్దుష్ట విధానం రూపొందించి, వాటిని ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపించాలి.
- కావేరీ ట్రిబ్యునల్ 50 శాతం డిపెండబులిటీ లెక్కలను, పాత కృష్ణా ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ కొత్త ట్రిబ్యునల్ ఎటూకాకుండా 65 శాతం డిపెండబులిటీ లెక్కలు తీసుకుంది. పాత ట్రిబ్యునల్ 78 సంవత్సరాల నీటి ప్రవాహ లెక్కలు తీసుకుంటే.. మనం 112 ఏళ్ల లెక్కలు కూడా ఇస్తామంటే... కొత్త ట్రిబ్యునల్ విచిత్రంగా 47 సంవత్సరాల లెక్కలు తీసుకుంది.

- కరువు, వరద సంవత్సరాల్లో అవస్థలు పడే దిగువ రాష్ట్రాలకే మిగులు జలాల వినియోగం స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉండగా.. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వాటినీ ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. గతంలో మిగులు జలాలు పంపిణీ చేసిన కావేరీ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లటానికి దిగువ రాష్ట్రాల అభ్యంతరాలే కారణం. ఇప్పటికే తీవ్ర వివాదానికి దారితీసిన ఆ ప్రాతిపదికను.. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకున్న తీరు విస్మయకరంగా ఉంది.

- మహారాష్ట్ర తమ కోయినా జలవిద్యుదుత్పత్తి ప్లాంటు నుంచి ఇప్పటికే 67 టీఎంసీల నీటిని వృథాగా అరేబియా సముద్రంలోకి వదిలేస్తోంది. కరెంటును ఉత్పత్తి చేయగలం కానీ నీటిని ఉత్పత్తి చేయలేం. అవసరమైతే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కలిసి కొంత కరెంటును ఇస్తాయనీ, ఆ నీటిని దిగువ రాష్ట్రాల వైపు మళ్లించాలని మనం వాదించినా వినకుండా.. ట్రిబ్యునల్ కోయినా ప్లాంటుకు మరో 25 టీఎంసీల నీరు అదనంగా కేటాయించటం చిత్రంగా ఉంది.

- దిగువ రాష్ట్రాలకు సక్రమంగా నీరు విడుదల చేసేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండటానికి ఒక కొత్త పద్ధతిని అత్యవసరంగా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఎగువ రాష్ట్రాల్లో 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం దాటిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ‘రివర్ రెగ్యులేటరీ అథారిటీ’ లకు సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులను అధ్యక్షులుగా నియమించాలి. వాటికి పాక్షిక న్యాయ (క్వాసీ-జుడీషియల్) అధికారాలను కల్పించాలి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో వీటి పనితీరు, బాధ్యతలు, అధికారాలు ఉండాలి. ప్రతి 15 రోజులకొకసారి ఈ అథారిటీ సమావేశమై నీటికేటాయింపులను.. తగిన దామాషాలో విడుదల చేయాలి.

నాటి చంద్రబాబు పాపాలే మనకు శాపాలు...

నిజానికి చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టులను నిర్మించలేదు కాబట్టే మనకు ఈ తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. పాత ట్రిబ్యునల్ నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా, కేసీ కెనాల్‌లను దృష్టిలో పెట్టుకుని వాటికి నీటి రక్షణ కల్పిస్తూ 750 టీఎంసీలు కేటాయించింది. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకూ నీటినిచ్చింది. ప్రస్తుత ట్రిబ్యునల్ కూడా దాదాపు పూర్తికావచ్చిన తెలుగుగంగకు 25 టీఎంసీలు ఇచ్చింది. చంద్రబాబు గనుక మన పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి ఉంటే, వాటన్నింటికీ ఈ ట్రిబ్యునల్ నీటిరక్షణ కల్పించేది. కర్ణాటక ఆలమట్టి ప్రాజెక్టును కట్టినప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నిద్రపోయాడు కాబట్టే అప్పటి ప్రధాని దేవెగౌడ వేగంగా ఆలమట్టి నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. తను ప్రాజెక్టులు కట్టలేని నిర్వాకం ఒక పాపం కాగా, కర్ణాటక కడుతుంటే అడ్డుకోలేకపోవటం మరో పాపం.. అలా చంద్రబాబు పాపాలు ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయి.

మన రాష్ట్రంలోని హంద్రీనీవా, గాలేరు - నగరి, కల్వకుర్తి, తెలుగుగంగ, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, వెలిగొండ ప్రాజెక్టులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులని ముద్ర వేసి వాటిని నిలిపివేయించే ప్రయత్నం చేసింది. దాన్ని నివారించి, ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం కావటానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ ప్రాజెక్టులను రాష్ట్రం సొంత రిస్కుతో నిర్మిస్తోందనీ, వాటికి నీటి హక్కు డిమాండ్ చేయబోమనీ ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వాల్సి వచ్చింది.


సాగునీటి కల్పనలో చంద్రబాబు హయాంలో జరిగిన తీవ్ర నష్టాన్ని పూడ్చేందుకు దివంగత నేత వైఎస్ ఏకంగా కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. కానీ ఆయన మరణానంతరం ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల విషయంలో నాటి చంద్రబాబు అడుగుజాడల్లోనే పయనిస్తోంది. ప్రత్యేకించి పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. వీటన్నింటికీ వెంటనే జాతీయ హోదాలు ప్రకటించాలి. నిర్ణీత గడువులో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేలా నిధులివ్వాలి. దీనికి ప్రధాని స్వయంగా జవాబు చెప్పాలి. 
 
లాభాలకు సై.. నష్టాలకు నై!
 కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో ఎగువ రాష్ట్రాలకే లాభం
నీరు వచ్చినప్పుడు వాటాలు తీసుకుని.. రానప్పుడు చేతులెత్తేస్తాయి
నదిలో ఎక్కువ నీరు ఉందంటూ పంపిణీ చేసిన ట్రిబ్యునల్

 లాభాల్లో పక్క రాష్ట్రాలకూ వాటా పంచిన కృష్ణా ట్రిబ్యునల్.. నష్టాలను మాత్రం మనపైనే నెట్టేసింది! నదిలో ఎక్కువ నీరు ఉందని ఎగువ రాష్ట్రాలకు కోటా పెంచిన ట్రిబ్యునల్.. కొరత సమయాల్లో నష్టం వాటిల్లితే దాన్ని భరించే విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది! 3 రాష్ట్రాలకు సరిపోయేలా నీరు వస్తే మంచిదే . కానీ వర్షాభావంతో నదిలో నీటి లభ్యత తగ్గితే జరిగే నష్టాన్ని మాత్రం మన రాష్టమ్రే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు లేని సమయాల్లో నీటి కొరతలో కూడా ఎగువ రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలన్న మన అధికారుల వాదనను తోసిపుచ్చింది. దీంతో వర్షాలు రాక నీరు తగ్గితే రాష్ట్రం ఎడారి అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఎగువ రాష్ట్రాలకు కళ్లెం ఎక్కడ?

బచావత్ అవార్డు (ట్రిబ్యునల్-1) ప్రకారం కృష్ణాలో నికర జలాలు 2,130 టీఎంసీలు మాత్రమే. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేసుకుని ఈ నీటిని అంచనా వేశారు. అయితే... బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం నీటి లభ్యతను 65 శాతానికి కుదించి 2,293 టీఎంసీల నికర జలాలు ఉన్నట్టు తేల్చింది. అలాగే మరో 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు అంచనాకు వచ్చింది. మొత్తం నికర, మిగులు జలాలు 2,578 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అంటే నదిలోకి వచ్చే నీటినంతటిని పంచేసినట్టే! ఈ నీటి విడుదలకు సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది. ఈ బోర్డులో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్ర స్థాయి అధికారులు కూడా సభ్యులుగా ఉండాలని తెలిపింది. పది రోజుల వర్కింగ్ షీట్స్‌ను రూపొందించి ఆ మేర నీటిని విడుదల చేయాలని సూచించారు. అయితే బోర్డు పనితీరులో కానీ, ఎగువ రాష్ట్రాలు పాటించాల్సిన సూచనల విషయంలోగానీ, నీటి కొరతను పంచుకునే అంశంలోకానీ ట్రిబ్యునల్ ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు. నదిలోకి వచ్చే నీటిని ఎగువ రాష్ట్రాలు తమ నికర జలాలుగా అక్కడే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. దాంతో దిగువ ప్రాంతమైన మన రాష్ట్రానికి నీటి రాక తగ్గిపోతుంది. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని నమోదు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

వారికైతే ప్రాజెక్టుల వారీగా కేటాయింపు..

నిర్మాణంలో ఉన్న మన ప్రాజెక్టులను పట్టించుకోని కృష్ణా ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు మాత్రం ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించింది. మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ వంటి ఏ ప్రాజెక్టుకు నీటిని కేటాయించ లేదు. అదే కర్ణాటకకు మాత్రం అప్పర్ తుంగకు 12 టీఎంసీలు, అప్పర్ భద్రకు 10 టీఎంసీలు, సింగత్లూర్ లిప్టుకు 18 టీఎంసీల చొప్పున కేటాయించింది. అలాగే మహారాష్టక్రు చెందిన కొయినా జల విద్యుత్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఉన్న 67 టీఎంసీలకు అదనంగా మరో 25 టీఎంసీల నీటిని కేటాయించింది. మన రాష్ర్టంలో కేవలం తెలుగుగంగ, జూరాలకు మాత్ర మే 25 టీఎంసీలు, 9 టీఎంసీల చొప్పున కేటాయింపులను చేశారు.

మొదటి తీర్పును మార్చొద్దని చట్టం చెబుతున్నా...

ఒక నదిపై ట్రిబ్యునల్ తీర్పు చెప్పిన తర్వాత, అదే నదిపై కొనసాగింపుగా రెండో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినప్పుడు మొదటి తీర్పును మార్చడానికి వీలు లేదు. అంతర్రాష్ట్ర జలవివాద చట్టం-2002 ఇదే విషయాన్ని చెపుతోంది. అయితే... బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మొదటి ట్రిబ్యునల్‌లోని పలు అంశాలను సవరించింది. నదిలోని నీటిని అంచనా వేయడం కోసం మొదటి ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ప్రమాణికంగా తీసుకుంటే.. ఇప్పటి ట్రిబ్యునల్ మాత్రం దాన్ని 65 శాతంగా పరిగణనలోకి తీసుకుంది. అలాగే మిగులు జలాలను పంచకూడదని మొదటి ట్రిబ్యునల్ తీర్పు. దీనిపై కూడా ప్రస్తుత ట్రిబ్యునల్ భిన్నమైన వైఖరి అవలంబించింది. మిగులు జలాలను గుర్తించడమే కాకుండా ఎగువ రాష్ట్రాలకు పంచేసింది.
 
అడుగడుగునా సైంధవులు!  అరచేతిని అడ్డుపెట్టి...
 
జగన్ జలదీక్షను నిలువరించేందుకు కాంగ్రెస్ పెద్దల విశ్వప్రయత్నం
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపకపోగా.. అడుగడుగునా అడ్డంకులు
దీక్షలో పాల్గొనవద్దంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు
కొద్దిరోజులుగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలు
మీ నియోజకవర్గాల్లో పనులన్నీ చేసేస్తామంటూ బుజ్జగింపులు...
ఢిల్లీ వెళ్తే అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని బెదిరింపులు
స్వయంగా రంగంలోకి దిగిన సీఎం, పీసీసీ చీఫ్

 కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగే తీవ్ర అన్యాయంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో తలపెట్టిన జలదీక్షలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎవరూ పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. జలదీక్షలో పాల్గొనడానికి సిద్ధమైన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తూ.. ఢిల్లీకి వెళ్లకుండా వారిని అడ్డుకుంటున్నారు. గత వారంరోజులుగా కాంగ్రెస్ ముఖ్యులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తీరని నష్టంతోపాటు డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దీనిపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రభుత్వం సమైక్యంగా పోరాటం చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అసలు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిపై జగన్ చేపట్టిన దీక్షకు సంపూర్ణ సహకారం అందించి, ఆయన పోరాటంలో భాగస్వామ్యం కావాలని కొందరు ఎమ్మెల్యేలు సిద్ధపడగా గత కొద్దిరోజులుగా వారితో ప్రత్యేక భేటీలు జరుపుతూ ఢిల్లీ వెళ్లకుండా శతవిధాలా ఒత్తిడి తెస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మరోవైపు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లతో పాటు పలువురు మంత్రులు ఇదే పనిలోనే నిమగ్నమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ ఆదేశాల మేరకే వీరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు.

కర్ణాటకకు చెందిన మొయిలీ ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పును ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొయిలీ కర్ణాటక ప్రయోజనాల దృష్టితో వ్యవహరిస్తుంటే.. ఆయన ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోనన్న భయంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ట్రిబ్యునల్ అన్యాయంపై నోరు మెదపడం లేద న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మొయిలీ స్వయంగా చెప్పిన కారణంగానే ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. జగన్ తలపెట్టిన యాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనకుండా, ఎలాగైనా కట్టడి చేయాలన్న ఆదేశాలు ఉండడంతో.. గత కొద్దిరోజులుగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర నాయకులు వేరువేరుగా పిలిపించి సమావేశాలు నిర్వహించారు.

గాంధీభవన్‌లో డీఎస్ ప్రత్యక్షం!

కేంద్ర మంత్రి చిదంబరం ఈ నెల 5న 8 రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతం చేసిన రోజు నుంచి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గాంధీభవన్‌లో అడుగుపెట్టలేదు. మంగళవారం జగన్ దీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం గాంధీభవన్‌కు వచ్చారు. జగన్ వెంట వెళ్లే వారి పట్ల అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని, ఇది అధిష్టానం మాట అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజులుగా కనిపించని డీఎస్ ఒక్కసారిగా సోమవారం రావడం, వచ్చీ రావడంతో జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని కోస్తా నాయకుడొకరు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పట్నుంచీ.. జగన్‌కు మద్దతుగా నిలుస్తారని అనుమానమున్న ఎమ్మెల్యేలందరినీ పిలిచి బుజ్జగిస్తున్నారు. మీ నియోజకవర్గంలో పనులేవైనా పెండింగ్‌లో ఉంటే వెంటనే చేస్తామని ఆశ చూపుతున్నారు.

మంత్రివర్గ సమావేశంలోనూ జగన్ యాత్రపై చర్చించడమే కాకుండా, యాత్రకు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎవరూ వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులను పురమాయించారు. దాంతో ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు అదే పనిగా ఎమ్మెల్యేలను పిలిపించుకుని ప్రత్యేకంగా ఒకటికి రెండుసార్లు మాట్లాడి, తర్వాత సీఎంతో భేటీ ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను సీఎం వద్దకు తీసుకెళ్లారు. నిజానికి జగన్ చేపట్టిన దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భావన జిల్లాల ప్రజాప్రతినిధుల్లో ఉంది. ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ముఖ్యమంత్రికి కనీసం సమీక్షా సమావేశం నిర్వహించేంత సమయం కూడా లేదా అని విపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదన్న భావన ప్రజల్లో బలంగా ఉందని, అందుకే జగన్‌కు మద్దతు ఇవ్వాలని సంకల్పించానని కోస్తాకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు. అయితే తనపై అనేక రకాల ఒత్తిళ్లు చేసి, ఢిల్లీ వెళ్లకుండా చేస్తున్నారని ఆయన వాపోయారు.

విశాఖలో ప్రకటన చేసినప్పట్నుంచీ..

జగన్ దీక్ష చేస్తానని విశాఖపట్నం జిల్లా ఓదార్పుయాత్రలో ప్రకటించిన రోజు నుంచి రాష్ట్ర పార్టీ నాయకులు కొందరు మిగతా సమస్యలన్నీ వదిలేసి ఈ అంశంపైనే దృష్టి సారించారు. కొందరు ఎమ్మెల్యేలకు మంత్రులు రోజుల తరబడి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరికొందరికైతే పదవుల ఆశ కూడా చూపించారని వినిపిస్తోంది. జగన్ జలదీక్ష ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ నాయకుడు చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని ఎత్తుకుని మూడు జిల్లాల్లో పర్యటనలు పెట్టుకున్నారని, అధికార కాంగ్రెస్‌లో ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పించే విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే భావి తరాలు క్షమించవని వారు అంటున్నారు. నయానో భయానో ఎమ్మెల్యేలను ఇప్పటికైతే ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ రానున్న రోజుల్లో తప్పకుండా తమ రాజకీయ భవితవ్యాన్ని అంచనా వేసుకోక తప్పదని మరో నాయకుడు చెప్పారు.
 
ఎక్కడి నుంచి వచ్చారు.. బాగున్నారా?

జలదీక్ష రైలులో రైతులకు యువనేత పలకరింత
 జలదీక్షలో పాల్గొనేందుకు ప్రత్యేక రైలులో బయలుదేరిన రైతులు, మద్దతుదారులను యువనేత జగన్‌మోహన్‌రెడ్డి పేరుపేరునా పలకరించారు. రైలు ఆసాంతం అన్ని బోగీలు తిరిగిన ఆయన అందరితో మమేకమయ్యారు. ముఖ్యంగా రైతుల వద్ద కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా డెల్టా కింద ఉన్న రైతాంగానికి ఉన్న సమస్యలను ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి సమస్య, నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి ఆయా జిల్లాల ప్రతినిధుల వద్ద కూలంకషంగా చర్చించారు. తన బోగీలో ఉన్నప్పుడు కూడా ఆయన కృష్ణా నదీ జలాలకు సంబంధించిన మ్యాప్‌ను ఆధ్యయనం చేశారు.
మా సమస్యల పైనా ఎలుగెత్తండి

నాగ్‌పూర్‌లో జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర రైతులు
 
దివంగత మహానేత వైఎస్సార్ తనయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ సమస్యలపై ఆందోళన చేసేందుకు ఢిల్లీ వెళుతున్నారని తెలుసుకున్న మహారాష్ట్ర రైతులు దాదాపు 500 మంది ఆయనను నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో కలిసి సంఘీభావం తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు నాగ్‌పూర్ చేరాల్సిన రైలు సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు చేరుకున్నా.. అప్పటివరకూ ఓపికతో వేచివుండి ఆయనను కలిశారు. రైలు ఆగినపుడు యువనేత బోగీ తలుపు వద్దకు వచ్చి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. రైతులు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి జై జగన్ అంటూ నినదించారు. తమ పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని చెప్తూ తమ సమస్యలను కూడా దీక్షలో ప్రస్తావించి కేంద్రానికి వినిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. 
 
ఢిల్లీ చేరుకున్న రైతులు
దేశరాజధానిలో గజగజ వణికిస్తున్న చలిని లెక్కపెట్టకుండా.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రైతులు సోమవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకొన్నారు. వారితో ఏపీ భవన్ కళకళలాడింది. జంతర్‌మంతర్‌కు సమీపంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు బస చేశారు. ప్రత్యేక రైలులో జగన్‌తో కలిసి వస్తున్న దాదాపు 2,000 మంది ప్రతినిధులు కాకుండా.. మరో 1,000 మంది తమ సొంత ఏర్పాట్లతో ఢిల్లీ చేరుకుంటున్నట్లు గోనె ప్రకాశరావు తెలిపారు. తమిళనాడు, జీటీ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఢిల్లీ రావాలని అనేకమంది ప్రయత్నించినా వాతావరణం అనుకూలించక రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తి వారు రాలేకపోతున్నారని చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన గుర్గావ్, నోయిడా ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు జగన్‌కు సంఘీభావంగా దీక్షకు హాజరుకానున్నారు.

ఢిల్లీలో మెడిసిన్(పీజీ) చదువుతున్న వైద్యులు 30 మంది ‘వైఎస్‌ఆర్ డాక్టర్స్ సేన’ ఆధ్వర్యంలో దీక్షాస్థలి వద్ద స్వచ్ఛందంగా ప్రాథమిక వైద్య సేవలు అందించనున్నారు. ప్రముఖ సినీ నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు ఏపీ భవన్‌లోని వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. రాష్ట్రానికి ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవటానికి ‘జలదీక్ష’ దారి చూపాలని ప్రార్థించారు. జలదీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక రావాలని, రాష్ట్రానికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. 

No comments:

Post a Comment