దీక్ష అనంతరం ప్రధానికి వినతిపత్రం* నాడు 75 శాతం నీటి లభ్యత ఆధారంగా జలాలు పంచారు* ఇప్పుడు 65 శాతాన్నే లెక్కించి ఇష్టమొచ్చినట్లు కేటాయింపులు చేశారు* వరద వస్తే మునిగిపోయే మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వరా?*వైఎస్ ఉంటే ఇలా జరిగేదా అని జనం అడుగుతున్నారు
కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి జరిగిన ఘోర అన్యాయానికి నిరసనగా ఈ నెల 11న ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతమే ఆధారంగా తీసుకుని జలాల కేటాయింపులు జరిపి అన్నదాతల బతుకు భరోసాపై నీళ్లుజల్లిందని దుయ్యబట్టారు. వరదలొస్తే మునిగిపోయే మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వకపోవడాన్ని జగన్ తూర్పారబట్టారు. వైఎస్ బతికే ఉంటే ఈ రకంగా జరిగి ఉండేది కాదని ప్రతి రైతు ఆకాశం వైపు చూస్తున్నాడన్నారు. సోమవారం విశాఖ జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా విశాఖనగర పరిధిలో పలుచోట్ల దివంగత నేత వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, పలుప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం మీద కేంద్రం చిన్నచూపుపై ఉద్వేగంగా ప్రసంగించారు. 11న దీక్ష ద్వారా ప్రజల గోడును కేంద్రానికి, యావత్ దేశానికి తెలిసేలా చేస్తానని ఆయన అన్నారు. అప్పుడైనా రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి స్పందిస్తారేమోనని ఆశాభావం వ్యక్తంచేశారు. దీక్ష సందర్భంగా ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
వైఎస్ ఉంటే ఇలా జరిగేదా?
‘ఇవాళ నీటి పారుదల పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఇలా జరిగేదా? కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఇంత అన్యాయం జరిగేదా? ఈ తీర్పు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. 1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. ఈరోజు 65 శాతం మాత్రమే తీసుకొని నీళ్ల కేటాయింపులు జరిపారు. వరదల వల్ల నష్టపోయేది మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు కేటాయింపులు జరుపుతారా? మిగతా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకుంటే నీళ్ల కేటాయింపులు చేస్తున్నారు. మరి మన పరిస్థితేంటి? వరదలు వస్తే మనం మునగాలి.. కరువొస్తే మాత్రం ఉన్న నీళ్లు పైన ఉన్నవాళ్లు వాడేసుకుంటారు. ఇదేనా న్యాయం? ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉందా? లేదా? అని రైతు ఆవేదనగా చూస్తున్నాడు.’
వారు మొర ఆలకించాలని దేవుడిని కోరుకుందాం
‘పోలవరం కట్టాలని కొందరు ఎంపీలు పోయి అడిగితే.. మరికొందరేమో వద్దని ఆపుతారు.. కృష్ణా గోదావరి నదుల జలాలను అనుసంధానించాలని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, ప్రతి నీటిచుక్కనూ వాడుకోవాలన్న ఆలోచనను కేంద్రం చేయట్లేదు. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గులేదూ అని చెప్పడానికి బాధగా ఉంది. నేను చెబుతున్నా.. ఈ నెల 11న ఢిల్లీలో ఒక రోజుపాటు నిరాహార దీక్షకు దిగుదాం. నాకు మద్దతుగా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఈ దీక్షలో పాల్గొంటారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న సంగతిని కేంద్రానికే కాదు.. యావత్ దేశానికీ చూపుదాం.. అప్పుడన్నా ప్రధాని స్పందిస్తారేమో చూద్దాం.. అప్పుడన్నా రాష్ట్రం సమస్యలు వినడానికి ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారేమో చూద్దాం.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రైతుసంఘాల నేతలు, కార్మిక సంఘాల నాయకులూ, స్థానిక సంస్థల ప్రతినిధులూ మాతో కలిసివస్తారు. అప్పుడైనా రాష్ట్రాన్ని బతికించేందుకు స్పందిస్తారో లేదో చూద్దాం.. మన మొర ఆలకించేలా చూడమని దేవుడిని కూడా కోరుకుందాం.’
నాన్నా.. ఎక్కడున్నావ్..
‘రైతులు, చేనేత కార్మికులు, మైనారిటీ సోదరులు.. ఇలా ప్రతి ఒక్కరి క్షేమం కోరుతూ.. ప్రతి పేద సోదరుడినీ పేదరికం నుంచి బయటకు తేవాలని ఆలోచన చేసింది వైఎస్సార్.. నాన్న తిరిగి రాడంటే చాలా బాధగా ఉంది.. నాన్నా.. ఎక్కడున్నావ్ అని అంటే పలికే పరిస్థితిలో లేడంటే చాలా బాధగా ఉంది.. నావెంట ఎవరూ లేరని విపక్షాలు గొంతెత్తినప్పుడు.. స్వపక్షాలు కూడా నావెంట రానప్పుడు.. మేమున్నామంటూ నాపై ఆప్యాయతలు చూపిన మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను..’ అంటూ పెందుర్తిలో జగన్ గద్గద స్వరంతో మాట్లాడారు.
వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు..
విశాఖలో పలుచోట్ల వైఎస్ విగ్రహావిష్కరణల అనంతరం మాట్లాడుతూ.. దివంగత నేత ప్రజల గుండెల్లో ఎంతగా నాటుకుపోయారో జగన్ గుర్తుచేసుకున్నారు. ‘ఈ జంక్షన్‌కు వచ్చి వైఎస్ ఎక్కడా అని ఎవరైనా అడిగితే.. పసిపిల్లలను చంకన వేసుకుని.. ఆలస్యమైనా అలసట, అసంతృప్తి లేకుండా వేచి ఉన్న ప్రతి అక్కాచెల్లెళ్ల గుండెల్లో వైఎస్ కనిపిస్తాడు. ప్రతి అక్కాచెల్లీ పావలా వడ్డీ గురించి ఆలోచించినప్పుడు.. వారి ముఖంపై చిరునవ్వు కనిపించినప్పుడు.. దివంగత నేత గుర్తుకొస్తూనే ఉంటాడు. అవ్వాతాతలు కరస్రాయం లేకుండా అడుగు ముందుకు పడని స్థితిలో వచ్చారు.. వారు ప్రతి నెల ఒకటో తేదీన వచ్చిన పింఛన్ చూసుకొని కన్నకొడుకులా మా బాగోగులు చూసుకున్నాడని ఆలోచించినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. ప్రతి పేద తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు.. ఇంకో నాలుగేళ్లలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని.. ఓ ఉద్యోగం చూసుకొని మా బాగోగులు చూసుకుంటారన్న ధీమాకు వచ్చినప్పుడు.. వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు.
నా కూతురు డాక్టర్ చదువులు చదువుతోంది.. ఇంకో నాలుగేళ్ల తరువాత సూది మందు వేసైనా తను సంపాదించుకుంటూ మమ్మల్ని పోషిస్తుందన్న ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడల్లా వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. అనారోగ్యానికి గురైనప్పుడు.. పెద్దాసుపత్రికి వెళ్లి అప్పుల పాలు కాకుండానే గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికివచ్చి భార్యాపిల్లలతో తన సంతోషాన్ని పంచుకున్నప్పుల్లా వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. బిల్లులు కట్టే బాధలేకుండా ప్రతి రైతు తన మోటారు ఆన్ చేసుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తాడు. పోలవరం పూర్తయినప్పుడు, ఆ నీళ్లు విశాఖకు తాగునీళ్లు అందించినప్పుడు, ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి పూర్తయినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. వైఎస్ ఉంటే పోలవరం పనులు ఎంత వేగంగా జరిగేవో అని రైతు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు’ అని అన్నారు.
ఒంటరిగా వచ్చినా..: ‘ఇవాళ నేను కాంగ్రెస్ నుంచి ఒంటరిగా బయటికి వచ్చినా.. చిరునవ్వుతో నిలబడ్డానంటే అది మీ ప్రేమ, ఆప్యాయతలే వల్లే అని గర్వంగా చెబుతున్నా.. ఆలస్యమైనా నాకోసం వేచి ఉన్నందుకు మీకు మరోసారి చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా’ అని పలుచోట్ల జగన్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment