హైదరాబాద్, జనవరి 25 : 'ఆట' మొదలైంది! రాజకీయ చదరంగం రసకందాయంలో పడింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఆటలో పోటీ పడుతున్నాయి. ఒకరిని ఒకరు ఇరుకున పెట్టేందుకు... పాత పాపాలను తవ్వి పోసేందుకు... అందరూ అస్త్రాలు పట్టుకుని బయలుదేరారు. ఎవరి మాటలను వారి మెడకే చుట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆరేళ్లు అధికారంతో ఆటాడుకున్న మాజీ ఎంపీ వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీలతోపాటు టీఆర్ఎస్ కూడా కత్తులు దూస్తోంది. జగన్ మీడియాలో పెట్టుబడులు పెట్టిన వారికి జారీ చేసిన నోటీసులే వీరికి అస్త్రాలుగా మారాయి. 'ఓ ఖూనీ కేసులో జగన్‌ను అసెంబ్లీలో కాపాడేందుకు 60 రోజులు అధ్యయనం చేశాను' అని ప్రకటిస్తూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'మైండ్ గేమ్'కు శ్రీకారం చుట్టారు.
బహుశా... 'పరిటాల రవి హత్య కేసులో నువ్వో నిందితుడివి. చేసిన మేలు మరిచిన కృతఘ్నుడివి' అని జగన్‌కు చెప్పడమే ముఖ్యమంత్రి అంతరంగం కావొచ్చు. అంతేకాదు... వైఎస్ తనకొక పని చెప్పారని, అది అనైతికమని తాను చెప్పానని, ఆ కారణంగానే తాను 'సెప్టెంబర్ 2'న వైఎస్‌తోపాటు హెలికాప్టర్‌లో రచ్చబండకు వెళ్లలేదని కూడా చెప్పారు. తద్వారా... తాను నైతికతకు కట్టుబడి ఉన్న వ్యక్తిని అనే సంకేతాలు పంపారు. స్పీకర్‌గా ఉన్న తన చేత అనైతిక ప్రకటనలు చేయించేందుకు వైఎస్ ప్రయత్నించారని చెప్పకనే చెప్పారు.
అయితే... ఇవే ప్రకటనలు అటు తెలుగుదేశం, ఇటు జగన్ వర్గం నేతలకు అస్త్రాలుగా మారాయి. 'చీఫ్ విప్‌గా ఉన్న కిరణ్ ఒక ముద్దాయిని కాపాడారు' అంటూ తెలుగుదేశం మండిపడగా... వైఎస్ ప్రమాదం వెనుక ఉన్న అనుమానాలకు కిరణ్ ప్రకటన బలం చేకూరుస్తోందని జగన్ వర్గం నేతలు పేర్కొన్నారు. పరిటాల హత్య, వైఎస్ దుర్మరణం... ఈ రెండు కేసుల్లో సీబీఐ కిరణ్‌ను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలను పక్కన పెడితే... అధికారమే రక్షణ కవచంగా జగన్ అడ్డగోలుగా సాగించిన అక్రమాలు ఇప్పుడు మరింత తేటతెల్లమవుతున్నాయి. వీటిపై కాంగ్రెస్, టీడీపీలు గురిపెట్టాయి. "వైఎస్ అధికారంలోకి వచ్చింది మొదలు... అవిశ్రాంతంగా చేసిన దోపిడీ న్యాయ దేవత సాక్షిగా బట్టబయలు కానుంది'' అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రికాక మునుపు, ఎమ్మెల్యే హోదాలో శంకర్ రావు రాసిన లేఖలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడంతో 'జగన్ ఆస్తుల తుట్టె' మరోమారు కదిలింది.
దీనిపై శంకర్‌రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'అధికార దుర్వినియోగంతోనే జగన్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు' అని తెలిపారు. "వైఎస్ చచ్చి బతికారు. లేకపోతే, అవినీతి ఆరోపణలు పెరిగి అనునిత్యం చచ్చేవారు... అని ఒక పెద్దాయన గతంలో అన్నారు. జగన్ అవినీతిపై వాస్తవాలు బహిర్గతమయ్యేందుకే హైకోర్టుకు లేఖ రాశాను'' అని తెలిపారు. ఇక జగన్ మీడియాతోపాటు, ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని... దీనిపై సీబీఐ విచారణ జరపాలని మరో మంతి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
డబ్బుకు ప్రాధాన్యమిచ్చే జగన్ ముఖ్యమంత్రి అయితే... ఇక రాష్ట్రమే ఉండకపోవచ్చునని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. 'సాక్షి' అక్రమార్జనతోనే పుట్టిందని.. జగన్ వర్గానికి సిగ్గూ లజ్జా లేవని ఎంపీ మధుయాష్కీ విరుచుకుపడ్డారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో నేతల మధ్య చర్చ మొత్తం జగన్ ఆస్తుల చుట్టూ తిరిగింది. "అప్పట్లో మేం వైఎస్ మాటను జవదాటలేని పరిస్థితి ఉండేది.
పత్రికల్లో అవినీతి బాగోతాల గురించి కథనాలు వచ్చినా స్పందించలేని స్థితి. వైఎస్ మరణం తర్వాత కూడా జగన్‌పై విమర్శలు చేసేందుకు వెనుకాడాం. కానీ, నిజం నిప్పులాంటిది. ఏదో ఒకరూపంలో బయటకు వస్తుంది'' అని ఒక ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారమనే ఉల్లిపొర తొలగిపోవడం, రాజకీయ పరిస్థితులు మారడంతో జగన్ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని... ఇప్పుడు ప్రభుత్వం కూడా వాటిని కప్పి పుచ్చలేదని అంటున్నారు.
మరో పోరాటం...
వైఎస్ ఉండగా... ఆయన అవినీతిపై అవిశ్రాంతంగా చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని ఆనందిస్తోంది. అటు కిరణ్‌పై, ఇటు జగన్‌పై అస్త్రాలు సంధిస్తోంది. పరిటాల కేసులో నిందితులను కాపాడటంలో తాను చొరవ చూపినట్లు ముఖ్యమంత్రి అంగీకరించడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేరస్తులను కాపాడిన సీఎం కూడా నేరస్తుడే అన్నారు. జగన్ మీడియాలో పెట్టుబడులపై హైకోర్టు స్వీకరించిన రిట్ పిటిషన్‌లో తెలుగుదేశం సైతం ఇంప్లీడ్‌గా చేరాలని టీడీపీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు.
పరిటాల హత్యపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో... సీబీఐ పునర్‌విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "జగన్‌ను వెనుకేసుకు రావడానికి 60 రోజులు కష్టపడ్డామని చెప్పడమంటే... హత్యానేరాలను ప్రోత్సహించడమే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేయాలి'' అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. "చీఫ్ విప్ పదవిలో ఉండి నేరస్తులను రక్షించడం చట్ట విరుద్ధం కాదా? వాస్తవాలను దాచేందుకే 60 రోజులు కష్టపడ్డారా?'' అని ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం సంపాదించిన అవినీతి సొమ్ముఉన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
జగన్ అవినీతిపై ఆరేళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం లభిస్తోందని మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులపై ఇంటర్‌పోల్ సహాయంతో ఆరా తీయాలని, వైఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగినట్లు తాము ఆధారాలతో సహా బయటపెట్టామని ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. టీఆర్ఎస్ నేత హరీశ్ రావు అటు జగన్, ఇటు కిరణ్‌లపై ఎక్కుపెట్టారు. హత్యానేరం నుంచి జగన్‌ను కాపాడినట్లు ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకొన్నందున... హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకుని కిరణ్, జగన్‌లపై విచారణ జరపాలన్నారు.
కిరణ్ మైండ్ గేమ్
విచ్చలవిడిగా చెలరేగిపోతున్న జగన్ వర్గాన్ని ఆత్మ రక్షణలోకి నెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ 'మైండ్‌గేమ్' మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. పరిటాల రవి హత్య కేసును, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండకు వెళ్లేముందు వైఎస్ ఒక అనైతిక పని తనకు చెప్పారనడం వంటి అంశాలను ఆయన బహిరంగంగా ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. సాధారణంగా కిరణ్ నోరు జారరని... విశాఖలో కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారని అంటున్నారు.
పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై అనుమానాలున్నాయని చెప్పడం ఒక ఎత్తయితే... వైఎస్ తన చేత అనైతిక పనులు చేయించాలని చూశారని చెప్పడం మరో ఎత్తు. విషయం లోతుల్లోకి వెళ్లకుండానే చెప్పాల్సింది చెప్పి, తన చతురత ప్రదర్శించినట్లు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన నాటి నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోందని వారంటున్నారు. అయితే... ఇందులో వ్యూహాత్మకమేమీ లేదని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే తాను అలా మాట్లాడానని కిరణ్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.
జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తుతున్నారు. ఇదే స్ఫూర్తితో ఆయన వర్గీయులూ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ... కాంగ్రెస్ వైపు నుంచి ఆ స్థాయిలో ఎదురు దాడి కనిపించడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్ నుంచి కూడా స్పందన లేకపోవడంతో కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.
"జగన్‌ను, ఆయన వర్గాన్ని ఏ స్థాయిలో ఎదుర్కోవాలో, అసలు ఎదుర్కోవాలో వద్దో అనే అయోమయం కూడా ఉంది. దీనిని తొలగించి, ఎదురుదాడికి సిద్ధం చేయడమే నా ఉద్దేశం'' అని కిరణ్ చెబుతున్నట్లు సమాచారం. ఇకపై... సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ వైఎస్‌కు తామే సన్నిహితులమని, జగన్ కంటే తమకే ఆయన అధిక ప్రాధాన్యమిచ్చే వారని, ఆయన రాజకీయ వారసులం తామేనని చాటి చెప్పనున్నట్లు తెలుస్తోంది.
జగన్ వర్గం ఫైర్
హెలికాప్టర్ ప్రమాదం గురించి కిరణ్ ఏ ఉద్దేశంతో ప్రస్తావించినప్పటికీ... జగన్ వర్గం మాత్రం ఇదే ప్రకటనను తమకు అస్త్రంగా మార్చుకుంటోంది. 'వైఎస్ మరణించనున్నట్లు తెలిసే... కిరణ్ తన ప్రయాణాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారా?' అని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. పరిటాల హత్య కేసు గురించి ప్రస్తావించడం కిరణ్ అభద్రతా భావానికి నిదర్శనమన్నారు.
అంబటి రాంబాబు కూడా హెలికాప్టర్ ప్రమాదంపై ఇదే సందేహాలు వ్యక్తం చేశారు. సీబీఐ కిరణ్‌ను కూడా ప్రశ్నించాలన్నారు. పరిటాల కేసులో జగన్‌ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఎంపీ సబ్బం హరి సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్‌గా ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం కిరణ్ చేసిన ప్రయత్నాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. జగన్‌తో అధిష్ఠానం జరుపుతున్న సంప్రదింపులను అడ్డుకునేందుకే... వైఎస్ కుటుంబంపై కిరణ్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్‌ది నీచ రాజకీయం
రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడలేదు.
పులివెందులలో వైఎస్ జగన్ ధ్వజం
హామీల అమలేదని అడిగితే ఇప్పుడు ఎన్నికలు లేవంటోంది
మహానేత భార్యపై ఆయన తమ్ముడినే పోటీకి దించుతోంది
సొంతగడ్డపై జగన్‌కు పల్లెపల్లెనా వెల్లువెత్తిన అభిమానం
నానమ్మ జయమ్మకు యువనేత నివాళి
‘రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడలేదు. అంతటితో సంతోషించకుండా, ఆ మహానేత సతీమణిపై ఆయన తమ్ముడినే పోటీ పెట్టించే నీచ రాజకీయానికి కాంగ్రెస్ దిగింది. ప్రతి అక్కా, ప్రతి చెల్లీ.. ఓటు వేసే ముందు ఈ నీచ రాజకీయాలను గుర్తించండి’ అంటూ యువనేత వైఎస్ జగన్ తన సొంతగడ్డ పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వైఎస్ హామీ ఇచ్చిన 30 కిలోల బియ్యం, 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఎందుకు అమలు చేయలేదని ఈ కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే, ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఇస్తాం’ అంటోందని కాంగ్రెస్ అవకాశవాదాన్ని ఎత్తిపొడిచారు. యువనేత మంగళవారం ఉదయం పులివెందులకు చేరుకున్నారు. నానమ్మ జయమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో ఫాదర్ల సమక్షంలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు తనను కలిసేందుకు వచ్చిన వారిని విడివిడిగా కలిసి మాట్లాడారు. అనంతరం తొండూరు మండలంలోని గంగాదేవిపల్లె, ఉడవగండ్ల, ఇనగలూరు, అగడూరు గ్రామాల్లో యువనేత పర్యటించారు. గంగాదేవిపల్లె, అగడూరు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ.. ఆయన చేసిన ప్రసంగం వారిని ఉత్తేజితులను చేసింది. రాష్ట్రంలోని ప్రతి పేదకూ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలుచేసి వైఎస్ జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
పల్లెపల్లెనా కురిసిన అభిమానం
తొండూరు మండలంలో యువనేత పర్యటించిన గంగాదేవిపల్లె, ఉడవగండ్ల, ఇనగలూరు, అగడూరు గ్రామాల్లో గ్రామస్థులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. డప్పులు, బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు. ఊళ్లోకి ప్రవేశించగానే అక్కడి నుంచి డప్పుల మోతలతో, బాణసంచా కాల్పులతో ఊరేగింపుతో గ్రామంలోకి తీసుకెళ్లారు. వృద్ధులు, మహిళలు, యువకులు ఆయనను చూసేందుకు అమితాసక్తి చూపారు.
చర్నాకోల పట్టి: ఇనగలూరు గ్రామానికి చేరే ముందు జగన్‌ను వాహనం నుంచి దిగాలని గ్రామస్థులు ఒత్తిడి చేశారు. తాము అలంకరించి తెచ్చిన కోడెడ్ల బండిలో ఆయన్నుఎక్కించారు. యువనేత చర్నాకోల పట్టి, మరో చేత పగ్గాలు పట్టి కోడెలను పరుగెత్తించారు. బండి వెంట యువకులు ఈలలు, కేకలు వేస్తూ అనుసరించారు. ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి ప్రవేశించేంత వరకు యువనేత ఇలా ఎద్దుల బండిలో చర్నాకోల తిప్పుతూ రావడం గ్రామస్తులను అబ్బురపరిచింది. అగడూరులోనూ గ్రామస్థుల కోరిక మేరకు ఆయన ఎడ్లబండి తోలారు.