Wednesday, December 29, 2010

రైతుల మేలు కోసమే ఢిల్లీకి.. * యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* బృందంగా వెళ్లి శరద్‌పవార్‌ను కలుస్తాం* రైతులకు మంచి ప్యాకేజీ అందించాలని కోరతాం*కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తా

కష్టాల్లో ఉన్న రైతులకు మెరుగైన ప్యాకేజీ దక్కేవిధంగా ప్రయత్నించేందుకు ఢిల్లీ వచ్చినట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతాంగ సమస్యలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిసి పరిస్థితి వివరించేందుకు ఆయన బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతాంగ సమస్యలను కేంద్రానికి నివేదించేందుకు ఢిల్లీ వచ్చానని చెప్పారు. అకాలవర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నిస్తానని తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో రాజకీయాలకు తావులేదన్నారు.

రైతాంగ సమస్యలను నివేదించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్రమంత్రులు శరద్‌పవార్, దయానిధి మారన్‌ల అపాయింట్‌మెంట్ కోరగా.. పవార్ మాత్రమే అపాయింట్‌మెంట్ కేటాయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, చేనేత కార్మికుల ప్రతినిధులు, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో కలిసి బృందంగా వెళ్లి శరద్‌పవార్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించి, రైతాంగానికి అధికసాయం అందేవిధంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యలపై ఇప్పటికే దీక్ష నిర్వహించారు కదా, తదుపరిస్థాయి ఒత్తిడి చర్యల్లో భాగంగా ఢిల్లీ వచ్చారా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ... రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, వారికి ఊరట కలిగించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకే ఢిల్లీ వచ్చినట్లు సమాధానమిచ్చారు.

ఇప్పుడు రాజకీయాలు వద్దు...
త్వరలో ప్రకటించనున్న రాజకీయ పార్టీ పనుల్లో భాగంగా ఢిల్లీ వచ్చారా అని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, దెబ్బమీద దెబ్బపడి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని జగన్ గుర్తుచేశారు. వరదలు, తుపానులు, అకాలవర్షాలు, జల్, లైలా తుపానులు వారిని కోలుకోనివిధంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి మెరుగైన ప్యాకేజీ సాధనలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంచి ప్యాకేజీని అందించి రైతులను ఆదుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు మాట్లాడి సమస్య ప్రాధాన్యాన్ని తగ్గించుకోదలచుకోలేదని స్పష్టం చేశారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారనే ప్రశ్నలపై స్పందిస్తూ... ఎవరేమన్నారో తనకు తెలియదన్నారు. రాజకీయాలపై దృష్టి మళ్లించి రైతుల సమస్య ప్రాధాన్యాన్ని తగ్గించవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యనుంచి దృష్టి మరల్చకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికారు. రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తే బాగుంటుందని.. అంతకుమించి తాను మాట్లాడబోనని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో తనకు తెలియదని, అన్నీ మీరే చెప్తే ఎలా అని ప్రశ్నించారు. జగన్‌తోపాటు ఢిల్లీ వచ్చిన బృందంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు నరసింహారెడ్డి, నరసింహనాయుడు ఉన్నారు.

No comments:

Post a Comment