Wednesday, December 15, 2010

కాంగ్రెస్‌లో జగన్‌ కార్డు

Jagan-sirr
‘మమ్మీ.. నాకు చాక్లెట్‌ ఇవ్వకపోతే నీ పార్టీ నుంచి డాడీ పార్టీలోకి వెళతా’- చిన్నపిల్లలు తమ చిన్న చిన్న డిమాండ్ల కోసం తలిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేసే సహజ ధోరణి ఇది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉంది. కాకపోతే ఇక్కడ చిన్నపిల్లల బదులు పెద్దలయిన ఎమ్మెల్యేలే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తేడా అదే. ఇప్పటివరకూ తమకు ప్రాధాన్యం ఇవ్వని నాయకత్వం ఇప్పుడు జగన్‌ వ్యవహారంతో బుజ్జగిస్తున్న వైనాన్ని ఎమ్మెల్యేలు, నేతలు చక్కగా వినియోగించుకుంటున్నారు. జగన్‌ పేరు చెప్పి ఏకంగా పార్టీనే బెదిరించే పరిస్థితి ఏర్పడింది. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జగన్‌ వైపు దూకేస్తామని చెప్పకనే చెబుతున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి వంటి మరికొంతమంది స్థితప్రజ్ఞులు ‘జగన్‌ చేతిలో మంత్రదండం ఉందం’టూ పార్టీపై ఒత్తిడి చేసే పరోక్ష వ్యూహంతో కథ నడుపుతున్నారు.

వందేళ్లకుపైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో రాను రాను దయనీయస్థాయికి దిగజారుతోంది. ఢిల్లీ నుంచి కంటిచూపుతో రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకత్వానికి, ఇప్పుడు ఒక జూనియర్‌ ఎమ్మెల్యేను కూడా బ్రతిమిలాడుకోవలసి దుస్థితి దాపురించింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌ ఈ విషయంలో నానా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు జగన్‌ వైపు వెళ్లకుండా బుజ్జగించడానికే ఆయన సమయం సరిపోయేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను పిలిచి జగన్‌ పార్టీలో చేరవద్దని, మీకు మంచి భవిష్యత్తు ఉందంటూ బుజ్జగించవలసి వస్తోంది.

ఈ పరిస్థితిని ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, అధిష్ఠానంపై మరింత పట్టుబిగించేందుకు ఎవరి ఎత్తుగడలో వారున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వాలని, తమ జిల్లాలో మరొకరికి ప్రాధాన్యం ఇస్తే సహించేదిలేదని సీఎంకు నేరుగానే హెచ్చరిస్తున్నారు. ఇంతవరకూ తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, నియోజకవర్గంలో అధికారులు తాము సూచించిన పనులు కూడా చేయడం లేదని, ఈ పరిస్థితి కొనసాగితే కష్టమని నిష్ఠూరాలాడుతున్నారు. తమను జగన్‌ పార్టీలో చేరమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారన్న మరో బాంబు పేల్చి చల్లగా బయటకు వస్తున్నారు.

పేర్ని నాని అయితే, తాను 2014 వరకూ మనసు చంపుకుని పార్టీలో ఉంటానని నిర్మొహమాటంగా చెప్పారు. వనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి తనకు ప్రజలే అధిష్ఠానమని, ప్రజలు, కార్యకర్తలు తనను జగన్‌ వెంటే ఉండమని చెబుతున్నారని, ఓదార్పు యాత్రలో పాల్గొంటామని సీఎం ముఖం మీదే చెప్పారు. నిజానికి ఎమ్మెల్యేలు-సీనియర్‌ నాయకులు చాలాకాలం నుంచి కార్పొరేషన్‌ పదవులపై కన్నేశారు. వివిధ కారణాల వల్ల అది వైఎస్‌ హయాం నుంచీ వాయిదా పడుతూ వస్తోంది. రోశయ్య హయాంలో కొన్ని కార్పొరేషన్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడు వాటిని సాధించుకునేందుకు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు అధిష్ఠానంపై ‘జగన్‌ త ంత్రాన్ని’ ప్రయోగిస్తున్నారు. కార్పొరేషన్‌ పదవులు ఇవ్వకపోతే పార్టీలో ఉండేది లేదన్న పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు.

అధిష్ఠానం ఎదుర్కొంటున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచు కుని, తమ లక్ష్యసాధన కోసం పార్టీ నాయకత్వాన్ని బెదిరిం చే స్థాయికి వెళ్లారు. ఇన్నాళ్లూ అనామకులుగా ఉన్న తమ కు జగన్‌ పుణ్యాన పార్టీలో ప్రాధాన్యం పెరిగిందని, స్వ యంగా ముఖ్యమంత్రే ఫోన్లు చేసి బుజ్జగించేదాకా వచ్చా రంటున్నారు. ఈవిధంగానయినా తమకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందని గ్రహించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ధైర్యంగా ఎదిరించే స్థాయికి ఎదిగారు.జగన్‌ పేరు అడ్డుపెట్టుకుంటే రెండురకాలుగా లాభపడ వచ్చన్నది వారి వ్యూహం. ప్రభుత్వం లొంగివచ్చి పదవు లిస్తే మూడేళ్లూ హాయిగా ఉండవచ్చు. లేకపోతే జగన్‌ శిబిరం నుంచి ఆఫర్లు ఉండనే ఉన్నాయి. ఇప్పట్లో పార్టీకి రాజీనామా చేయకపోయినా ఫర్వాలేదు. అందరి మాదిరి గా పార్టీలోనే ఉంటూ, జగన్‌ అనుకూల స్వరం వినిపిం చినా నష్టమేమీలేదన్న రెండంచల వ్యూహంలో ఉన్నారు.

No comments:

Post a Comment