Friday, December 17, 2010

జనం సొమ్ముతో జగన్ పండగ, ఆరేళ్లలో అందనంత ఎత్తుకు

 

జనం సొమ్ముతో జగన్ పండగ, ఆరేళ్లలో అందనంత ఎత్తుకు
తండ్రి అధికారమే ఆధారం
కంపెనీల మూలాలన్నీ అనుమానాస్పదం
అక్రమ మార్గాల్లో పెట్టుబడులు
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వాటాలు
అప్పుడు అధికార వ్యవస్థ గప్‌చుప్
ఇప్పుడు అవే వ్యవస్థల గర్జనలు

అదో చిన్న మొక్క... అడుగులోపు ఎత్తు, చిన్న చిన్న ఆకులు, సన్నని కాండం... అదీ దాని స్వరూపం! ఆరేళ్లలో దాని రూపురేఖలే మారిపోయాయి. ఆ చిన్న మొక్క అంతకంతకు విజృంభించింది. ఊడలు దిగింది. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించింది. కళ్లు మూసి తెరిచేంతలో మహా వటవృక్షంగా ఎదిగిపోయింది. ఇది ఎలా సాధ్యమని అడిగిన వారిని చూసి ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఫక్కున నవ్వారు. మీకేం తెలియదు పొమ్మన్నారు. వ్యాపార నైపుణ్యం అంటే ఇదేనని, కార్పొరేట్ మహత్యం ఇలాగే ఉంటుందని తెగ వాదించారు. ముఖ్యమంత్రి పదవి అనే తల్లి వేరు వల్లే ఆ మొక్క అలా వయసుకు మించి ఎదిగిందనే వాస్తవం తెలిసీ మిన్నకున్నారు. అదే కాంగ్రెస్ నేతలు పరిస్థితులు మారేసరికి ఇప్పుడు ఆ మహా వృక్షంపై యుద్ధం ప్రకటించారు. నువ్వెలా ఎదిగావో మాకు తెలుసంటూ గోల చేస్తున్నారు. దానిని పెకలించలేక ప్రయాస పడుతున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడైన జగన్మోహన్‌రెడ్డి కథ ఇది.

  2003-04 సంవత్సరంలో వైఎస్ జగన్ చెల్లించిన ఆదాయపు పన్ను కేవలం రూ.60 వేలు. 2009-10 సంవత్సరంలో ఆయన చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ ఏకంగా రూ.84 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎలా ఎదిగిపోయారో, ఎంతగా చెలరేగిపోయారో చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు. అధికారంలోకి రాక మునుపు ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాల్సినంత ఆర్థిక దుస్థితి వైఎస్‌ది. పీఠం ఎక్కిన తర్వాత ఆయన ఓ మహా ప్రబల ధన శక్తిగా ఎదిగిపోయారు. అంతేకాదు... సీఎం అయిన తొలినాళ్ల నుంచే తన అధికార సోపానాల మీదుగా సుపుత్రుడి ఎదుగుదలకు యథా శక్తి శ్రమించారు. సండూర్ పవర్ అనే అతి చిన్న కంపెనీతో ప్రారంభమైన జగన్ వ్యాపారం... వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక శాఖోపశాఖలుగా విస్తరించింది. కార్మెల్ ఆసియా, జనని ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, క్లాసిక్ రియాల్టీ, షలోమ్ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్ హోటల్స్, సిలికాన్ బిల్డర్స్ ఇలా అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి.

ఈ కంపెనీల పుట్టు పూర్వోత్తరాలపై 'ఆంధ్రజ్యోతి' పక్కా ఆధారాలతో సహా అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అప్పట్లో వైఎస్ చెప్పిందే వేదంగా భావించిన కాంగ్రెస్ నేతలంతా ఈ కథనాలను దునుమాడిన వారే. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు జగన్ కంపెనీల పుట్టుక వెనుక రహస్యం తమకు తెలుసంటూ విమర్శిస్తున్నారు. 'అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?' అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు... జగన్ పత్రికపై విపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలపై అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్, ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

"చంద్రబాబు సాక్షి పత్రికపై విమర్శలు చేయడం మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. భవిష్యత్తులో సాక్షి ఎదుగుదల బాగా ఉంటుందనే ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి'' అని కిరణ్ కుమార్ 2008 ఏప్రిల్ 6న జగన్ పత్రికను అడ్డగోలుగా వెనకేసుకొచ్చారు. ఇదీ పరిస్థితి! జగన్ సమైక్యవాదం వినిపించగానే... తెలంగాణ నేతలకు 'సాక్షి' చేదెక్కింది. జగన్ టీవీ చానల్ సోనియాపై వ్యతిరేక కథనం ప్రసారం చేసేసరికి... మొత్తం కాంగ్రెస్ నేతలకు కంపరం పుట్టుకొచ్చింది. ఇప్పుడు... జగన్ కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆదాయపు పన్ను శాఖ వరకు అన్నీ కన్నేశాయి. కాంగ్రెస్‌కు కానీ, కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలకుగానీ... జగన్ అక్రమాలు ఇప్పుడు మాత్రమే తెలిసినవి కావు! ఎప్పుడో తెలుసు! అవసరం వచ్చింది కాబట్టి, ఇద్దరి మధ్య చెడింది కాబట్టి... ఇప్పుడు రకరకాల అస్త్రాలు తీస్తున్నారు!

దశ దిశలా విస్తరణ...

గనులు, స్టీలు, సిమెంట్, మీడియా, విద్యుత్తు... ఇలా ఆరేళ్లలో జగన్ అడుగుపెట్టని రంగమంటూ లేదు. అయితే, ఆయన పెట్టిన కంపెనీల మూలాలన్నీ అనుమానాస్పదమే, అక్రమమే! అన్నింటికంటే ముఖ్యంగా... జగన్ సొంత ప్రసార సాధనమైన 'సాక్షి' గురించే చెప్పుకోవాలి. తన సొంత మీడియా కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ చీటికి మాటికీ 'ఆ రెండు పత్రికలు' అంటూ విరుచుకుపడేవారు. 'కాంగ్రెస్' కోసం ఒక పత్రిక అవసరమనే భావన కల్పించారు. కుమారుడి ద్వారానే పత్రికను ప్రారంభింపచేశారు. అదికూడా... భారీ స్థాయిలో! ఇతర పత్రికలను నిర్మూలించడమే లక్ష్యంగా అది పుట్టుకొచ్చింది. వచ్చీ రాగానే 'ఇతర పత్రికలు కూడా రూ.2 కే విక్రయించాలి' అంటూ 'గొంతెమ్మ' కోర్కెల ఉద్యమం మొదలుపెట్టారు. నిజమే... ఆయన సొమ్మేం పోయింది! ఆయన ఉచితంగా అయినా పేపర్ పంచి పెట్టగలరు. ఎందుకంటే... రూ.500 కోట్ల విలువైన పత్రికలో జగన్ పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు.

సండూర్ పవర్‌తో మొదలుపెట్టి... దానికి అనుబంధంగా కొన్ని కంపెనీలు, మరిన్ని పిల్ల కంపెనీలను పుట్టించి, వాణిజ్య నిపుణులకు సైతం అంతుపట్టని రీతిలో జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు ప్రవహింప చేశారు. ఈ క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను అడ్డగోలుగా ఉల్లంఘించి... జగతి పబ్లికేషన్స్‌కు మారిషస్ నుంచి అక్రమమార్గంలో డబ్బులు తెప్పించారు. 'మా కంపెనీలో విదేశీ పెట్టుబడులు లేవు' అంటూ ఆర్ఎన్ఐకి తప్పుడు సమాచారం అందించారు. సెబీ నిషేధించిన కంపెనీలకూ జగతి పబ్లికేషన్స్ షేర్లు కేటాయించడం మరో అక్రమార్కం. అంతేకాదు... చరిత్ర మొత్తం అనుమానాస్పదమే అయిన 12 పశ్చిమ బెంగాల్ కంపెనీలు కూడా జగతిలో పెట్టుబడులు పెట్టాయి. అందులోనూ, రూ.9.31 లక్షల సంచిత నష్టం మూటగట్టుకుని, 2007-08లో కేవలం 77,855 రూపాయల లాభం ఆర్జించిన కంపెనీలు... జగతిలో ఏకంగా 41.57 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు చూపించారు. ఇదంతా 'జగన్ మాయ'లో భాగమే! ఇలాంటి అక్రమాల పుత్రికకు ముఖ్యమంత్రి వైఎస్ 'అధికారికంగా' ఆర్థిక పరిపుష్టి కలిగించారు. నిబంధనలు సడలించి మరీ కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలను గుప్పించారు.

అంతా అడ్డగోలు...

వైఎస్ తనయుడు జగన్ ఏర్పాటు చేసిన భారతి సిమెంట్స్ (అప్పట్లో రఘురాం సిమెంట్స్) ఆవిర్భావమే ఒక 'అద్భుతం!' ఈ సంస్థలో ప్రమోటర్ల (జగన్ కుటుంబం) వాటా ఒక్క ఏడాదిలోనే రూ.45 కోట్ల నుంచి రూ.6500 కోట్లకు పెరిగింది. ఇది భారత సిమెంట్ రంగం చరిత్రలోనే ఒక రికార్డు. ఇక జగన్ కంపెనీలకు 'తల్లి లాంటిదైన' సండూర్ పవర్‌ది మరో చరిత్ర! 22 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ విద్యుత్తు ప్లాంటు విలువ రూ.1300 కోట్లుగా చూపారు. పది రూపాయల షేరును రూ.675కు విక్రయించారు. అందులో 21 లక్షల షేర్లను నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాటిక్స్) కొన్నారు. మరో 82 లక్షల షేర్లను బినామీ కంపెనీలకు విక్రయించి రూ.702 కోట్లు అక్రమంగా సమీకరించారు.

ఆ సొమ్ముతోనే జగన్ బంతాట ఆడటం మొదలుపెట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడం, అలా పెట్టుబడులు పెట్టిన వారికి ప్రభుత్వపరంగా లబ్ధి చేకూర్చడం వైఎస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అంటే... జనం సొమ్ముతో పండగ చేసుకున్నారన్న మాట! ఇలా జగన్ కంపెనీల లోతుపాతులపై 'ఆంధ్రజ్యోతి' జగన్ నాటకం, జగతి కిలాడీలు శీర్షికన వరుస కథనాలను ప్రచురించింది. 'ఈ దేశంలో వ్యవస్థలు సక్రమంగా నడిస్తే... జగతి పబ్లికేషన్స్‌కు వెంటనే తాళాలు పడతాయి!' అని కంపెనీ, మీడియా వ్యవహారాలపై అవగాహన ఉన్న నిపుణుడొకరు తెలిపారు. కానీ... అప్పటి వ్యవస్థలన్నీ వైఎస్ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యవస్థలు జగన్‌పై గురి పెడుతున్నాయి. ఇది... కాల మహిమ! జనం మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉన్నన్నాళ్లూ ఈ 'మహిమలు' జరుగుతూనే ఉంటాయి.


******************************************************************************
ఎంత ఎదిగి పోయావయ్యా!

2004లో...
జగన్ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు
స్థిరాస్తుల విలువ రూ.36 లక్షలు
వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు రూ. 19 కోట్లు

2006లో...

జగన్ ఆదాయం రూ.40 కోట్లు
2010లో...
జగన్ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్: రూ.84 కోట్లు

No comments:

Post a Comment