రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాల్లాంటి యువ జన కాంగ్రెస్, ద్వితీయ శ్రేణికి చెందిన యువ నేతలను తన వైపు మళ్లించుకుని కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసేందుకు జగన్ వేస్తున్న ఎత్తులను చిత్తు చేసేందుకు త్వరలో యువరాజు రాహుల్‌గాంధీ రాష్ట్రంపై దృష్టి సారిం చనున్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు ద్వితీయ శ్రేణి నేతలను తన వైపు మళ్లించుకోవడం ద్వారా.. ఎమ్మె ల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లను అనివార్య పరిస్థితిలో తన పార్టీలో చేరేలా జగన్ పన్నిన వ్యూహరచన విజయవంతం అవుతున్న నేపథ్యంలో, రాహుల్ రాష్ట్రంలో అడుగుపెడు తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ జనవరి నుంచి రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేయనున్నా రు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం పేరుతో ఆయన ఇక్కడకు రానున్నారు.
కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చిత రాజకీయ వాతావరణం తో దిక్కుతోచని యువ నేతలను జగన్ తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక నెట్‌వర్క్ ద్వారా ఆకర్షిస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఉన్న యువ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలను జగన్ వర్గీయులు వ్యక్తిగతంగా వెళ్లి వారిని బుట్టలో వేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మునిసిపల్ ఛైర్మన్లు ఉన్నంతవరకూ మీకు భవితవ్యం ఉండదని జగన్ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
అదే తమ పార్టీలో చేరితే మీ లక్ష్యం నెరవేరుతుందని, ఎన్నికల్లో పోటీకి ఆర్థికంగా కూడా ఆదుకుని, మిమ్మల్ని గెలిపించుకుంటామని భరోసా ఇస్తుండటంతో ద్వితీయ శ్రేణి నేతలు జగన్ వైపు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. దానితోపాటు వారంతా తమ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్ల వద్దకు వెళ్లి జగన్ వైపు వెళదామని ఒత్తిళ్లు చేస్తున్నారు. దీనితో తమ కేడర్ అంతా జగన్ వైపు వెళితే తాము ఒక్కరే కాంగ్రెస్‌లో ఉండి ఏం ప్రయోజనమన్న ఆలోచన మొదల యింది. ఈ రకంగా ప్రజాప్రతినిధులపై జగన్ వర్గం చేస్తున్న ఒత్తిళ్లు బాగా ప్రభావితం చేస్తున్నాయి.
ఈ వాతావరణం పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీస్తుందని గ్రహించిన సీనియర్లు ఇటీవలే రాహుల్‌గాంధీని కలిసి, రాష్ట్రంలో యువ నేతలు, ద్వితీయ స్థాయి నేతలను కాపాడుకోవాలంటే మీరు రాష్ట్రంపై దృష్టి సారించవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీనియర్ నేత వి.హన్మంతరావు ఈ విషయంలో రాహుల్ రాష్ట్రానికి రావలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను, బహిరంగసభల విజయవంతంలో కీలకపాత్ర పోషించే యువ నేతల స్పీడుకు బ్రేకులు వేసి, వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని విహీచ్ స్పష్టం చేశారు.
దీనికి అంగీకరించిన రాహుల్ జనవరి నుంచి తాను రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పినట్లు తెలిసింది. ముందు.. రాష్ట్ర స్థాయిలో యువజన కాంగ్రెస్, ద్వితీయ శ్రేణి నేతలతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రాంతాల వారీగా భేటీలు నిర్వహించి వారితో మమేకం కావాలని నిర్ణయించారు. తనపై ఉన్న యూత్ ఇమేజ్‌ను జగన్ వైపు వెళ్లకుండా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రధానంగా.. కొత్తగా ఎన్నికయిన యువ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలన్న ధ్యేయంతో రాహుల్ రాష్ట్ర పర్యటనలు చేయనున్నారు.
గతంలో జగన్ హడావిడి నేపథ్యంలో.. రాష్ట్రానికి చెందిన కొందరు యువ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకున్న రాహుల్, ఈసారి క్షేత్రస్థాయిలో పనిచేసే యువ నేతలతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.తన పర్యటనల కంటే ముందే యువజన కాంగ్రెస్ కమిటీలను ప్రకటించాలని రాహుల్ భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో జగన్ వర్గాన్ని ఎదుర్కోవడంతో పాటు, ఆయన వర్గ ప్రభావాన్ని నియంత్రించే స్థాయి ఉన్న వారికి జిల్లా యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత తొలిసారిగా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు, ప్రతి కార్పొషన్‌కు ఒక డైరక్టర్ పదవిని యూత్ కాంగ్రెస్ నేతకు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్లు, జిల్లా స్థాయిలో చైర్మన్ పదవులను తప్పనిసరిగా యూత్‌కే ఇవ్వాలని రాహుల్ ఒక విధాన నిర్ణయాన్ని ప్రవేశపెట్టనున్నారు. తన నిర్ణయాల వల్ల యువ నేతలు జగన్ వైపు వెళ్లకుండా పార్టీలోనే కొనసాగుతారన్నది రాహుల్ వ్యూహంలా కనిపిస్తోంది.
No comments:
Post a Comment