Saturday, December 18, 2010

తండ్రి 'ఆత్మ'పై తనయుడి పోరు! * మొదటి నుంచీ ఉప్పూ నిప్పు * కేవీపీకి ప్రాధాన్యంపై జగన్ గుర్రు


కేవీపీకి ప్రాధాన్యంపై జగన్ గుర్రు
కీలక సమయంలో 'చెయ్యి' ఇచ్చారని ఆగ్రహం
అధిష్ఠానం పక్షాన నిలవడంపై అసహనం
సురేఖ లేఖాస్త్రానికి ఇదే కారణం?
గుల్బర్గా వైద్య కళాశాలలో జరిగిన పరిచయం తర్వాత... 1978లో వైఎస్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2వ తేదీన మృతి చెందేదాకా... కేవీపీ ఆయనతోనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా ప్రతి దశలో వైఎస్‌తోనే కేవీపీ ఉన్నారు.

అప్పుడెప్పుడూ కేవీపీ, వైఎస్‌ల మధ్య అనుబంధం విషయంలో ఎలాంటి పొరపొచ్ఛాలూ లేవు. కానీ.. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వివాదం మొదలైంది. అది వారిద్దరి మధ్య కాదు! పాలనలో కేవీపీ జోక్యం, ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యాన్ని వైఎస్ కుటుంబ సభ్యులు... ప్రధానంగా జగన్ వ్యతిరేకించే వారని పార్టీ నేతల్లో ప్రచారం జోరుగా ఉంది.

కాంట్రాక్టుల కేటాయింపులు, కీలక పోస్టుల్లో నియామకాల విషయంలో కేవీపీతోపాటు జగన్ కూడా జోక్యం చేసుకునే వారని.. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెబుతున్నారు. వైఎస్ ఉన్నప్పుడే ఆర్థికపరమైన పలు లావాదేవీలకు సంబంధించి కేవీపీతో జగన్ వ్యతిరేకించేవారనే ప్రచారం సాగింది.

వైఎస్ మరణంతో...

వైఎస్ దుర్మరణం తర్వాత జరిగిన పరిణామాలు కేవీపీకీ, జగన్‌కూ మధ్య దూరాన్ని మరింత పెంచాయి. వైఎస్ వారసునిగా జగన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్, వైఎస్ భౌతిక కాయం ఉండగానే, దానికి సమీపంలోనే ఎమ్మెల్యేల సంతకాల సేకరణ జరిగింది. అత్యంత విషాదకర సమయంలో అధికారం కోసం సంతకాల సేకరణ ఏమిటంటూ అధిష్ఠానం మండిపడింది. పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయ్యేందుకు సంతకాల సేకరణే ప్రధాన కారణమని జగన్ భావిస్తున్నారు.

కొండా సురేఖ కూడా ఇటీవల తన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 'నేను, వైఎస్ ఒకే మనసు, ఒకే ఆత్మ' అని చెప్పుకున్నప్పటికీ... వైఎస్ మరణం తర్వాత కేవీపీలో ఈ వైఖరి కనిపించలేదని జగన్ వర్గం ఆక్షేపిస్తోంది. ప్రజా భద్రతా సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న కేవీపీ... వైఎస్ మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయకపోవడం జగన్‌ను, ఆయన వర్గాన్ని విస్మయానికి గురి చేసిందని చెబుతారు.

జగన్ ఇప్పటికీ తన తండ్రి మరణంపై తాను సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రజల్లోనే అవే సందేహాలు కలిగేలా ప్రచారం చేస్తున్నారు. 'రాష్ట్రంలో ఏ కార్యకర్త కూడా వైఎస్ ప్రమాదవశాత్తు మృతి చెందారని భావించడంలేదు. ఆయన మరణంపై సందేహాలున్నాయి' అని ఇటీవల పులివెందులలో జరిగిన సభలో పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వపరంగా దర్యాప్తు జరిపేందుకు కేవీపీ ఎందుకు సిద్ధపడలేదని జగన్ వర్గం ప్రశ్నిస్తోంది.

పీఠం... ముడి!

వైఎస్ మృతి అనంతరం మెజారిటీ శాసనసభ్యుల మద్దతున్న తననే సీఎం కుర్చీలో కూర్చోబెడతారని జగన్ భావించారు. రఘువీరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా జగన్‌ను సీఎం చేయకుంటే మంత్రులుగా ప్రమాణం చేయబోమని అప్పట్లో ప్రకటించారు. 'మనం కలిసి పరిపాలన చేద్దాం' అంటూ తనను కలిసి సానుభూతి ప్రకటించడానికి వచ్చిన నేతలతో జగన్ చెప్పారని, ఇదీ ఆయనలోని నమ్మకానికి నిదర్శనమని చెబుతారు. సీఎంగా తనపేరు ప్రకటించడం లాంఛనమే అని జగన్ భావించారు.

ఆ సమయంలో కేవీపీ గొంతెత్తి, జగన్ పక్షాన నిలుస్తారని పలువురు భావించారు. కానీ.. పరిస్థితి తారుమారైంది. కీలకమైన క్షణంలో కేవీపీ మౌనం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దీనిని జీర్ణించుకోలేకపోయారని జగన్ సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవెంటే ఉన్న ఆ సమయంలో కేవీపీ ఒక్క మాట అని ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నది జగన్ అభిప్రాయం.

పుండుమీద కారం చల్లినట్లుగా... సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కట్టబెడుతూ తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ జగన్ చేతే ప్రవేశపెట్టించారు. ఈ వ్యవహారాలన్నింటికీ కేవీపీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఏ దశలోనూ కేవీపీ దీనిని వ్యతిరేకించకపోవడం, అధిష్ఠానాన్ని తప్పుపట్టకపోవడం జగన్‌కూ, ఆయన కుటుంబానికీ, అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.

అన్నింటికంటే ముఖ్యంగా... అప్పుడు సీఎంగా ఉన్న రోశయ్యతో కేవీపీ బంధాన్ని కొనసాగించడం .. గతంలో వైఎస్ ఉన్నప్పటి లాగానే శాసనసభ సమావేశాల సమయంలో అసెంబ్లీకి రావడం, సలహాదారుగా కొనసాగడం ఆ ఆగ్రహాన్ని మరింత పెంచింది. కేవీపీ అటు అధిష్ఠానంతో, ఇటు నాటి సీఎం రోశయ్యతో సఖ్యతగా మెలగడం కూడా జగన్‌కు మింగుడు పడలేదు.

పైగా... ఎమ్మెల్యేలు తనవైపు మొగ్గు చూపకుండా కేవీపీ వారిని కట్టడి చేస్తున్నారనే అనుమానం కూడా కలిగింది. సీఎంగా రోశయ్య బాధ్యతలు నిర్వహించినంత కాలం... ఎప్పటికైనా అధిష్ఠానం దిగివచ్చి తనకు సీఎం పదవి అప్పగిస్తుందని జగన్ భావిస్తూ వచ్చారు. కానీ, అనూహ్యంగా రోశయ్యను మార్చేసి, ఆయన స్థానంలో తన సామాజిక వర్గానికే చెందిన కిరణ్‌కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో... ఇక తాను కాంగ్రెస్‌లో సీఎం కావడం అసంభవమని జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఇదే సమయంలో తన కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు అధిష్ఠానం యత్నిస్తున్నా.. కేవీపీ నోరు విప్పకపోవడంపై జగన్‌తో పాటు ఆయన వర్గం ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ ద్వారా కేవీపీపై లేఖాస్త్రం సంధించినట్లు ప్రచారం జరుగుతోంది.

వేస్తారా సంకెళ్లు?

ఒకటి రెండూ కాదు... వేల కోట్ల అవినీతి! సర్వ వ్యవస్థల నాశనం! ఇన్నేళ్లుగా జరిగిందిదే! 'ఆంధ్రజ్యోతి' ఎప్పటికప్పుడు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నన్ని రోజులు... వారూ వారూ కలిసి ఊళ్లు పంచుకున్నన్ని రోజులు దీనిపై ప్రభుత్వాలు స్పందించలేదు. రాజకీయ సమీకరణాలు మారిపోగానే కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. అప్పుడు 'ఆంధ్రజ్యోతి' రాసిన కథనాలు అక్షరసత్యాలని ఇప్పుడు ప్రభుత్వమే తన చర్యల ద్వారా అంగీకరించినట్లయింది.

ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ విచారణకు కూడా సిద్ధపడుతోంది. రహేజాదీ ఇదే పరిస్థితి. బయ్యారంలో ఇనుప నిక్షేపాల కేటాయింపును రద్దు చేసింది. వైఎస్ పుత్రుడి కంపెనీలపై ఐటీ దాడులు జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. సెజ్‌ల పేరిట జరిగింది భూ పందేరమేనని తేలిపోయింది. ఈ కుంభకోణాల్లో కోట్లకొద్దీ ప్రజాధనం కొందరు పెద్దల ఖాతాల్లోకి చేరుకుంది.

ఇప్పుడు... ప్రభుత్వం ఏం చేస్తుంది? మెక్కిన సొమ్మును కక్కిస్తుందా? అవినీతి పరులకు సంకెళ్లు వేస్తుందా?... వారి మధ్య మళ్లీ సఖ్యత కుదిరితే, వాళ్లు లోపాయికారీ ఒప్పందానికి వస్తే మొత్తం అవినీతిని కప్పేస్తారు! ఇప్పుడే సర్కారును పౌర సమాజం ప్రశ్నించాలి. 'మేమున్నాం... నిలదీస్తాం' అని అనుక్షణం గుర్తు చేయాలి.
click here

No comments:

Post a Comment