గుంటూరు జిల్లాలో వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ
ఏడాది కాలంగా తుపాన్లు, వరదలు అన్నదాతను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం రైతు మీద ఎందుకు ప్రేమ చూపలేకపోతోందని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిని మామూలు పరిస్థితిగా చూడకూడదని, రైతు కన్నీరు రాష్ట్రానికే అరిష్టమని, ఆ కన్నీరు తుడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవలి వర్షాలకు అతాలకుతలమైన ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో పర్యటించారు. ప్రకృతి విలయతాండవానికి కకావికలమైన అన్నదాతలను పరామర్శించి వారి కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. వేలకు వేలు అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలైందంటూ కన్నీరుమున్నీరవుతున్న రైతును చూసి ఆయన చలించిపోయారు.
రాత్రి 9.10 గంటల సమయంలో అమృతలూరులో రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క రైతునూ ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. బాధిత రైతుకు తక్షణ సాయంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందే. ఇన్‌పుట్ సబ్సిడీ రెట్టింపు చేయాల్సిందే.. రబీకి ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాల్సిందే.. ధాన్యం తడిచినా, రంగు మారినా కొనాల్సిందే. రుణాలపై వడ్డీ మాఫీ చేసి ఓ సంవత్సరం పాటు అడగకుండా మారటోరియం విధించాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి చూసి నాకు చాలా బాధేసింది. వారు బ్యాంకుకు వెళితే కనీసం రుణం కూడా ఇవ్వరు. వారిని ఆదుకోడానికి ఒక ప్రత్యేక మార్గనిర్దేశకం తీసుకురావాల్సిందే. ఇవన్నీ రైతులు నన్నడిగినవే. ఇవన్నీ చేయకపోతే.. రైతులను విస్మరిస్తే ఈ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. 2014 ఇంకెంతో దూరం లేదు. మరో మూడేళ్లే. రైతు పక్షపాతిగా ప్రభుత్వం లేకపోతే ఏ ప్రభుత్వమూ నిలబడదు’’ అని ఆయన సర్కారును హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో వస్తాననుకోలేదు..
పర్యటనలో ముందుగా చుండూరు మండలం చిన్నపరిమి రైతులను యువనేత పరామర్శించారు. స్వాగతం పలికేం దుకు భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈ గ్రామానికి ఇలాంటి పరిస్థితుల్లో వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. నాన్న బతికున్న రోజుల్లో ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. రైతు కంట కన్నీరు చూడకూడదు.. రైతు కంట కన్నీరు చూస్తే రాష్ట్రానికి అరిష్టం అని చెప్పేవారు. సంవత్సర కాలంగా వరుసగా వరుస నష్టాలు చవిచూస్తున్నారు. ఒకసారీ కృష్ణా ఉప్పొంగింది. రబీలో లైలా, మొన్న జల్, ఈరోజు మళ్లీ వాయుగుండం.. రైతులు ప్రతిసారీ అప్పుతెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఖరీఫ్ నుంచి రబీకి.. రబీ నుంచి ఖరీఫ్‌కు.. ఇలా ప్రతిసారి దెబ్బమీద దెబ్బపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఏవిధంగా అప్పులు తీర్చగలడని నేను అడుగుతున్నా.. ’ అని ప్రశ్నించారు.
ప్రధాని హామీ ఇచ్చినా..
‘కృష్ణా పొంగినప్పుడు సాక్షాత్తూ ప్రధానమంత్రే వచ్చి వెయ్యి కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. ఒకసారి *500 కోట్లు ఇచ్చారు. మరోసారి *150 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ దెబ్బ సరిపోలేదని మళ్లీ లైలా తుపాను దెబ్బతీసింది. ఆనాడు ఇస్తామన్న ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకా అందకముందే జల్ తుపాన్ దెబ్బతీసింది. జల్ తుపాన్ నష్టాలు లెక్కకట్టే కార్యక్రమం పూర్తికానేలేదు. మళ్లీ దెబ్బ. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది ప్రత్యేక పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని గుర్తించాలని నేను వేడుకుంటున్నా. రైతును కాపాడే ప్రతి కార్యక్రమం చేపట్టాలని మీ అందరి సమక్షంలో అడుగుతున్నా. నాకు బాగా గుర్తుంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు తాను రైతుల పక్షపాతినని చెప్పి ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్తుపైనే తొలి సంతకం చేశారు. రైతు ఏనాడూ కన్నీరు పెట్టకూడదని తలచారు. కన్నీరు రాకుండా చూశారు. రైతులందరికీ రుణమాఫీ ఇచ్చినప్పుడు ఆ పథకం అందరికీ అందట్లేదని భావించి.. అందని వారికి *5 వేలు ఆర్థిక సాయం అందించారు...’ అని గుర్తు చేశారు.
*5 వేల సాయంతోపాటు వడ్డీ మాఫీ చేయండి
‘ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తుపాను బా ధిత రైతుకు *5 వేల తక్షణ సాయం ప్రకటించాలి. రుణాలు కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వరుసగా దెబ్బమీద దెబ్బపడుతోంది. ఈపరిస్థితుల్లో రుణాలు రీషెడ్యూలు చేసి వడ్డీ మాఫీ చేయాలి..’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘తిరగాల్సిన గ్రామాలు ఉన్నాయి.. ఒక్కమాట చెబుతున్నా.. నేను ఇక్కడ రైతులను ఓదార్చడానికి నేనొస్తే.. మీ ప్రేమ ఆప్యాయతలతో నన్ను ఓదారుస్తున్నారు. మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నా..’ అంటూ చిన్నపరిమిలో సెలవుతీసుకున్నారు.
అండగా నేనున్నా.. మంచిరోజులొస్తాయి..
పెదరావూరులో పొలాలను పరిశీలించి బాధిత రైతుల్ని పరామర్శించే క్రమంలో జగ్గడిగుంటపాలేనికి చెందిన కలవకొల్లు వాణి జగన్‌తో మాట్లాడుతూ.. తాను మూడెకరాల వరి మాగాణి సాగుచేశానని, వర్షాలకు పంటమొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకుంది. ఎకరా కౌలు సాగు కోసం *20 వేలకుపైగా పెట్టుబడి పెట్టానని ఇప్పుడు చేతికొచ్చిన పంటంతా నీటిపాలైందని ఆమె వాపోయింది. జగన్ ఆమెను ఓదారుస్తూ.. ‘అమ్మా.. పంటనష్టం గురించి దిగులుచెందకండి.. వచ్చేవన్నీ మంచి రోజులే.. మీకు అండగా నేనుంటా.. రైతు కన్నీటిని ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. లేదంటే ఒత్తిడి చేసైనా మిమ్మల్ని ఆదుకునేందుకు నేనున్నా..’ అంటూ భరోసా ఇచ్చారు. పెదరావూరుకు చెందిన మహిళా రైతులు చేవూరి జ్యోతి, ఏకశిరి గాయత్రి, పొన్నం అన్నపూర్ణలు యువనేతతో మాట్లాడుతూ.. వరుసగా ఏడాది కాలంగా తమకు పంటలేసినప్పుడల్లా దెబ్బమీద దెబ్బ తగులుతోందని, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదని జగన్‌కు వివరించారు. అప్పులిచ్చిన బ్యాంకులు, ప్రైవేటు వడ్డీవ్యాపారులు ఒత్తిడి చేసే పరిస్థితులు వస్తే భయపడొద్దని జగన్ వారికి ధైర్యం చెప్పారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు.
జగన్ వెంట మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, మర్రెడ్డి వెంకట శివరామకృష్ణారెడ్డి, సినీ నటుడు విజయచందర్ తదితరులున్నారు.
చెమ్మగిల్లిన జగన్
చుండూరు మండలం చినపరిమిలో రైతులు ఒక్కొక్కరుగా తమ బాధలను జగన్‌కు వివరిస్తున్న సమయాన ఆయన ఓ నిమిషంపాటు మౌనంగా పంట నష్టపోయిన పొలాలవైపే చూస్తూ చలించిపోయారు. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ రైతులతో మాట్లాడారు. ‘రైతు బాగుకోసం ఆనాడు నాన్నగారు వైఎస్ ఎంతగా తపించేవారో, అలాగే నేనూ మీ అందరికీ అండగా ఉంటాను..’ అంటూ ధైర్యం చెప్పారు.
అన్నా.. మీరు సీఎం అయితే చాలన్నా..
‘రాజును బట్టి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము మంచిగున్నామన్నా..ఎవరెవరో ముఖ్యమంత్రులుగా చేసి మమ్మల్ని కాపాడలేరన్నా..మీరు సీఎం అయితేనే రైతులకు న్యాయం చేయగలుగుతారన్నా...’ అంటూ తనను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌మోహనరెడ్డి వద్ద చినపరిమికి చెందిన ఆలూరి బుజ్జిబాబు తన ఆకాంక్షను వెల్లడించారు. తాను ఐదెకరాలు సాగుచేసి నష్టపోయినట్టు చెప్పారు.
జనసంద్రాలైన నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ,్ల నడికుడి,
సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్లు
ఇసుకేస్తే రాలని తెనాలి.. రైలు దిగి స్టేషన్ బయటికొచ్చేందుకే 40 నిమిషాలు..
అక్కడి నుంచి తెనాలి పట్టణం దాటడానికి గంట
మధ్యాహ్నం 2.30కు చేరాల్సిన గ్రామానికి ఆరింటికిగానీ చేరలేనంతలా జనాభిమానం
ఒక్కో స్టేషన్‌లో ఆరు వేల నుంచి 10 వేల మంది అభిమానులు. రైల్వే స్టేషనా.. లేక బహిరంగ సభా.. అన్నట్లు పోటెత్తారు. ఎక్కడి జనం..! ఏమి అభిమానం..! ఎవరినోట విన్నా ఇదే మాట. టీవీల్లో స్వాగత దృశ్యాలు చూస్తున్నవారికీ అదే ఆశ్చర్యం. యువనేత జగన్‌మోహనరెడ్డి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారని తెలిసి ఎవరికి వారు పరుగులు తీశారు. ఆయా స్టేషన్ల చుట్టుపక్కల నుంచే కాకుండా సమీప ప్రాంతాల నుంచి బస్సులు, జీపులు, కార్లల్లో తండోపతండాలుగా తరలివచ్చారు. సికింద్రాబాద్ నుంచి గుంటూరు జిల్లా తెనాలి మధ్య ఉన్న అన్ని స్టేషన్లలోనూ జగన్ రైలు ఎప్పుడొస్తుంది? ఇంకా ఎంత సమయం పడుతుంది? అన్న ప్రశ్నలే వినిపించాయి. అభిమాన సందోహంతో స్టేషన్లు మరో మనిషి పట్టడానికి వీల్లేనంతగా కిక్కిరిసిపోయాయి. ఎట్టకేలకు వారు ఎదురుచూస్తున్న రైలు రావడం, అందులో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డంతో జగన్నినాదాలు మిన్నంటాయి. యువనేత దిగాల్సిన తెనాలి స్టేషన్‌లో ఈ అన్ని స్టేషన్లనూ మించిన అభిమాన తాకిడి దర్శనమిచ్చింది. ఇక్కడ స్టేషన్ బయటకు వచ్చేందుకే ఆయనకు 40 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి పట్టణం దాటడానికి గంట పట్టిందంటే జన తాకిడిని అర్థం చేసుకోవచ్చు.
నలిగిపోయిన యువనేత
తెనాలి స్టేషన్‌లో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారిని నియంత్రించడానికి తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడంతో విపరీతంగా తోపులాటలు జరిగాయి. దీంతో వారిమధ్య నలిగిపోయిన జగన్ ఒకదశలో పడిపోయే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1.50 గంటలకు రైలు దిగిన ఆయన 2.30కు గానీ స్టేషన్ నుంచి బయటకు రాలేకపోయారు. తెనాలి స్టేషన్ నుంచి పట్టణం బయటకు రావడానికే గంట సమయం తీసుకుంది. ఇక జగన్ పర్యటించిన తెనాలి ప్రాంతంలో పొలాల వెంబడి దారులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకోవాల్సిన తొలి పర్యటన గ్రామం చేరేసరికి సాయంత్రం ఆరైంది. జగన్ వెంట సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తరలివచ్చారు. పిడుగురాళ్లలో గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి వారికి తోడయ్యారు.
అడుగడుగునా.. జనహోరే
గుంటూరు జిల్లాలో ఇటీవలి వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన యువనేత జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు పర్యటన ఆద్యంతం ఆలస్యంగా సాగింది. ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన జగన్‌కు రామన్నపేట, నల్లగొండ స్టేషన్లలో అభిమానులు జై జగన్ నినాదాలతో స్వాగతం పలికారు. మిర్యాలగూడ స్టేషన్‌లో అనూహ్యంగా జనం తరలిరావడంతో జగన్నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని నడికుడి స్టేషన్ జనసంద్రంగా మారింది. స్టాప్ లేని బెల్లంకొండ తదితర స్టేషన్లలో సైతం జనం వేచి ఉండి.. నినాదాలతో హోరెత్తించారు. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు స్టేషన్లకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక తెనాలి రైల్వే స్టేషన్‌లో జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. స్టేషన్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఇసకేస్తే రాలదనిపిం చింది. తెనాలి వీధుల్లో అడుగడుగునా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు దారిపొడవునా బారులు తీరారు. మహిళలు బంతి, గులాబీలతో పూలవర్షం కురిపించారు. జగన్‌కు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు.
బురద నిండిన పొలాల్లో..
జగన్ తెనాలి నుంచి నేరుగా చుండూరు మండలం చినపరిమి గ్రామానికి చెందిన పొలాలకు చేరుకున్నారు. అయితే అక్కడికి కూడా అభిమానులు వచ్చి చుట్టుముట్టడంతో బాధిత రైతులను పరామర్శించేందుకు జగన్ చాలా ఇబ్బందులు పడ్డారు. భద్రతావిభాగంలోని రోప్ పార్టీ సిబ్బంది చేతులెత్తేశారు. ఓర్పుతో జగన్ అభిమానులను దాటుకొని పొలాల్లోకి సాగారు. బురద పొలంలో మోకాళ్ల వరకు దిగబడ్డా లెక్కచేయకుండా వెళ్లి రైతులతో మాట్లాడారు. ఎంత పెట్టుబడి పెట్టారు? ఏమేరకు నష్టపోయారు? ఎలాంటి సాయం కావాలి? వంటి విషయాలు అడిగారు. తుపాను వల్ల నష్టపోయిన కౌలు రైతులతోనూ మాట్లాడారు. నీటిలో మునిగి.. మురిగిపోయి ఉన్న వరి పనలను చూసి జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. అయితే అభిమానుల ఉత్సాహం, నినాదాల మధ్య రైతులతో సరిగ్గా మాట్లాడలేకపోయారు. దారివ్వాలని పదే పదే విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. చినపరిమికి చెందిన ఏడుగురు రైతుల పొలాలకు వెళ్లి వారితో మాట్లాడారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చినపరిమి చేరుకోవాల్సి ఉండగా.. గ్రామం చేరేసరికి సాయంత్రం ఆరైంది. జగన్ గ్రామం దాటి మరో గ్రామానికి వె ళ్లేసరికి ముప్పావుగంట నుంచి గంట వరకు పట్టింది.
రైతును పట్టించుకోకపోతే పోయేకాలమే
చినపరిమి నుంచి పెదపరిమి చేరేసరి ఏడయ్యింది. అక్కడి నుంచి కూచినపూడి, పెదపూడిల మీదుగా అమృతలూరు చేరేసరికి రాత్రి 8.30 అయ్యింది. ఇక్కడ బాప్టిస్టు చర్చిలో ప్రార్థనల అనంతరం చర్చి బయటకు వచ్చి పావుగంటపైనే ప్రసంగించారు. అనంతరం గోవాడ రామాలయంలో పూజలుచేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. 11 గంటలకు చెరుకుపల్లిలో అంబద్కేర్ విగ్రహానికి పూలదండ వేసి రైతులనుద్దేశించి ప్రసంగించారు. అన్నంపెట్టే రైతును పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి పోయేకాలమేనని హెచ్చరించారు. గ్రామాల్లో రైతులు.. ‘ఆనాడు రాజన్న.. నేడు జగనన్న..’ అంటూ నినాదాలివ్వడం విశేషం.
‘కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపిస్తారు..’
జగన్ కేవలం రైతులను పరామర్శించేందుకే వచ్చారని.. మరోసారి వచ్చి రాజకీయాలు మాట్లాడతారని.. కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపిస్తారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు పేర్కొన్నారు. చినపరిమిలో జగన్ రాకకు ముందు ఆయన ప్రసంగించారు. పదవుల కోసం జగన్‌ను వదిలివెళ్లిన వారిని చూసి పైనున్న వైఎస్ బాధపడ్డా.. ప్రజల ఆదరణ చూసి తప్పక ఆనందిస్తారన్నారు.
టీచర్ ఇంట్లో బస
పరామర్శల పర్యటన ఆలస్యం కావటంతో జగన్ శుక్రవారం రాత్రి చెరుకుపల్లిలో బస చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రమే రేపల్లె చేరుకుని పెనుమూడి మీదుగా కృష్ణాజిల్లాకు వెళ్లాలని నిర్ణయించారు. అనూహ్యమైన ప్రజా స్పందన కారణంగా పర్యటన ఆలస్యమవుతూ రాత్రి 11 గంటలకు చెరుకుపల్లి చేరుకుంది. దీంతో రాత్రికి అక్కడే మద్ది వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు ఇంట్లో బస చేశారు. యువనేత శనివారం చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో పర్యటిస్తారు. మరో రోజు పర్యటించయినా షెడ్యూలు పూర్తిచేస్తారు.