* వైఎస్ ఆచరించిన ‘సంక్షేమం’ పై చర్చ.. దానికోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు
* ప్రారంభోపన్యాసం చేయనున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
* తొలిరోజు తొమ్మిది అంశాలపై ప్రసంగించనున్న నాయకులు, నిపుణులు
* రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై లోతైన సమీక్ష
* తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు..
మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... అదే ఎజెండాతో తొలి ప్లీనరీ సమావేశాలకు సిద్ధమయింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఇక్కడి ఇడుపులపాయలో జరిగే ఈ సమావేశాలు... పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ సతీమణి విజయమ్మ ప్రారంభోపన్యాసంతో మొదలుకానున్నాయి. మహానేత మరణానంతరం సామాన్యుడికి ఒక్కొక్కటిగా దూరమయిపోతున్న సంక్షేమ పథకాల కోసం ఏ వ్యూహం అనుసరించాలి? వైఎస్సార్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంతో పాటు... వాటిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పరంగా ఏం చేయాలి? అనే అంశాలు తొలిరోజైన శుక్రవారం ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాలపై తొలిరోజు జరిగే చర్చలో... భూమిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయాన్ని లాభసాటి చేయటంతో పాటు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికీ వైద్యం, విద్య అందించేందుకు పార్టీ ఎలాంటి డిమాండ్లు చేయాలి? వాటి సాధనకు ఎలా ఉద్యమించాలనే అంశాలపై చర్చ సాగుతుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
సంక్షేమం విషయంలో దివంగత నేత వైఎస్సార్ మార్గమే అనుసరణీయమని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఆయన తన పాదయాత్రకు పెట్టిన ‘ప్రజాప్రస్థానం’ పేరునే ఈ సమావేశాలకూ ఖరారు చేసింది. అంతేకాదు. ఆయన పుట్టిన రోజైన జూలై 8నే... అది కూడా ఆయన సమాధి చెంతనే ఈ సమావేశాలనూ ఆరంభిస్తోంది. ఇటీవలి ‘కడప’ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల ఊహలక్కూడా అందని చరిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయాలపై నిర్ణయాత్మక ముద్ర వేసిన యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. దీంతో తొలి ప్లీనరీపై జాతీయ స్థాయి పార్టీలూ నిశితంగానే దృష్టి పెట్టాయి. అందుకనే రాజకీయ ప్లీనరీల్లో ఆనవాయితీగా వినిపించే రాజకీయ ప్రసంగాలు కాకుండా, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే సమీక్షలతో ఈ ప్లీనరీ సాగనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
‘‘ఇదో సువర్ణాధ్యాయం. రాష్ట్రం నలుమూలల నుంచి కొత్త ఆశలతో వచ్చే వేల మంది ప్రతినిధులు... రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టబోతున్నారు. సమాజం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల పార్టీ వైఖరిని ఆవిష్కరించడానికి ఇదో వేదిక కాబోతోంది’’ అని పార్టీలోని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తొలిరోజు తొమ్మిది అంశాలపై నేతలు, నిపుణులు ప్రసంగిస్తారని, రెండవరోజు మరో ఐదు అంశాలపై ప్రసంగాలు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు.
వెనుకబడిన ప్రాంతాలపై చర్చ...
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మరణించాక ఒక్కొక్కటిగా రాలిపోతుండటంపై జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు పోరాటాలు చేసింది. ఇలాంటి వైఖరిని సహించేది లేదంటూ ధర్నాలు, నిరాహార దీక్షలతో ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు పంపించింది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో సమగ్రమైన చర్చకు సిద్ధమైన వైఎస్సార్ తనయుడు... రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ చెందిన పలువురు మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులతో సమాలోచనలు జరిపాకే ‘ప్రజాప్రస్థానం’ పేరు ఖరారు చేశారు.
అంతేకాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రాంతీయ వాదంపైనా ఈ ప్లీనరీలో లోతుగానే చర్చించనున్నట్లు సమాచారం. ‘‘తెలంగాణ అంశంతోపాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను కూడా చర్చించే అవకాశముంది. తెలంగాణ అంశంపై ఆ ప్రాంతానికి చెందిన నిపుణులే మాట్లాడతారు’’ అని తెలంగాణకు చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.
ఇడుపులపాయలో వైఎస్ జగన్ సమాలోచనలు
ఇడుపులపాయలోని తన స్వగృహంలో గురువారం సాయంత్రం పార్టీకి చెందిన నేతలు, మేధావులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాలోచనలు జరిపారు. శుక్రవారం ప్రారంభమయ్యే ప్లీనరీలో చర్చించనున్న అంశాలు, ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై మరోసారి లోతుగా చర్చించారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, ఎస్.రఘురామిరెడ్డిలతోపాటు మేధావులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment