ప్రజల ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉన్నంతకాలం
సోనియా, సీఎం, చంద్రబాబు.. ఎవ్వరితోనైనా కొట్లాడతా
ప్రజల గుండెల్లో ఇంకా బతికున్నారన్న కక్షతో వైఎస్‌పై
బురదజల్లేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయి
మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ విచారణలు, ఐటీ నోటీసులు, చిత్రహింసలు...
అయినా ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి
సైతం వెనుకాడను... నా కాళ్లు, వెన్నెముక విరగ్గొట్టినా కూడా.. మళ్లీ కెరటంలా పైకిలేస్తాను
ఎందుకంటే నాకు దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి
నాన్న వైఎస్ సాక్షిగా చెప్తున్నా నాపై ప్రజలనమ్మకాన్ని వమ్ముకానీయను
కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర నుంచి-ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనుకాడనని, ప్రజల ప్రేమాభిమానాలు తనకు అండగా ఉన్నంతకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోసైతం కొట్లాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదజల్లడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలో భాగంగానే తనకు కేసుల వేధింపులని దుయ్యబట్టారు.
‘నాపై సీబీఐ విచారణలు జరిపించవచ్చు.. ఇన్‌కంటాక్స్ నోటీసులు ఇప్పించవచ్చు.. తప్పుడు కేసులు బనాయించవచ్చు.. నా కాళ్లు, వెన్నెముకను కూడా విరగ్గొట్టవచ్చు.. ఎన్ని చేసినా మళ్లీ కెరటంలా పైకిలేస్తాను. ఎందుకంటే నాకు, అమ్మకు ఆ దేవుడి దయ, వైఎస్‌ను ప్రేమించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడను. చనిపోయిన నాన్న సాక్షిగా చెపుతున్నా.. నాపై ప్రజలు పెట్టుకున్న అచంచల విశ్వాసాన్నీ, నమ్మకాన్ని ఏ ఒక్కరోజు.. ఏ ఒక్క సందర్భంలోనూ వమ్ముచేయను.
వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రజల ప్రేమాభిమానాలు నాకు అండగా ఉన్నంతకాలం సోనియా గాంధీతోనైనా కొట్లాడతా.. ముఖ్యమంత్రితోనైనా కొట్లాడతా.. చంద్రబాబు, ఈనాడు, తోక పత్రిక, ఈ మధ్యే ఆ గ్రూపులో చేరిన టీవీ-9...తోనైనా కొట్లాడతా. ప్రజల ఆప్యాయత, అనురాగాలు నాకు తోడుగా ఉన్నంతకాలం దేశంలో ఎవ్వరితోనైనా కొట్లాడతా’ అని జగన్‌ఉద్వేగంగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రలో ఆయన కోయిలకుంట్లలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి ఉద్విగ్నంగా ప్రసంగించారు. దీనికి ముందు హరివరం, ఉయ్యాలవాడ, పూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తిలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
నేను చేసిన తప్పల్లా మాట మీద నిలబడడమే
దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో.. ఇచ్చిన మాట తప్పకపోవడమే నేను చేసిన తప్పు.. అలా మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ ఎంక్వైరీలు, ఇన్‌కంటాక్స్ నోటీసు లు, చిత్రహింసలు.. కేవలం మాటే కదా అని అందరు రాజ కీయ నాయకుల్లాగా నేనూ గాలికి వదిలేసి ఉంటే.. సోనియా నా భుజం తట్టి వెరీగుడ్ అనేవారు.. కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు.. కానీ నేను అలా చేయలేదు.. నాన్న చెప్పినట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటపై నిలబడాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఈ రోజు నాపై పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైమరీ కుట్రలు చేస్తున్నాయి.
ఆ దేవుడే చేయిస్తున్నాడు: నేను ఆ మహానేత బాటలో నడుస్తున్నప్పుడు.. అది పూలబాట కాదు.. కష్టాల బాట అని ఆ దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఆ దేవుడే ఆ రోజు ఎందుకు చేశాడోగానీ.. నల్లకాలువలో నాతో మాట ఇప్పించాడు.. ఆ దేవుడే ప్రతి గుడిసెలోకీ వెళ్లేలా చేశాడు.. పేదవాడి కష్టాలు నాకు చూపించాడు.. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలిసేలా చేశాడు.. ఒక్క మాటైతే చెప్పగలుగుతున్నా.. నేను తిరిగినన్ని కిలోమీటర్లు ఏ నాయకుడూ తిరగలేదు.. నేను చూసినంత పేదరికం ఏ నాయకుడూ చూడలేదు. దాదాపు 300-350 కుటుంబాలను వారి గుడిసెల్లోకి వెళ్లి చూశాను.. వారి పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తప్ప ఏ ఒక్క నాయకుడికీ తెలియదని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు ఎందుకు చేయించాడో తెలియదుగాని.. ఇన్ని కష్టాలు వచ్చినా... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా మనసుకు మాత్రం సంతోషంగా ఉంది. సీఎం స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు వైఎస్‌ను మరో వందేళ్లు మర్చిపోని విధంగా ఆ సువర్ణయుగాన్ని ముప్పై ఏళ్లపాటు నేను అందివ్వగలనన్న నమ్మకం నాలో వెయ్యిరెట్లు పెరిగింది.
ప్రజల గుండెల్లో ఉన్నందుకే వైఎస్‌పై బురద
మహానేత మరణించాక కూడా ప్రజల మనసు లోతుల్లో పదిలంగా ఉన్నారు. అందుకే ఆయనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తిరిగి రాలేడని తెలిసీ.. చనిపోయారన్న కనీస విచక్షణ కూడా పక్కనబెట్టి పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘కాంగ్రెస్ హౌస్ కమిటీ వేస్తానంటేనే నేను అసెంబ్లీకి వచ్చాను’ అని చంద్రబాబు అంటారు.. ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనడానికి ఇంతకంటే ఏం చెప్పాలి? దివంగత నేత చనిపోయి రెండేళ్లయ్యాక ఇప్పుడెందుకు కేసు వేశారని అంటే.. సోనియా కేసు వేయమన్నారు కాబట్టే వేశానని మంత్రి శంకర్రావు నిస్సిగ్గుగా చెపుతుంటే.. ఇంతటి దిగజారుడుతనాన్ని చూస్తుంటే బాధేస్తోంది. మరణించిన మహానేతపై బురద చల్లేందుకు ఎంతకైనా దిగజారే ఈ వైఖరి చూస్తోంటే బాధనిపిస్తోంది. చంద్రబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్న చంద్రబాబు ఈ రోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్తగా ఒక్క ఇల్లు లేదు, కార్డు లేదు..
మహానేత మరణించిన ఈ రెండేళ్ల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డులేదు.. ఒక్క కొత్త ఇల్లు లేదు.. 108 కుయ్ కుయ్ చప్పుళ్లూ లేవు.. పెద్ద ఆపరేషన్ చేయించాల్సి వస్తే ఆ దేవుడే దిక్కు... 85వేల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా పథకం ఎక్కడ వేసిన గొంగళి లాగే ఉంది...రెండేళ్ల క్రింత పేద వాడి ముఖంపై వెలిగిన చిరునవ్వు ఇప్పుడు కానరాదు.. మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఒక్క నేతా కనుచూపు మేరలో లేడు.. ఈ దయనీయ పరిస్థితి చూస్తే.. మహానేత రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వమేనా ఇది? అని అనిపిస్తుంది.
త్వరలో మళ్లీ సువర్ణయుగం..
మహానేత సువర్ణ యుగం మళ్లీ కచ్చితంగా వస్తుంది. ఈ రెండేళ్లుగా పేదల ముఖాలపై మాయమైన చిరునవ్వును త్వరలోనే మళ్లీ తెప్పిస్తాను. గతంలో కన్నా మరింత చిక్కటి చిరునవ్వును సుసాధ్యం చేస్తాను. రూ.200 నుంచి రూ.700 పింఛన్‌తో అవ్వలూ, తాతల ముఖాల్లో మరింత చిక్కటి చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. పిల్లలను స్కూలుకు పంపినందుకు తల్లిదండ్రులకు రూ.1,000 చెల్లించే సువర్ణ యుగం త్వరలోనే వస్తుంది. వడ్డీలేని రుణాలతో రైతును ఆదుకునే ప్రభుత్వం వస్తుంది.
రెండో రోజూ అదే ఆప్యాయత.. 5 గంటల ఆలస్యం
కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రకూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇచ్చిన మాట కోసం ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తమ ముందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డానికి ఊళ్లు ఊళ్లన్లీ రోడ్లపైకి వచ్చాయి. ఆయనతో కరచాలనానికి పిల్లా పెద్దా.. అందరూ ఉత్సాహం చూపించారు. అభిమాన సంద్రం వెల్లువెత్తడంతో యాత్ర షెడ్యూల్ కంటే సుమారు ఐదు గంటల ఆలస్యంగా ముందుకు సాగింది.
ఉదయం 9.30 ప్రాంతంలో ఆళ్లగడ్డలోని భూమా దంపతుల ఇంటి నుంచి జగన్ బయలు దేరారు. రాత్రి 11:50కు బనగానపల్లెలో బహిరంగ సభలో మాట్లాడారు. సుమారు ఐదు గంటల ఆలస్యంగా జగన్ ఇక్కడకు వచ్చినప్పటికీ ప్రజలు భారీగాహాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి 12.30 దాటాక కూడా యాత్ర సాగింది.
ఓదార్చిన కుటుంబాలు: హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరయ్య, బనగానపల్లెలో జడ్డువారి మాధవరెడ్డి కుటుంబాలు.
వైఎస్ విగ్రహావిష్కరణలు: 14; కోయిలకుంట్లలో మాజీ ఎమ్మెల్యే కర్రా సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ
యాత్ర సాగిన గ్రామాలు: కొండాపురం, దొర్నిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం, ఉయ్యాలవాడ, రూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తి, కోయిలకుంట్ల, ముదివేడు, ముక్కమల్ల, ఆకుమల్ల, అవుకు, గుండ్లశింగవరం, రాళ్లకొత్తూరు, బనగానపల్లె.
జగన్‌ను పంచెకట్టులో చూడాలనుంది: శోభా నాగిరెడ్డి
దివంగత నేత వైఎస్‌లాగా పంచెకట్టులో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని ఉందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. కోయిలకుంట్ల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నేత అందించిన స్వర్ణ యుగం త్వరలోనే మళ్లీ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
No comments:
Post a Comment