Monday, July 18, 2011

మాటకు కట్టుబడి ఉన్నా.. అందుకే వేధిస్తున్నారు * కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


ఇచ్చిన మాటను గాలికి వదిలేసి ఉంటే సోనియా వెరీగుడ్ అనేవారు
కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు, అయినా మడమ తిప్పలేదు..
మహానేతపై బురద చల్లేందుకే కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టిస్తోంది
మంత్రివర్గ నిర్ణయాలకు వైఎస్ ఒక్కడినే బాధ్యుడిని చేయాలని చూస్తోంది
నా కాళ్లు, వెన్నుపూస విరగ్గొట్టినా కెరటంలా పైకి లేస్తా...
యాత్రలో పాల్గొన్న చెన్నకేశవరెడ్డి, కాటసాని, బాలనాగిరెడ్డి, మోహన్‌రెడ్డి

‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో మాటిచ్చాను. ఏ దేవుడు ఆ రోజు నానోట ఆ మాట పలికించాడోగానీ.. ఆ ఒక్క మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ ఒక్క మాటకు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ నుంచి నన్ను బయటకు పంపించారు. వెంటనే ఐటీ నోటీసులు ఇప్పించారు.. ఇప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు కుమ్మక్కై వారి వయసులో సగం కూడా లేని నన్ను వేధిస్తున్నారు’’


ఆళ్లగడ్డ ఓదార్పు యాత్ర*


‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో మాటిచ్చాను. ఏదేవుడు ఆ రోజు నానోట ఆ మాట పలికించాడోగానీ.. ఆ ఒక్క మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ ఒక్క మాటకు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ నుంచి నన్ను బయటకు పంపించారు. వెంటనే ఐటీ నోటీసులు ఇప్పించారు.. ఇప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు కుమ్మక్కై వారి వయసులో సగం కూడా లేని నన్ను వేధిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఓదార్పు యాత్ర ప్రారంభమైన కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ సభలకు భారీగా హాజరైన జనప్రవాహాన్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

ప్రజల గుండెల్లో ఉండడమే పాపమా?

ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రానికే కాదు దేశానికి సైతం చాటిచెప్పిన మహానేత వైఎస్. ఆయన మరణించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ జనం గుండెలోతుల్లో పదిలంగా గూడుకట్టుకున్నారు. అదే పాపమన్నట్లు ఆయన్ను ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయడానికి ఆయనపై బురదజల్లుతున్నారు. ఆయన రెక్కల కష్టం వల్లే 2004, 2009లలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో సోనియా ఈ రోజు అధికారం చలాయిస్తోందంటే అందుకు కారణం వైఎస్ కాదా?


వైఎస్ ఒక్కడినే బాధ్యుడిని చేయడానికి కుట్ర

వైఎస్ మంత్రివర్గంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలన్నింటికీ మహానేత ఒక్కడినే బాధ్యుడిని చేయాలని కాంగ్రెస్ పెద్దలు కుట్ర పన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సొంత నిర్ణయాలపై సొంత మంత్రి శంకర్రావుతో కేసు వేయించారు. వైఎస్ ఎలాగూ తిరిగిరారు.. సమాధానం చెప్పుకోలేరు అన్న ఆలోచనతో ఆయనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నేనేం తక్కువ తినలేదంటూ అధికారపార్టీతో కుమ్మక్కై మహానేతపై మరిన్ని నిందలు వేస్తున్నారు.


బాబు స్టే తెచ్చుకున్నారు


నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’అన్న చంద్రబాబు.. ఇప్పుడు నాపై అదే సీబీఐ విచారణకోసం డిమాండు చేస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణ కేసులో స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలంగడుపుతున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. వైఎస్‌పై బురదజల్లేందుకు, జగన్‌ను అణగదొక్కేందుకు కోర్టుకెళ్లి మరీ సీబీఐ విచారణ కోరుతున్నారు.


ఒక్కడిపై ఇంత మంది కుట్ర చేస్తున్నారు..


ఒకే ఒక్కడిని భూస్థాపితం చేసేందుకు.. దేశంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఈనాడు పత్రిక, ఓ తోకపత్రిక, ఈ మధ్యే ఈ గ్రూపులో చేరిన టీవీ-9.. అందరూ కలిసి కుట్రలు పన్నుతున్నారు. ఇచ్చిన మాటకోసం నిలబడటమే నేను చేసిన నేరం. ఓదార్పు మానుకుని ఉంటే, సోనియావెరీగుడ్ అనేవారు. కేంద్రంలో నాకూ ఓ మంత్రిపదవి ఇచ్చి ఉండేవారు. కానీ మంత్రి పదవి వద్దనుకున్నాను.. మాట తప్పకపోవడం.. మడమ తిప్పకపోవడం.. విశ్వసనీయత అన్న నా తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను. అందుకే వేధిస్తున్నారు. ఇచ్చిన మాటకోసం, మహానేత ఆశయాలను కొనసాగించే దిశగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా వెరవను.


నా కాళ్లు, వెన్ను విరగ్గొట్టినా.. కెరటంలా పైకిలేస్తా


బహుశా నా కాళ్లు, వెన్ను పూస కూడా విరగ్గొడతారేమో. అయినా సరే.. ఎవరేం చేసినా సరే కెరటంలా పైకిలేస్తా. కాంగ్రెస్, టీడీపీ పెద్దలకు లేనిది.. నాకు, నా తల్లికి మాత్రమే ఉన్నది ఆ దేవుడి దయ, నాన్నను ప్రేమించే ప్రతి గుండె చప్పుడు.. మమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి. దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో నడవడం చేతకాని ఈ ప్రభుత్వం, చనిపోయాక కూడా జనం గుండెల్లో సజీవంగా ఉండటం ఎలాగో నేర్వలేని వారు, దివంగత నేత ఆశయాలను కొనసాగించలేని వారు ఈ రోజు ఆయనపై బురదజల్లుతున్నారు.


అడుగడుగునా జన జాతరే...!


అడుగడుగునా జన నీరాజనం. అడుగు కూడా ముందుకు వేయనీయని అభిమాన సందోహం. ఫలితంగా సోమవారం ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ ఏకంగా 5 గంటలు ఆలస్యమైంది! సాయంత్రం 4.00కు జరగాల్సిన సభ రాత్రి 9.00కు ప్రారంభమైంది! అయినా ప్రజల్లో ఉత్సాహం అణు మాత్రమైనా తగ్గలేదు. తమ అభిమాన నాయకుని కోసం అంతసేపూ వారు భారీ సంఖ్యలో వేచి చూశారు. యాత్ర తొలిరోజు సోమవారం ఉదయం 10కి మొదలైంది. ఆళ్లగడ్డలో భూమా దంపతుల ఇంటి నుంచి బయల్దేరిన ఆయన, తొలుత చాగలమర్రిలో మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మసీదులో ప్రార్థనలు చేసి, సమీపంలోని దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. బాషా ఇంటి నుంచి వేదికను చేరేందుకే అరగంట పట్టింది! జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో గ్రామ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నమాజుకు వేళవడంతో జగన్ ప్రసంగాన్ని కాసేపు ఆపారు. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రసంగించారు.

నాలుగు కుటుంబాలకు ఓదార్పు...: తొలి రోజు చాగలమర్రి, శెట్టివీడు, ముత్యాలపాడు, చక్రవర్తులపల్లె, కృష్ణాపురం, ఆలమూరు, నరసాపురం, ముత్తలూరు గ్రామాల్లో 8 విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. చాగలమర్రిలో మహబూబ్ బాషా, గొడిగనూరులో ఇండ్ల ఇసాక్, ఆళ్లగడ్డలో వన్నూరు బాషా కుటుంబాలను పరామర్శించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాకరాజువేముల చేరుకుని తోట బాలరాజు కుటుంబాన్ని ఓదార్చారు. షెడ్యూల్ మేరకు సోమవారం హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరమ్మ కుటుంబాలను కూడా ఓదార్చాల్సి ఉన్నా అర్దరాత్రి కావడంతో తొలి రోజును ముగించి రాత్రి బసకు ఆళ్లగడ్డ చేరుకున్నారు. మంగళవారం ఉదయం పదింటికి ఆ రెండు కుటుంబాల ఓదార్పుతో రెండో రోజు యాత్ర మొదలవుతుంది.


 వైఎస్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం
- కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఉద్ఘాటించారు. అందుకే తాము జగన్‌కు పూర్తి మద్దతునిస్తున్నామని తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర సోమవారం చాగలమర్రిలో ప్రారంభమైన సందర్భంగా వారు సభా వేదికపై ప్రసంగించారు.
ఎవరేమన్నారో.. వారి మాటల్లోనే..

వైఎస్ అండతోనే గెలిచా
నేను ఐదుసార్లు ఎమ్మెల్యే కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణం. మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఓదార్చటానికి కర్నూలు జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉండాలని మేం నిర్ణయించుకున్నాం. ఆయన వెంట ఓదార్పుయాత్రలో పాల్గొంటాం. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించటం జగన్‌వల్లే సాధ్యం.
- కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే

జగన్ నాయకత్వంలోనే పథకాలన్నీ కొనసాగుతాయి

రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు జగన్ నాయకత్వంలోనే కొనసాగుతాయి. మహానేత మృతిని తట్టుకోలేక ప్రాణాలొదిలిన కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఆయన వెంట ఓదార్పు యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం.
- చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

జగన్‌కు అంతా సహకారం అందించాలి

రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్సార్‌తోనే ప్రారంభమైంది. వైఎస్సార్ మరణంతో పథకాలన్నీ నిలిచిపోయాయి. వాటన్నింటినీ అమలు చేయగల నాయకుడు జగనే. ఆయనకు అంతా సహకారం అందించాలి.
- బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే

జగన్ కోసం ప్రాణాలనూ లెక్కచేయం

సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ఏకమై వైఎస్ జగన్‌ను అణచాలని చూస్తున్నారు. సూర్యుణ్ణి అరచేత్తో ఆపాలనుకుంటున్నారు. ప్రజలు వైఎస్సార్‌ను జగన్‌మోహన్‌రెడ్డిలో చూసుకుంటున్నారు. ఆయన లేని లోటును తీర్చటానికి నేనున్నానంటూ జగన్ ముందుకొచ్చారు. వైఎస్సార్ మరణించాక రెండేళ్లలో పేదవాణ్ణి పలుకరించే వారే కరువయ్యారు. ఒక్క రేషన్‌కార్డు, పక్కాగృహం ఇవ్వలేదు. రైతులను పట్టిం చుకోవటం లేదు. 128 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్క కార్యకర్తను కూడా నిలబెట్టుకోలేకపోయింది. జగన్‌మోహన్‌రెడ్డిని ఆపడం ఆ పార్టీకి సాధ్యం కాదు. పదువులు లెక్క చేయక ప్రజల కోసం పోరాడిన జగన్ స్ఫూర్తితో మేం ముందుకు సాగుతాం. ఆయన కోసం ప్రాణాలను కూడా లెక్కచేయం.
- శోభానాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

వైఎస్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందింది

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం అభివృద్ధి చెందింది. రైతులు పచ్చగా ఉండటానికి కారణం వైఎస్సారే. భవిష్యత్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాం.
- ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ

అణచేకొద్దీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది

జగన్‌ను అణచివేయాలని చూస్తున్నారు. అలా చేసేకొద్దీ ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులు జగన్‌ను అణచేసేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఎవరికైనా చిన్న పదవి ఇవ్వాలన్నా, ఏపనైనా చేయాలన్నా సోనియాగాంధీ వద్ద అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్‌కు పరిపాలించే నైతిక హక్కు లేదు. రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది. ఆయన ఓ వ్యక్తి కాదు శక్తి. జగన్ కోసం సైనికుల్లా ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే.
- భూమా నాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత

No comments:

Post a Comment