Saturday, July 9, 2011

‘' అమ్మ ఒడి '’లా పాలన

 
ప్లీనరీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆత్మను ఆవిష్కరించిన జగన్

ఓదార్పు యాత్రలో పేదల బాధలు చూశాను..
అప్పుడే నా మనసులో పేదరిక నిర్మూలనకుజవాబు మెదిలింది
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం..
‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను బడికి పంపినందుకు తల్లికి డబ్బులిస్తాం
ఎల్‌కేజీ నుంచి 10 వరకు రూ.500, ఇంటర్‌లో రూ.700, డిగ్రీలో రూ.1000 ఆమె ఖాతాలో వేస్తాం
108 తరహాలో పశు వైద్యానికి 102..
రైతులకు వ్యవసాయ సూచనల కోసం 103..
భూమి లేని కూలీలకు ఎకరా భూమి సాగుయోగ్యంగా మలిచి ఇస్తాం..
అక్కా చెల్లెళ్లకు, రైతన్నలకు వడ్డీ లేని రుణాలు..
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్..
వ్యవసాయ పరికరాల కొనుగోలుకు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం
అవ్వా తాతలు, వితంతువుల పింఛను రూ.700కు పెంచుతాం
వికలాంగులకు రూ.1000 పెన్షన్..
మద్యపాన నియంత్రణకు కొత్త విధానం..
ఊళ్లలో బెల్టు షాపులనేవే లేకుండా చేస్తాం..
ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని పూర్తిచేస్తాం

  ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిన మహానేత వైఎస్ సువర్ణ యుగాన్ని మళ్లీ తెచ్చే దిశగా పలు చరిత్రాత్మక, సంక్షేమ పథకాలు చేపడతామంటూ బడుగు బతుక్కి భరోసా ప్రకటించారు. పిల్లలను బడికి పంపే తల్లికి డబ్బులు, వృద్ధులు, వితంతువుల పింఛను రూ.700కు పెంపు, వికలాంగులకు రూ.1000 పెన్షన్, మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు, కొత్తగా 102, 103 సేవలు.. ఇలా పలు సంచలనాత్మక పథకాల అమలే తమ పార్టీ ఎజెండా అంటూ వేలాది కరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలకు కొత్త అర్థం చెబుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలకు ఇలా మరింత పరిపూర్ణత చేకూర్చేందుకు ఆయన సంకల్పించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ప్రస్థానం’(తొలి ప్లీనరీ) సమావేశాల్లో ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. వాటిని రూపొందించడానికి దారితీసిన పరిస్థితులను విస్పష్టంగా వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..


నాన్నే నాకు స్ఫూర్తి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక మొట్టమొదటి ప్లీనరీ ఇది. వైఎస్సార్ పాదాల చెంతన, ఆయన ఆశయాల సాధన కోసం నిలబడి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నా. నా కంటే ముందు చాలా మంది మాట్లాడారు. చాలా చాలా చేయాలని తమ తమ వ్యూహాలు చెప్పారు. చెప్పిన ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫలానా పార్టీ అని సగర్వంగా చెప్పుకొనే రీతిలో, ఫలానా నాయకుడు అని గొప్పగా చెప్పుకొనే రీతిలో వైఎస్సార్ ఆశయాల సాధనకు, వైఎస్సార్ కడుపున పుట్టిన ఆణిముత్యం అని చెప్పుకొనే రీతిలో మన విధానాలు ఉంటాయి. మరో వందేళ్ల వరకు ఏ ఒక్కరూ వైఎస్సార్‌ను మరిచిపోలేని రీతిలో, 30 ఏళ్ల పాటు వైఎస్సార్ సువర్ణయుగ పాలన మళ్లీ ఉండేలా పార్టీ ఉంటుందని సగర్వంగా చెబుతున్నా. దివంగత నేత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ఆయన కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు. కేంద్రంలో సోనియాగాంధీ కూడా ఉన్నారు. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని ఏ ఒక్కరికీ తట్టలేదు. ఒక్క వైఎస్‌కు తప్ప. దాదాపు 1500 కిలోమీటర్లకు పైగా కాలినడకన పాదయాత్ర చే స్తూ ప్రతి పేదవాడిని కలుస్తూ వాళ్ల బాధలు చూశారు. వారి బతుకులను అర్థం చేసుకోగలిగారు. ఏం చేస్తే వారి ముఖాన చిరునవ్వు కనిపిస్తుందో అధ్యయనం చేశారు.

ఆ మాటే వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించింది..
కాలమో, మరి దేవుడే అలా చేశాడో తెలియదు గానీ నాతో ఒక మాట అనేలా చేశాడు. నాన్న చనిపోయాక 20 రోజులు కూడా గడవకముందే దేవుడు నా నోటి నుంచి ఎందుకు అనిపించాడో తెలియదు గానీ.. వైఎస్ మరణ వార్తను దిగమింగుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. ఆ మాటే నన్ను కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించింది. పేదరికాన్ని చాలా దగ్గరగా చూశా. నేను చూసినంత దగ్గరగా ఏ నాయకుడూ చూడలేదు. కులాలు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబాన్నీ చూశా. ప్రతి కుటుంబంతో 20 నిముషాల పాటు మాట్లాడాను. ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ. పేదరికంలో ఒక్కో కోణం. ఈ పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలన్న ఆలోచనను ప్రేరేపించిన సమయమది. పేదరిక నిర్మూలనకు ఒక జవాబు నా మనసులో మెదిలింది. ఆ జవాబు నా దగ్గర ఉందని నేను గర్వపడుతున్నా.


పేదరిక నిర్మూలనకు రెండే మార్గాలు..

వైఎస్సార్ పాదయాత్రలో ప్రతి అంశాన్నీ తట్టారు. పేదవాడు ఎందుకు పేదవాడిగా మిగిలిపోతున్నాడో అర్థం చేసుకున్నారు. పేదరిక నిర్మూలనకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. దానికి కులం లేదు. మతం లేదు. ఆకలి, మమకారం మాత్రమే ఉన్నాయి. ఆ రెండు మార్గాల్లో ఒకటేంటంటే.. ప్రతి పేద కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలి. డాక్టరో, ఇంజినీరో, కలెక్టరో కావాలి. పెద్ద చదువు చదివిన వాడు ఉద్యోగం చేస్తూ ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులకు తోడుగా నిలబడితే ఆ కుటుంబ పేదరికం పోతుంది. ఇక రెండో మార్గం. నేను పేద కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే కూలికి వెళుతున్నాం బాబూ అని సమాధానం ఎదురైంది. ఎలా బతుకుతున్నావమ్మా అని అడిగితే కూలి దొరక్కపోతే బతకలేమన్నదే వారి జవాబు. కనీసం ఒక ఎకరా అయినా భూమి ఇస్తే వారి పేదరికం పోతుంది. కేవలం భూమి ఇస్తే సరిపోదు. దాన్ని సాగుకు యోగ్యంగా చేయాలి. అప్పుడే పేదరికాన్ని పోగొట్టగలుగుతాం. వైఎస్సార్ కలలుగన్న ఈ స్వప్నాలే మా పార్టీ జెండా.. అదే మా ఎజెండా.
వైఎస్ హామీలు నెరవేరుస్తాం: 2009లో ఎన్నికలకు ముందు వైఎస్సార్ రెండే రెండు కొత్త హామీలిచ్చారు. రూ.2కి 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఆయన పోయి రెండేళ్లవుతోంది. ఆయన్ను మర్చిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు కదా అని ప్రజలను కూడా పూర్తిగా మరిచిపోయింది. మేనిఫెస్టో అనే దానికి విలువ లేకుండా పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివంగత నేత ఇచ్చిన హామీలను అమలుచేసి చూపిస్తుంది. ఏడు గంటల విద్యుత్తును తొమ్మిది గంటలకు పెంచే హామీని మేం అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చాక సాధ్యమైనంత త్వరలో అమలుచేస్తాం.

ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తాం

ప్రతి కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదువుకోగలిగితే పేదరికం పోతుందని తెలిసినా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే 3400 కోట్లు బకాయిలు ఉంటే, పథకాన్ని కొనసాగించడానికి మరో 3400 కోట్లు కావాల్సి ఉంటే మూడు వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకొంది. పేద కుటుంబాలను కలిసినప్పుడు వారు చదువుకోవాలంటే ఈ 3400 కోట్లు కూడా సరిపోవని నాకు తెలిసింది. వారి పేదరికం పోవాలంటే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివించాలి. ఆ బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది.

‘వైఎస్సార్ అమ్మ ఒడి’

ఆ పేద ఇళ్లకు వెళ్లినప్పుడు అమ్మలతో అక్కలతో మాట్లాడినప్పుడు, చిన్నచిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు ఏడో తరగతి కూడా పూర్తికాకుండానే చదువు మానేశానని చెబుతున్నప్పుడు చాలా బాధనిపించేది. కాస్తోకూస్తో పనిచేస్తే తప్ప బతకలేని పరిస్థితి అని చెబితే బాధేసింది. వీరంతా గొప్ప చదువులు ఎప్పుడు చదువుతారన్న ఆలోచన నాలో రేగింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’. తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి ప్రోత్సాహకంగా డబ్బులు జమ చేస్తాం. ఇద్దరు పిల్లలను చదివించేందుకు వీలుగా జమ చేస్తాం. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు రూ.500 చొప్పున, ఇంటర్‌లో అయితే రూ.700 చొప్పున, డిగ్రీ అయితే వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తాం. ఏ తల్లీ తమ బిడ్డలను చదువుకు పంపకుండా కూలికి పంపే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం. బడికి పంపించినందుకే ఈ ప్రోత్సాహకం. చదువులు మేమే ఉచితంగా చదివిస్తాం. రూ. 3,400 కోట్లయితే ఇప్పటివరకు ఉన్న పథకానికి సరిపోతుంది. ఇప్పటికంటే నాలుగైదింతల బడ్జెట్ పెరిగినా పరవాలేదు. ఇది మా కనీస బాధ్యత. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాం.

ప్రతి స్కూలునూ ఇంగ్లిష్ మీడియం చేస్తాం

అలాగే ఊళ్లకు పోయినప్పుడు అక్కడ స్కూళ్లను చూశాను. అక్కడ ప్రైమరీ స్కూళ్ల దాకానే ఉన్నాయి. ఆ ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ దాకా ప్రతి ఊళ్లోనూ అప్ గ్రేడ్ చేయాలి. ఆ ప్రతి స్కూలులో మౌలిక వసతులు కల్పించాలి. ఆ ప్రతి స్కూలును ఇంగ్లీష్ మీడియం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మా భుజస్కంధాలపై వేసుకొని అది చేపడుతుంది.

అక్కాచెల్లెళ్లకు వడ్డీలేని రుణాలు..

పేదరికంలో మగ్గుతున్న అక్కాచెల్లెళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధనిపించింది. వారికోసం అమలుచేస్తున్న పావలా వడ్డీ పథకానికి వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాలి. దాన్ని నడిపించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో అక్కాచెల్లెళ్ల ముఖాల్లో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం వడ్డీ సొమ్ము ఇచ్చేవరకు బ్యాంకులు ఆ మహిళల వద్ద రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఒక గ్రూపులో ఒక సభ్యురాలు మూడేళ్లలో చెల్లించేందుకు రూ. 30 వేలు తీసుకుంటే.. రూపాయి వడ్డీతో కలిపి ఏటా 45 శాతం సొమ్ము తిరిగి చెల్లించాల్సివస్తోంది. కానీ ఆ 45 శాతం వాళ్లు ఎలా కట్టగలుగుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి అక్కాచెల్లెళ్లకు వడ్డీ లేని రుణం ఇస్తాం. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడే బ్యాంకులు వడ్డీ రాయితీ ఇస్తాయని ఎదురుచూడాల్సిన పనిలేదు. ప్రభుత్వమే ఆ సొమ్మును ముందే కట్టేస్తుంది.

మూడు పూటలా భోజనం ఉండాలి..

నేను ఊళ్లకు వెళ్లినప్పుడు ప్రతి అవ్వా, తాతా పనులు విడిచిపెట్టుకుని నా దగ్గరికి పరుగెట్టుకుంటూ వచ్చారు. ఏమ్మా ఈ వయసులో కూడా పనిచేస్తున్నావా? అని అడిగితే.. బతకాలి కదా బిడ్డా.. మీ నాన్న రూ. 200 ఇస్తున్నాడు.. అయితే బతకడానికి ఆ డబ్బులు సరిపోవు కదా నాయనా అని బదులిస్తే బాధనిపించింది. అవ్వలూ, తాతలు, వితంతువులకు ఇప్పుడిస్తున్న పింఛను సరిపోదు. వారికి మూడు పూటలా భోజనం దొరికేలా కనీసం రూ. 700కు తక్కువ కాకుండా ఉండాలి. మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితి లేనప్పుడు ఈ ప్రభుత్వం ఉంటేనేం.. పోతేనేం? మా పార్టీ అధికారంలోకి వస్తే వీరందరికీ రూ.700తో పాటు, వికలాంగులకు ఇస్తున్న పింఛనును రూ.500 నుంచి రూ. 1000కి పెంచుతాం.

ప్రాధాన్య పరంగా జలయజ్ఞం ప్రాజెక్టులు

దివంగత నేత, ప్రియతమ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం పేరిట కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలని కలలు గన్నారు. ఈ వేళ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వంశధార స్టేజీ-1 ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తవుతుంది. ఐదు కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులున్నాయి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 13 ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి. ఇటువంటి చిన్నచిన్న మొత్తాలు ఖర్చు పెట్టినా చాలా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నా.. పూర్తిగా జలయజ్ఞాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రతి రైతు సోదరుడి ముఖాన శాశ్వతమైన చిరునవ్వు చూడాలి అంటే.. ఒక ప్రాతిపదికన, ఏ ప్రాజెక్టు చేస్తే వెంటనే రైతు సోదరుడికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రాధాన్యత అంశాల పరంగా ప్రతి ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం కూడా పూర్తిగా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు వచ్చేస్థాయికి ఏఏ ప్రాజెక్టులు వచ్చాయన్న అంశాన్ని మనస్సులో పెట్టుకొని, ఆ మేరకు డబ్బులు కేటాయింపు చేస్తూ.. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా చేపడుతుంది.

మద్యపాన నియంత్రణ..

మద్యపానాన్ని నియంత్రిస్తాం. ప్రతి గ్రామంలో మద్యపానం వల్ల చదువుకోలేని పరిస్థితి. చదువుకోలేని పరిస్థితి వల్ల మద్యపానం. ఈ పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. గ్రామాల్లో తాగుడు లేకుండా బెల్టు షాపులు మూసేయిస్తాం. మద్యం షాపులు తగ్గిస్తాం. తాగాలంటే నిరుత్సాహపరిచేలా మద్యపాన విధానం రూపొందిస్తాం.

ఆరోగ్యం మా అభయం..

పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి తెచ్చేది అనారోగ్యం. ఏ గుండె పోటో వస్తే భార్యాపిల్లలు ఐదు రూపాయల వడ్డీకో, పది రూపాయల వడ్డీకో అప్పు తెచ్చి బతికించుకున్నా.. తరువాత దాన్ని తీర్చేందుకు జీవితాంతం ఊడిగం చేయాల్సివచ్చే దుస్థితి. ఇది ఏ పేదవాడికీ రాకూడదు. మా సీఎం ఉన్నాడన్న భరోసా ఉండాలి. నేను ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానో, ఏ పడక మీద చికిత్స పొందుతున్నానో, అదే ఆస్పత్రిలో, అదే పడకపైన పేదోడు కూడా చికిత్స పొందాలి. వైఎస్సార్‌లాంటివాడే మా సీఎం అని చెప్పుకొనేలా ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం కనీసం 108 వాహనానికి డీజిల్ పోసే పరిస్థితి లేదు. రిపేరు చేయించే స్థితిలో లేదు. ఆస్పత్రికి వెళితే మందులు కూడా దొరకని దుస్థితి. మా ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న 800 ఆంబులెన్సులను 1,500కు పెంచుతాం. 104లో పనిచేసే వాళ్లకు నాలుగైదు నెలలుగా జీతాలు దొరకని పరిస్థితి. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉండేలా 1,100 వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో దాంట్లో ఇద్దరు వైద్యులు ఉండేలా చూస్తాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించాలన్న ఆలోచన చేస్తోంది. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలున్నాయా అన్న ఆలోచన చేయట్లేదు. మేం ప్రతి జబ్బుకూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తూనే, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం.

ఏటా పది లక్షల ఇళ్లు..

1947 నుంచి 2004 వరకు రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారని గర్వంగా చెబుతున్నా. అంతేకాదు. ఆ ఐదేళ్లలో ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. దేశం మొత్మమ్మీద మిగతా రాష్ట్రాల్లో కట్టిన ఇళ్లు 48 లక్షలే. అంటే దేశమంతా ఒకెత్తు. వైఎస్సార్ కట్టించిన ఇళ్లు ఒకెత్తు. మేం ప్రతి ఏటా కనీసం 10 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా.. ఇల్లు లేదని ఎవరూ చేతులెత్తే పరిస్థితి ఉండకూడదు.

ఇంకా ఆలోచనల్లో చాలా పథకాలు

ఇంకా ప్రతి దళిత సోదరుడి నుంచి బీసీ, మైనారిటీ సోదరుడి వరకు మేలు చేసేందుకు నా ఆలోచనల్లో చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రతి ఒక్కరి ముఖంలో ఎలా చిరునవ్వు చూడగలమో అధ్యయనం చేస్తాం. ఇదీ మా బడ్జెట్, ఇదీ మా పార్టీ, ఇతనే మా నాయకుడు అంటూ మా మేనిఫెస్టోతో ఎన్నికల్లో సగర్వంగా చెప్పుకొనేలా చేస్తాం.

‘మద్దతు’కు 3 వేల కోట్లు

కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి చూశాం. కానీ ఎన్నడూ లేనివిధంగా రైతులు సమ్మెకు దిగారు. వరి పండించలేని పరిస్థితిని సిగ్గులేని ప్రభుత్వం తెలుసుకోవాలని సమ్మె చేస్తున్నామని వారంటున్నారు. మద్దతు ధర దక్కని పరిస్థితి ఇక ఉండదు. మద్దతు ధర కోసం రూ.3 వేల కోట్లు పక్కనపెడతాం. మద్దతు ధర దొరకనప్పుడు ఆ సొమ్ముతో ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ఉంటే.. సగం మాత్రమే మన నిల్వలు వాడుకునేందుకు వినియోగిస్తున్నాం. మిగతా సగం ఇతర రాష్ట్రాల కోసం వినియోగిస్తున్నాం. గిడ్డంగులు ఇవ్వరు. మద్దతు ధర ఇవ్వరు. ఎగుమతి చేసుకోనివ్వరు. ప్రాథమిక పాఠశాలను గిడ్డంగులుగా వాడుకునే దుస్థితి చూసి బాధనిపిస్తోంది. మా హయాంలో మరో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ప్రభుత్వమే కడుతుంది. రైతులు మోటార్లు కొనుగోలు చేసుకునేందుకు, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు 14 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. వీటి కోసం 3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం ఇస్తాం.

వడ్డీలేని పంట రుణాలు..

నేను వెళ్లినప్పుడు ప్రతి రైతు ముఖాన కన్నీరు కనిపించింది. కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితి. మొన్న అనంతపురం వెళ్లాను. కరువొచ్చి పంట బీమాకోసం ఎదురుచూస్తున్న రైతుకు ఏడాది గడిచినా బీమా డబ్బు రాలేదు. వరదలు వచ్చి పంట నష్టపోయినప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లి పరిస్థితి చూసి లక్షలాది మందితో విజయవాడలో దీక్ష చేస్తే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం గాలి మాటలు చెప్పింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ఉత్తమాటలు చెప్పింది. వైఎస్సార్ ఉన్నప్పుడు పసుపు రైతు 15 వేలకు అమ్ముకుంటే ఇప్పుడు 4 వేలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. వరి వేసుకునే బదులు ఉరేసుకుంటే మేలని రైతు సోదరులు అన్న మాట విన్నా. ఆ రైతు ముఖాన చిరునవ్వు ఉండాలంటే రైతు పక్షపాతి సీఎంగా ఉండాలి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ రైతు బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెబుతున్నా. రైతన్నకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని చెబుతున్నా.

ఆ శాఖ మనకే తెస్తా..


ఉపాధి హామీ పథకాన్ని రైతులకు, చేనేత కార్మికులకు అనుసంధానం చేయాలి. ఇది ప్రధానమంత్రి చేతుల్లో ఉన్న అంశం. కనీసం 35 ఎంపీ స్థానాలు నాకివ్వండి. అప్పుడు కేంద్రం మన మాట ఎందుకు కాదంటుందో చూద్దాం. ఎవరో వ్యవసాయ మంత్రి కావాల్సిన దుస్థితి మనకేంటి. వాళ్ల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి మనకెందుకు? 35 స్థానాలు ఇస్తే ఆ శాఖ మనకే తెస్తా. ఈరోజు రైతులు తాము అధికోత్పత్తి సాధించడానికి ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలియని పరిస్థితి. వారి భూముల్లో సారమెంత? ఉత్పత్తి ఎలా పెంచాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? మేం ఆలోచించాం. 104, 108 మాదిరిగా రైతులకు మొబైల్ అగ్రిక్లినిక్‌లు అందుబాటులో ఉండేలా 103ని తెస్తాం. వాటిలో ఉండే డాక్టర్లు రైతులకు సలహాలిస్తారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే అనుబంధ వ్యవసాయం కూడా ఉండాలి. పాడిపశువులు పెంచుకోవాలి. వాటి సంరక్షణకు 102ని తీసుకొస్తాం. దాంట్లో వెటర్నరీ వైద్యులు ఉంటారు. ఇంటికొచ్చి మీ పశువులకు వైద్యం చేస్తారు.


అందరికీ లబ్ధి - ప్రజా ప్రస్థానం సంక్షేమ సూత్రం 


తొలి ప్లీనరీలో భారీ లక్ష్యాలు  నిర్దేశించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తొలి ప్లీనరీలో ప్రకటించిన సంక్షేమ లక్ష్యాల విసృ్తతి ఒకసారి పరిశీలిస్తే... వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రతి వర్గమూ, ప్రతి ప్రాంతమూ, ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో లబ్ధిపొందుతారని స్పష్టమవుతోంది. పార్టీ ప్లీనరీ నిర్దేశించుకున్న ఈ లక్ష్యాల అమలుతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ప్రభుత్వం, పాలన పట్ల విశ్వాసం, కనీసావసరాల లభ్యతపై భరోసా కలుగుతుంది. ఒక సగటు కుటుంబానికి ఆ ధీమాను కల్గించాలనే సంక్షేమసూత్రం ఆధారంగానే పార్టీ ఈ కొత్త భారీ లక్ష్యాలను నిర్దేశించుకుందని ఆ పార్టీ ముఖ్యనేతలూ వివరిస్తున్నారు. విభిన్న ఆర్థికస్థాయిల్లోని ప్రజలపై ఈ కార్యక్రమాల ప్రభావం ఎలా ఉంటుంది, స్థూలంగా సమాజంలో ఎందరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి విశ్లేషిస్తే...

‘అమ్మ ఒడి’లో 2 కోట్ల మంది: ఎల్‌కేజీ నుంచి డిగ్రీ, వృత్తి విద్య, పీజీ వరకు ప్రస్తుతం ఒకటిన్నర కోట్ల మంది విద్యార్థులున్నారు. ఈ సంఖ్యను బట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన అమ్మ ఒడి పథకానికి ఏటా రూ.9 వేల కోట్లు అవసరమవుతాయి. డ్రాపవుట్లు తగ్గి, స్కూళ్లలో నమోదు శాతం పెరిగి వచ్చే రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య 2 కోట్లకు పెరగవచ్చు. ఈ పథకం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించాల్సిన సొమ్ము రూ.12 వేల కోట్లు దాటుతుందని అంచనా. కాగా 2 కోట్ల మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.

కోటి మందికి సామాజిక పింఛన్లు: సామాజిక పింఛన్ల పథకం కింద ప్రస్తుతం 70 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం వద్ద రకరకాల పింఛన్ల దరఖాస్తులు ఇంకా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మంజూరు చేయకుండా సర్కారు మొరాయిస్తోంది. కాగా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య కోటికి చేరుకోగలదని ఒక అంచనా. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని గణనీయంగా పెంచితే దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల మేరకు అవసరం.
ఏటా 40 లక్షల మందికి గూడు: ఏటా కనీసం 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో... బడ్జెట్‌లో సుమారు రూ.5,500 కోట్లు కేటాయించాలి. 10 లక్షల కుటుంబాలంటే.. కుటుంబానికి నలుగురు లెక్కన చూసినా ఏటా 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. పక్కా గూడు సమకూరుతుంది. గుడిసె లేని ఆంధ్రప్రదేశ్ దిశలో ప్రభుత్వం అడుగులు వేసినట్లవుతుంది.

మహిళలకు మరింత బలం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. వడ్డీ రాయితీలను ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే, రుణాల పరిమాణాన్ని మరింత పెంచితే... వారి ఆర్థిక వ్యవహారాలు మరింత పెరగడమే గాక కొన్నేళ్లలో వీరి సంఖ్య కోటిన్నరకు చేరుకోవచ్చు.

ప్రతి రైతూ లబ్ధిదారుడే: రైతులు ఏటా రూ.40 వేల కోట్లు పంట రుణాలుగా తీసుకుంటున్నారు. వారి నుంచి ఏటా బ్యాంకులు 6- 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించినట్లుగా వీరికి వడ్డీ లేకుండా రుణాలివ్వాలంటే ఏటా రూ.2,400 నుంచి రూ.2,800 కోట్లు కావాలి. ఐతే దీనిద్వారా సుమారు 70 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఇక మద్దతు ధర కల్పనకు కచ్చితమైన హామీకి వీలుగా రూ.3,000 కోట్లతో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తే.. ప్రతి రైతూ లబ్ధిదారుడే. 1.2 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరినట్లే.

భుక్తికి భరోసా పెంపు: రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల తెల్లకార్డులున్నాయి. ఒక్కో కార్డుకు ప్రస్తుతం కిలో రూ.2 చొప్పున 20 కిలోల బియ్యం ఇస్తున్నారు. దీన్ని 30 కిలోలకు పెంచుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితంగా 2 కోట్ల కుటుంబాలు ఈ మేరకు లబ్ధిపొందుతాయి.
104, 108 ... 102, 103: కుయ్... కుయ్... శబ్దాలు ప్రజలందరికీ తరచూ వినిపిస్తాయి. 104, 108 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి నిధులు సమకూర్చడం ద్వారా అంబులెన్స్‌ల సంఖ్య పెంచితే.. కాల్ చేసినప్పుడు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరడానికి పట్టే గరిష్ట వ్యవధి 20 నిమిషాల నుంచి ఇంకొంచెం తగ్గుతుంది. వ్యవసాయ సేవలకు, పశువైద్య సేవలకూ 103, 102 సేవలు ప్రారంభిస్తే... సమాజంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరినట్లే.


నా బిడ్డను ఆశీర్వదించండి ... మీకు అప్పగిస్తున్నా...
ప్రజాప్రస్థానంలో విజయమ్మ ప్రారంభోపన్యాసం


  ‘దేవుడి ఆశీస్సులు, మీ ప్రేమ, ఆదరణ ఉంటాయని నమ్ముతూ.. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి..’ అని మహానేత వైఎస్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ శ్రేణులను కోరారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి ఆశయాలకు ప్రతిరూపమని.. వైఎస్‌లో ఉన్న చిత్తశుద్ధి, ధైర్యం, దృఢ విశ్వాసం ఆయనలో ఉన్నాయని.. దివంగత నేత ఆశయసాధనలో జగన్‌ను ఆశీర్వదించాలని అన్నారు. ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి చెంతన శుక్రవారం ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రస్థానం(ప్లీనరీ) సదస్సులో తొలిరోజు ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.

19 నిమిషాల పాటు ఉద్వేగభరితంగా సాగిన ఈ ప్రసంగంలో నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. ఆమె పలుమార్లు కంటతడిపెట్టుకున్నారు. విజయమ్మ మాట్లాడుతున్నప్పుడు పలువురు ప్రతినిధులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ప్రసంగం ప్రతినిధులను కదిలించివేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఉదాహరణలతో తెలియజేస్తూ.. గత రెండేళ్ల ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు విజయమ్మ వివరించారు. వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మళ్లీ తేవాలని ఆకాంక్షించారు.


ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ పార్టీ ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చిందో ప్రజలకు మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నా. ఈ పార్టీ అన్నింటికన్నా భిన్నమైన పార్టీ. మాటలు కాదు చేతలు ముఖ్యమని చూపిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. ఆయన ఆశయాలకు వారసత్వంగా పుట్టిన పార్టీ. ఆయనకు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అంటే చాలా అభిమానం. అందుకే తన పథకాలన్నింటికీ ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టి.. వాళ్ల పేర్లు జనంలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశారు. 1978 నుంచి 2004 వరకు 25 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నప్పుడూ అనేక సందర్భాల్లో ఆయన తల చూపించి తనకు ఎన్ని దెబ్బలు తగిలాయో చూడమని చెప్పేవారు. రెండ్రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన ఐదు రోజులు ప్రజల మధ్య ఉండేవారు.

మంచి సీఎం ఎలా ఉండాలో చూపించారు..

2003లో 68 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాజమండ్రిలో 51 డిగ్రీల ఎండలు ఉన్నప్పుడూ పాదయాత్ర చేశారు. వారం రోజులపాటు అస్వస్థతకు గురయ్యారు. అయినా తిరిగి పాదయాత్ర కొనసాగించారు. ప్రజలకు ఎక్కడ ఏం కావాలి? ఎక్కడ పరిశ్రమ రావాలి? ఎక్కడ ప్రాజెక్టులు కావాలి? ఎవరికి ఏ అవసరం ఉంది? ఇలా అన్నీ తెలుసుకున్నారు. ప్రజలందరికీ ఏం చేయాలన్నదానిపై బ్లూప్రింట్ ఆయన మైండ్‌లో ఉండేది. తాను అధికారంలోకి రాగానే విద్యుత్తు బకాయిలు మాఫీ చేశారు. రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించారు. రైతుల పక్షపాతిగా జలయజ్ఞం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ, 108, పావలావడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక మంచి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు.

2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు జట్టు కట్టి పోటీచేస్తే.. ఒక్కడే మళ్లీ అధికారంలోకి తేగలిగాడు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 33 నుంచి 36 ఎంపీ సీట్లు వస్తాయని.. 180 నుంచి 200 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని సోనియాగాంధీకి చెబితే ఆమె నమ్మలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ సీట్లు వచ్చినా అసెంబ్లీ సీట్లు తగ్గాయి. ప్రజలు మనకు పాస్ మార్కులే ఇచ్చారని, ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉందని అప్పుడే ఆయన కొన్ని కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వంలోని సహచరులకు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని ఉద్బోధించారు.


మధ్యాహ్నానికి వస్తానని చెప్పారు..

2009లో అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో ఒక్క రోజు కూడా వృథా కానివ్వలేదు. కార్యక్రమాల సక్రమ అమలుకు రచ్చబండ నిర్వహించాలని తలంచారు. సత్వరం జలయజ్ఞం పూర్తిచేయాలని భావించారు. ప్రాణ హిత-చేవెళ్ల మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేసేవారు. ధైర్యంగా ఉండేవారు. కానీ దేవుడి ప్రణాళిక ఏమిటో తెలియదు. సెప్టెంబరు 2న కూడా జగన్ ఏదో ప్రాజెక్టుల పూర్తి గురించి మాట్లాడుతుండగా.. ఆయన పూర్తిగా వివరించి చెప్పారు. నిన్నటి వరకు అసెంబ్లీ నడిచింది కదా.. వర్షం కూడా పడుతోంది.. మళ్లీ అప్పుడే వెళ్లడం దేనికంటే.. రచ్చబండకు వెళ్లాల్సిందే అన్నారు. పైలట్ తీసుకుని వెళ్తేనే వెళ్తాను... లేదంటే.. మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని చెప్పారు. ఏమైందో ఏమో.. తిరిగి రాలేదు. ఆయనతో కలిసి జీవించే అదృష్టం నాకు లేకపోయింది. ఆయన కోసం 700 మంది ప్రాణాలిచ్చారు. అంతమంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు.

వైఎస్‌పై సోనియా మాటలు బాధ కలిగించాయి..

ఇంటి పెద్దను కోల్పోయిన బాధను అనుభవించిన వాళ్లం. అందుకే జగన్ నల్లమలకు వెళ్లినప్పుడు అక్కడ సభలో వాగ్దానం చేశాడు. చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాడు. అప్పటికి ఏ రాజకీయాలు లేవు. అన్నమాట ప్రకారం రెండు జిల్లాల్లో అభిమానుల కుటుంబాలను ఓదార్చాడు. తండ్రిలాగే కొడుకునూ ఆదరించారు. అర్ధరాత్రులు, తెల్లవార్లూ అక్కున చేర్చుకున్నారు. రెండు జిల్లాలు అయ్యాక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడే నేను సోనియాగాంధీకి లేఖ రాశాను. ఓదార్పు పూర్తిచేయాలని ఉందని, మీరు అనుమతి ఇస్తే అన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చి వివరిస్తామని కోరాను. నెల రోజుల తర్వాత ఆమె అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

నేను, జగన్, షర్మిల కలిసి వెళ్లి ఆమెకు వివరించాం. దానికి బదులుగా ఆమె ఇంతలా ఎందుకు? జిల్లాలో ఒక చోటికి పిలిచి సహాయం చేస్తే సరిపోతుందని, జిల్లాకు ఒక్క విగ్రహం సరిపోతుందని చెప్పారు. ఇంకోమాట కూడా అన్నారు. మేం ముఖ్యమంత్రిని చేయడం వల్లే ఆయన ఈ కార్యక్రమాలు చేయగలిగారని చెప్పారు. మా మనసుకు చాలా బాధ కలిగింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఎందరో సీఎంలు వచ్చారు. కానీ ఆయనలా ప్రజల కోసం ప్రణాళికలు ఎవరూ చేయలేదు. వైఎస్ చనిపోయాక మీరే వచ్చి పరామర్శించారు గానీ మమ్మల్ని పిలిపించుకోలేదు కదా.. అలాగే జగన్ కూడా వారి వద్దకే వెళ్లి పరామర్శిస్తేనే బాగుంటుంది అని కూడా చెప్పాం. కానీ ఆమె వినిపించుకోలేదు. చేసేది లేక కన్నీటితో తిరిగొచ్చాం.


ఇచ్చిన మాట తప్పలేదు...

ఢిల్లీ నుంచి వచ్చాక.. ఏం చేద్దామనుకుంటున్నావని జగన్‌ను అడిగాను. అమ్మా.. నేనైతే మాట ఇచ్చాను. ఏడు వందల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. వైఎస్సార్ కొడుకుగా, నేను మాట నిలబెట్టుకోలేదన్న మాట అనిపించుకోవడానికి సిద్ధంగా లేను. నాయన పేరు నిలబెట్టడానికే నేను నిర్ణయించుకున్నా అని చెప్పాడు. ఆ నిర్ణయం మంచిదే అని పించింది. రెండోసారి యాత్రకు బయలుదేరాలనుకున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను కట్టడి చేశారు. ‘సాక్షి’ పైన దాడులు జరిపించారు. మంత్రులతో లేఖలు రాయించి కోర్టుల్లో కేసులు నడిపిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలోనే కొనసాగాలనుకున్నాం. కానీ మా మరిదిని పిలిపించి మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాధలేదు. కానీ జగన్‌ను బలహీనుడిగా చేయాలని తలచారు.

ఇది మాకు బాధ కలిగించింది. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాం. ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సి వచ్చింది. పార్టీ పెట్టి మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. వైఎస్‌కు 4.20 లక్షల మెజారిటీని కట్టబెడితే.. జగన్‌కు 5.40 లక్షల మెజారిటీ కట్టబెట్టి ఆదరణ చూపారు. వైఎస్ ఎమ్మెల్యేగా సాధించిన మెజారిటీ కంటే అధికంగా నాకు మెజారిటీ కట్టబెట్టి మీ ప్రేమ చూపారు. ఎప్పటికీ రుణపడి ఉంటాం.



తండ్రి ఆశయాలకు ప్రతిరూపం జగన్..

ఈ రోజు ఆయన జయంతి. జగన్ మీ ముందున్నాడు. తండ్రి ఆశయాలకు ప్రతిరూపం. తండ్రిలో ఉన్న కమిట్‌మెంట్, విల్‌పవర్, ధైర్యం.. ప్రతీది జగన్‌లో ఉన్నాయి. రాజకీయంలో ఉండాలంటే నిబ్బరం, ధైర్యం ఉండాలని వైఎస్ చెప్పేవారు. ఆ ధైర్యం జగన్‌లో ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం స్పందించే గుణం, పోరాడే తత్వం జగన్‌లో ఉంది. నా బిడ్డను మీరు ఆశీర్వదించండని కోరుతున్నా. దేవుడి దయ, ఆశీస్సులు.. వైఎస్ ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, ఆదరణ ఉన్నాయని నమ్ముతున్నా. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు జగన్ పూర్తిచేస్తాడని నమ్ముతున్నా. జగన్, వాళ్ల నాన్న స్నేహితుల్లా మాట్లాడుకునేవారు.

ప్రాణహిత, పోలవరం వంటి ప్రాజెక్టుల గురించి విశ్లేషించుకునేవారు. ప్రతిదాంట్లో కొడుకును అలా తీర్చిదిద్దాడు. ఓదార్పు యాత్రలో, ఇప్పటి వరకు చేసిన దీక్షల్లో నా కొడుకు కష్టపడుతున్నప్పుడు.. దేవా.. నా కొడుకును ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని బాధపడేదాన్ని. కానీ నాయకుడిగా తీర్చిదిద్దేందుకే ఇలా కష్టపెడుతున్నాడేమోనని నాకు నేను సమర్థించుకునేదాన్ని. నా బిడ్డను మీరంతా ఆశీర్వదించాలి. ఇక్కడికి వచ్చిన వారంతా వైఎస్‌లా స్పందించాలి. వైఎస్‌లా పోరాడాలి. ప్రజల వెంట నడవాలి. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెచ్చేందుకు మనమంతా కృషిచేద్దామని కోరుతున్నా.


అక్షరాలా ‘ ప్రజా ప్రస్థానమే’!

ప్రజాకాంక్షలకు అద్దం పట్టిన ప్లీనరీ  * అన్ని వర్గాలకూ భరోసా ఇచ్చేలా జగన్ ప్రసంగం


వైఎస్ రాజశేఖరుని ‘ప్రజాప్రస్థానం’... ఓ సువర్ణ యుగానికి నాందీ ప్రస్తావన చేసిన చరిత్రాత్మక ఘట్టం. ఆ బంగరు పాలనను తిరిగి తెచ్చే లక్ష్యంతో ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రారంభించిన ‘ప్రజాప్రస్థానం’... ‘వైఎస్ యుగ’ స్థాపనకు విస్పష్ట ప్రణాళికను ప్రకటించిన ఓ చారిత్రక అవసరం! వైఎస్ మనసా వాచా నమ్మిన ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని, ఆ పాలనను కచ్చితంగా తిరిగి తెస్తామని పార్టీ తొలి ప్లీనరీ ఉద్ఘాటించింది. పురుడు పోసుకుంటూనే కనీవినీ ఎరగని రీతిలో చరిత్రాత్మక విజయాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... మహా నేత జయంతి అయిన శుక్రవారం నాడు కోలాహలంగా ‘ప్రజాప్రస్థానాన్ని’ ప్రారంభించింది.

ప్రజా సంక్షేమ పథకాల చరిత్రలో మేలిమలుపుగా నిలవగల చరిత్రాత్మక పరిణామాలకు ప్లీనరీ బీజం వేసింది! కార్యక్రమ వేదికైన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి పరిసరాల్లో ఈ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఉద్వేగపూరితం.. విజయమ్మ ప్రసంగం: పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయలక్ష్మి ప్రసంగం రాష్ట్ర నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో తరలి వ చ్చిన ప్రతినిధులను విశేషంగా ఆకర్షించింది. పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే, భావి కర్తవ్యాన్ని నిర్దేశించారామె. వైఎస్ మృతి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను వివరించిన తీరుఅందరి హృదయాలనూ కదిలించింది. ‘నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా...ఆదరించండి...’ అంటూ చేసిన విజ్ఞప్తి కంటతడి పెట్టించింది.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఉదయాన్నే కుటుంబసమేతంగా వైఎస్ సమాధిని దర్శిం చి నివాళులర్పించారు. తర్వాత ఆయన రాజకీయ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఉదయం 10.40కి ప్రజాప్రస్థానం ప్రారంభమైంది. మహానేతను స్మరిస్తూ, ముందుగా ఆయనకు ప్రజాప్రస్థానం వేదిక నివాళులర్పించింది. ఆయన మృతిని తట్టుకోలేక మరణించిన అభిమానులందరి కుటుంబాలకూ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతూ మరో తీర్మానం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో మృతి చెందిన, బలిదానం చేసిన వందలాది మందికి కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ తీర్మానం చేశారు.

విజయమ్మ ప్రసంగం తర్వాత ఆర్థిక, వ్యవసాయ, సాగునీటి రంగాలు, పారిశ్రామిక విధానం, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ చేతివృత్తులు తదితర తీర్మానాలను విసృ్తతంగా చర్చించి ఆమోదించారు. తొలిరోజు సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్... ప్రజల కోసం తానేం చేయదలచిందీ, సమాజం పట్ల తన వైఖరినీ విస్పష్టంగా ఆవిష్కరించారు. ఆయన ప్రసంగం ప్రతినిధులను ఉత్తేజితుల్ని చేసింది. వైఎస్సార్ అమర్ హై, జై జగన్ నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మారుమోగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఇతర పార్టీలకు వెరుపు, విస్మయం, ఆర్థికవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తే... ప్రతినిధులను మాత్రం ఉర్రూతలూగించింది. ఏ పార్టీ కూడా దరిదాపులకు రాలేని స్థాయి వాగ్దానాలతో సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తను తలపించారు.

రాజకీయవాదుల ఊహలకు కూడా అందని మానవతావాదిగా, రైతుల, పేదల పక్షపాతిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తన ప్రసంగంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే గాక పార్టీ అధిష్టానానికి కూడా ముచ్చెమటలు పోయించారు. ఏ ఎన్నికలూ లేని సమయంలో చేసిన నికార్సయిన వాగ్దానాలతో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుతించిన జగన్, వాటినే సానబట్టి సామాన్యులకు మరింత చేరువ చేశారు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికీ సభ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపింది. రోజు పొడవునా ‘సీఎం జగన్’ అంటూ నినాదాలు వినిపిస్తూనే వచ్చాయి.
 
ప్రజాప్రస్థానం * ప్లీనరీ హైలైట్స్

ప్లీనరీలో ఫ్లెక్సీలు, తోరణాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
నూరు అడుగుల వైఎస్సార్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొండా సురేఖ వెంట వచ్చిన పసుపులేటి వెంకన్న కళాబృందం నృత్యాలు అందరినీ అలరించాయి.
పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం 10.30కు వేదిక పైకి జగన్, విజయమ్మలు వచ్చారు.
10.55కు దివంగత సీఎం వైఎస్‌కు సభా సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు.
11 గంటలకు వైఎస్సార్ మరణం అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న వారికి నివాళులు అర్పించారు.
11.05కు తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆత్మహత్యలు చేసుకున్న వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
11.07కు ప్లీనరీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్యే విజయమ్మ తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు.
11.30కు జగన్ పార్టీ నాయకులతో ప్రమాణం చేయించారు.
విరామం తర్వాత 3.20 గంటలకు జగన్ సభా ప్రాంగణానికి వచ్చారు.
{పాంగణంలో వైఎస్సార్ ఫోటో ప్రదర్శనను చూసేందుకు కార్యకర్తలు బారులుతీరారు.
వైఎస్సార్ సాక్షి సేవా సమితి సంపత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చే శారు.
వైఎస్సార్ 62వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ సమాధి వద్ద ప్రార్థన సమయంలో విజయమ్మ బాధతో కన్నీరు కారుస్తూ మౌనంగా ఉండిపోయారు.
జగన్ సోదరి షర్మిలమ్మ ప్రార్థనలు చేసే వరకూ కళ్లు చెమరుస్తూనే ఉన్నారు.
ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ భారతి, బ్రదర్ అనిల్‌కుమార్, ఈసీ గంగిరెడ్డి, అవినాష్, భారతమ్మ పాల్గొన్నారు.
వైఎస్సార్ జయంతి రోజునే ప్లీనరీ ప్రారంభం కావడంతో ప్రతినిధులే కాకుండా వైఎస్ అభిమానులు తండోప తండాలుగా ఇడుపులపాయకు తరలివచ్చారు. మహానేత సమాధిని సందర్శించు కున్నారు. దాదాపు లక్ష మంది వచ్చి ఉంటారని అంచనా.
జనం ఇడుపులపాయకు పోటెత్తడంతో పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
వైఎస్ జయంతి సందర్భంగా శుక్రవారం సమాధి వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్లీనరీకి 14 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేయగా.. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఆ సంఖ్య 30 వేలకు చేరుకుంది. ముందుగా 14 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది రావడంతో అప్పటికప్పుడు 30 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ సందర్భంగా ప్రతినిధులు, అభిమానులు ఏ సమయంలోనూ అసహనం ప్రదర్శించకుండా ఓపికతో సహకరించడం విశేషం.

No comments:

Post a Comment