Monday, May 30, 2011

ఆత్మబంధువుల కోసం అడవి దారిలో....

 
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సాగిన జగన్ ఓదార్పు యాత్ర
దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల గుండా కదిలిన కాన్వాయ్
డప్పులు, సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికిన గిరిపుత్రులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఓదార్పు యాత్ర
దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య
ప్రాంతాల్లో వైఎస్ జగన్ కాన్వాయ్
సంప్రదాయ నృత్యాలతో గిరిపుత్రుల ఆత్మీయ స్వాగతం
ఏజెన్సీ ప్రాంతాల్లో యాత్ర వద్దని జగన్‌మోహన్‌రెడ్డికి
లేఖ రాసిన విజయనగరం ఎస్పీ
జ్వరంతో బాధపడుతున్నందున యాత్ర వాయిదా
వేసుకోవాలన్న డాక్టర్లు... అయినా తన వారిని
కలవాల్సిందేనంటూ ముందుకు సాగిన జననేత



‘‘సార్.. కాకితాడ, ఉదయపురం పల్లెలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. అవి మావోయిస్టులకు బాగా పట్టున్న గ్రామాలు. నక్సల్స్ కదలికలు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. మేం రక్షణ కల్పించలేం. దయచేసి వెళ్లొద్దు. ఓదార్పు యాత్ర షెడ్యూల్ మార్చుకోండి..!’’
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయనగరం జిల్లా ఎస్పీ నవీన్ గులాటి లేఖ.
‘‘మీరు తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోండి..’’
- ఆదివారం ఉదయం జగన్‌కు వైద్యుల సూచన.

..అటు ఎస్పీ హెచ్చరికలు.. ఇటు వైద్యుల సూచనలేవీ జననేతను ఆపలేకపోయాయి. ఎలాగైనా సరే ఆత్మబంధువులను అక్కున చేర్చుకోవాలన్న తలంపుతో అడుగు ముందుకేశారు. దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గుండా సాగిపోయారు. విజయనగరంలో ఆరో రోజు ఓదార్పు యాత్ర ఆసాంతం ఏజెన్సీ గ్రామాల మీదుగా సాగింది. ఆదివారం పార్వతీపురం మండలం ఖడ్గవలస నుంచి యాత్ర ప్రారంభమైంది.. అక్కడ్నుంచి జగన్ పెదమేరంగి జంక్షన్, పెదమేరంగి మీదుగా కురుపాం చేరుకున్నారు. కురుపాం మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కురుపాం ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ్నుంచి దట్టమైన అడవి ప్రారంభమైంది. కురుపాంలో ప్రసంగం ముగించగానే యాత్ర దట్టమైన అడవి వైపు కదిలింది. దీంతో పోలీసుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. బొబ్బిలి డీఎస్పీ త్రినాథ్, పార్వీతీపురం డీఎస్పీ ఎల్వీ శ్రీనివాసరావు.. జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరించారు.

గిరిజన పల్లెల్లో ఆత్మీయ స్వాగతం..


దట్టమైన అడవిలో జగన్‌మోహన్‌రెడ్డికి మొదట తెమఖర గ్రామ గిరిజనులు స్వాగతం పలికారు. తమ సంప్రదాయం ప్రకారం.. నీలం రంగు కండువా కప్పి, కళ్లు కడిగి దిష్టి తీశారు. కుంకుమతో బొట్టు పెట్టి ఆశీర్వదించారు. అక్కడ్నుంచి మరింత దట్టమైన అడవి మొదలైంది. టిక్కబాయి గ్రామస్థులను పలకరించి జగన్ ముందుకు కదిలారు. కిలోమీటరు దూరం వెళ్లగానే.. జగన్ తన వాహనాన్ని ఆపారు. ఏం జరిగిందోనని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన మాత్రం ఇవేవీ గమనించకుండా.. రోడ్డు పక్కనే ఉన్న మర్రిచెట్టు నీడ కింద నిలబడి తన కోసం ఎదురు చూస్తున్న నూకలమ్మ(65), అడవి శివమ్మ(70) అనే వృద్ధురాళ్ల దగ్గరికి వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. వెళ్లొస్తా తల్లీ అంటూ అక్కడ్నుంచి సెలవు తీసుకున్నారు. తర్వాత యాత్ర తోటగూడ మీదుగా రస్తాకుంటుబాయి గ్రామం చేరింది. గిరిజనమహిళలు రోడ్డుపై నిలబడి ఆయనకు ఘన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అడవి చంద్రమ్మ అనే మహిళ ‘‘నా మనువడు పది పాసయ్యాడు. ఇక ఖర్చు పెట్టలేమని మానేశాం’’ అని జగన్‌కు తన గోడు వెళ్లబోసుకుంది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘‘మన ప్రభుత్వం వచ్చే వరకు కష్టపడి పిల్లలను చదివించండి. ఎట్టి పరిస్థితుల్లో చదువులు ఆపొద్దు. మన ప్రభుత్వం రాగానే పైసా ఖర్చు లేకుండా నేను చదివిచ్చుకుంటాను’’ అని వారికి భరోసానిచ్చారు. ‘‘ఆ పైడితల్లి దయవలన నువు బేగున (తొందరగా) ముఖ్యమంత్రివి కావాలయ్యా. మేం ఓటేసుకొని నిన్ను గెలిపించుకుంటాం..’’ అని గిరిజన మహిళలు ఆశీర్వదించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో..


రస్తాకుంటుబాయి నుంచి ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి.. మండ, గుమ్మగదబవలస, లేవిడి, మొండెంఖల్లు మీదుగా ఉదయపురం, కాకితాడ గ్రామాలకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాలు ఒడిశా సరిహద్దున ఉన్నాయి. ఇక్కడ్నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం వె ళ్తే ఒడిశా జిల్లాలోని గుమ్మ గ్రామం వస్తుంది. ఈ రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నాయి. వారం కింద టే మావోయిస్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్క్వాడ్, కోరాపుట్ దళాలు సంయుక్తంగా ఇక్కడ సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయి సాయుధ పోలీసు వలయం మధ్య జగన్‌మోహన్‌రెడ్డిని బాధిత కుటుంబం వద్దకు తీసుకుపోవాలని, మధ్యలో సాధారణ ప్రజలను, గిరిజనులను కలవకుండా కట్టడి చేయాలని పోలీసులు భావించారు. కానీ ఆయన మాత్రం రక్షణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, నన్ను స్వేచ్ఛగా వారితో మాట్లాడనివ్వాలని పోలీసులను కోరారు. ఈ రెండు గ్రామాల ప్రజలు డప్పులు, ధింసా నృత్యాలతో జగన్‌మోహన్‌రెడ్డిని తమ గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయపురంలో పత్తిక స్వప్న, కాకితాడలో అరిక భాస్కర్‌రావు కుటుంబాలను ఓదార్చారు. అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటికే జ్వరం తీవ్రం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి నేరుగా చిలకాంలోని ద్వారపురెడ్డి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్మోహన్‌రావు, మాజీ ఎంపీ కణితివిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, డాక్టర్ బొత్సా కాశినాయుడు, పి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment