Monday, May 16, 2011

పొట్టగొడితే.. పోగాలమే! ...... నినదించిన జగన్ ‘రైతు దీక్ష’

* భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు
* మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం..
* మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు నిరసన
* జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష
* ప్రభం‘జనం’తో కిక్కిరిసిన ఐదో నంబర్ జాతీయ రహదారి
* నిప్పులు కక్కుతున్న ఎండను సైతం లెక్కచేయక కాలినడకన వచ్చిన ప్రజలు.. ఉదయం 9 గంటలకే‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో జన హోరు
* సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు

‘‘నోటికాడికి ముద్దను తెచ్చే చేతుల్ని నరికే ప్రభుత్వమిది. రైతుల్ని ఇబ్బందిపెట్టినోళ్లంతా ఏమయ్యారు..? ఈ సర్కారూ గాల్లో కలిసేదే.’’
‘‘వైఎస్ ఉన్నప్పుడు మద్దతు ధర రూ.వెయ్యి వచ్చేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తోంది.’’
‘‘మొన్నటి తుపానుల పరిహారాలకే దిక్కులేదు. బ్యాంకు రుణాల్లో ఇన్సూరెన్స్ కింద కొంత కోతకోసినా.. ఈ సర్కారు హయాంలో మాకు నష్టపరిహారం సొమ్ము వచ్చింది లేదు.’’

.... ఇదీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’లో అన్నదాతల ఆవేదన, ఆగ్రహ జ్వాల. వేసవి కాలం.. భానుడు చండ ప్రచండంగా మండిపోతున్నాడు.. అందులోనూ గుంటూరు.. 42 డిగ్రీలతో నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటు ‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో ఇలా రైతు సూరీడు కూడా అంతే స్థాయిలో ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నాడు. తమ బాధలు పట్టని సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడం, వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు తమ ఆవేదన, ఆక్రందనల్ని ఆదివారం ‘రైతు దీక్ష’లో వెళ్లగక్కారు.

తమను పట్టించుకోకుండా మిల్లర్లకు ఊతమిస్తూ తమ పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తున్నప్పటికీ.. జగన్ దీక్షకు జనం ప్రభంజనమై పోటెత్తారు. తమకు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి అన్నదాతలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ నినాదాలతో, పోటెత్తిన అశేష జనవాహిని సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు కొనసాగే ఈ దీక్ష 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.

రైతు నేతకు నివాళితో దీక్ష ప్రారంభం..
శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్ వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు.

అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతునేత తికాయత్‌మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సమస్యల గోడు వెళ్ళబోసుకోవటానికి వచ్చిన రైతులతో జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘మీ నాయన బతికుంటే మా బతుకులు బాగుండేవయ్యా’ అంటూ మాచర్లకు చెందిన సింహాద్రి రాములు తన పరిస్థితిని విన్నవించాడు. నాలుగు ఎకరాల్లో పంట వేస్తే అపారనష్టం వాటిల్లిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రూ.600కు కూడా ధాన్యం కొనే నాథుడే లేడని రైతులు తమ ఆవేదనను వివరించారు.
మద్దతుగా వేలాదిమంది దీక్ష
దీక్ష ప్రాంగణంలో జగన్‌కు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష ప్రారంభించారు. దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అడుగడుగునా అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. సమస్యలను, సిద్ధాంతాలను విస్మరించి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి వంగపండు కుమార్తె ఉష ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ చేసిన మిమిక్రీ, గీతాలు ఆహూతులను అలరించాయి. యువత స్వచ్ఛందంగా వాలంటీర్ బాధ్యతలు స్వీకరించి దీక్షకు హాజరైన రైతులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు.
9 గంటల నుంచే జనహోరు
రైతులు భారీస్థాయిలో దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గుంటూరు, కర్నూలు, చిలకలూరిపేట రోడ్డు(ఎన్‌హెచ్ 5) వాహనాల రద్దీతో కిక్కిరిసింది. ఒకవైపు రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండగానే, మరోవైపు గుంటూరుకు సమీపాననున్న అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, జూనంచుండూరు, వింజనంపాడు, నల్లపాడు తదితర గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన దీక్షాశిబిరానికి వచ్చారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పసిపిల్లల్ని చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం విశేషం.

ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతో పాటు శిబిరం వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం దీక్షకు వచ్చిన జనం, జగన్ ప్రభావం, నేతల ప్రసంగాల గురించి చర్చించుకోవడం కనిపించింది. ఎంతమంది జనం వచ్చారు. ఎక్కడెక్కడ్నుంచి వచ్చారు. ఎలా వచ్చారంటూ వివరాల్ని పోలీసులు పదేపదే అడిగి తెలుసుకున్నారు. నేతల ప్రసంగాలప్పుడు ప్రాంగణంలోని యువత జిందాబాద్‌లతో హోరెత్తించారు. తమ అభిమాన నేత జగన్ ప్రసంగం కోసం పదేపదే డిమాండ్ చేశారు. ఆయన్ను కలుసుకుని అభినందించేందుకు, కరచాలనం చేసేందుకు అందరూ ఉత్సాహం చూపడం కనిపించింది. జగన్ చేతిని పెకైత్తి అభివాదం చేసినప్పుడల్లా ప్రాంగణంలో జై జగన్ నినాదాల హోరు మార్మోగింది.
జగన్ మెజార్టీపై అభినందనలు....
రెండురోజుల కిందటే కడప పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా రికార్డు మెజార్టీని సాధించిన జగన్ విజయోత్సాహాలను కూడా పక్కనపెట్టి రైతు దీక్ష చేయడంపై పలువురు నాయకులు ప్రశంసించారు. జగన్ నిత్య శ్రామికుడిగా రైతు పక్షాన పోరాటాలు చేయడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతోందని కొనియాడారు. జగన్ రికార్డు మెజార్టీతో దేశంలో తెలుగువారి ఆత్మగౌరవం మరొక్కసారి ప్రకటితమైందన్నారు. జగన్ మెజార్టీ గురించి ప్రస్తావించినప్పుడు సభకు హాజరైన వారు కరతాళధ్వనులు చేశారు.

ప్రాంగణంలో భారీ విద్యుత్ ప్రభ..
రైతు దీక్షా వేదిక ప్రాంగణంలో 98 అడుగుల భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ప్రభ ప్రాంగణానికి నూతన శోభను తీసుకొచ్చింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి అనే రైతు వెయ్యి బల్బులతో ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలాగే దీక్షా వేదిక ప్రాంగణంలో 20 వరకు బెలూన్లను ఎగురవేశారు.

No comments:

Post a Comment