Tuesday, August 30, 2011

త్వరలోనే మంచి రోజులు: జగన్‌ * రైతన్నలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

వైఎస్ సువర్ణయుగంలో మా సీఎం ఉన్నాడన్న భరోసా ఉండేది
మద్దతు ధరకంటే మూడొందలు ఎక్కువే వస్తాయన్న ధీమా ఉండేది
మహానేత పోయాక ఏ రైతును కదిల్చినా కన్నీరే..
రైతుల ముఖాల్లో చిక్కటి చిరునవ్వులు పూసే రోజులు త్వరలోనే
వైఎస్సార్ చనిపోయి రెండు సంవత్సరాలైనా ఇంకా
ప్రజల గుండెల్లో బతికున్నారనే కాంగ్రెస్, టీడీపీల అక్కసు


ఓదార్పు యాత్ర : ‘రాముడి రాజ్యమైతే మనం చూడలేదుగాని రాజశేఖరుడి సువర్ణయుగం చూశాం. ఆ సువర్ణ యుగంలో ఏ సమస్య వచ్చినా.. మా ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అని ప్రతి రైతన్నకూ ఓ ధీమా ఉండేది. ఇప్పుడు ఏ అన్నదాతను కదిలించినా కన్నీరే కనపడుతోంది. ఈ కష్టాలు పోయి.. మీ ముఖాల్లో చిక్కటి చిరునవ్వులు పూసే రోజు త్వరలోనే వస్తుందని నేను భరోసా ఇస్తున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్ర 15వ రోజు సోమవారం ఆయన చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రజల కోరిక మేరకు దాదాపు అన్ని గ్రామాల్లో ఆయన క్లుప్తంగా ప్రసంగించారు.

రాత్రి 11.30 గంటలకు జోరున కురుస్తున్న వర్షంలో చాట్రాయి మండల కేంద్రంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం రాత్రి ఏడు గంటలకు చేయాల్సి ఉండడంతో అప్పటికే అక్కడికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం కురిస్తున్నా.. అక్కడి నుంచి కదల్లేదు. జగన్ కోసం అలాగే వేచి ఉన్నారు. వారినుద్దేశించి జననేత ప్రసంగిస్తూ ‘మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేన’ంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సోమవారం జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

రైతులు వరి కంటే ఉరే మేలనుకుంటున్నారు

రాష్ట్రంలోనే కాదు కదా.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రైతులు సమ్మెచేస్తున్నారు. కనీసం వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇవాళ రైతు వరి వేసుకోవడం కంటే ఉరి వేసుకోవడమే మేలు అనుకుంటున్నాడు. అదే దివంగత మహానేత సువర్ణ యుగంలో అయితే అన్నదాతకు భరోసా ఉండేది. వేసిన పంట ఏ ధరకు అమ్ముడు పోతుందో అనే ఆలోచనే ఉండేది కాదు. కనీస మద్దతు ధర కంటే రూ.200, రూ.300 ఎక్కువే వస్తుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్లీ రైతన్న ముఖంలో చిరునవ్వులు చూసే రైతు ప్రభుత్వం త్వరలోనే రాబోతోంది.

చంద్రబాబూ ఆ కిటుకు చెప్పు..


అయ్యా.. చంద్రబాబు నాయుడూ ఈ వేళ మీరు రోడ్లెక్కి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. వెయ్యి కోట్ల రూపాయలిస్తే మీ ఆస్తులు రాసిస్తానంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో నువ్వు రెండెకరాల ఆసామివి. ఈ వేళ నువ్వు వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు చంద్రబాబూ? రెండెకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించవచ్చో ప్రతి పేదవాడికి కూడా చెప్పు.

వైఎస్‌పై కాంగ్రెస్, టీడీపీ కుట్ర


ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారంటే.. కారణం వైఎస్సార్ రెక్కల కష్టమే. అలాంటి నేత చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికిఉండడమే నేరమన్నట్లు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై విలువలు కూడా మరిచిపోయి రాజకీయాలు చేస్తున్నారు. ఈ టీడీపీ, కాంగ్రెస్ పెద్దలకు ఒక్క మాట చెప్తున్నా.. మీరు చేస్తున్న రాజకీయాలు పై నుంచి దేవుడు గమనిస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు డిపాజిట్లు కూడా రాకుండా మీ రెండు పార్టీలను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు.

No comments:

Post a Comment