Thursday, September 1, 2011

''మళ్లీ వస్తాను.. మీ అందరినీ కలుస్తాను.. జగన్ మీ వాడు.. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’'

కృష్ణా జిల్లా గ్రామాలకు జగన్ హామీ
తొలి విడత ఓదార్పు యాత్ర ముగించుకుని....

వెళుతుండగా అడ్డుపడిన అభిమానులు
తమ గ్రామాలకు రావాలంటూ పట్టు....

త్వరలోనే మలి విడత యాత్రకు వస్తానన్న జననేత

తొలి విడత 17 రోజుల్లో 809 కి.మీ. ప్రయాణం

‘త్వరలోనే మళ్లీ వస్తాను.. మీ అందరినీ కలుస్తాను.. జగన్ మీ వాడు.. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’ అని కృష్ణా జిల్లా వాసులను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో తొలి విడత ఓదార్పు యాత్రను బుధవారం ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా మార్గం మధ్యలో పలు గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు రావాలంటూ పట్టుబట్టడంతో ఆయన పై విధంగా నచ్చజెబుతూ ముందుకు కదిలారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు.

17 రోజులైనా షెడ్యూలు పూర్తికాలేదు..


తొలుత అనుకున్న షెడ్యూలు ప్రకారం జిల్లాలో యాత్ర 16 రోజుల్లో పూర్తవ్వాలి. అయితే వరుసగా 17 రోజులపాటు పర్యటించినా షెడ్యూలులో సగం కూడా పూర్తికాలేదు. అడుగడుగునా జన తాకిడి, షెడ్యూల్లో లేని గ్రామాలకూ రావాలంటూ ప్రజలు పట్టుబట్టడంతో రోజూ యాత్రలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఎలాగైనా షెడ్యూలును సకాలంలో పూర్తిచేయడానికి జగన్ రోజూ అర్ధరాత్రి దాటాక 2 వరకు కూడా ప్రయాణించారు. వర్షాలు కురుస్తున్నా లెక్కచేయకుండా వాటిలో తుడుస్తూనే ఆత్మబంధువుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ యాత్రను విరామం లేకుండా కొనసాగించారు. కాగా సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఆయన యాత్రకు విరామమిచ్చారు.

17వ రోజు యాత్ర సాగిందిలా..


ఓదార్పు యాత్ర 17వ రోజు బుధవారం ఆయన బోర్వంచ గ్రామంలోని మసీదులో ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. తర్వాత రావిచర్ల, కొత్త రావిచర్ల గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి గన్నవరం బయలుదేరారు. మార్గం మధ్యలో ఆగిరిపల్లి, తోటపల్లి, గొల్లనపల్లి, బీబీగూడెం, గన్నవరం తదితర గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు రావాలని పట్టుబట్టారు. మలి విడత ఓదార్పు యాత్రకు త్వరలోనే వస్తానని, అప్పుడు తప్పకుండా వారి గ్రామాలకు వస్తానని నచ్చజెప్పి జగన్ ముందుకు సాగారు.


ఎదురు చూస్తుంటాం.. వెళ్లిరా నాయినా


మంగళవారం ఓదార్పు యాత్ర షెడ్యూల్‌లో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ముసునూరు మండలంలోని బాసవరప్పాడు, అక్కిరెడ్డిగూడెం, చక్కపల్లి, వలసపల్లి మీదుగా ముసునూరు మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. జన తాకిడితో యాత్ర దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమయింది. తుమ్మగూడెంలో విగ్రహావిష్కరణ చేసే సమయానికి అర్ధ రాత్రి దాటిపోయింది. అప్పటికే జగన్ బాగా అలసిపోవడంతో నిర్వాహకులు పై గ్రామాల్లో యాత్రను వాయిదా వేశారు.


కాగా జననేతకోసం రాత్రి ఒంటి గంట వరకు ఎదురు చూసిన మర్లపాడు గ్రామస్తులు బుధవారం జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. తమ గ్రామాలకు రావాలంటూ పట్టుబట్టారు. ‘అమ్మా జ్వరంగా ఉంది... మళ్లీ వస్తాను. దారి ఇవ్వండి’ అని జగన్ వారిని కోరడంతో గ్రామస్తులు ఆయనకు దారిచ్చారు. ‘నీ కోసం ఎదురు చూస్తుంటాం.. తప్పకుండా రావాలి.. నాన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి’ అని ఆ గ్రామస్తులు కోరారు. జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.


809 కిలోమీటర్లు.. 22 కుటుంబాలు


కృష్ణా జిల్లా తొలి విడత ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. 17 రోజుల్లో మొత్తం 809 కిలోమీటర్లు ప్రయాణించి 223 గ్రామాలను పలకరించారు. 237 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి 22 బాధిత కుటుంబాలను ఓదార్చారు. బుధవారం యాత్రలో జగన్ వెంట కృష్ణా జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, పూడూరు గౌతంరెడ్డి తదితరులున్నారు.

No comments:

Post a Comment