Thursday, May 3, 2012

పాపం... పేద!

 పిల్లి గుడ్డిదయితే ఎలుక ఎదురెళ్లి వెక్కిరించిందట! వేటగాడు అసమర్థుడయితే లేడి వెయ్యి గంతులేసిందట!! ఇక్కడ పిల్లి అయినా, అసమర్ధుడయిన వేటగాడయినా ప్రజలే!!! జనం తామేమి చెబుతున్నా నమ్ముతున్నారన్న భ్రమల్లో ఉన్నప్పుడే సదరు నేత ఒక ఎలుక, మరో లేడిలా భావిస్తాడు. సానుభూతి, ప్రత్యర్ధుల బలహీనతల ఆధారంగా వచ్చి పడుతున్న విజయాలతో ఊగిపోతున్న యువనేత జగన్‌.. తాజాగా తనది పేద కులమని చేసిన సంచలన, విభ్రాంతికరమైన వ్యాఖ్య జనాలను వెర్రివాళ్ల నుకునేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనం గొర్రెలని, ఎవరేది చెబితే అది నమ్ముతారన్న వ్యాఖ్యలు ఇప్పటివరకూ సామెతలు, సినిమాల్లో మాత్రమే వింటున్నాం. కానీ జగన్‌ మాత్రం జనాలను ఈ దృష్టితోనే చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మూడు ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మానసిక పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కడప లోక్‌సభ, పులివెందుల, కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌.. తాను చెప్పినవన్నీ ప్రజలు వింటున్నారన్న అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. తనపై ప్రత్యర్ధులు అవినీతిపరుడని ఆరోపిస్తున్నా ప్రజలు మూడు ఎన్నికల్లోనూ తననే గెలిపించడంతో, ఇక తాను ఏమి చెప్పినా ప్రజలు సులభంగా నమ్ముతారని, అవి నిజమని భావిస్తారన్న ధీమాకు వచ్చినట్లు ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.

తనది పేదకులమని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీలో సైతం యువనేత పేదరికంపై చర్చ జరుగుతోంది. కడప లోక్‌సభ, పులివెందుల, కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో ఉన్న జగన్‌.. తాను ఏమి చెప్పినా జనం నమ్ముతారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్న వాస్తవం ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులపై ఒకవైపు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ విచారణ చేస్తుంటే తనది పేద కులమని చెప్పడం వింతలోకెల్లా వింతని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నయి. న్యాయమూర్తులు సైతం ఏ-1 అయిన జగన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నిస్తున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోనూ జగన్‌ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ నేత చేసిన వ్యాఖ్య అనవసర వివాదానికి దారితీస్తుందేమో నన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు ఎన్నికల్లో గెలవటం, జగన్‌పై కాంగ్రెస్‌-టీడీపీలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నా జనం నమ్మకపోవడంతో ఆయనలో మితిమీరిన ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. ‘అన్ని పార్టీలూ అవినీతికి పాల్పడు తున్నాయి. అంతా అవినీతిపరులే. కాకపోతే కొందరు ఎక్కువ తిన్నారు. మరికొందరు తక్కువ తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందువల్లే జనం జగన్‌ అవినీతి గురించి కాంగ్రెస్‌-టీడీపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా నమ్మడం లేదు. దానిని చూసి మా నేత అతిగా అంచనా వేసుకుని, తానేది చెప్పినా నమ్ముతారనుకుంటే అది భ్రమే అవుతుంద’ని వైకాపా సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

pales 

తనది పేద కులమని జగన్‌ చెప్పడం బూమరాంగ్‌ అవుతుందని, దానిని ప్రజలు నమ్మరంటున్నారు. ‘ఇప్పటివరకూ జనం జగన్‌ను నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తనది పేద కులమని చెప్పడం వల్ల జగన్‌ తమను వెర్రివాళ్లను చేస్తున్నారని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు అసలుకే ఎసరు తెస్తాయి. ప్రత్యర్థులకు అస్త్రాలు ఇచ్చినట్టవుతాయి. ఆయన ఎవరి మాట వినరు. ఎవరు చెప్పాలి?’ అని మరో సీనియర్‌ నేత ప్రశ్నించారు. కాగా, సీబీఐ, ఈడీ కేసుల నేపథ్యంలో జగన్‌ సంపాదించిన లక్ష కోట్ల ఆస్తులపై ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తనది పేద కులమని జగన్‌ చెప్పడంతో మళ్లీ ఆయన ఆస్తులపై చర్చ సహజంగానే తెరపైకి వచ్చినట్టయింది.

బెంగళూరులో కళ్లు చెదిరే రాజమహల్‌, హైదరాబాద్‌లోని నివాసాలే దాదాపు 600 కోట్ల రూపాయల ఖరీదవుతాయన్న అంచ నా తెలిసిందే. 2008-09 ఆర్థిక సంవత్సరానికి గాను రు.2.92 లక్షల రూపాయలు ఆదాయపన్నుగా చెల్లించిన జగన్‌.. 2009-10 సంవత్సరానికి 84 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారు. అంటే ఏడాదికి అధికారికంగానే 500 రూపాయల కోట్ల ఆదాయం ఉన్నట్టే లెక్క. జగన్‌ చెల్లించిన పన్ను ఆదాయాలను పరిశీలిస్తే.. 6 నెలల్లోనే 1,110 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి విలువ రు2.12 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. తనయుడు వైఎస్‌ జగన్‌ 2003-2004 ఐటి రిటర్న్‌‌సలో తన సంవత్సర ఆదాయం 9,19,951 రూపాయలని పేర్కొన్నారు.

మళ్లీ 2009 నాటి ఎన్నికల అఫిడవిట్‌లో 77.40 కోట్ల రూపాయలుగా చూపారు. 2011 ఎన్నికలో దానిని 445 కోట్లుగా చూపారు. అంటే కోటి రూపాయల ఆస్తిపరుడయిన ఒక నిరుపేద కేవలం 8 సంవత్సరాల్లో 85 కోట్ల రూపాయల అడ్వాన్సు టాక్సు చెల్లించే స్థాయికి, 445 కోట్లకు ఎలా అధిపతి అయ్యారన్న చర్చ మళ్లీ అన్ని వర్గాల్లోనూ మొదలయింది. ఇక జగన్‌ విలాసజీవితానికి బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌, బెంగళూరు బన్నేరుఘట్టరోడ్‌ లోని మంత్రి భవనం మరోసారి చర్చలోకి వచ్చింది. బెంగళూరులోని మంత్రి భవనం 5 ఎకరాల్లో ఉంది. 7 అంతస్తులున్న దీని విలువ కేవలం 400 కోట్ల రూపాయలు. దాని ద్వారా వచ్చే అద్దె ఎంతో తెలుసా.. కేవలం 27 కోట్ల రూపాయలు! ఇక లోటస్‌ పాండ్‌లోని జగన్‌ నివాసం చూస్తే ఇంద్రుడు కూడా ఈర్ష్యపడవలసిందే.

హుడా హైట్స్‌లోని ప్లాట్‌ నెంబర్లు 2,3,4,6,7,8లో 5807 చదరపు గజాల్లో 88 వేల చదరపు అడుగుల్లో కళ్లు చెదిరే భవంతులు నిర్మించారు. ఇది దాదాపు 88 డబుల్‌బెడ్‌రూములతో సమానం. లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసంలో 30 గదులు, 14 ఎస్క్‌లేటర్లు, పదుల సంఖ్యలో లిఫ్టులు, ఒక హెలిపాడ్‌, ప్రార్ధనామందిరం, స్క్వాష్‌ కోర్టులు, మినీ థియేటర్లు ఉన్నాయి. ఒక పేదవాడికి ఇది సాధ్యమా అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇన్ని అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన భవంతులతో తులతూగుతున్న జగన్‌, తనకు తాను నిరుపేద అని చేసుకుంటున్న ప్రచారం తిరగబడితే అసలుకే ఎసరు వస్తుందని సొంత పార్టీ సహా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

‘ఒక సింగిల్‌ బెడ్‌రూం దొరికితే అదే మహా భవంతిగా సామాన్య-మధ్య తరగతి వర్గాలు భావిస్తుంటాయి. మరి వందలకోట్ల భవంతులున్న జగన్‌ కూడా నిరుపేదగా భావించుకుంటున్నారు. అది తమను ఎగతాళి చేసినట్లుగానే కిందిస్థాయి వర్గాలు అన్వయించుకుంటే మొత్తం పేద వర్గాలు జగన్‌కు వ్యతిరేకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి వ్యాఖ్య ఆయన చేసి ఉండకూడద’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

jagan00

ఇవి ఓ నిరుపేద నివాసాలు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్  లోని 5807 చదరపు గజాల్లో 88 వేల చదరపు అడుగుల్లో కళ్లు చెదిరే భవంతి ఇది. ఇందులో 30 గదులు, 14 ఎస్క్‌లేటర్లు, పదుల సంఖ్యలో లిఫ్టులు, ఒక హెలిపాడ్గ, ప్రార్ధనా మందిరం, స్క్వాష్‌ కోర్టులు, మినీ థియేటర్లు ఉన్నారుు. అటువైపు బెంగళూరులోని ప్యాలెస్‌. ఇది ేకవలం 5 ఎకరాల్లో ఉంది. దీని విలువ ేకవలం 400 కోట్ల రూపాయలేనట!. 7 అంతస్తు లున్న భవనం మరొకటి. దాని ద్వారా వచ్చే అద్దె ఎంతో తెలుసా.. అది కూడా ేకవలం 27 కోట్ల రూపాయలేనట!! ఇదీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ అనుభవిస్తున్న పేదకులం!!! 

 - (సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌)

No comments:

Post a Comment