రైతు పరిస్థితి దయనీయంగా ఉంది
కరువు రైతులను ఆదుకోండి
రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయండి
‘‘ఈ దీక్షను చూసి ఇప్పటికైనా కళ్లు తెరవండి.. లేకుంటే మేమే తెరిపిస్తాం.. రైతు సమస్యలపై కదలండి.. జగన్ దీక్ష చేశాడని కుళ్లుకోకుండా.. ఇది రైతులంద రూ చేసిన దీక్షగా చూడండి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సర్కారుకు హితవు పలికారు. రైతుల కష్టాలు తీర్చాలంటూ ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరాహారదీక్షలు చేసినా.. ప్రభుత్వ వైఖరి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే ఉందని నిప్పులు చెరిగారు. కరువు ప్రాంతాల్లోని రైతులను, రైతు కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని, పంటలన్నీ నష్టపోవడంతో వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడు రోజులపాటు చేపట్టిన రైతు దీక్షను ఆయన గురువారం సాయంత్రం విరమించారు. అనంతరం ముగింపు సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. విశ్వసనీయత, విలువలు లేని రాజకీయాలను చీల్చి చెండాడారు. రైతు దీక్ష వేదికగా నాలుగు ప్రధాన డిమాండ్లను సర్కారు ముందుంచారు. రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటలను గిట్టుబాటయ్యే రేట్లకు కొనుగోలు చేయాలని, వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని, కరువు మండలాల్లోని రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినదించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, బీమా-1, బీమా-2 నుంచి పోలవరం వరకు ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఆద్యంతం రైతులు, రైతు కూలీల కష్టాలను ప్రస్తావిస్తూ సాగిన జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
పెట్టుబడి ఖర్చులు మూడు రెట్లు.. రాబడి మూడోవంతు..
రాష్ట్రంలో రైతుల పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత దయనీయంగా ఉంది. వ్యవసాయంలో పెట్టుబడుల ఖర్చులు మూడింతలు పెరిగాయి.. కానీ రాబడి మాత్రం మూడో వంతుకు పడిపోయింది. పసుపు రైతులు తమ గోడు చెపుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఎకరానికి రూ.1.20 లక్షల పెట్టుబడి పెడితే వర్షాల్లేక దిగుబడి భారీగా తగ్గిపోయింది. 15 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఇప్పుడు మార్కెట్లో క్వింటాలు పసుపుకు రూ.4000కు మించి రాని పరిస్థితులు ఉన్నాయి. పంటను అమ్ముకుంటే ఆ రైతన్నకు రూ.60 వేలు వస్తాయి. మరో రూ.60 వేలు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పసుపు పంట క్వింటాలుకు రూ.16 వేలు ధర ఉంటే.. నిరుడు అది రూ.12 వేలకు పడిపోయింది. నిన్ననే ఓ రైతు నా దగ్గరికొచ్చాడు. పసుపును నిరుడు ఇదే సమయానికి రూ.13,700కు అమ్ముకుంటే... ఈ ఏడాది రూ.4,200కే అమ్ముకోవాల్సి వచ్చిందని మార్కెటు స్లిప్పులు తెచ్చి నాకు చూపించాడు. ఒక్క పసుపే కాదు. వరి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్క బస్తా అమ్ముకుంటే రూ.750కి మించి రావడం లేదు. వ్యవసాయం చేయటం కంటే ఉరి పోసుకోవటమే మేలు.. అన్న సామెత ప్రతిచోటా వినిపిస్తోంది.గిట్టుబాటు ధరల్లేక పత్తి, చెరకు రైతులు కూడా తల్లడిల్లుతున్నారు. మార్కెట్లో చక్కెర ధర కిలోకు రూ. 34 ఉంటే... చెరకు పండించిన రైతులకు మాత్రం టన్నుకు రూ.2000 గిట్టడం లేదు. నిరుడు రూ.12 వేలు పలికిన మిర్చికి ఇప్పుడు రూ. 5 వేలకు కాస్త అటుఇటు గా ఉంది. అలాగే కిందటేడాది రూ.4 వేల ధర ఉన్న సజ్జకు ఇప్పుడు రూ.2 వేలు మాత్రమే వస్తోంది. మహానేత వైఎస్ హయాంలో టన్ను రూ.18 వేలు పలికిన బత్తాయి ఇప్పుడు రూ.6 వేలకు కూడా అమ్ముడుపోవడం లేదు. టమాటా ధర అయితే అర్ధ రూపాయికి పడిపోయింది. ఉల్లి రెండు రూపాయలకు కిలో అమ్ముకోవాల్సిన దుర్భర దుస్థితి ఉంది.
పంట చేతికొచ్చేసరికి రేట్లు పడిపోతున్నాయి..
కరెక్టుగా పంట రైతన్న చేతికి వచ్చే సమయానికి మార్కెట్లో రేట్లు తగ్గిపోతున్నాయి. తీరా ఆ పంట వ్యాపారుల చేతికి వెళ్లిపోయాక రేట్లు పెరిగిపోతున్నాయి. అప్పుల బాధలు పడలేక, ఎంతో కొంత రేటుకు రైతన్న తన పంటలను అమ్ముకుంటున్నాడు. ఎరువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. వైఎస్ ఉన్నప్పుడు రూ.430 ఉన్న డీఏపీ ఎరువు రేటు... ఇప్పుడు రూ.1,050కి పెరిగింది. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలా దీక్షలు చేశాం.. నిరాహార దీక్షలు చేశాం.. కలెక్టరేట్లను, మండల కార్యాలయాలను ముట్టడించాం. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వ వైఖరి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది.
రైతును చూసి జాలిపడుతున్న కూలీ...
రాష్ట్రంలో కూలీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. రోజు కు కనీసం రూ.100లు కూడా గిట్టడం లేదని వారు చెబుతున్నారు. ‘‘కానీ.. పాపం... రైతన్నలే కష్టాలు, నష్టాల్లో ఉన్నారు. ఇంకా మాకేం ఇవ్వగలుగుతారు’’ అని వారు రైతుల పట్ల జాలి చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతటి దయనీయ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. బహుశా దేశచరిత్రలోనే మొదటిసారి అనుకుంటా.. రాష్ట్రంలోని రైతులు ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించి సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. రైతులను, రైతులను నమ్ముకున్న కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది.
‘మీ నాన్న వల్లే చిరునవ్వు..’ అన్నప్పుడు ఆనందమేసింది..
తొలిరోజున అంకాపూర్‌కు చెందిన రైతు మోహన్‌రెడ్డి నన్ను కలిశాడు. ‘‘రాష్ట్రమంతటా కరువు ఉంటే చిరునవ్వుతో మేమెందుకున్నామంటే.. మీ నాన్న గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టులు మాకిచ్చారు. అంతకుముందు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చూసి వెళ్లి పోయారు. ఎన్నికలప్పుడు వచ్చి ఏదో చేస్తామన్నారు. కానీ మీ నాన్న మా ఊరికొచ్చారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి మమ్మల్ని ఆదుకున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోనే మాకు నీళ్లొచ్చాయి. రూ.230 కోట్లతో గుత్ప, రూ.270 కోట్లతో అలీసాగర్ నిర్మించారు..’’ అని మోహనన్న చెప్పినప్పుడు ఆనందమైంది. రైతుల బాధలు అర్థం చేసుకున్న వ్యక్తి దివంగత నేత వైఎస్ ఒక్కరే. అందుకే వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజకీయాల్లో విలువలకు అర్థం తెచ్చి.. విశ్వసనీయతకు అద్దంపట్టిన నాయకుడు వైఎస్. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట... అధికారపక్షం లో ఉన్నప్పుడు ఇంకోమాట మాట్లాడుతూ.. ఎన్నికలప్పు డు మాత్రమే ప్రాజెక్టులకు టెంకాయలు కొడుతున్నారు.
ఆ 17 మంది విలువలు, విశ్వసనీయత వైపు నిలిచారు..
నాకు తల్లి లాంటిది, మన అక్కసురేఖను చూసి గర్వపడుతున్నా. కారణమేమిటంటే... విలువలు, విశ్వసనీయత లేక చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను కాదని ఆమెతోపాటు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రం నిఖార్సుగా పేదల పక్షాన నిలిచారు. ప్రజలందరూ మనవైపు చూస్తున్నారు.. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు.. పేద విద్యార్థి చదవలేని పరిస్థితి.. పేదలు బతకలేకపోతున్నారు.. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి మనల్ని చూస్తున్నారు. చంద్రబాబు ఏ దురుద్ధేశపూర్వకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టినా కూడా.. మనం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే.. అని నేను వారికి చెప్పా. ఈ రాజ కీయ వ్యవస్థలో విలువలు కావాలి.. విశ్వసనీయత ఉండాలి అని, ప్రతి ఒక్కరూ రైతుల కోసం నిలబడాలని, పేద ప్రజల కోసం పోరాడాలని అని నేను చెప్పిన మాటను గౌరవించి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతాయి. ఆ రోజు ఎమ్మెల్యేలందరూ భయపడ్డారు కూడా. ఎందుకంటే అధికార పక్షంతో పోటీ. వాళ్లు కోట్లతో కుమ్మరిస్తారు. మంత్రులంతా నియోజకవర్గాల్లో మకాం వేస్తారు. పోలీసు యంత్రాంగం కూడా వారి చెప్పుచేతల్లో ఉంటుంది. కానీ.. వారికి నేనొక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడదామని. మొట్టమొదటిసారి రైతుల కోసం పేదల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి.. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికలు జరగబోతున్నాయి.
బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలన్నది బాబే...!
జీవో 89, 99 ప్రతులను వేదికపై చూపిన జగన్
కరెంటు బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలంటూ చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన జీవో కాపీలను రైతు దీక్ష వేదికపై జగన్‌మోహన్‌రెడ్డి చూపారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మించి మరో వ్యక్తి ఉన్నాడు. ఆయనే చంద్రబాబునాయుడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నేతకైనా విశ్వసనీయత, విలువలు అంటే అర్థం తెలిసిఉండాలి. ఆయ న చేసే పనులు ఏవీ కూడా రైతులు, పేదలపై ప్రేమతో కాదు. ‘‘నాకేంటి లాభం..?’’ అన్న ఆలోచనతోనే చేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలారేసుకునేందుకే ఉపయోగపడతాయన్న చంద్రబాబు.. ఇప్పుడు నిస్సిగ్గుగా తానే తొమ్మిది గంటల కరెంటు ఇస్తానని అబద్ధాలు చెబుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టకుంటే వారిని జైల్లో పెట్టేందుకు, శిక్షించేందుకు ఆయన జీవో నం.89, జీవో నం.99లు జారీ చేశారు. జీవో 89లో... కరెంటు బిల్లులు కట్టని రైతులను వారెం టు కూడా లేకుండా అరెస్టు చేయండి అని చెప్పారు.
అంతటితో ఆగకుండా బిల్లులు చెల్లించని రైతులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించాలి.. అని ఇదే జీవోలో చెప్పారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తూ జీవో 99 తెచ్చారు. రైతులపై బాబుకు ఉన్న ప్రేమ ఇదీ..! అంతకుముందు రూ.50 ఉన్న హార్స్‌పవర్ విద్యుత్తు బిల్లును రూ.650కి పెంచిన పెద్దమనిషి కూడా చంద్రబాబే. వైఎస్ ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించిన తర్వాత.. ఎన్నికలకు పోయినప్పుడు నేను కూడా ఇస్తా అంటూ బాబు చెప్పారు. మళ్లీ ఇటీవల కరీంనగర్ సభకు వెళ్లినప్పుడు.. ‘‘విద్యుత్తు తీగలు చూపిస్తూ.. చూశారా... ఆ రోజే నేను చెప్పా. ఉచితంగా కరెంటిస్తే బట్టలారేసుకోవాల్సి వస్తుంది.. అదే నిజమైంది..’’ అని ఇదే చంద్రబాబు అన్నారు. ఒక మనిషి ఏ మాత్రం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట మార్చుకుంటూ పోతాడో చెప్పేందుకు చంద్రబాబే ఒక ఉదాహరణ’’ అని జగన్ అన్నారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యలు
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకమే కారణం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగుపడింది, వ్యవసాయం ఆశాజనకంగా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో 134 లక్షల టన్నుల ధాన్యం ఉత ్పత్తులుంటే, ఆయన సీఎం అయ్యాక 220 లక్షల టన్నులకు ఉత్పత్తులు పెరిగాయి. కానీ మహానేత మరణం తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పండించిన పంటల పరిస్థితి ఇలా ఉంటే... తినడానికి సరైన తిండిలేకపోవడంతో దేశంలో 42 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లేకపోయిందని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. దీన్నిబట్టి దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. వైఎస్సార్ నాటి స్వర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. రైతుల పక్షాన అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తున్న జగన్ చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ
రైతు దీక్షతో ప్రభుత్వానికి హెచ్చరిక
రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులపాటు అకుంఠిత దీక్ష చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక పంపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. అందుకే జగన్ రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొమ్మిదేళ్ల హయాంలో రైతుల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు చేస్తున్న రైతుపోరును చూసి జనం నవ్వుకుంటున్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని కోరినందుకు ముగ్గురు తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదే. కానీ వైఎస్సార్ అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతోపాటు పంటకు గిట్టుబాటు ధర అందించారు. ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వస్తేనే రైతుల జీవితాలు బాగు పడతాయి.
- కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే
తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది
తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టమైన వైఖరి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాది ప్లీనరీలోనే తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తున్నామని చెప్పి, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్న టీడీపీ... తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనంటున్న కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్ తెలంగాణకు రావద్దనడానికి ఆ పార్టీలకు సిగ్గుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పునాదులు కదిలి పోతాయి. జగన్ రైతుదీక్షకు మద్దతు తెలిపిన వేలాదిమంది రైతులకు కృతజ్ఞతలు.
- బాజిరెడ్డి గోవర్ధన్, వైఎస్సార్‌సీపీ నేత
వైఎస్ హయాంలో ముస్లింలకు న్యాయం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లిం లకు న్యాయం జరిగింది. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సారే. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి అరకులో గిరిజనులతో కలిసి డ్యాన్స్‌లు చేస్తున్నారు. జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకమయ్యారు. కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు చివరి కిరణం. చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.
- ఎంఏ రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ
జగన్‌కు నిమ్మరసం ఇవ్వడం ఆనందంగా ఉంది
రైతు సమస్యలపై మూడు రోజులుగా దీక్ష చేసిన రైతు బాంధవుడు వైఎస్ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం ఆనందం గా ఉందని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన నక్కల భూమారెడ్డి అనే రైతు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం భూమారెడ్డి తన చేతులతో జగన్‌కు నిమ్మరసం తాగించి రైతుదీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు చేపట్టి రైతులకు మేలు చేశారని, వ్యవసాయ రుణ మాఫీ కింద తనకు ఒక లక్ష రూపాయలు మాఫీ అయినట్లు గుర్తుచేసుకున్నారు. కరెంటు బకాయిలు కూడా మాఫీ అయ్యాయని చెప్పారు. మూడ్రోజులుగా దీక్ష ప్రాంగణంలోనే ఉన్నానన్నారు.
- రైతు నక్కల భూమారెడ్డి స్పందన
No comments:
Post a Comment