Sunday, April 17, 2011

పోటెత్తిన పులివెందుల * జనం ఆశీస్సులతో... విజయమ్మ నామినేషన్

మండుటెండలో మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన తరలి వచ్చిన వేలాదిమంది జనం.. వైఎస్ అమర్హ్రే.. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ పెద్దఎత్తున నినాదాలు. జనంతో పోటెత్తిన పులివెందుల రోడ్లు.. అభిమానుల ఆశీర్వాదాల నడుమ పులివెందుల శాసనసభాస్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా వై.ఎస్. విజయమ్మ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. యువనేత జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ, సతీమణి భారతితో కలసి శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ సమాధి చెంత నామినేషన్ పత్రాలను ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం పులివెందులలోని తమ గృహానికి చేరుకుని బంధు, మిత్రులతో కలసి ప్రార్థనలు చేశారు.
ఉదయం 8 గంటల నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పులివెందుల నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిమంది జనం జగన్ ఇంటికి చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు జగన్ నివాసానికి వచ్చారు. ఉదయం 10-35 గంటలకు విజయమ్మతో పాటు జగన్, వై.ఎస్.భాస్కరరెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేయడానికి ఇంటినుంచి కాలినడకన బయల్దేరారు. నాయకులు, కార్యకర్తల సూచనమేరకు జగన్, విజయలక్ష్మి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, సినీనటి రోజా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు ప్రచార రథం ఎక్కారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పాదయాత్రగా వచ్చిన కళా బృందం, ఆముదాల వలస నుంచి వచ్చిన కళాబృందం వాహనం ఎదుట ప్రదర్శనలు చేస్తుండగా రథం ముందుకు సాగింది.
ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌కు చేరుకోగానే అశేషంగా తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతం నిండిపోయింది. మండుటెండలో మూడు కిలోమీటర్ల దూరం జనతరంగం ముందుకు సాగింది. పూల అంగళ్ల సర్కిల్, పుల్లారెడ్డి ఆస్పత్రి సర్కిల్, సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్, జూనియర్ కాలేజీల మీదుగా ర్యాలీ మధ్యాహ్నం 12-30 గంటలకు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న అనేకమంది వాహనాలను పోలీసులు పక్కకు మళ్లించడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకాలను చేత్తో పట్టుకోరాదని ఆంక్షలు పెట్టడంతో అభిమానులు పోలీసుల మీద తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గి ర్యాలీ సాగడానికి అంగీకరించారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు వై.ఎస్. విజయవ్ముతో పాటు జగన్, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.ప్రకాష్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తిచేసి రిటర్నింగ్ ఆఫీసర్ గోపాల్‌కు విజయవ్ము తన నామినేషన్ పత్రాలు అందచేశారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి, పార్టీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్‌ఠాకూర్, విజయ్‌చందర్ పాల్గొన్నారు.

Friday, April 15, 2011

జగన్ నామినేషన్ సందర్భంగా ఉప్పొంగిన ఉత్సాహం

యువనేత నామినేషన్ సందర్భంగా జనసంద్రమైన కడప రోడ్లు
స్థానికులతోపాటు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన అభిమానులు
నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ సమాధిని సందర్శించిన జగన్
భావోద్వేగానికి గురైన జగన్ కుటుంబ సభ్యులు, చలించిపోయిన అభిమానులు


వైఎస్సార్ పార్టీ అధినేత, ఆ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర వారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కడప కలెక్టర్‌రేట్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. 11.04 గంటలకు ఒకసెట్ దాఖలు చేయగా, 11.22 గంట లకు మరో సెట్‌పై సంతకం చేసి రిటర్నింగ్ అధికారి శశిభూషణ్ కుమార్‌కు అందజేశారు. జగన్ వెంట ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, న్యాయవాది పుల్లారెడ్డి ఉన్నారు.


జనసంద్రంగా కలెక్టరేట్
యువనేత నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాల యం చుట్టూ ఉన్న రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. పార్టీ కార్యకర్తలు అభిమానుల కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వెల్లువులా వచ్చిన అభిమానులను నిలువరించడానికి పోలీసులు పడరాని పాట్లుపడ్డారు.

నాన్నకు నివాళులు..అమ్మ దీవెనలు


ఉదయం 9.30గంటల ప్రాంతంలో మొదట విజయమ్మ, షర్మిళ, భారతిరెడ్డి వైఎస్‌ఆర్ సమాధివద్ద నివాళులర్పించారు. విజయమ్మ ప్రార్థన చేస్తుండగా సమాధి వద్దకు జగన్ రాగానే ఆమె ఉద్వేగానికి గురై కుమారుని పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చుతూ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. అనంతరం నామినేషన్‌కు సంబంధించిన ఫైలును సమాధిపై ఉంచి జగన్‌ను దగ్గరకు తీసుకుని విజయమ్మ ముద్దుపెట్టి ఫైలు అందించారు. కాగా, ఇడుపుల పాయకు బయలుదేరే ముందు పులివెందులలోని ఇంట్లో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా అమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న అభిమానులు తిరుపతి ప్రసాదాలు, కుంకుమ జగన్‌కు ఇచ్చారు. వాహనం ఎక్కగానే గుమ్మడికాయ దిష్టి తీశారు.

తరలివచ్చిన నేతలు.. అభిమానులు


యువనేత నామినేషన్ కార్యక్రమానికి, అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద నివాళులర్పించేందుకు జగన్ మామ ఇ.సి.గంగిరెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వై.ఎస్.సుశీలమ్మ, వై.ఎస్.ఆనంద్‌రెడ్డి, వై.ఎస్.రాజేష్‌రెడ్డి, జార్జిరెడ్డి సతీమణి వై.ఎస్.భారతమ్మ, జగన్‌మేనత్త విమలమ్మ, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, కడప మాజీమేయర్ రవీంద్రనాథరెడ్డి, సజ్జల దివాకర్‌రెడ్డి, వై. ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మారెప్ప, పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, బూచేపల్లె శివప్రసాద్‌రెడ్డి, ఆళ్ల నాని, శేషారెడ్డి, సత్యవతి, షాజహాన్, శోభానాగిరెడ్డి, బాబురావు, కాటసాని రామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గండి బాబ్జి, విష్ణువర్దన్‌రెడ్డి, శివరామరాజు, బాజిరెడ్డి గోవర్దన్, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రెహ్మాన్, కంచర్ల ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైఎస్ చైర్మన్ శంకరరెడ్డి, సినీనటి రోజా, వాసిరెడ్డి పద్మ, శ్రీలక్ష్మీరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, గోనె ప్రకాశరావు, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఇ.వి.సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు.

వైఎస్ జగన్ చరాస్తి విలువ రూ. 365 కోట్లు
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ చరాస్తి విలువ రూ. 365,68,55,224లుగా తెలిపారు. స్థిరాస్తులు, వాటిపై చేసిన అభివృద్ధి తదితరాలు రూ. 8,35,97,412 లుగా వివరించారు. ప్రస్తుతం ఈ స్థిరాస్తి మార్కెట్ విలువ రూ. 25,04,50,893 కాగా, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డి పేరున ఉన్న చరాస్తి విలువ రూ. 41,33,46,809లుగా ప్రకటించారు. భారతి పేరున ఉన్న స్థిరాస్తి విలువ రూ. 1,59,53,540లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థిరాస్తి విలువ రూ. 13,63,94,338లుగా తెలిపారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి జగన్ తీసుకున్న రుణాలు రూ. 2,40,73,390లుగా తెలిపారు. వైఎస్ భారతి తీసుకున్న రుణాల విలువ రూ. 7,71,39,995లుగా పేర్కొన్నారు.