Showing posts with label Guntur. Show all posts
Showing posts with label Guntur. Show all posts

Friday, January 27, 2012

సర్కారు కళ్లు తెరిపిద్దాం! * గుంటూరు ఓదార్పులో జగన్ పిలుపు

*వస్త్ర వ్యాపారులకు అండగా నిలుద్దాం
*వ్యాట్ విధింపుపై ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా చలనం లేదు
*ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది

  ‘‘వస్త్రాలపై వ్యాట్ తగ్గించాలని చిన్న చిన్న వ్యాపారులు కూడా దుకాణాలు మూసివేసి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.. ఈ పాలకుల కళ్లు తెరిపించేందుకు ప్రజలు సిద్ధం కావాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేద వ్యాపారులకు తోడుగా నిలుద్దామని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి జగన్... 58వ రోజు ఓదార్పు యాత్రను ప్రారంభించారు.

గురజాల నియోజకవర్గం దాచేపల్లి, గురజాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాను బొడ్డపాటి అంజిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మొత్తం ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా..

పెంచిన వ్యాట్ తగ్గించాలని వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసేశారు. ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. చిన్నచిన్న దుకాణాల వాళ్లు కూడా షాపులు మూసి సమ్మె చేస్తున్న పరిస్థితులు ఉన్నా... వారిని పట్టించుకునే నాథుడే లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి... చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది. ఈ చిన్నచిన్న దుకాణాల వాళ్లకు మద్దతుగా నిలబడటం కోసం శుక్రవారం రోజున (నేడు) నరసరావుపేటలో ధర్నా చేయబోతున్నాం. దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా. నేను కూడా మీతో పాటుగా అక్కడ ధర్నాలో పాలు పంచుకుంటాను.

మాట వదిలేస్తే బతకటమే అనవసరం..
మాటంటూ ఇస్తే ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి కాదు.. కష్టమైనా.. నష్టమైనా ఇచ్చిన మాట తప్పకూడదని.. మడమ తిప్పకూడదని.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన దివంగత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ప్రజల గుండె చప్పుడు వినాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండుటెండలో కాలినడకన 1500 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ మహానేత అడుగుజాడల్లోనే నా పయనం. నాడు నల్లకాలువ సంతాప సభలో పాల్గొన్నప్పుడు నా మనసు నిండా బాధ ఉంది. తండ్రిని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో తెలిసింది.

దివంగత నేత కోసం ఎవరెవరు చనిపోయారో ఆ ప్రతి కుటుంబాన్నీ కలిసి పరామర్శిస్తానని అప్పుడే మాట ఇచ్చాను. అది నువ్వు ఎందుకు చెప్పావని ఎవరైనా అడిగితే.. నేను సమాధానం చెప్పలేను. దేవుడు ఆ మాట నా చేత ఎందుకు చెప్పించాడో తెలియదు. ఎలాంటి రాజకీయాలు లేని ఆ వేళ నేను కల్మషం లేని మనస్సుతో ఆ మాట చెప్పాను. నేను ఇచ్చిన ఆ మాటను గాలికి వదిలేయమన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలా నేను చేయలేనని చెప్పాను. కారణం ఏమిటంటే.. ఇచ్చిన మాటను వదిలేస్తే నేను బతికి ఉండటం కూడా అనవసరం అనిపించే ఆ మాట చెప్పా.
మాట తప్పనందుకే సీబీఐ విచారణ..

ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నందుకు ఇవాళ నా మీద సీబీఐ విచారణ వేశారు. ఇన్‌కంటాక్స్ కేసులు పెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టరేట్‌తో నా మీద దాడులు చేయించారు. అన్నీ జరిగాయి. కానీ ఆ మాటపై నిలబడినందుకు నేను ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను. 600 గుడిసెల్లోకి వెళ్లాను.. ప్రతి పేదవాడు పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి చుశాను.. ఆ మాటను గాలికి వదిలేసి ఉంటే బహుశా ఎప్పటికి కూడా నేను ఇవ న్నీ చూసి ఉండక పోయేవాణ్నేమో.

Tuesday, January 17, 2012

రైతుల కళ్లలో కన్నీళ్లు - పట్టించుకున్న నాథుడే లేడు : జగన్

గుంటూరు ఓదార్పులో వైఎస్ జగన్ ఆవేదన
అన్నదాత అధోగతిలో ఉన్నా.. 10 నెలలుగా రాష్ట్రంలో
వ్యవసాయ మంత్రి లేరు
వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడం మేలనే మాట వినిపిస్తోంది

రాష్ట్రంలో రైతన్నల ముఖాల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని, దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత అధోగతిలో ఉన్నా.. ఈ రాష్ట్రానికి 10 నెలలుగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా లేరని ప్రభుత్వంపై మండిపడ్డారు. పండించిన ఏ పంటకూ మార్కెట్లో సరైన ధర దక్కక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని దిడుగు గ్రామంలో ఓదార్పు యాత్రను వై.ఎస్.జగన్ పునఃప్రారంభించారు. జిల్లాలో 49వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆరు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపూడి, పెదకూరపాడు సహా పలుచోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...


‘‘ఐదు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడ్రోజులపాటు రైతు దీక్ష చేసి ఇక్కడకు వచ్చాను. రైతన్నల ముఖాన ఈవేళ కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరి వేసుకున్న రైతులను అడిగితే బస్తా రూ.750కు కూడా అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామన్న సమాధానం వచ్చింది.

మిరప రైతులను కలిస్తే.. క్వింటాలుకు రూ.4 వేలు కూడా గిట్టని స్థితిలో ఉన్నామని సమాధానమిచ్చారు. పత్తికి క్వింటాలుకు రూ.3,500 కూడా అందడంలేదు. వ్యవసాయం చేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలనే మాట వినవస్తోంది. ఇక్కడకు వచ్చే ముందు దారిలో నడిరోడ్డుపై పరిచిన ఉల్లిపాయలను రైతులు నాకు చూపిం చారు. ఎకరాకు రూ.40 వేల నుంచి 50 వేలు ఖర్చుచేశాం. అమ్ముదామంటే కిలోకు రెండు రూపాయలు కూడా సరిగా గిట్టని పరిస్థితులున్నాయని రైతులు చెబుతున్నపుడు బాధనిపించింది.

దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఇవే ఉల్లిపాయలు కిలో రూ.16కు అమ్మిన రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రతి రైతు చెబుతున్నపుడు.. ఆ సువర్ణయుగం అన్నదాతలకు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. జూపూడి గ్రామం వచ్చేముందు కొందరు మిర్చి రైతులు నాతో మాట్లాడారు. మిర్చి పంటను చూపిస్తూ.. మొన్న వర్షమొచ్చింది.. బొబ్బర వైరస్ వచ్చి 20-25 క్వింటాళ్లు పండాల్సిన పంట.. 10 క్వింటాళ్లకు మించి పండే పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్‌కు వెళితే క్వింటాలు రూ.4 వేలకు మించి రాదు.. ఎకరాకు రూ.70 వేలు నష్టం వ చ్చే పరిస్థితులు కనబడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వంక ఆశగా చూస్తున్నా.. పట్టించుకోని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికివుంటే పరిస్థితులు ఈ మాదిరిగా ఉండేవి కావనే మాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. రాముడి రాజ్యమైతే చూడలేదు గానీ, రాజశేఖరుడి సువర్ణపాలన చూశామని అందరూ గర్వంగా చెబుతున్నారు.


పనుల కోసం జిల్లాలు దాటి వలసలు...


దారిలో చాలామంది అక్కాచెల్లెళ్లతో మాట్లాడాను. పొలాల్లో పనిచేస్తున్నారు. నన్ను చూసి వారంతా నా దగ్గరకు వచ్చి ఆప్యాయత చూపించారు. వారిలో కర్నూలు నుంచి కూడా వచ్చిన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ‘తల్లీ...అక్కడ పనులు లేవా?...ఇక్కడదాకా వచ్చారు?’ అని అడిగితే.. ‘అక్కడ రోజుకు రూ.70-80 కూడా గిట్టడం లేదు. మిరప తోటలకెళితే రూ.120-130 గిడతాయని వచ్చామన్నా’ అని అన్నారు. అక్కడ్నుంచి వలసలు వచ్చారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని పొలాల్లో పనిచేస్తున్న వారిని చూసి బాధనిపించింది.

రెండు నెలల్లో విద్యాసంవత్సరం ముగియనున్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించి రావల్సిన రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి అడిగే నాథుడే కరువయ్యాడు. ఇల్లు కట్టుకోవడం అటుంచి వైఎస్ బతికి ఉన్నప్పుడు కట్టుకున్న ఇళ్లకు డబ్బులు రాని పరిస్థితి. పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకున్న 108 అంబులెన్సులకు ఫోనుచేస్తే అందుబాటులేని దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలను చూస్తే బాధనిపిస్తోంది.’’

చనిపోయిన మహానేతకు ఓ న్యాయమట..
బతికున్న బాబుకు ఇంకొక న్యాయమట..


‘ఇవాళ రాష్ట్రంలోనయినా, కేంద్రంలోనయినా సోనియాగాంధీ రాజ్యమేలుతున్నారంటే.. దానికి కారణం వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అలాంటి నేత చనిపోయాడని తెలిసీ, తిరిగి రాడని తెలిసీ, బతికి ఉన్నపుడు ఒక మాటా మాట్లాడని ఇదే కాంగ్రెస్ నేతలు.. ఆయన చనిపోయాక అప్రతిష్టపాలు చేయాలని, నైతిక విలువలన్నీ పక్కనపెట్టి చివరకు చంద్రబాబునాయుడుతో కలిశారు. కుళ్లు, కుతంత్రాలు పన్ని కోర్టులకు వెళ్లి.. కేసులు వేసి చనిపోయిన ఆ మహానేతను అప్రతిష్టపాలు చేయాలని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. విలువలు లేని, విశ్వసనీయత లేని, న్యాయం లేని, ధర్మం లేని రాజకీయాలను వీరు కలసికట్టుగా చేస్తున్నారు. చనిపోయిన మహానేతకు ఒక న్యాయమట.. బతికివున్న చంద్రబాబునాయుడుకు ఇంకొక న్యాయమట! ఇలాంటి అన్యాయమైన వ్యవస్థను చూసి బాధనిపిస్తుంది.’

Tuesday, May 17, 2011

రైతుల మేలు కోరని దగాకోరు సర్కారు * రైతన్నల సమస్యలపట్ల నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం

* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు
* వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది...
* వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు
* నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా
* అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష...

  ‘రైతు సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనసు ఉండడంతో మార్గం కనిపించింది. స్వర్ణయుగం లాంటి ఆయన పాలనలో క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ. 530 నుంచి రూ. 1,000 వరకు పెరిగింది. ఒక దశలో ఈ ధర రూ. 1,200 వరకు పోయింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలపై మనసు లేకపోవడంతో మార్గం కనిపించడం లేదు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా తొక్కాలా.. కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలా.. అనే ఆలోచన లతో కాలం గడిపేస్తున్నారు. జగన్‌పై దృష్టి పెట్టే సమయంలో కేవలం 10 శాతం ప్రజా సమస్యలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రైతులకు మద్దతు ధరకోసం నేను చేపట్టిన 48 గంటల దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం
48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.

రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా.
 
ఆ ఏకైక సీఎం చంద్రబాబు
 
వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు.

నేను కదిలే వరకూ.. బాబు కదలరు

ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు.
ఈ సర్కారుకు సిగ్గులేదు
వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది.

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా

ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా.

మద్దతు ధర 100 పెంచాలి

ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.

స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం.

పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను.
 
ఉప్పొంగిన గుంటూరు * ముగింపు రోజున జనసంద్రంగా మారిన రైతుదీక్ష ప్రాంగణం
 
జనప్రవాహంతో గుంటూరు ఉప్పొంగింది.. అన్నదాతల వేల గొంతుకలు ఒక్కటయ్యాయి.. సమస్యలపై దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి.. తమకోసం దీక్షకు దిగిన జననేత కు జేజేలు పలికాయి..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ముగింపు సందర్భంగా మంగళవారం రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్ష ముగించిన అనంతరం జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం జగన్నినాదాలు, చప్పట్లతో దీక్షా ప్రాంగణం మార్మోగింది. అన్నదాతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగినప్పుడల్లా.. జనం హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వంద్వ వైఖరి, కుయుక్తులను వివరిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభించిన జగన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించారు. తనను కలిసేందుకు, వినతిపత్రాలు ఇచ్చేందుకు, కరచాలనం చేసేందుకు వచ్చిన జనాన్ని జగన్ ఆప్యాయంగా పలకరించారు. మూడ్రోజులపాటు రైతులు క్యూలో నిల్చుని జగన్‌ను కలిసి, తమ గోడును వెల్లబోసుకున్నారు. వీటిలో కొన్నింటికి జగన్ తక్షణమే పరిష్కారం చూపారు. సోమవారం వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాద బాధిత రైతులు సమస్యను విన్నవించిన క్షణాల్లోనే జగన్.. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫోన్ చేశారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకూ సంప్రదింపులు జరపాలని జిల్లా నేతలకు సూచించారు.

జనమే జనం:
రైతు దీక్షాప్రాంగణం చివరిరోజు జనసంద్రంగా మారింది. గుంటూరు జిల్లాతోపాటు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలి వచ్చారు. ఉదయం 7.30 గంటల నుంచే నేతల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి.

దీక్ష విరమణ:
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య కొబ్బరి నీళ్లు అందించి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. మద్దతు ధరలేక 960 బస్తాల ధాన్యాన్ని బస్తా ఒక్కింటికి రూ. 680కు అమ్ముకున్న సుబ్బయ్యకు సుమారు రూ. 5 లక్షల నష్టం వచ్చిం ది. జగన్‌తోపాటు ఆయనా నిరాహార దీక్ష చేశారు.

భారీగా తరలివచ్చిన నేతలు:
జగన్ చేపట్టిన రైతుదీక్షకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మూడ్రోజులపాటు సాగిన ఈ దీక్షకు మొత్తం ఇద్దరు పార్లమెంటు సభ్యులు, 19 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే), కొండా సురేఖ (పరకాల ఎమ్మెల్యే), ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత (పత్తిపాడు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), గొర్ల బాబురావు (పాయకరావుపేట), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), శేషారెడ్డి (అనపర్తి), కె.శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఎం.ప్రసాదరాజు (నర్సాపురం), బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), పి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కొవ్వూరు), కొర్ల భారతి (టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రాపురం), తెల్లం బాలరాజు (పోలవరం), ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు హాజరయ్యారు.

జగన్‌కు జన వీడ్కోలు

దీక్ష విరమించిన జగన్‌కు జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది మంది జగన్‌ను అనుసరిస్తూ పయనమయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ జగన్ గుంటూరు నుంచి మధ్యాహ్నం ఏలూరు బయల్దేరి వెళ్లారు.

జగన్ చెబితే అరగంటలో రాజీనామా
జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన పిలుపిచ్చిన అరగంటలో నాతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వ్యూహాలు, సాంకేతిక కారణాల వల్లే ఇప్పటివరకూ మేం రాజీనామాలు చేయలేదు. కడప ఉపఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెనుతుపాను రేగనుందని నేను ముందే చెప్పాను. ఈ తుపానులో వైఎస్, జగన్‌లను విమర్శించినవారంతా కొట్టుకుపోతారు. జగన్‌తో నడుస్తున్నందువల్లే ఎప్పుడూ ఇంటిపట్టున ఉండే విజయమ్మ సైతం 40 రోజులు మండుటెండల్లో ప్రజల మధ్య తిరిగారు. ఎవరైనా ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకుంటారు లేదా విజయోత్సవాలు జరుపుతారు. కానీ ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ మళ్ళీ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. అంతలోనే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి రైతుదీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్‌కు పోటీగా నిలబడగల నాయకుడెవ రైనా కనిపిస్తున్నారా?
- అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్న వాస్తవాన్ని సీఎం, మంత్రులు గ్రహించాలి. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ పదవీకాలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సహిస్తూ ఊరుకుంటున్నారు. లేదంటే అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు. కడప గెలుపు ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగులుతుంది. వైఎస్ లేని లోటును జగన్ తీరుస్తారు. నిజాయితీగా పనిచేయడం తప్ప టక్కుటమారాలు జగన్ ముందు చెల్లవు. మహానేత వైఎస్ భోళాశంకరుడని, జగన్ శ్రీమహావిష్ణువని సాక్షాత్తు ఓ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత నాతో అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు 50 వేల మెజార్టీ కూడా రాదని కొందరు, లక్ష మెజార్టీ దాటదని మరికొందరు, గత మెజార్టీని మించిపోరని ఇంకొందరు కబుర్లు చెబుతూ ప్రజల్ని గందరగోళంలో పడవేశారు. ఈ నేతల దొంగమాటలు నమ్మి పందేలు కాసినవారు అన్యాయమైపోయారు. ఈ రైతు దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలి.
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి

రైతుల కన్నీటిలో కొట్టుకుపోతుంది
రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. ఈ రైతుల కన్నీటిలో కిరణ్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే చిరంజీవి, రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్‌గా ముద్రపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు సమస్యల పట్ల పోరాడుతున్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని ముందు తెలుసుకోవాలి. తాము అధికారంలో ఉన్న చోట్ల సంస్కరణలు అమలు చేయడం మానేసి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ఆందోళన చేయడం ఎంతవరకు సబబు? కడప అఖండ విజయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు పాలపొంగుగా అభివర్ణించారు. అందులో ఉన్నది గిన్నెడు పాలు కాదు. సప్తసముద్రాలంత అభిమానం జగన్‌పై ఉంది. కడపలో జనం ఓట్లతో ఈవీఎం కుయ్‌మంటుంటే అక్కడ ఢిల్లీలో అధిష్టానం గూబ గుయ్యిమంది.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం ఖాయం
కడపలో జగన్ మెజార్టీ చూస్తుంటే.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభ ఎన్నికల మెజార్టీలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆ విజయం లెక్కలోనిది కాదు. అప్పట్లో పీవీపై ఎన్టీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదు. జగన్‌కు రాష్ట్రానికి సీఎంగానే కాదు.. దేశానికి ప్రధాని కాగల లక్షణాలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు కలిగిన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ ప్రజలు పట్టం కడ తారు.
- ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి

కాంగ్రెస్‌కు చర మగీతం పాడండి

చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా జవసత్వాలు తెచ్చిన నేత వైఎస్. అలాంటి మహానేత దేశంలో ఏ నాయకుడూ ప్రవేశపెట్టని విధంగా పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకలించాలి. ప్రజాసమస్యలపై, రైతు సమస్యలపై ఎలాంటి అవగాహన లేని సీఎం మనల్ని పాలించడం మన ఖర్మ. వైఎస్ తర్వాత రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాగళ్ళనే తుపాకులను చేసి మీ ఓటుతో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు చరమగీతం పాడి జగన్ సీఎం అయ్యేదాకా అండగా నిలవండి.
-ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

జగనే వారసుడని నిరూపించారు..

వైఎస్ వారసుడు జగన్ మాత్రమేనని కడప ఓటర్లు నిరూపించారు. రైతు దీక్షకు ఢిల్లీపెద్దలు తమ వేగుల్ని పంపి ఉంటారు. ఈ వేగుల ద్వారా అయినా రైతు గుండెచప్పుడు ఢిల్లీకి తెలుస్తుంది. కడప జిల్లాలోని తిరుమలదిన్నెలో ఓ నాలుగేళ్ల పాప మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వస్తున్నారంటే ఎవడైతే నాకేంటి? జై జగనన్న అని నినాదం చేసిందంటే జగన్ ఎంతలా ప్రజల గుండెల్లో ఉన్నారో అర్థమవుతుంది. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు సోనియా బొమ్మ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి.
-ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు

కిరణ్ కోసం పదవి వదులుకుంటారా?

జగన్ కోసం మంత్రి పదవులు వదులుకోవడానికి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. సీఎం కిరణ్‌కోసం మంత్రి పదవి వదులుకోవడానికి కేబినెట్‌లో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం వెన్నెముక లేని సర్కారు. దీన్ని కూల్చడం జగన్‌కు ఒక లెక్కకాదు. వీహెచ్, శంకరరావులు కాంగ్రెస్‌ను అథఃపాతాళానికి నెట్టడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముత్యంలాంటి పార్టీ. అయితే జగన్ వెళ్లిపోయిన తర్వాత ముత్యం వెళ్లిపోయింది. ప్రస్తుతం చిప్పే మిగిలింది. ఏ జాదూ వచ్చినా కాంగ్రెస్‌ను మార్చలేరు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు

దేశానికే ఆదర్శం వైఎస్..

రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ను చూసి దేశం ఎంతో నేర్చుకుంది. వైఎస్ పంచె కట్టుకుని వస్తుంటే రైతుకు నిజమైన ప్రతినిధిలా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాథుడే లేడు. సినిమా రంగం నుంచి వచ్చిన ఓ నేత సామాజిక సేవ అంటూ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి కేవలం పదవి కోసం పార్టీని నట్టేట ముంచి నీచమైన కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా రాష్ట్ర వ్యవసాయ రంగాన్నే దివాళా తీయించింది. మళ్లీ అప్పటి వైఎస్ పాలనను తీసుకురాగ ల వ్యక్తి జగన్ ఒక్కడే.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ

Monday, May 16, 2011

రైతు పోరు, జనహోరు * రెండో రోజూ ‘రైతు దీక్ష’కు పోటెత్తిన అన్నదాతలు

వినతిపత్రాలిచ్చి తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
జగన్ వెంటే నడుస్తానన్న మంత్రి ధర్మాన సోదరుడు, నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్
నేడు 12 గంటలకు దీక్ష విరమణ

‘బాబూ.. కాస్త దారిస్తారా..? జగన్ బాబును కలవాలి. ఆ మా రాజుకు ఈ కాగితం ఇచ్చెల్తా..! ఇంతమంది జనంలో కూడా ఎలాగోలా ఇక్కడ్దాక వచ్చా.. ఇంక నడవలేను సామి. కాస్త, ఆ బాబు దగ్గర్కి తీసుకెళ్లండయ్యా..’
అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పరిమి గ్రామానికి చెందిన వృద్ధ రైతు పేరం ముసలయ్య ఎట్టకేలకు జగన్ దగ్గరకు చేరుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు ముసలయ్య మూడెకరాల పంటను నష్టపోయాడు. సర్కారు నుంచి ఎలాంటి సాయం లేని నేపథ్యంలో జగన్‌కు తన ఆవేదనను తెలియచేసేందుకు అతడు దీక్షకు వచ్చాడు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రమిచ్చాడు.


ఇలాంటి వృద్ధ, యువ, మహిళా రైతులు గుంటూరులో సోమవారం రైతు దీక్షకు వేలాదిగా తరలివచ్చారు. జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కాకపోయినా.. జగన్‌కు తమ సమస్యలు చెప్పుకొంటే వాటి పరిష్కారానికి ఆయన తమ తరఫున పోరాడతారన్న నమ్మకమే 70 ఏళ్ల వయసున్న వారిని సైతం ‘రైతు దీక్ష’కు లాక్కొచ్చింది. 48 గంటల రైతు దీక్షలో రెండోరోజైన సోమవారమిలా రైతులు, అభిమానులు, మద్దతు తెలిపేవారితో దీక్షా ప్రాంగణం పోటెత్తింది. రైతులు వ్యవసాయ పరిస్థితుల్ని, నష్టపోయిన తీరును.. తమను పట్టించుకోని అధికారుల వైఖరిపై జగన్‌కు వినతిపత్రాలు అందించారు. మహిళలు సైతం పలు సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. పావలావడ్డీ, అభయహస్తం, రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను తమ అభిమాన నేత జగన్‌కు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జగన్‌ను కలిసేందుకు ప్రజలు వస్తూనే ఉన్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ కోసం నేనున్నాంటూ ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు.

అదే ఓర్పు.. అదే చిరునవ్వు: ఆదివారం మధ్యాహ్నం నుంచీ తిండీ తిప్పలు లేకున్నా.. కరచాలనానికి జనం పోటెత్తుతున్నా.. జగన్ పెదాలపై చిరునవ్వు చెరగలేదు.. తనతో మాట్లాడ్డానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కరచాలనం చేస్తూ ఆయన ఉత్సాహంగా కనిపించారు. క్యూలో వచ్చిన ప్రతిఒక్కర్నీ ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ.. వారు చెప్పుకునే సమస్యల్ని సావధానంగా విన్నారు. అందరు రాజకీయ నేతల్లా కాకుండా.. వినతిపత్రాల్ని ఆయన చదువుతూ ఉండటం అభిమానుల్ని సంతృప్తిపరిచిన అంశమని చెప్పాలి. రైతన్నల చేతుల్లో చేయి కలిపి నేనున్నానంటూ భరోసానివ్వడం వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కదిలిన మహిళా లోకం: ఎర్రని సూరీడు అగ్నిగోళంలా మండుతూ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరినా లెక్కచేయక మహిళలు వడివడిగా వైఎస్సార్ రైతు ప్రాంగణానికి చేరుకున్నారు. వారు వేల సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సహకరించి మహిళల ఆకాంక్షను నెరవేర్చారు. ఓవైపు వేదికపై ప్రజా కళాకారులు పాటలు ఆలపిస్తుండగా, క్యూల్లో నిల్చొన్న రైతులు, అభిమానులు కూడా వారికి వంతపాడుతూ జేజేలు పలికారు.

రహదారులన్నీ గుంటూరు వైపే:
సోమవారం రాష్ట్ర రహదారులన్నీ గుంటూరువైపే మళ్లాయి. కృష్ణా, ప్రకాశం, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి తరలి వచ్చారు. వీరుకాక ఖమ్మం, ఆదిలాబాద్, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.


ప్రజాప్రతినిధుల హాజరు:
రెండో రోజు దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధుల్లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోష్(రామచంద్రపురం), కొండా సురేఖ (పరకాల), ఎమ్మెల్యేలు తె ల్లం బాలరాజు(పోలవరం), కొర్ల భారతి(టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కె.శ్రీనివాసులు(రైల్వే కోడూరు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ), అమర్‌నాథరెడ్డి(రాజంపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బాబూరావు (పాయకరావుపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకాశేషుబాబు తదితరులున్నారు.

మిర్చి రైతులను ఆదుకోండి..
ఇన్‌చార్జి కలెక్టర్‌కు జగన్ ఫోన్

గుంటూరు, న్యూస్‌లైన్: ‘మిర్చి రైతుల్ని ఆదుకోండి.. అప్పులు చేసి పండించిన పంటను ధర వస్తుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ధర సంగతి ఎలా ఉన్నా ఒక్క కాయ కూడా మిగలకుండా మొత్తం బూడిదైంది. గుంటూరులో వరుసగా కోల్డ్ స్టోరేజీలు తగులబడటంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రతీ రైతుకు పారదర్శకంగా పరిహారం అందించాలి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ను కోరారు. ఆదివారం రాత్రి గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెంలో ఉన్న వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నికి ఆహుతై వందలాదిమంది రైతులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులు కలిసి న్యాయం చేయాలంటూ విన్నవించారు. తక్షణమే స్పందించిన జగన్.. అప్పటికప్పుడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. నష్టపోయిన ప్రతి రైతును రికార్డుల ఆధారంగా గుర్తించి పరిహారం తక్షణమే అందించాలని, జాప్యం జరిగినా, రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తానని చెప్పారు. కాగా మిర్చి రైతులకు అండగా వైఎస్ జగన్ ఉంటారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. జేసీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం సారాంశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రైతులకు వివరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే మళ్ళీ మళ్ళీ జగన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని చెప్పారు.

నేడు 12 గంటలకు దీక్ష విరమణ

వైఎస్ జగన్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. దీక్ష విరమణకు ముందు జగన్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.

పొట్టగొడితే.. పోగాలమే! ...... నినదించిన జగన్ ‘రైతు దీక్ష’

* భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు
* మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం..
* మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు నిరసన
* జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష
* ప్రభం‘జనం’తో కిక్కిరిసిన ఐదో నంబర్ జాతీయ రహదారి
* నిప్పులు కక్కుతున్న ఎండను సైతం లెక్కచేయక కాలినడకన వచ్చిన ప్రజలు.. ఉదయం 9 గంటలకే‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో జన హోరు
* సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు

‘‘నోటికాడికి ముద్దను తెచ్చే చేతుల్ని నరికే ప్రభుత్వమిది. రైతుల్ని ఇబ్బందిపెట్టినోళ్లంతా ఏమయ్యారు..? ఈ సర్కారూ గాల్లో కలిసేదే.’’
‘‘వైఎస్ ఉన్నప్పుడు మద్దతు ధర రూ.వెయ్యి వచ్చేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తోంది.’’
‘‘మొన్నటి తుపానుల పరిహారాలకే దిక్కులేదు. బ్యాంకు రుణాల్లో ఇన్సూరెన్స్ కింద కొంత కోతకోసినా.. ఈ సర్కారు హయాంలో మాకు నష్టపరిహారం సొమ్ము వచ్చింది లేదు.’’

.... ఇదీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’లో అన్నదాతల ఆవేదన, ఆగ్రహ జ్వాల. వేసవి కాలం.. భానుడు చండ ప్రచండంగా మండిపోతున్నాడు.. అందులోనూ గుంటూరు.. 42 డిగ్రీలతో నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటు ‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో ఇలా రైతు సూరీడు కూడా అంతే స్థాయిలో ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నాడు. తమ బాధలు పట్టని సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడం, వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు తమ ఆవేదన, ఆక్రందనల్ని ఆదివారం ‘రైతు దీక్ష’లో వెళ్లగక్కారు.

తమను పట్టించుకోకుండా మిల్లర్లకు ఊతమిస్తూ తమ పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తున్నప్పటికీ.. జగన్ దీక్షకు జనం ప్రభంజనమై పోటెత్తారు. తమకు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి అన్నదాతలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ నినాదాలతో, పోటెత్తిన అశేష జనవాహిని సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు కొనసాగే ఈ దీక్ష 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.

రైతు నేతకు నివాళితో దీక్ష ప్రారంభం..
శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్ వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు.

అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతునేత తికాయత్‌మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సమస్యల గోడు వెళ్ళబోసుకోవటానికి వచ్చిన రైతులతో జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘మీ నాయన బతికుంటే మా బతుకులు బాగుండేవయ్యా’ అంటూ మాచర్లకు చెందిన సింహాద్రి రాములు తన పరిస్థితిని విన్నవించాడు. నాలుగు ఎకరాల్లో పంట వేస్తే అపారనష్టం వాటిల్లిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రూ.600కు కూడా ధాన్యం కొనే నాథుడే లేడని రైతులు తమ ఆవేదనను వివరించారు.
మద్దతుగా వేలాదిమంది దీక్ష
దీక్ష ప్రాంగణంలో జగన్‌కు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష ప్రారంభించారు. దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అడుగడుగునా అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. సమస్యలను, సిద్ధాంతాలను విస్మరించి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి వంగపండు కుమార్తె ఉష ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ చేసిన మిమిక్రీ, గీతాలు ఆహూతులను అలరించాయి. యువత స్వచ్ఛందంగా వాలంటీర్ బాధ్యతలు స్వీకరించి దీక్షకు హాజరైన రైతులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు.
9 గంటల నుంచే జనహోరు
రైతులు భారీస్థాయిలో దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గుంటూరు, కర్నూలు, చిలకలూరిపేట రోడ్డు(ఎన్‌హెచ్ 5) వాహనాల రద్దీతో కిక్కిరిసింది. ఒకవైపు రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండగానే, మరోవైపు గుంటూరుకు సమీపాననున్న అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, జూనంచుండూరు, వింజనంపాడు, నల్లపాడు తదితర గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన దీక్షాశిబిరానికి వచ్చారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పసిపిల్లల్ని చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం విశేషం.

ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతో పాటు శిబిరం వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం దీక్షకు వచ్చిన జనం, జగన్ ప్రభావం, నేతల ప్రసంగాల గురించి చర్చించుకోవడం కనిపించింది. ఎంతమంది జనం వచ్చారు. ఎక్కడెక్కడ్నుంచి వచ్చారు. ఎలా వచ్చారంటూ వివరాల్ని పోలీసులు పదేపదే అడిగి తెలుసుకున్నారు. నేతల ప్రసంగాలప్పుడు ప్రాంగణంలోని యువత జిందాబాద్‌లతో హోరెత్తించారు. తమ అభిమాన నేత జగన్ ప్రసంగం కోసం పదేపదే డిమాండ్ చేశారు. ఆయన్ను కలుసుకుని అభినందించేందుకు, కరచాలనం చేసేందుకు అందరూ ఉత్సాహం చూపడం కనిపించింది. జగన్ చేతిని పెకైత్తి అభివాదం చేసినప్పుడల్లా ప్రాంగణంలో జై జగన్ నినాదాల హోరు మార్మోగింది.
జగన్ మెజార్టీపై అభినందనలు....
రెండురోజుల కిందటే కడప పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా రికార్డు మెజార్టీని సాధించిన జగన్ విజయోత్సాహాలను కూడా పక్కనపెట్టి రైతు దీక్ష చేయడంపై పలువురు నాయకులు ప్రశంసించారు. జగన్ నిత్య శ్రామికుడిగా రైతు పక్షాన పోరాటాలు చేయడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతోందని కొనియాడారు. జగన్ రికార్డు మెజార్టీతో దేశంలో తెలుగువారి ఆత్మగౌరవం మరొక్కసారి ప్రకటితమైందన్నారు. జగన్ మెజార్టీ గురించి ప్రస్తావించినప్పుడు సభకు హాజరైన వారు కరతాళధ్వనులు చేశారు.

ప్రాంగణంలో భారీ విద్యుత్ ప్రభ..
రైతు దీక్షా వేదిక ప్రాంగణంలో 98 అడుగుల భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ప్రభ ప్రాంగణానికి నూతన శోభను తీసుకొచ్చింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి అనే రైతు వెయ్యి బల్బులతో ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలాగే దీక్షా వేదిక ప్రాంగణంలో 20 వరకు బెలూన్లను ఎగురవేశారు.

Friday, December 10, 2010

జనంలోకి జగన్‌ * రైతులకు జగన్ పరామర్శ

సొంత పార్టీ స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన ఉన్నతికి కేవలం తండ్రి పేరు వినియోగించు కోవడం ఒక్కటే కాకుండా, తనకు తాను ప్రజానాయకుడిగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆయన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.జగన్‌ నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తుండగా, రాష్ట్రంలో జల్‌ తుపాను సంభవించింది. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి, రైతు లకు బాసటగా నిలిచారు. అయితే, జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఓదార్పు యాత్రకే పరిమితమయ్యారు. జల్‌ తుపాను వల్ల నెల్లూరు-ప్రకాశం జిల్లాలు కూడా దెబ్బతిన్నప్పటికీ, అక్కడే ఉన్న జగన్‌.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించటం గానీ, వారిని సానుభూతి ప్రకటించటం గానీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

దానిని పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించి, వారికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం.. ఆయన శు్ర వారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో రైలుమార్గం ద్వారా గుంటూరు-కృష్ణా జిల్లాలలో పర్యటించేందుకు సిద్ధమవుతు న్నారు. ఆ మేరకు ఆయా జిల్లాల నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇప్పటివరకూ కేవలం తండ్రి పేరు చెప్పుకుని ప్రచారం చేసుకోవడం వల్ల సొంతగా ఎలాంటి బలం లేదని, తండ్రి పేరు- ఫొటో లేకపోతే తప్ప మనుగడ లేదన్న తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్తులో తాను నాయకుడిగా ఎదగడం కష్టమని గ్రహించిన జగన్‌.. ఆమేరకు తన తండ్రి పేరు వినియోగించుకోవడంతో పాటు, స్వయంగా తాను జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అందుకే ఆయన రైతులను పరామర్శించేందుకు రైతుబాట పట్టనున్నట్లు కనిపిస్తోంది. వైఎస్‌ రైతు కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్రలతో పాటు, తరచూ జనంలోకి వెళ్లిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. తాను కూడా తండ్రి బాట పట్టకుండా, కేవలం ఆయన పేరును మాత్రమే వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించారు. దానితో ఇకపై తరచూ సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి వెళ్లాలని తీర్మానించుకు న్నట్లు కనిపిస్తోంది.
 వర్షబాధిత ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నేడు, రేపు పర్యటన

నేటి ఉదయం ‘జన్మభూమి’ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరనున్న యువనేత
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనేడు, రేపు జగన్ పర్యటన

చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీళ్ల పాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగాన్ని పరామర్శించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. శుక్ర, శనివారాల్లో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ గ్రామాల్లో ధ్వంసమైన పంట పొలాలను పరిశీలించనున్నారు. జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం పర్యటన వివరాలు

ఉదయం 7.10 గంటలకు హైదరాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదే రతారు.
మధ్యాహ్నం 12.25 గంటలకు గుంటూరు జిల్లా తెనాలికి చేరుకుంటారు.
చుండూరు మండలం చినపరిమిలో వరి పొలాలను సందర్శిస్తారు.
అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని పంట పొలాలను పరిశీలిస్తారు.
పెదపూడి రైతులను పరామర్శిస్తారు.
అమృతలూరు మండల కేంద్రంలో, గోవాడ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి, పొన్నపల్లి, నడింపల్లి, గూడవల్లి, కనగాల ప్రాంతాల్లో పంటనష్టాన్ని పరిశీలిస్తారు.
భట్టిప్రోలు మండలం శివంగులపాలెం వెళ్లి ఆ తరువాత భట్టిప్రోలు చేరుకుంటారు.
భట్టిప్రోలు మండలం వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం ప్రాంతాలను సందర్శిస్తారు
రేపల్లె మండలం కారుమూరు, పెదవరికూటివారిపాలెం, పేటేరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అక్కడినుంచి రేపల్లెకు చేరుకుంటారు.
రాత్రికి కృష్ణా జిల్లా అవనిగడ్డలో బసచేస్తారు.

శనివారం పర్యటించే ప్రాంతాలు

అవనిగడ్డ నుంచి బయలుదేరి బందలాయి చెరువు, వేకనూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
నాగాయలంక మండలం తుంగలవారిపాలెం, వక్కపట్లవారిపాలెంలను సందర్శిస్తారు.
కోడూరు మండలం పోటుమీద, మందపాకల, లింగారెడ్డిపాలెం, కోడూరు, కృష్ణాపురం, జయపురం, మాచవరం, కొత్తపేట ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అవనిగడ్డ మండలం అవనిగడ్డ, పులిగడ్డల్లో పొలాలను పరిశీలిస్తారు.
మోపిదేవి మండలం మోపిదేవి, పెదప్రోలు, కొత్తవానిపాలెం వెళతారు.
చల్లపల్లి మండలం చల్లపల్లి, లక్ష్మీపురం, లంకపల్లి, మాజేరు, జీలకరగ్రండిలో పంట నష్టాన్ని చూస్తారు.

బందరు మండలం గుండుపాలెం, రుద్రవరం, మచిలీపట్నం మీదుగా ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులను పరామర్శిస్తారు.

అదేరోజు రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఇది రైతాంగానికి కష్టకాలమని, వారంతా విషాదంలో మునిగి ఉన్నారని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నందున ఏ విధమైన ఆర్భాటాలకు తావివ్వరాదని సీనియర్ నేత, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ మేరకు మరీమరీ విన్నపం చేస్తున్నామని చెప్పారు. నాట్లు వేసినప్పటి నుంచి చివరివరకు రైతన్నలు వానలతో ఎన్నో కష్టనష్టాలకోర్చుకున్నారని, చివరకు ఎంతో కొంత చేతికి వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మళ్లీ విరుచుకుపడిన వర్షాలు రైతుల్ని కోలుకోకుండా చేశాయని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.