Thursday, January 6, 2011

జగన్ పార్టీ పేరు నమోదుకు దరఖాస్తు * ఈసీకి అందజేసిన వైవీ సుబ్బారెడ్డి

యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ పెట్టబోయే కొత్త పార్టీ పేరు నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంలో బుధవారం దరఖాస్తు దాఖలైంది. జగన్ తరఫున ఆయన ప్రతినిధి వై.వి.సుబ్బారెడ్డి ఈ దరఖాస్తును అం దజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన టీవీ చానళ్ల ప్రతినిధులతో సుబ్బారెడ్డి క్లుప్తంగా మాట్లాడారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును, స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా కొత్త పార్టీ పేరు ఉం టుందని ఆయన తెలిపారు. రెండు మూడు వారాల్లో ఈసీ నుంచి క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీ విధివిధానాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. పార్టీ పేరు ఈసీలో నమోదయ్యాక విధివిధానాలను వెల్లడిస్తామన్నారు. పేరు ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నలకు.. ఈసీ నుంచి క్లియరెన్స్ వచ్చినపుడు ఆ విషయం తెలుస్తుందని జవాబిచ్చారు.

జగన్ దీక్షకు మొదలైన ఏర్పాట్లు
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు నే పథ్యంలో జగన్ 11న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షకు ఏర్పాట్లు బుధవారం ఆరంభమయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలపై సుబ్బారెడ్డి పలువురితో సమావేశమై చర్చలు జరిపారు.

రైతు కష్టాలు కేంద్రానికి తెలిపేందుకే..... జగన్ ఢిల్లీ దీక్ష

జగన్ ఢిల్లీ దీక్షపై అంబటి రాంబాబు స్పష్టీకరణ
కేంద్ర జలపంపిణీ విధానం ఉండాలన్నదే
జగన్ ప్రధాన డిమాండ్
వైఎస్‌పై చంద్రబాబు విమర్శలు సరికాదు
ఆయన హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే
ఈ అనర్థం వచ్చేది కాదు
* ట్రిబ్యునల్ లో గట్టి వాదనలు వినిపించడంలో రాష్ట్రం విఫలమైందని జనం భావిస్తున్నారు

  కృష్ణానది ప్రాజెక్టుల పరిధిలోని రైతాంగం భయాందోళనలనూ, వారి కష్టాలనూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు దీక్షను చేపడుతున్నారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు తెలిపారు. ఆయన బుధవారం సాగర్ సొసైటీలోని జగన్ క్యాంపు కార్యాలయంవద్ద ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, శా్‌ప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, పీసీసీ కార్యదర్శి జనక్ ప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ జగన్ దీక్ష వివరాలను వెల్లడించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉందని, దానిని దృష్టిలో ఉంచుకునే.. కేంద్రం ఒక జల పంపిణీ విధానాన్ని ఏర్పాటు చేయాలని జగన్ కోరుతున్నారని ఆయన తెలిపారు.

మిగులు జలాలు అక్కర లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాసిన లేఖ ఫలితంగానే కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆ వాదనను అంబటి ఖండించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటై, విచారణ ప్రారంభించిన తరుణంలో కడుతున్న ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులుగా భావించరాదనే ఉద్దేశంతో వైఎస్ ఈ లేఖ రాశారేతప్ప మరో ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో కృష్ణానదిపై వైఎస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే నాటికే పూర్తి కావాల్సినవని, కానీ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వాటి జోలికే పోనందువల్ల వచ్చిన అనర్థమిదని ఆయన వివరించారు. చంద్రబాబు ఇరిగేషన్ ఊసెత్తక పోవడంవల్ల రాష్ట్ర రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ట్రిబ్యునల్ ముందు మన న్యాయవాదులు సరిగ్గా వాదనలు వినిపించలేదని, ప్రభుత్వం వారికి కావాల్సిన సమాచారాన్ని అందించలేకపోయిందని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా... ‘‘ఉండొచ్చు, ప్రభుత్వ లోపాలు కావచ్చు.. మరొకటి కావచ్చు, ఈ భావం ప్రజల్లో నెలకొని ఉంది’’ అని అంబటి బదులిచ్చారు. అయితే వైఎస్ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్న అభిప్రాయమూ రైతుల్లో బలంగా నెలకొని ఉందన్నారు. జగన్ దీక్ష కూడా ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా కాదని, కేంద్ర జల పంపిణీ విధానం ఉండాలన్నదే ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇది బల ప్రదర్శన కూడా కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. జగన్ తన ఓదార్పు యాత్రకు మధ్యలో విరామం తీసుకుని ఢిల్లీ వెళుతున్నది రైతుల కష్టాలను ఎలుగెత్తి చాటడానికేనని, అపుడైనా కేంద్రం కళ్లు తెరుస్తుందని భావిస్తున్నామని రాంబాబు అన్నారు. జగన్ పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలోని అన్ని కీలకమైన సమస్యలపైనా స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

జగన్ జనం వెంట వస్తారు..

ఈ నెల 9వ తేదీ సాయంత్రం జగన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఢిల్లీకి బయలుదేరతారని అంబటి తెలిపారు. జిల్లాల్లో తమకున్న యంత్రాంగం ద్వారా ఢిల్లీకి వెళ్లేవారిని ఎంపిక చేశామని వివరించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రత్యేక రైలులో బయలుదేరతారని చెప్పారు. రైలులో 1,400 నుంచి 1,800 మంది వరకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిమంది అభిమానులు ఢిల్లీకి జగన్ వెంట రావడానికి ఉబలాట పడుతున్నారని, అయితే అందరినీ తీసుకెళ్లడం సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దని కోరారు.

ఢిల్లీ దీక్షలో జగన్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటారని ప్రశ్నించినపుడు.. ‘‘చూద్దాం, ఎంత మంది వస్తారో... మేమలాంటి అంచనాలేమీ వేయడం లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఢిల్లీలో విపరీతమైన చలిగాలులున్నాయి కనుక దీక్షకు వచ్చేవారు తప్పనిసరిగా స్వెట్టర్లు, శాలువాలు, దుప్పట్లు, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లోవ్స్ వంటివి తెచ్చుకోవాలని అంబటి సూచించారు. విలేకరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వద్దిరెడ్డి చలమారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ బి.మోహన్‌కుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.పుల్లయ్య కూడా పాల్గొన్నారు.

కాంగ్రెస్సే ఒంటరి * పాడేరులో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* నన్ను ఒంటరిని చేసి పంపేశామని ఆనందపడుతున్నారు
* 2014లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాకుండా ఒంటరిదవుతుంది
* వైఎస్ హామీలు అమలు చేయని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు
* 30 కిలోల బియ్యం ఎటు పోయాయ్? 9 గంటల కరెంటు ఏమైంది?
* ఆదివాసీలకు ఒక్క ఎకరం భూమైనా పంచారా?
* ఒక్క రేషన్ కార్డయినా కొత్తగా ఇచ్చారా?
* ఒక్క కొత్త పింఛన్ అయినా మంజూరు చేశారా?


‘నన్ను ఒంటరిని చేసి పార్టీ నుంచి బయటకు పంపామని ఆనందపడుతున్నారు.. కానీ నేను ఒంటరిని కాదు.. 2014లో డిపాజిట్లు కూడా దక్కకుండా కాంగ్రెస్ పార్టీయే ఒంటరిదవుతుంది’ అని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2009 ఎన్నికల్లో రేషన్ బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని, ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచుతామని మహానేత వైఎస్ హామీ ఇచ్చారని, వాటిని ఇప్పటికీ అమలు చేయని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదని ఆయన విమర్శించారు. రాజశేఖరరెడ్డి చనిపోయాక ఒక్క కొత్త కార్డుగాని, కొత్త పింఛనుగాని ఇచ్చారా? ఒక్క ఎకరం భూమైనా పేదలకు పంచారా? అంటూ సర్కారు తీరును దుయ్యబట్టారు. బుధవారం విశాఖ జిల్లాలో మూడోరోజు ఓదార్పుయాత్ర సందర్భంగా పాడేరులో భారీ జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘నాకు బాగా గుర్తుంది. దివంగత నేత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక అంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంతోపాటు కొత్తగా అనేక పనులుచేశారు. మొన్నటి ఎన్నికల్లో రెండే మాటలు చెప్పారు. ప్రజాపంపిణీ బియ్యం 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని.. వ్యవసాయానికి మరో రెండు గంటలు పెంచి 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే మహానేతను పోగొట్టుకుంది ఈ రాష్ట్రం. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయి దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది. మరి ఈ రెండు హామీలు ఏమయ్యాయి? ఇక్కడా కాంగ్రెస్ పెద్దలే ఉన్నారు. ఢిల్లీలోనూ కాంగ్రెస్ పెద్దలే ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. మీకు ఓటేసిన ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చరా?’ అని నిలదీశారు.

ఈ ప్రభుత్వం నిద్రపోతోందా?
‘ఆ గొప్పనేత లేడన్న బాధ వినిపిస్తున్నప్పుడు.. కనిపిస్తున్నప్పుడు.. నాకూ చాలా బాధగా ఉంది. ఒంటరిని చేసి పార్టీ నుంచి పంపించేశామని వాళ్లు ఆనందపడుతున్నా.. ఇంతమంది గుండెల్లో వైఎస్ బతికే ఉన్నాడని చెబుతున్నా.. ఒంటరిని నేను కానని.. 2014లో డిపాజిట్లు కూడా కోల్పోయి కాంగ్రెస్ పార్టీనే ఒంటరిగా మిగులుతుందని చెబుతున్నా..’ అని జగన్ పేర్కొన్నారు. ‘ఆదివాసీలకు దివంగత నేత వైఎస్ లక్షా 20 వేల ఎకరాల భూమిని పంచాడని ఇప్పుడే మాజీ ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు చెబుతున్నాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలా ఒక్కచోటైనా ఎందుకు పంచలేదని అడుగుతున్నా.. ఇక్కడ ఇంకా 60 వేల ఎకరాలు పంచాల్సి ఉంది. అర్జీలు వచ్చినా దివంగత నేత చనిపోయాక ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు.. ప్రభుత్వం నిద్రపోతోందా?’ అని ఆయన ప్రశ్నించారు.

ఒక్కటైనా కొత్తగా ఇచ్చారా...?
అరకు నియోజకవర్గ పరిధిలోని హుకుంపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రసంగించారు. ‘నేను వస్తుంటే పైకప్పు లేకుండా నిర్మాణం ఆగిపోయిన ఇళ్లు కనిపించాయి. మీరే చెప్పండమ్మా... వైఎస్ చనిపోయాక బిల్లులు వస్తున్నాయా? కొత్త ఇళ్లు మంజూరవుతున్నాయా?’ అని అడిగినప్పుడు జనం లేదు లేదంటూ ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. ‘వైఎస్ చనిపోయాక కొత్త పెన్షన్లు వస్తున్నాయా? ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా? వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆదివాసీలకు లక్షా 20 వేల ఎకరాలు పంచారు. ప్రతి ఆదివాసీ కూడా చల్లగా ఉండాలని చూశారు. వైఎస్ చనిపోయాక ఈ ప్రాంతంలో కనీసం ఒక్క ఎకరా కూడా ఇచ్చారా?’ అంటూ ప్రశ్నించడంతో జనం లేదంటూ సమాధానమిచ్చారు.

Tuesday, January 4, 2011

రైతు జనహితుడు * కర్షకుల ఇక్కట్లపై ఆవేదన

ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం
వైఎస్ లేకే ఈ అవస్థలని జననేత వివరణ


రైతుల సమస్యల ప్రస్తావన వస్తే చాలు.. ఆ గొంతు నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. అన్నదాతకు అన్ని విధాలా జరుగుతున్న అన్యాయం స్ఫురణకు వస్తే చాలు, ఆ మదిలో ఆవేశం ఉప్పొంగుతోంది. జనం మధ్య జనం కోసం సాగుతున్న ఓదార్పు యాత్రలో కర్షకులకు ఎదురవుతున్న కష్టనష్టాలపై జననేత జగన్ మాట్లాడినప్పుడల్లా ఓవంక ఆగ్రహం, మరోవంక ఆవేదన వెల్లువవుతున్నాయి.


యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. అన్నదాతల కోసం తపిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్... సాగునీటి ప్రాజెక్టుల పట్ల సర్కారు నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మొదలైన ఓదార్పుయాత్ర మంగళవారం కూడా అప్రతిహతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన తన తండ్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఆవిష్కరణలు, ప్రధాన జంక్షన్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగాల్లో ముఖ్యంగా ఇటు ప్రకృతి వైపరీత్యాలు, అటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతన్న ఎలా నలిగిపోతున్నదీ వివరిస్తున్నారు.

జగన్ తన ప్రసంగాల్లో రైతుల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా జనం నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. పోలవరం, చేవెళ్ల ప్రాణహిత, సుజలస్రవంతి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న వైనం, ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టికొట్టేలా కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులతో రాష్ట్ర రైతాంగం ఎంతగానో దెబ్బతింటోందని తన ప్రసంగాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈనెల 11న రాజధాని డి ల్లీలో నిరాహారదీక్షకు దిగుతానని సోమవారమే ప్రకటించారు. రైతు పక్షపాతి వైఎస్ బతికుంటే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు సగమైనా పూర్తయ్యేవని, దీంతో నేడు రైతన్నలకు ఈ దుస్థితి ఉండేది కాదని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తవుతుంటే వారి కళ్లల్లో దివంగత మహానేత వైఎస్సే గుర్తుకు వస్తారని పేర్కొంటున్నారు.

పోలవరం వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు పూర్తిస్థాయిలో సాగు, తాగునీటి సమస్య తీరేదని ప్రస్తావిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌నిచ్చిన మహనీయునిగా డాక్టర్ వైఎస్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడుతున్నారు. ఓదార్పుయాత్ర సమయంలో బాధిత కుటుంబాల కష్టసుఖాలను, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ కష్టమొచ్చినా మీకు నేనున్నానని, అండగా ఉంటానని, దిగులు చెందవద్దని భరోసా ఇస్తున్నారు. విగ్రహావిష్కరణలు, సభల్లో మాత్రం అన్నదాతల అవస్థలు, వారికి జరుగుతున్న అన్యాయం, వైఎస్ చేపట్టినసంక్షేమ పథకాలు పడకేసిన తీరు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబడుతున్నారు. యువనేత జగన్ సమయస్ఫూర్తితో చేస్తున్న ప్రసంగాలకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు.

హామీల అమలెక్కడ? * విశాఖ ఓదార్పులో జగన్ ధ్వజం

* మహానేత మరణించగానే అన్నీ గాలికొదిలేశారు
* నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం
* 9 గంటల కరెంటు ఏమైంది?
* 30 కేజీల బియ్యం ఎటు పోయాయి?... ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు
* రెండో రోజు యాత్రలో విగ్రహావిష్కరణల జోరు
* యువనేతపై ఉప్పొంగిన ప్రేమాభిమానాలు.. ఘనస్వాగతం
* 11న ఢిల్లీలో దీక్ష కారణంగా ‘ఓదార్పు’ షెడ్యూలులో మార్పు
* 8 వరకు యాత్ర... సంక్రాంతి తర్వాత మిగతా కుటుంబాల పరామర్శ


  దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రస్తుత పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మంగళవారం రెండోరోజు ఓదార్పుయాత్ర సందర్భంగా రాత్రి 10 గంటల సమయంలో బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ రైతు తన సమస్యను చెప్పుకొంటూ కేకలు వేశాడు. దీనికి స్పందించిన జగన్ ‘ఏం చేద్దాం మరి? ధర్నా చేద్దామా? రండి మరి.. చలో ఢిల్లీ..’ అంటుండగా ఆ రైతు తన సమస్యను వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో జగన్ ‘రా.. ఇక్కడికి వచ్చి మైకులో చెప్పు’ అని ఆ రైతు పెంటకోట శ్రీనివాస్‌రావును కోరారు. దీంతో ఆ రైతు మైక్ తీసుకొని ‘తొమ్మిది గంటల కరెంటు ఏమైంది? కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు. చెరకు క్రషర్‌కు 10 రోజుల అనుమతి కోసం అడిగితే 3 నెలల కోసం డీడీ తీయాలని చెబుతున్నారు..’ అని బదులిచ్చాడు.
దీనికి జగన్ ప్రతిస్పందిస్తూ ‘ఆ వేళ నాకు బాగా గుర్తు. రైతులంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజుల్లో.. వారిని బతికించాలంటే ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, దాని వల్ల కొంతైనా మేలు జరుగుతుందని, రైతులు బతుకుతారని వైఎస్ భావించారు. అప్పట్లో విద్యుత్తు ఉద్యమం కూడా జరిగింది. అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతీ నాకు గుర్తుంది. అయితే ఉచిత విద్యుత్తు ఇస్తే ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని అప్పటి పాలకులు హేళన చేశారు. దాన్ని పక్కనబెట్టారు. కాదూ కుదరదన్నారు. కానీ దివంగత నేత వైఎస్ ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకమే ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దివంగత నేత రాష్ట్రానికే కాదు.. దేశానికీ చూపించారు’ అని అన్నారు.
ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు..
‘దివంగత నేత రేషన్ బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి విద్యుత్తును ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతామని చెప్పారు. అయితే రెండోసారి ప్రభుత్వాన్ని తె చ్చాక వందరోజుల్లోనే ఆయన చనిపోయారు. ఒక నాయకుడు చనిపోయాక వెంటనే ఈ పాలకులు ఆ హామీలు గాలికొదిలేశారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దగ్గర దగ్గర ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కాబోతోంది.. ఆ హామీల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు..’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మనిషంటే వైఎస్‌లా ఉండాలని చెప్పేందుకు వేరే నిదర్శనం అవసరం లేదు. మీరు చూపిస్తున్న ఆప్యాయతలే చాలు’ అని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.


పల్లెపల్లెనా పెద్దాయనే..
ఊరూరా విగ్రహం.. రాజన్నే మా దైవం
* మహానేత కుమారుడికి హారతి పట్టిన పల్లెలు

‘నాకు నాలుగు మెతుకులు నోట్లోకి పోతున్నాయంటే దానికి కారణం పెద్దాయనే. రెండ్రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు. మా ఊళ్లో ఆరుగురికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు. ముగ్గురికి గుండె ఆపరేషన్లు. ఇద్దరు పిల్లలకు చెవి ఆపరేషన్లు. పెద్దాయన లేకున్నా ఆయనను మరచిపోలేం. అందుకే ఊరంతా కలిసి విగ్రహం పెట్టుకున్నాం. ఆయనే మాకు దేవుడు. జగనే ఇప్పుడు మా నాయకుడు. పార్టీ పెడితే తిరిగి చూడక్కర్లేదు..’ ఇదీ విశాఖ జిల్లా లక్ష్మీపురంలో మజ్జి జగ్గారావు అనే వ్యవసాయ కూలీ హృదయ స్పందన. ‘ఏం పెద్దాయన.. విగ్రహం ఎవరు పెట్టారు’ అని ‘న్యూస్‌లైన్’ పలుకరిస్తే ఆయనిలా స్పందించారు.

పేదోళ్లందరికీ మంచి చేసినందుకేప్రతి ఊరికీ వైఎస్ దేవుడయ్యాడని చెప్పుకొచ్చాడు. మంగళవారం యువనేత ఓదార్పు యాత్రలో భాగంగా ముందుకు సాగుతున్నప్పుడు నాలుగైదు వందల జనాభా లేని చిన్న పల్లెల్లో సైతం మహానేత విగ్రహాన్ని ఏర్పాటుచేయడం కనిపించింది. చిన్నచిన్న పల్లెలకు ప్రభుత్వం నుంచి సాయం అందడం చాలా కష్టం. అయినా ఇలాంటి పల్లెల్లోనూ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం నుంచి సాయం లభించిందనడానికి ఊరూరా నెలకొల్పిన వైఎస్ విగ్రహాలే నిదర్శనం. కాగా యువనేత కోసం వేచి చూసిన జనంతో మంగళవారం యాత్ర సాగిన రోడ్లన్నీ కళకళలాడాయి. ‘జై జగన్’ నినాదాలు మిన్నంటాయి.

తొలిరోజు తెల్లవారుజాము వరకు యాత్ర
తొలిరోజు సోమవారం యాత్రకు జనం భారీగా పోటెత్తడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం కష్టమైంది. దీంతో షెడ్యూల్ పూర్తి చేయడం కోసం యువనేత మంగళవారం తెల్లవారుజామువరకు పర్యటించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక అడ్డూరు, నర్సాపురం, రాయువురాజుపేట, చౌడువాడ, గుల్లేపల్లి, గొండుపాలెం, కె.కోటపాడుల్లో విగ్రహావిష్కరణలు చేసిన జగన్ 3 గంటల వేళ కోటపాడులో పట్టాభిరామయ్య అనే రిటైర్డ్ ఉపాధ్యాయుని ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 9.30కే రెండోరోజు యాత్రకు బయలుదేరారు. 10 గంటలకు కోడూరు, 10.40కి కొత్తపెంట, 11.15కు వేచలం, 12.10కి లక్కవరం గ్రామాల్లో విగ్రహాలు ఆవిష్కరించారు. ఇవన్నీ చిన్న గ్రామాలే. అయినా అన్ని గ్రామాల్లో జనం విగ్రహాలు ఏర్పాటుచేశారు. జగన్ వచ్చేదాక వేచి ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తమ ఊళ్లో ఒకరాత్రి బస చేశారని.. దానికి గుర్తుగా ఇప్పుడు విగ్రహాన్ని పెట్టుకున్నామని లక్కవరం ప్రజలు చెప్పారు. వైఎస్‌ను జీవితాంతం మరిచిపోలేమని, వైఎస్ ఆనాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్లారని, మీరూ దర్శించుకోవాలని పట్టుబట్టారు. ఇక్కడే చోడవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సన్యాసిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వద్దూ.. పదవీ వద్దూ అంటూ రాజీనామా చేసేశానని, జగన్ వెంటే వస్తానని ప్రకటించారు.

వైఎస్ ఉంటే పింఛను రూ.600 అయ్యేదేమో..
లక్కవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ముందుకు సాగుతుండగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నేతృత్వంలో పలువురు నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌ను కలిశారు. అక్కడి నుంచి జుత్తాడ వెళ్లేసరికి 2 అయ్యింది. జుత్తాడలో విగ్రహావిష్కరణ చేశారు. 2.45కు గజపతినగరంలో, 3.10కి గోవాడ(అంబేరుపురం)లో విగ్రహావిష్కరణ చేశారు. అంబేరిపురంలో జగన్ మాట్లాడుతూ వైఎస్ బతికే ఉంటే తమ పింఛన్ రూ.200 నుంచి రూ.600 చేసేవారేమోనని అవ్వలూ తాతలూ అనుకుంటున్నారని చెప్పారు. 3.35కు వెంకన్నపాలెంలో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి 4.20కి చోడవరం చేరుకున్నారు.

వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు..
చోడవరంలో విగ్రహావిష్కరణ అనంతరం జగన్ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లు పావలా వడ్డీకే రుణాలు అందుకున్నప్పుడు వారి చిరునవ్వులో, పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి చదువులు చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే ఆనందంలో వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడని అన్నారు. ‘అవ్వాతాతలు నడవలేని స్థితిలోనూ ఇక్కడికి వచ్చారు.. నెల ఒకటో తేదీన వచ్చిన పింఛన్ చూసుకొని కన్నకొడుకులా మా బాగోగులు చూసుకున్నాడని ఆలోచించినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడని వారు చెబుతున్నారు. పేదవాడు అనారోగ్యానికి గురైనప్పుడు.. పెద్దాసుపత్రికి వెళ్లి అప్పుల పాలు కాకుండానే గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికివచ్చి భార్యాపిల్లలతో తన సంతోషాన్ని పంచుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. బిల్లులు కట్టే బాధలేకుండా రైతూ తన మోటారు ఆన్ చేసుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తాడు..’ అని చెప్పారు.

బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు..
చోడవరం నుంచి 5.20కి దామునాపురం చేరుకున్న యువనేత అక్కడ విగ్రహావిష్కరణ చేశాక ప్రసంగించారు. ‘నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు.. చనిపోయాక ఎందరి గుండెల్లో ఉన్నామన్నదే గొప్ప సంగతీ అని చెప్పేవారు. ఎక్కడున్నావ్ నాన్నా.. అని నేను పిలిచినా పలికే పరిస్థితిలో లేడు ఆ మహానేత. ఇంత బాధలో ఉన్నా నన్ను ఒంటరిని చేశారు. ఒంటరినై మీ ముందుకు వచ్చినా.. మేమున్నామంటూ ఆప్యాయత చూపిన మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను’ అని అన్నారు.

5.40కి లక్ష్మీపురంలో రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి తిరిగి చోడవరం మీదుగా గాంధీగ్రామ్ చేరుతుండగా మహిళలు పెద్దసంఖ్యలో హారతులు పట్టారు. రోడ్లకు ఇరువైపులా యువత ర్యాలీలుగా తరలివచ్చారు. 7.00 గంటలకు గాంధీగ్రామ్‌లో, 7.35కు చౌడుపల్లిలో విగ్రహాలు ఆవిష్కరించారు. అక్కడి నుంచి 7.50కి గౌరిపట్నం చేరుకున్నారు. ఇక్కడ కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. 9.40కు విజయరామరాజుపేటలో రెండు విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత మంగళపాలెం, కె.జగన్నాథపురం, అప్పల్రాజుపురం, ఎల్‌బీపట్నం, ఖండీవరంలలో విగ్రహావిష్కరణలు చేసి ప్రసంగించారు. ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. 12.20కు మాడుగులలో రెండు విగ్రహాల ఆవిష్కరణతో యువనేత యాత్ర పూర్తి చేసి అక్కడే బసచేశారు.

పోలవరం ఏమైంది?
‘రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ చెప్పేవారు. ఇవాళ వైఎస్ బతికి ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండేదని రైతు అనుకుంటున్నాడు. సగానికి సగం పూర్తయ్యేదని అనుకుంటూ ప్రాజెక్టు వైపు చూస్తున్నాడు. వైఎస్ బతికి ఉంటే సాగునీరు వచ్చేదని, విశాఖకు తాగునీరు వచ్చేదని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఏమైంది పోలవరం ప్రాజెక్టు అని నేను అడుగుతున్నా.. ఎందుకు మొదలవ్వలేదని నేను అడుగుతున్నా.. పోలవరం ఏమైందని రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు.. వైఎస్ బతికి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అంటున్నాడు..’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

Monday, January 3, 2011

11న హస్తినలో నిరశన * కృష్ణా పంపకంలో అన్యాయంపై 11న జగన్ నిరాహారదీక్ష

*రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దీక్షతో కేంద్రానికి, యావత్ దేశానికి తెలియజేస్తాం : ఓదార్పు యాత్రలో యువనేత*దీక్షలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల  ప్రతినిధులు, రైతు, కార్మిక సంఘాల నేతలు...
దీక్ష అనంతరం ప్రధానికి వినతిపత్రం* నాడు 75 శాతం నీటి లభ్యత ఆధారంగా జలాలు పంచారు* ఇప్పుడు 65 శాతాన్నే లెక్కించి ఇష్టమొచ్చినట్లు కేటాయింపులు చేశారు* వరద వస్తే మునిగిపోయే మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వరా?*వైఎస్ ఉంటే ఇలా జరిగేదా అని జనం అడుగుతున్నారు

కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి జరిగిన ఘోర అన్యాయానికి నిరసనగా ఈ నెల 11న ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతమే ఆధారంగా తీసుకుని జలాల కేటాయింపులు జరిపి అన్నదాతల బతుకు భరోసాపై నీళ్లుజల్లిందని దుయ్యబట్టారు. వరదలొస్తే మునిగిపోయే మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వకపోవడాన్ని జగన్ తూర్పారబట్టారు. వైఎస్ బతికే ఉంటే ఈ రకంగా జరిగి ఉండేది కాదని ప్రతి రైతు ఆకాశం వైపు చూస్తున్నాడన్నారు. సోమవారం విశాఖ జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా విశాఖనగర పరిధిలో పలుచోట్ల దివంగత నేత వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, పలుప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం మీద కేంద్రం చిన్నచూపుపై ఉద్వేగంగా ప్రసంగించారు. 11న దీక్ష ద్వారా ప్రజల గోడును కేంద్రానికి, యావత్ దేశానికి తెలిసేలా చేస్తానని ఆయన అన్నారు. అప్పుడైనా రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి స్పందిస్తారేమోనని ఆశాభావం వ్యక్తంచేశారు. దీక్ష సందర్భంగా ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

వైఎస్ ఉంటే ఇలా జరిగేదా?
‘ఇవాళ నీటి పారుదల పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఇలా జరిగేదా? కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఇంత అన్యాయం జరిగేదా? ఈ తీర్పు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. 1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. ఈరోజు 65 శాతం మాత్రమే తీసుకొని నీళ్ల కేటాయింపులు జరిపారు. వరదల వల్ల నష్టపోయేది మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు కేటాయింపులు జరుపుతారా? మిగతా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకుంటే నీళ్ల కేటాయింపులు చేస్తున్నారు. మరి మన పరిస్థితేంటి? వరదలు వస్తే మనం మునగాలి.. కరువొస్తే మాత్రం ఉన్న నీళ్లు పైన ఉన్నవాళ్లు వాడేసుకుంటారు. ఇదేనా న్యాయం? ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉందా? లేదా? అని రైతు ఆవేదనగా చూస్తున్నాడు.’
వారు మొర ఆలకించాలని దేవుడిని కోరుకుందాం
‘పోలవరం కట్టాలని కొందరు ఎంపీలు పోయి అడిగితే.. మరికొందరేమో వద్దని ఆపుతారు.. కృష్ణా గోదావరి నదుల జలాలను అనుసంధానించాలని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, ప్రతి నీటిచుక్కనూ వాడుకోవాలన్న ఆలోచనను కేంద్రం చేయట్లేదు. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గులేదూ అని చెప్పడానికి బాధగా ఉంది. నేను చెబుతున్నా.. ఈ నెల 11న ఢిల్లీలో ఒక రోజుపాటు నిరాహార దీక్షకు దిగుదాం. నాకు మద్దతుగా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఈ దీక్షలో పాల్గొంటారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న సంగతిని కేంద్రానికే కాదు.. యావత్ దేశానికీ చూపుదాం.. అప్పుడన్నా ప్రధాని స్పందిస్తారేమో చూద్దాం.. అప్పుడన్నా రాష్ట్రం సమస్యలు వినడానికి ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారేమో చూద్దాం.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రైతుసంఘాల నేతలు, కార్మిక సంఘాల నాయకులూ, స్థానిక సంస్థల ప్రతినిధులూ మాతో కలిసివస్తారు. అప్పుడైనా రాష్ట్రాన్ని బతికించేందుకు స్పందిస్తారో లేదో చూద్దాం.. మన మొర ఆలకించేలా చూడమని దేవుడిని కూడా కోరుకుందాం.’

నాన్నా.. ఎక్కడున్నావ్..

‘రైతులు, చేనేత కార్మికులు, మైనారిటీ సోదరులు.. ఇలా ప్రతి ఒక్కరి క్షేమం కోరుతూ.. ప్రతి పేద సోదరుడినీ పేదరికం నుంచి బయటకు తేవాలని ఆలోచన చేసింది వైఎస్సార్.. నాన్న తిరిగి రాడంటే చాలా బాధగా ఉంది.. నాన్నా.. ఎక్కడున్నావ్ అని అంటే పలికే పరిస్థితిలో లేడంటే చాలా బాధగా ఉంది.. నావెంట ఎవరూ లేరని విపక్షాలు గొంతెత్తినప్పుడు.. స్వపక్షాలు కూడా నావెంట రానప్పుడు.. మేమున్నామంటూ నాపై ఆప్యాయతలు చూపిన మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను..’ అంటూ పెందుర్తిలో జగన్ గద్గద స్వరంతో మాట్లాడారు.

వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు..

విశాఖలో పలుచోట్ల వైఎస్ విగ్రహావిష్కరణల అనంతరం మాట్లాడుతూ.. దివంగత నేత ప్రజల గుండెల్లో ఎంతగా నాటుకుపోయారో జగన్ గుర్తుచేసుకున్నారు. ‘ఈ జంక్షన్‌కు వచ్చి వైఎస్ ఎక్కడా అని ఎవరైనా అడిగితే.. పసిపిల్లలను చంకన వేసుకుని.. ఆలస్యమైనా అలసట, అసంతృప్తి లేకుండా వేచి ఉన్న ప్రతి అక్కాచెల్లెళ్ల గుండెల్లో వైఎస్ కనిపిస్తాడు. ప్రతి అక్కాచెల్లీ పావలా వడ్డీ గురించి ఆలోచించినప్పుడు.. వారి ముఖంపై చిరునవ్వు కనిపించినప్పుడు.. దివంగత నేత గుర్తుకొస్తూనే ఉంటాడు. అవ్వాతాతలు కరస్రాయం లేకుండా అడుగు ముందుకు పడని స్థితిలో వచ్చారు.. వారు ప్రతి నెల ఒకటో తేదీన వచ్చిన పింఛన్ చూసుకొని కన్నకొడుకులా మా బాగోగులు చూసుకున్నాడని ఆలోచించినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. ప్రతి పేద తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు.. ఇంకో నాలుగేళ్లలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని.. ఓ ఉద్యోగం చూసుకొని మా బాగోగులు చూసుకుంటారన్న ధీమాకు వచ్చినప్పుడు.. వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు.

నా కూతురు డాక్టర్ చదువులు చదువుతోంది.. ఇంకో నాలుగేళ్ల తరువాత సూది మందు వేసైనా తను సంపాదించుకుంటూ మమ్మల్ని పోషిస్తుందన్న ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడల్లా వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. అనారోగ్యానికి గురైనప్పుడు.. పెద్దాసుపత్రికి వెళ్లి అప్పుల పాలు కాకుండానే గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికివచ్చి భార్యాపిల్లలతో తన సంతోషాన్ని పంచుకున్నప్పుల్లా వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. బిల్లులు కట్టే బాధలేకుండా ప్రతి రైతు తన మోటారు ఆన్ చేసుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తాడు. పోలవరం పూర్తయినప్పుడు, ఆ నీళ్లు విశాఖకు తాగునీళ్లు అందించినప్పుడు, ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి పూర్తయినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. వైఎస్ ఉంటే పోలవరం పనులు ఎంత వేగంగా జరిగేవో అని రైతు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు’ అని అన్నారు.

ఒంటరిగా వచ్చినా..: ‘ఇవాళ నేను కాంగ్రెస్ నుంచి ఒంటరిగా బయటికి వచ్చినా.. చిరునవ్వుతో నిలబడ్డానంటే అది మీ ప్రేమ, ఆప్యాయతలే వల్లే అని గర్వంగా చెబుతున్నా.. ఆలస్యమైనా నాకోసం వేచి ఉన్నందుకు మీకు మరోసారి చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా’ అని పలుచోట్ల జగన్ పేర్కొన్నారు.

అప్పన్నను దర్శించుకున్న యువనేత

యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఈవో ప్రేమ్‌కుమార్, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణం చేశారు. స్వామి అంతరాలయంలో అర్చకులు జగన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు జరిపారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దుశ్శాలువతో సన్మానించారు.

ఈవో.. అప్పన్న ప్రసాదం, చిత్రపటాన్ని దేవస్థానం తరపున యువనేతకు అందజేశారు. జగన్ వెంట ఎంపీ సబ్బంహరి, మాజీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పాయకరావుపేట ఎమ్మెల్యే జి.బాబూరావు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, టెక్నాలజీ సంస్థల మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి, కార్పొరేటర్ రవిరాజు తదితరులు ఉన్నారు.